( కార్టూనిస్టు హరి అనుభవాలు: 2 )
‘లీడర్’ పత్రికలో 1998 సం.లో చేరాను, అప్పటికి పత్రిక ప్రారంభం కాలేదు, లే అవుట్ వేయడం, డెమ్మీ తయారు చేయడం, ఇలాంటి పనులు ఉండేవి. అక్కడ వున్న పాత సాహిత్య బౌండ్ పుస్తకాలు చదవడం, ఈ లీడర్ మూర్తి గారే నక్సలైట్ నాయకులు కొండపల్లి సీతారామయ్య, గణపతి లను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్, ఎనభై దశాబ్డానికి అదొక సెన్సేషన్, సాహిత్యాభిరుచి వున్న వ్యక్తి.
మనం యవ్వనంలో కవి, నక్సలైట్, కమ్యూనిస్ట్ అన్నీ(మీరు, నేను, ప్రతిఒక్కరూ) ” కానీ వ్యవస్థలో భాగం అయిపోయాక దాని నుంచి యెంత పిండుకుందామా అని చూస్తాం” అని ఒక రచయిత శ్రీకారం రామ్మోహన్ రాసిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను, వ్యవస్థలో భాగం అయ్యి ఆ పాపకార్యాలలో మునగకుండా నిరంతరం ప్రయత్నిస్తాను. అక్కడ ప్రముఖ నక్సలైట్ నాయకుడు ఐ.వి. సాంబశివరావుగారి అబ్బాయి సురేష్ పత్రిక కంటెంట్ వ్యవహారాలు చూసుకునేవారు. మిత్ర సాహితి వర్మ, విశాఖ రచయితలు, విరసం రచయితలు, ప్రజాసాహితి నిర్మలానంద, తంబు ఇలా వస్తా పోతా ఉండేవారు.
సురేష్ వల్లనే నేను అక్కడ కొడవటిగంటి కుటుంబరావు సమగ్ర సాహిత్యం చదివాను, నా కొక మార్గం దొరికినట్లయింది, బుద్ధిజీవి గా, శ్రమజీవిగా వుండి పని చేసుకుంటే చాలు అదే హాయి అని. అక్కడకు వొచ్చిన అతివాద, మితవాద సంస్థలు వేటికి కనెక్ట్ కాలేదు, నా మూడో తరగతి నుంచి ఎర్ర జెండా పట్టుకొని తిరిగినందున (ఏమిరా అరెస్ట్ చేయమంటావా, పో ఇంటికి) అప్పటికే కింద బాగా కాలినందున సైలెంట్ గా వున్నాను.
తెలుగు కార్టూన్ స్కూల్ అనుకుంటే బాపు కార్టూన్ స్కూల్ ఒకటి, మోహన్ స్కూల్ ఒకటి, పొలిటికల్ కార్టూన్లకు ఆర్కే, శ్రీధర్ స్కూల్ ఒకటి ( ఇది నా స్వంత విభజన) తెలుగు పొలిటికల్ కార్టూన్ కి (పాకెట్ కార్టూన్ కి) మూడో స్కూలింగ్ కరెక్ట్. కానీ నాకైతే సుధీర్ తైలాంగ్, ఉన్ని లాగ స్థానిక జానపద శైలి ఇష్టం. లీడర్ మొదట వారపత్రిక అనుకున్నారు, కొన్ని కార్టూన్లు వేసాను, పేల లేదు, సురేష్ సాహిత్యాభిరుచితో కార్టూన్లు సెలెక్ట్ చేశారు, రమణ మూర్తి గారికి కావలసింది వేరే, రెండో ఇష్యూకి ట్రెండ్ మార్చాను, కార్టూన్లు పేలాయి, ఆ తరువాత లీడర్ డైలీ పేపర్ చేశారు, రోజూ ప్యాకెట్ కార్టూన్ వేయడం మొదలు, స్థానిక భాష,యాస, రాజకీయాలకు ప్రాధాన్యత నిస్తూ కార్టూన్ వేసే వాడిని.
రమణమూర్తి గైడెన్స్ లో అప్పటి మేయర్ సబ్బం హరి మీద రోజూ కార్టూన్లు వేసే వాడిని, నగరం లో అప్పుడు అదొక చర్చ, కొంచెం రఫ్ విషయాలు రాసే పేపర్ గ లీడర్ ఉండేది, వీక్లీ పేజీలు పిల్లలు, మహిళలు, సాహిత్యం, పజిల్స్ కూడా నేనే చూస్తూండేవాడిని.
చాలా ఉత్సాహంగా ఉండేది లీడర్ లో వాతావరణం, అలా 98 నుంచి 2001 వరకు అక్కడ ఫుల్ టైమ్ పని చేసాను. ఇది చేస్తూనే మధ్యలో వైజాగ్ సిటీ ఆన్లైన్ అనే వెబ్సైట్ కి కార్టూన్స్ వేసేవాడిని దాని ఓనర్లు ఒకరు యెన్ ఆర్ ఐ ఒకరు షిప్ కెప్టెన్. అదే నా మొదటి వెబ్ మ్యాగజిన్ వర్క్. వాళ్ళు కొన్ని స్నిప్పెట్స్ రాసేవారు వాటికి కార్టూన్లు వేసేవాడిని.
లీడర్ పేపర్ డెవెలప్ అయ్యింది, జనం పెరిగారు, సర్క్యులేషన్ పెరిగింది,పత్రిక దాని కమర్షియల్ అవసరాలలో పడింది, మనం అందులో నట్టు, బోల్టు లా ఉండటం తప్ప ప్రత్యేకంగా సృష్టించే కళ ఏమి లేదని అర్ధం అయ్యింది, నా ఇండివిడ్యువాలిటీ కాపాడుకోవడం ఎలా అని మధనం మొదలయ్యింది అయితే నాలుగు కార్టూన్లు వేసి సెలక్షన్ కోసం ఎడిటర్ కి చూపించడం ఆయన చెప్పిన వాళ్ళ మీద కార్టూన్ వేయడం అవసరమా ? అనిపించింది ఈ లోగ హైదరాబాద్ లో యానిమేషన్ కలకలం…. కార్టూనిస్టులు, ఆర్టిస్టులు అందరూ అందులో చేరిపోతున్నారు. మరి నేను కూడా స్థిరంగా ఉండలేక పోయాను. యానిమేషన్ లో పని చేయాలి అనే కోరిక చాల బలంగా నాటుకు పోయింది.
పొలిటికల్ కార్టూన్ నుంచి యానిమేషన్ లోకి:
2001 లో నా పెళ్లయ్యింది, యానిమేషన్ లో చేరాలి అంటే హైదరాబాద్ లోనే వుండి ప్రయత్నాలు చేయాలనీ అర్థం అయ్యింది, పొట్ట పట్టుకొని మళ్ళి యానిమేషన్ వుద్యోగం కోసం హైదరాబాద్ చేరాను, ముషీరాబాద్, జమిస్తాన్ పూర్ లో దిగి ప్రయత్నాలు మొదలు పెట్టాను, ఈ సారి హైదరాబాద్ వాతావరణం వేరు కార్టూనిస్ట్ అవసరం చిన్న పత్రికలకు లేదు, చిక్కడపల్లి లో ‘కృష్ణా పత్రిక“( పిరాట్ల వెంకటేశ్వర్లు దాని చిట్టా చివరి ఎడిటర్ ) లో తెలుగు డీ.టీ.పీ. చేసే వాళ్ళు కావాలి అలా అందులో కుదిరాను, పగలంతా యానిమేషన్ ప్రయత్నాలు చేయగా రెండునెలలు చివరకు డేటా క్వెస్ట్ లో దూరాను, వాళ్ళే వాళ్లకు కావాల్సింది నేర్పించి నన్ను బతికించారు.
డేటా క్వెస్ట్ యానిమేషన్ స్టూడియోలో:
హైదరాబాద్, బంజారా హిల్స్, అందమైన చెట్లు, పక్షుల రాగాలు, బూడిద రంగు లో వాతావరణం, చలి, చిన్న వాన తుంపర్లు, ఎక్కడ చూసినా పువ్వులు, చాలా ఆహ్లాదంగా ఉండేది వాతావరణం.
నా అదృష్టం బాగుంది, ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అయ్యి ఒక్క రూపాయి కట్టకుండా శిక్షణకు ఎన్నికయ్యాను,2 డి యానిమేషన్ లో ఇన్బిట్వీన్ , క్లీన్ అప్ నేర్పించారు. యానిమేషన్ ఒక గొప్ప ఆర్ట్ ఫార్మ్, క్రాఫ్ట్ ఫార్మ్. దాని గురుంచి యెంత ఊహించుకుంటే అంత ఆనందం, కిక్కు.
దేశంలో అన్ని మూలల నుంచి వొచ్చిన ఆర్టిస్టులు డీ క్యూ లో ఉండేవారు, రియల్ ఇండియా, అదో బంజారా హిల్స్ ప్రపంచం, నెలకు జీతం గ్యారంటీ, సో…. మళ్ళి పొలిటికల్ కార్టూన్లు ఫ్రీలాన్స్ గా మొదలు పెట్టాను.
ఇప్పటి తెలుగు భాష సంఘ అధ్యక్షులు పి. విజయబాబు అప్పుడు ఆంధ్ర ప్రభ ఆదివారం సంచికకు ఎడిటర్, ప్రతి వారం ఆదివారం మ్యాగజిన్ కి కార్టూన్లు వేసే వాడిని, ఆ తరువాత ఇండియన్ ఎక్సప్రెస్ మాజీ ఎడిటర్ సుందరం పెట్టిన మీడియా ఇండియా న్యూస్ ఏజెన్సీ కి కార్టూన్లు రోజూ వేసేవాడిని.
ఇక డేటా క్వెస్ట్ లో నేను రక రకాల ప్రాజెక్ట్స్ లో చేసాను, నేనేమి గొప్ప ఆర్టిస్టు కాను, కానీ ఆ సీన్ ఎలా కంప్లీట్ చేయొచ్చు అని ఊహించి చేసే వాడిని, మేనేజ్ చేసేసే వాడిని. నేనేదో పెద్ద వర్కర్ ని అనుకొని నన్ను చాలా వాటిల్లో సెలెక్ట్ చేసేసే వారు, కానీ సెమి హ్యూమన్ స్టైల్ నాకు కష్టం, కార్టూన్, జిగ్ జాగ్ బ్రష్ స్టైల్ ఇవి బాగా ఇష్టమైనవి.
ఈ యానిమేషన్ బొమ్మలు వేయడం, టార్గెట్ రీచ్ అవ్వడం కొంచెం కష్టం, ఇవి వేసి మల్లి లంచ్ హౌర్, లేదా సాయంత్రం బయట పత్రికలకు ఫ్రీలాన్సింగ్ పొలిటికల్ కార్టూన్స్ సైలెంట్ గ చేసేసే వాడిని. టైమ్ మేనేజ్ మెంట్, యండమూరి పుస్తకం ఒకటి ఇందుకు ఉపయోగ పడింది.
ప్రపంచంలో ప్రతి దానికి ఒక ఎక్సపైరీ డేట్ ఉంటుంది, తరువాత సంస్థ పెరగడం, ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ మధ్యలో గాప్ రావడం,( అప్పుడు చూడాలి పులిహోర జనాల గోల, నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఉంటామో లేదో, తీసేస్తారేమో అని ఒకటే కుక్క లాగ తిరుగేస్తుంటారు ) చేయగా చేయగా నాకు బోర్ కొట్టడం, ఏమిటి తరువాత ? అనే ప్రశ్న ?
అసలు ఒకరు మనకు జీతం ఇవ్వకుండా మనమే మన స్కిల్స్ ని అమ్ముకొని బ్రతికితే ఎలా ఉంటుంది, అనే ఆలోచన మొదలయ్యింది, అప్పడు డేటా క్వెస్ట్ లో నాకు ఇచ్చే జీతం ఎంతో నేను బయట కార్టూన్ల మీద అంత సంపాదించే వాడిని, అందమైన చెట్లు, పూలు, పక్షుల అరుపుల నుంచి మమ్మల్ని ఒక ఐదంతస్తుల బిల్డింగ్ లో పెట్టారు, ఎయిర్ కండిషనర్ రూమ్స్, కెమెరాలు, లిఫ్ట్ సౌండ్స్ నాకు అంత కంఫర్ట్ గ అనిపించలేదు, గబ గబా పనిచేసి బయటకు వెళ్లిపోయేవాడిని. కింద వాచ్మెన్ ని మంచి చేసుకొని అలా బయట కృష్ణా నగర్ రోడ్లుమీద, సత్యసాయి నిగమాగమం, లేదా అక్కడొక పార్క్ ఉండేది అక్కడ కూర్చొని ఓపెన్ ఎయిర్ పీల్చు కునే వాడిని, జీవితంలో స్వేఛ్చ ఎంత అవసరమో అర్ధం అయ్యింది. సెలవులు వాడేయడం మొదలు పెట్టాను, ఊరెళ్ళాలి అంటే ఒకడిని సెలవు అడిగే పరిస్థితి రాకూడదు అనుకునే వాడిని.
అలా ఒక రోజు “ముసనోబు ఫుకువొక” పుస్తకం గడ్డి పరకతో విప్లవం చదివాను, ఆ పుస్తకం నన్ను నిలవనీయ లేదు, నేను కూడా డేటా క్వెస్ట్ కు రిజైన్ చేసి పారదొబ్బి వైజాగ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. ఒక నెల రోజులు నోటీస్ పీరియడ్ అంటారు కదా అది ఇచ్చాను, ఇంకొక్క మూడునెలలు ఉండ్రా నాయనా నీకు చాలా డబ్బులు వస్తాయి, అసలు మానొద్దు అని ఆ బెంగాలీ అయన ( తపస్ చక్రవర్తి కాదు ) చెప్పినా వినలేదు.
ముందుగా పొద్దున్న బాక్స్ పట్టుకొని బయలు దేరి డేటా క్వెస్ట్ కి వొస్తే వొచ్చి, లేదంటే మెట్రో స్టేషన్ కి వెళ్లి ఆ ట్రైన్ ఎక్కి అదెక్కడి వరకు వెళితే అక్కడకు వెళ్లి, తిరిగి వొచ్చి స్టేషన్ బయట వున్న నా బైక్ తీసుకొని మళ్ళీ పార్క్ కి వెళ్లి అక్కడ భోజనం చేసి సాయంత్రం వరకు ఖచ్చితంగా బయట తిరిగే వాడిని, ఆఫీస్ అనే పాటర్న్, కొలీగ్స్ లేకుండా అనే పాటర్న్ లేకుండా ఉండటం కోసం, అలా హైదరాబాద్ అన్ని మూలలు తిరిగేసాక, మెల్లగా మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్లి మధ్యాహ్నం టీవీ వాళ్ళు వేసే మబ్బు సినిమాలు చూడడంఅలా కొన్ని రోజులు, ఆ తరువాత పొద్దున్న లెగిసి ఇంటి దగ్గరనుంచే మన స్వంత పనులు చేసుకోవడం ఇలా మొదలు పెట్టాను.
నెలరోజుల తరువాత నా రిజిగ్నేషన్ ఓకే అయ్యింది, నాకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ ప్రాసెస్ చేశారు. నేను వైజాగ్ వొచ్చేసాను.
వైజాగ్ లో యానిమేషన్ :
ఫ్రీలాన్సర్ గ బ్రతకడం ఇక్కడ వైజాగ్ లో కష్టం అని అర్ధం అయ్యింది, మొదట ద్వారకా నగర్లో ఒక చిన్న ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాను, డేటా ఎంట్రీ కూడా చేసేవాళ్ళం, కొడ్డి నెలలకే అది దొబ్బింది … తరువాత నా దగ్గర వున్న సేవింగ్స్ అన్నీ అయిపోయి ఆఖరుకు నా బైక్ కూడా అమ్మేసే పరిస్థితి వొచ్చింది, అమ్మేసాను కూడా. అప్పుడు ఇలా కాదు అని ఆ వూర్లో యానిమేషన్ ఇన్స్టిట్యూట్ లను కలిసి 2డి యానిమేషన్ పాఠాలు హవర్లీ బేసిస్ చెప్పడం మొదలు పెట్టాను, అప్పటి వరకు ఆ సిలబస్ చెప్పే వాళ్ళు లేక పక్కన పడేసారు , నా దగ్గర డేటా క్వెస్ట్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా వుంది, ఆలా వైజాగ్ లో మూడు ఇన్స్టిట్యూట్ లో చెప్పేవాడిని, కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు పర్సనల్ గ కూడా నా దగ్గర నేర్చుకునేవారు.
నా స్టూడెంట్ తో కలిసి ఒక చిన్న యానిమేషన్ ఫిలిం నేనే స్టోరీ బోర్డు వేసి, కీ ఫ్రేమ్స్ వేసి తీసాను, టీవీ వాళ్లకు, పేపర్ వాళ్లకు ఇచ్చాను, వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఊదర గొట్టారు. అది చూసి వైజాగ్ లో ఎడ్యుకేషన్ పాఠాలు చేయడానికి వొచ్చిన ఆయన మా స్టూడియో లో ఫుల్ టైం జాయిన్ అన్నాడు. ” నేను మధ్యాహ్నం వరకు ఇన్స్టిట్యూట్లో బ్యాచ్ కి పాఠాలు చెప్పి బువ్వ తిని మధ్యాహ్నం నుంచి వస్తా అన్నాను, ఒప్పుకున్నాడు, ఏముంది చాలా ప్రయాణాల లాగే మొదట చాలా అతి ఉంటుంది, కచ్చితంగా అన్నీ ఇస్తారు. తరువాత అన్నీ లేట్ చేస్తారు సరే ఆదలా ఉంచుదాం.
ఇక్కడ కొన్ని ఎడ్యుకేషన్ కంటెంట్స్ కి బొమ్మలు వేసే వాడిని, వాయిస్ చెప్పే వాడిని, కొన్ని స్వంత స్క్రిప్ట్స్ తయారు చేస్తే ఆయన ఇంప్రెస్ అయ్యి తాతయ్య చెప్పిన పొడుపు కథలు, తెలుగు సామెతలు చేసాను, అలాగే జోక్స్ ని కూడా యానిమేట్ చేసాను, ఇవ్వన్నీ పట్టుకొని అమ్ముదామని హైదరాబాద్ వెళ్ళాను, రేట్ కుదరలేదు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నమాట. మన గాలి తీసేస్తుంటారు కొనుగోలుదారులు. అదంతా ఒక పెద్ద మాయ ప్రపంచం.
ఈ లోగా నాకు తెలిసిన వైజాగ్ పెద్దాయన సత్యసాయి బాబా కథలు యానిమేట్ చేద్దాము, కథలకు ఇంతకు ముందు మనకు నువ్వు బొమ్మలు కూడా వేశావు అన్నాడు, ఈ వైజాగ్ ఎడ్యుకేషన్ యానిమేషన్ పర్సన్ ని ఆయన్ని కలిపాను, వాళ్లిద్దరూ నిర్మాతలన్నమాట డైరెక్టర్ గ నేను అలా పై కథలు నాలుగు టీవీ ఎపిసోడ్ లుగా తయారుచేశాము, మొత్తం బొమ్మలన్నీ నేనే వేసాను,మంచి ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, లిమిటెడ్ యానిమేషన్, దానికి మ్యూజిక్ మాధవపెద్ది సురేష్, టైటిల్ సాంగ్ చిత్ర పాడారు. అవి పట్టుకొని అనంతపురం వెళ్ళాము, పొద్దున్నే నగర సంకీర్తన నేను పక్కా నాస్తిక వెధవని అయినా తెల్లచొక్కా వేసుకొని ఏమి జరుగుతుందో చూద్దామని వెళ్ళాను, ఒక నిర్మాత ఒకప్పటి అభ్యుదయవాది ఇప్పుడు బాబా భక్తుడు, రెండో నిర్మాత వాళ్ళావిడకు భయ భక్తుడు. రెండో ఆయన నగర సంకీర్తనకు రాలేదు. మొదటాయన నేను నడిచి వొచ్చేము .
రూమ్ కి వొచ్చాక యానిమేషన్ ఓనర్ ” ఆలా బయటకు వెల్దామా హరి గారు , భోజనాలు అవీ ఎలా ఉన్నాయో చూసి వొద్దాము ” అన్నాడు సరే పదండి అన్నాను అప్పటికే నడుములు నే లకు జారేసి వున్నాయాన ” హే రోబో ” అన్నాడు.
ఎందుకు చెబుతున్నానంటే యానిమేషన్ లో పని చేయడం అంత ఓపికను మనకు నేర్పిస్తుంది,కదలకుండా కూర్చోవడం, ఎక్కువ సేపు పని చేయడం ఇవ్వన్నీ.
సరే మేము బాబా ని కలవడం కుదరలేదు, ఆయన ఆరోగ్యం బాగాలేదు,ఆయనకు వీడియో చూపిస్తాను అని అక్కడి ముఖ్యుడు హామీ ఇచ్చారట. ఇది ఇంకా పెద్ద స్థాయిలో చేయాలి అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారట, ఆ డిస్కషన్స్ కి నేను లేను. ఆ మరుసటి సాయంత్రం బాబా భక్తులకు దర్శనం ఇచ్చారు, మాకు స్పెషల్ అప్పాయింట్ మెంట్ దొరకలేదు. మేము వైజాగ్ వొచ్చిన రెండు రోజులకు “బాబా అవుట్” ఆ తరువాత “ప్రాజెక్ట్ అవుట్” ఆలా ఆ ఘట్టం ముగిసింది, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఓన్లీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి బొమ్మలు వేయాలి అప్పటికే బోలెడంత లైబ్రరీ నేను క్రీఏట్ చేశాను, బొమ్మ కోసం వొచ్చిన 2డి యానిమేటర్ కు అన్నిటికి అలా క్యారెక్టర్లు వేయక్కరలేదు, ఇలా నీకున్న సోర్స్ తో క్యారక్టర్ తయారు చేసుకోవాలి అని టెక్నిక్ చెప్పేవాడిని ( ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేస్తే ఇక మనతో పనేముంటుంది ఆ తరువాత “ఈ మార్ఫోసిస్” అనే సంస్థ కు కథలకు, పాటలకు యానిమేషన్ కేరక్టర్లు వేసేవాడిని, ఇప్పుడు అన్వీక్షకి పబ్లిషర్స్ గా వున్నారు కదా వాళ్ళే, భార్య భర్త ఇద్దరూ ఆ సంస్థను చూసుకునేవారు.
‘విశాలాంధ్ర’ పత్రిక లో:
రెండోసారి ‘లీడర్‘ లో జగమే మాయ కార్టూన్ వేయడం మొదలు పెట్టాను, ఫ్రీలాన్సర్ గా అలా 2014 వరకు వేసాను. నా కార్టూన్లు డిజైనర్స్ మంచిగ రంగులు వేసి ప్లేస్ చేయడం లేదని నేనే ఫోటోషాప్ నేర్చుకొని రెడీ టు యూజ్ లా ఇవ్వడం మొదలు పెట్టాను, ఇంక అలా ఆన్లైన్ లో ఇతర రాష్ట్రాలకు, వెబ్ సైట్ లకు కూడా.
ఆ తరువాత ఆన్లైన్లో కొన్ని నేషనల్ పొలిటికల్ సిండికేషన్, వెబ్సట్ లకు వర్క్ చేసాను, కార్టూన్లు ఇంగ్లీష్ లో వేస్తె వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ భాషల్లోకి మార్చుకునేవారు, ఫోటోషాప్, తెలుగు టైపింగ్ చేసి నా కార్టూన్ రెడీ టు యూజ్ లా పంపే వాడిని.
2014 ఏప్రిల్ నుంచి ‘విశాలాంధ్ర‘ లో టీవీ గారు రిటైర్ అయ్యాక, నేను కార్టూన్ మొదలు పెట్టాను, సరిగ్గా ఎన్నికల ముందు. అప్పటి ఎడిటర్ శ్రీనివాస రెడ్డి పత్రిక హైదరాబాద్ నుంచి వొచ్చేది, ఆన్లైన్ లో పంపిస్తే రెండు రాష్ట్రాల్లో ప్రింట్ అవుతుంది, తరువాత రాష్ట్రం విడిపోయింది, ఆంద్ర ప్రదేశ్ కి విజయవాడ హెడ్ ఆఫీస్ అయ్యింది ముత్యాల ప్రసాద్ ఎడిటర్ గా వున్నారు. ఎప్పుడూ ఇబ్బంది పెట్టింది లేదు, చాల బాగా మాట్లాడేవారు, కార్టూన్ కి సముచిత స్థానం ఇచ్చారు, మొన్న కరోనా అలాంటి మంచి మనిషిని తీసుకువెళ్లి పోయింది, ప్రస్తుతం ‘విశాలాంధ్ర’ ఎడిటర్ గా ఆర్వీ రామారావు వున్నారు, విశాలాంధ్ర విజ్ఞాన సమితి సభ్యులు కూడా కార్టూన్లు మెచ్చుకుంటారు.
ఒక కార్టూనిస్టుకి ఈ ప్రోత్సాహం చాలు. పార్టీ పత్రికలు కాబట్టి ఒక మూసలో వేయాలనే, వేస్తామని అనుకుంటారు అది తప్పు, అలాగే ఈ పత్రికల సర్క్యులేషన్ అవి రీచ్ అయ్యే పాఠకుల విజ్ఞాన స్థాయి ఒక స్థాయిలో ఉంటాయి.
ఫ్రీలాన్స్ పొలిటికల్ కార్టూనిస్టుగా మన అభిప్రాయాన్ని కొంత బలంగా చెప్పొచ్చు, దేశంలో దొంగ రాజకీయాలు, అబద్దాలు, ప్రభుత్వాల విధానాలు వాటి అమలులో లోపాలు, ప్రజల వైపు అభిప్రాయలు, పథకాల వెనక ఉద్దేశ్యాలు, అమలులో లోపాలు ఇలా ప్రతి అంశాన్ని క్షున్నంగా చదివి, పరిశీలించి కార్టూన్ వేయడం నాకు ఇష్టం.
నా కార్టూన్ వెనుక నా ఆవేదన ఉంటుంది, ప్రజాస్వామ్య విలువలు, మానవ విలువలు నిలబడాలనే ఆర్తి ఉంటుంది, ఇందుకు నేను ఎన్నుకున్న మార్గం ఫ్రీలాన్స్ పొలిటికల్ కార్టూనింగ్, పత్రికల అవసరాలు తీరుస్తాము దానితో పాటు నా స్వంత గొంతుక వినిపించే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
రాజకీయ పార్టీలతో కార్టూన్ ప్రయాణం:
పార్టీలు వేసుకునే వివిధ బుక్ లెట్లు, పోస్టర్లు, ఇప్పుడైతే డిజిటల్ పేపర్లు, సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ ఇలా వీటన్నిటికి నాకున్న పరిచయాల ద్వారా వేస్తుంటాను, ప్రజలకు సమాచారం అర్ధం అయ్యే విధంగా చూడటంలో పొలిటికల్ కార్టూన్ దే పై చేయి.
అందువలన పొలిటికల్ కార్టూనిస్టు పత్రికల అవసరాలు తీర్చే బోల్టు మాత్రమే కాదు, అతను ఒక కేటలిస్ట్, మానవతావాది, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన భావాలు చెప్పే ఒక కార్యకర్త.
నాకున్న పని ఒత్తిడిలు వల్ల చాల సార్లు మానేద్దాము అనిపించినా కార్టూన్ వేయడం రోజువారీ జీవితంలో ఒక భాగం చేసేసాను, ఈ మొత్తం ఆసుపత్రిలో వున్నపుడు ఒక పద్దెనిమిది రోజులు, అమెరికా వెళ్ళినపుడు ఒక నెలరోజులు తప్ప ఎప్పుడూ రెగ్యులర్ కార్టూన్లకి విఘాతం కలగ లేదు. అంత కమిట్మెంట్తో కార్టూన్లు పంపుతుంటాను.
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు నా పొలిటికల్ కార్టూన్ బాధ్యతను మరింత పెంచిందని భావిస్తున్నాను, కార్టూన్ వాచ్ ఫ్యామిలీకి నా ధన్యవాదాలు. ప్రోత్సహిస్తున్న విశాలాంధ్ర యాజమాన్యానికి నా నమస్సులు.
హరి వెంకట రమణ
(హరి)
విశాఖపట్నం
98660 84124
BAVUMDI. ENNENNI MALUPULU???