పది గజాల పట్టు చీరను
పదిలంగా అగ్గి పెట్టెలో సర్దగల
మన దేశ సాంస్కృతిక పతాకమతడు
నూలుపోగులే తమ నిధులని
సంబర పడే బడుగు జీవి
బతుకుకు మెతుకులు కరువై
ఆకలితో అలమటిస్తున్నా
మన సంస్కృతిని కాపాడుతున్న
తెలుగు తల్లి తనయుడతడు
ఉచితాలతో ఊదరగొడుతున్న నేతలకు
వారి కడగండ్లు కన్పించవు
ఎన్ని కష్టాలు ఎదురైనా
కులవృత్తిని వదలలేని కర్మవీరులు
మోడువారిన వారి బతుకులకు
చేయూత నిచ్చేవారు లేక
వారసత్వపు కళను నమ్ముకున్న
వారి బతుకులు ఛిన్నాభిన్నమవుతున్నాయ్
నైపుణ్యంగా మగ్గాలపై
నృత్యం చేసే వారి చేతి వ్రేళ్ళను
కళ్ళ కద్దుకోవాలనిపిస్తుంది మనకు
మన ప్రాచీన కళ మన కళ్శ ముందే
మనుగడ కోల్పవటం
విషాకరమైన దుస్థితి
నాయకుల ఉదాసీనత
ఆర్థిక రథ చక్రాల క్రింద
విలవిలలాడుతూ
క్రమంగా కనుమరుగై పోతున్నది
మన ప్రాచీన కళా సంపద… !
–కళాసారథి నూతలపాటి సాంబయ్య
సత్తెనపల్లి, పల్నాడు జిల్లా
చరవాణి : 9848034930.