మే 31న నటశేఖర కృష్ణ జయంతి ప్రత్యేకం…
వెండితెరపై ఎప్పటికీ చెరగని సంతకం-తెలుగు సినీ వినీలాకాశంలో ధ్రువతార
……………………………………………………………….
సాహసం ఆయన ఊపిరి.. మంచితనం ఇంటి పేరు.. సెల్యులాయిడ్‌పై ప్రయోగాల సృష్టికర్త. సినీ వినీలాకాశంలో ధ్రువతార. అంతకుమించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అజాత శత్రువు. ఆయన మరెవరో కాదు… నటశేఖర కృష్ణ. మనకు ఎందరో కథనాయకులు ఉన్నప్పటికీ ఆయనది ఓ విశిష్ట స్థానమని చెప్పవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజు అంటూ ఆయా కథానాయకులను సంబోధించే ప్రేక్షకులు.. సూపర్ స్టార్‌ను మాత్రం హీరో కృష్ణ అని పిలిచేవారు. దానికి తగ్గట్టే ఆయన.. సాహసమే నా ఊపిరంటూ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలతో ముందుండేవారు. సినీ పరిశ్రమలో పలువురికి కృష్ణ వెన్నుదన్నుగా నిలిచారు. తన స్టూడియోలో పనిచేసే ఏ కార్మికుడికి ఏ కష్టమొచ్చినా ఆర్థికంగా ఆదుకునేవారు. తాను నటించిన చిత్రం ఏదైనా కలెక్షన్లు సాధించలేకపోతే నిర్మాత నష్టపోకూడదని తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసేవారు. లేదంటే తర్వాతి సినిమా ఉచితంగా చేసిపెట్టేవారు. అంతటి తేనెమనసున్న హీరో చేతికి ఎముకనేదే లేదన్న రీతిలో దానధర్మాలు చేశారు. వరదలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. ఎస్.. నేనంటే నేనే అంటూ ముందుకొచ్చి నేనూ మనిషినే అని నిరూపించుకున్న మహాబలుడు. ఒకవైపు తన ఆస్తిపాస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నా పట్టించుకోని దేవుడులాంటి మనిషి హీరో కృష్ణ. ఎప్పుడూ ధరించే తెల్లని దుస్తులంత స్వచ్ఛమైన మనస్సు ఆయన సొంతం. ఒకటీ అరా చిన్నచిన్న వివాదాలు మినహా అందరికీ తల్లో నాలుకలా ఉండేవారు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవారు. జీవితాంతం క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. భార్య విజయనిర్మలను దర్శకురాలిగా ప్రోత్సహించి ఎన్నో సినిమాలు అందించారు. బంగారు కుటుంబాన్ని పరిశ్రమకు పరిచయం చేసిన కళామతల్లి ముద్దుబిడ్డ. ప్రేక్షకుల అభిమానాన్ని వజ్రాయుధంగా మలుచుకుని.. వారి హృదయ సింహాసనంపై తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందిన మహామనిషి. సూపర్ స్టార్ అనే పదం వెండితెరపై ఎప్పటికీ మెరుస్తూనే ఉండాలని మహేష్‌ను వారసుడుగా అందించిన ప్రజా నాయకుడు. మధ్యలో రాజకీయ ఆరంగేట్రం జరిపి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచి సింహగర్జన చేశారు. ఆడంబరాలు అనుబంధాలకు అతీతంగా ఏలూరు నుంచి పార్లమెంట్‌కు ప్రజాప్రతినిధిగా ఎంపికైన మొనగాళ్లకు మొనగాడు. చెప్పింది చేస్తానంటూ గోదారోళ్ల మనసు దోచి.. సమాజానికి సవాల్ విసిరి.. అంతం కాదిది ఆరంభం అని ప్రత్యర్థులను హెచ్చరించిన మన భలే కృష్ణుడు.. అమాయకుడు కాదు అసాధ్యుడని నిరూపించుకున్నారు. తదనంతర కాలంలో చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలతో శోభిల్లాలని, నిర్మాతల లోగిళ్లు పాడిపంటలు, భోగభాగ్యాలతో తులతూగాలని, ఊరంతా సంక్రాంతి రావాలని చెన్నపట్నవాసం వదులుకుని భాగ్యనగరంలో బావుటా ఎగురవేశారు.
50 ఏళ్లు.. 350 చిత్రాలు:
ఐదు దశాబ్దాల పాటు చిత్ర రంగాన్ని ఏలిన మకుటంలేని మహారాజు.. మన బుర్రిపాలెం బుల్లోడు. 1961లో కులగోత్రాలు చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఆయన పదండి ముందుకు, పరువు–ప్రతిష్ట సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించారు. 1965లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణను తేనెమనసులు చిత్రంలో కథానాయకుడిగా పరిచయం చేశారు. సాక్షి చిత్రంలో అమాయకుడి పాత్రలో అమోఘంగా రాణించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఇది బాపు దర్శకత్వం వహించిన తొలి సినిమా కావడం విశేషం. అన్నదమ్ముల సవాల్.. మామా అల్లుళ్ల సవాల్ విసిరిన, తండ్రీ కొడుకుల ఛాలెంజ్ చేసిన పగబట్టిన సింహం ఈ రామరాజ్యంలో భీమరాజు. గౌరిని ప్రేమించిన, మీనాను పెళ్లాడిన, గంగ మంగలతో స్నేహం చేసిన బంగారుబావది మరపురాని కథ. అక్కాచెల్లెలు, ఆస్తులు అంతస్తులు, ఇల్లు ఇల్లాలు, అత్తలూ కోడళ్లు వంటి కుటుంబ కథా చిత్రాలు ఆయన అద్భుత నటనకు తార్కాణాలు. కొత్తపేట రౌడీ, బెజవాడ బెబ్బులి, ఖైదీ రుద్రయ్య, రౌడీ అన్నయ్య, కిరాయి గూండా చిత్రాల్లో కరుకుగా కనిపించినా శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్, పచ్చని సంసారం సినిమాల్లోని పాత్రలకు జనం జేజేలు పలికారు. ప్రైవేటు మాస్టర్‌గా, ఘరానా దొంగగా, ఏజెంట్ గోపిగా, అల్లరి బుల్లోడుగా, ముఖ్యమంత్రిగా ప్రేక్షకుల అభిమానాన్ని నిలువుదోపిడి చేసిన అశ్వత్థామ మన ఘట్టమనేని కృష్ణ. దేవదాసు, ఇంద్రధనుస్సు చిత్రాల్లో భగ్న ప్రేమికుడిగా, ఈనాడులో విప్లవకారుడిగా, సింహాసనంలో సాహసవీరుడిగా, బండోడు గుండమ్మలో అమాయకుడిగా, కృష్ణావతారంలో ఇంటిని చక్కదిద్దే శ్రేయోభిలాషిగా కృష్ణ నటన అనన్య సామాన్యం. తుపాకి పట్టుకోవాలన్నా, తూటా దించాలన్నా ఆయనకు ఆయనే సాటి. మన్యం వీరుడు అల్లూరి పాత్రలో ఆయన చెప్పిన డైలాగులు మరిచిపోలేనివి.

మార్మోగిన పద్మాలయ…
1970లో పద్మాలయ మూవీస్ పతాకంపై సినిమాలు తీయడం ప్రారంభించి 1984లో సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావులతో కలిసి సొంతంగా స్టూడియో నిర్మించారు. ఆ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం నిజంగా అగ్నిపరీక్ష. స్టూడియోలో చిత్రీకరించిన తొలి చిత్రం సింహాసనం కావడం విశేషం. ఆ తర్వాత శ్రీ పద్మాలయ మూవీస్, పద్మాలయ పిక్చర్స్, పద్మాలయ కంబైన్స్, పద్మాలయ ఫిలింస్, పద్మాలయ క్రియేటివ్స్, పద్మాలయ ఆర్ట్స్, పద్మాలయ టెలిఫిలింస్, రత్న మూవీస్ పేరిట పలునిర్మాణ సంస్థలను స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆయన 17 చిత్రాలకు దర్శకత్వ బాధ్యత చేపట్టడం గమనార్హం. అందులో మహేష్ నటించిన శంఖారావం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న–తమ్ముడు చిత్రాలున్నాయి.
ఆల్ ఫస్ట్.. ఆయనే బెస్ట్!
చిత్ర పరిశ్రమలో కొత్తగా ఏ ప్రయోగం చేయాలన్నా కృష్ణ ముందుండేవారు. ఆయన కళాతృష్ణ అలాంటిది మరి. దాదాపు తొలి విజయాలన్నీ ఆయన ఖాతాలోనే జమయ్యాయి. తొలి తెలుగు సాంఘిక రంగుల చిత్రం తేనమనసులు. తొలి గూఢచారి చిత్రం గూఢచారి 116. కౌబోయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. ఈ చిత్రం 56 దేశాల్లో ప్రదర్శించిన ఘనత సాధించింది. ఈ సినిమా ద్వారా వెస్ట్రన్ జానర్‌ను పరిచయం చేశారు. మొట్టమొదటి సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం. మల్టీ స్టారర్ సినిమాల్లో అధికంగా నటించిన రికార్డు హీరో కృష్టకే దక్కుతుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజు, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్, మహేష్‌బాబులతో కలిసి నటించి వెండి తెరకు వెలుగులు పంచారు. సూపర్ స్టార్ సరసన విజయనిర్మల, జయప్రదగా హీరోయిన్లుగా ఎక్కువ సినిమాలు చేశారు. ఆ తర్వాతి స్థానాలు శ్రీదేవి, రాధకు దక్కుతాయి. దొంగ టైటిల్‌తో వచ్చిన ఎన్నో సినిమాల్లో కృష్ణ నటించారు. అధిక శాతం చిత్రాల్లో కృష్ణ పాత్రల పేర్లు కృష్ణ, గోపి. ‘కుమారరాజా’ చిత్రంలో మొదటిసారి త్రిపాత్రాభినయం చేశారు. 1967లో విడుదలైన సాక్షి చిత్రం తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి పలు అవార్డులను దక్కించుకుంది. 1972లో వచ్చిన పండంటి కాపురం తెలుగులో ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు కృష్ణ జీవితంలో మరపురాని మహోజ్వల ఘట్టం. ఈ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగువీర లేవరా.. పాటకు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం కూడా తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లింది. 175 రోజులపాటు ప్రదర్శించిన ఘనత సంపాదించుకుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం సినీ యాక్టర్‌ను డాక్టర్‌ను చేసింది. కేంద్రం పద్మభూషణ్‌తో గౌరవించింది. ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఆయన మన మధ్య ఉన్నా.. లేకున్నా మే 31వ తేదీ వచ్చిందంటే అభిమానులకు పండగే. ఈ ఏడాది ఆయన జయంతి నాడు మహేష్ నటించిన ‘వారణాసి’ చిత్రం టీజర్ విడుదల కాబోతోంది. అంటే సినీ ప్రేమికులకు డబుల్ బొనంజా అన్నమాట. తెలుగు చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలందించిన సీనియర్లలో ఒకరైన కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సూచన. ఆ దిశగా మన ప్రభుత్వ పెద్దలు కృషిచేయాలన్నది పలువురి కోరిక.
–చెన్నాప్రగడ శర్మ
చరవాణి: 9440587567
