అందమైన చేతిరాత – భవిష్యత్తుకు బంగారుబాట

ప్రముఖ చిత్రకారుడు, కవి ఆత్మకూరు రామకృష్ణ గారు తెలుగులో చేతిరాతపై ప్రచురించిన పుస్తకం “హస్తలేఖనం ఓ కళ “

పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు మునుపటి కంటే ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. పోటీ అవనీయండి, పెరుగుతున్న సిలబస్‌ అవనీయండి పిల్లలతోపాటు తల్లిదండ్రులకూ పరీక్ష పెడుతున్నాయి. అందుకే పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా వుండాలి? ఎంతవరకు వుండాలి? వంటి విషయాలు ఈ మధ్య కాలంలో ఎంతో చర్చనీయాంశాలుగా మారాయి. మన పరిథి దాటిన సమస్య పరిష్కారానికి మనం ఆయా రంగంలోని నిపుణుల సహా కోసం చూస్తుంటాం. అలా పిల్లల చదువు – తల్లిదండ్రుల పాత్ర అన్న విషయంపై ఈ మధ్య అమెరికాలోని ‘వాండర్‌ బిల్డ్‌ యూనివర్సిటీ’కి చెందిన నిపుణులు కొన్ని స్కూల్స్‌లో ఓ ఏడాదిపాటు వివిధ అధ్యయనాలు చేశారు. అందులో వారు కనుగొన్న విషయం ఏమిటంటే, చక్కటి దస్తూరి కలిగి వుండటం అనేది కేవలం ఓ ప్రత్యేక నైపుణ్యం మాత్రమే కాదు, అభ్యసన ప్రక్రియలో అదెంతో కీలకమైనదని కూడా గుర్తించారు.

మంచి చేతిరాత కలిగి వుండటం ఎంతో ముఖ్యం. పిల్లలకు మంచి చేతిరాత నేర్పించడమంటే దానర్థం అభ్యసన ప్రక్రియను, భావ వ్యక్తీకరణను సమర్థవంతంగా నేర్పించడమే అంటున్నారు వాండర్‌ బిల్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు. చేతిరాత చక్కగా నేర్చుకునే క్రమంలో పిల్లలు తాము రాసే అక్షరాలపై ఎంతో శ్రద్ధ పెడతారట. చిన్నతనంలో ఇలా అక్షరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాయడం అలవాటైన పిల్లల ఆ తరువాత కూడా అదే శ్రద్ధ, ఏకాగ్రత కనపరుస్తారట తమ చదువుల విషయంలో!! అలాగే మొదటిసారి అక్షరాలు నేర్చుకున్నప్పుడే పిల్లల దస్తూరి విషయంలో కొద్దిపాటి శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహిస్తే అది వారికి అలవాటుగా కూడా మారుతుందని అంటున్నారు పరిశోధకు.

పూర్వం కాపీ రైటింగ్‌ అంటూ పిల్లలతో రాయించేవారు, ప్రస్తుతం వారి చదువు, మార్కుపై పెట్టే శ్రద్ధ చేతిరాత విషయంలో చూపించడంలేదు. కానీ, ఎప్పటికప్పుడు పిల్లల చేతిరాత అందంగా వుండేలా ప్రోత్సహిస్తే, అది పిల్లల మంచి మార్కుకు, వారి వ్యక్తిత్వ వికాసానికి, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆర్ట్‌ టీచర్‌గా పనిచేస్తున్న రామకృష్ణగారు వేలాది విద్యార్థుల చేతిరాతనుచక్కదిద్దిన అనుభవంతో, తనకున్న చిత్రకళానుభవంతో వివిధ గ్రంధాలను పరిశోధించి, రాసిన ఈ పుస్తకం ఒక్క పిల్లల కు మాత్రమే కాదు, పెద్దలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చేతిరాతను ఎలా మెరుగుపరచుకోవాలో శాస్త్రీయ పద్ధతిలో బొమ్మలతో వివరించడం వలన ఎలాంటి వారికైనా సులభంగా అర్థం అవుతుంది. తెలుగులో చేతిరాతపై వచ్చిన పుస్తకాలు బహు తక్కువ. ఆ లోటును ఈ పుస్తకం భర్తీ చేస్తుందనడంలో సందేహంలేదు. ప్రతి ఉపాద్యాయుడు, పిల్లలున్న ఇల్లు, పాఠశాల కలిగి ఉండాల్సిన గ్రంధం ఈ “హస్తలేఖనం ఓ కళ ” 64కళలు.కాంలో సంవత్సరం పాటు సీరియల్‌గా ప్రచురితం అయి, పాఠకాదరణ పొందిన ఈ వ్యాసాలను చక్కటి పుస్తక రూపంలో ప్రచురించిన ప్రముఖ చిత్రకారుడు, కవి మిత్రులుఆత్మకూరు రామకృష్ణ గారు అభినందనీయులు.

– కళాసాగర్‌

 

SA:

View Comments (3)

  • నా పుస్తకం పై మీ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి సమగ్రమైన సమీక్ష వ్రాసి ప్రచురించిన మీ సహృదయతకు ధన్యవాదాలు

  • అయ్యా! అసలు "చేతిరాత"ను "హస్తలేఖనం" అనడమే ఘోరతప్పిదం. అంతటితో ఆగక ఏకంగా పుస్తకానికే ఆ పేరు పెట్టేయడం విచిత్రంగా ఉంది. పైగా రచయిత స్వయంగా "కవి" కూడా అని తెలిపితిరి. సరే- ఆయనకు తెలియకపోయినా వెబ్-సైట్ ఎడిటర్ గా ఇలాంటి పదాలను మీరు ప్రోత్సహించకూడదు. నిజమైన తెలుగుభాష కనుమరుగైపోవడానికీ, వక్రీకరణ చెందిన తెలుగుగా రూపాంతరం చెందడానికీ ఎవరో ఏదో అపకారం-హాని చేసేయనక్కరలేదు. ఇలాంటి "మేధావులు" చాలు. ఇంకా నయం- "హస్తలాఘవం" అనో, "హస్తప్రయోగం" అనో అనలేదు.