నూరేండ్ల నాటకమా! వందనాలమ్మా!!

గుడివాడ ప్రాంత నాటక రంగ చరిత్ర… ఓ సారి సింహావలోకనం…!

మన గుడివాడ నాటక రంగాన్ని సింహవలోకనం చేసుకునే ముందు ఆంధ్రదేశంలోని నాటక రంగ నేపథ్యాన్ని కూడా ఒకసారి వీక్షిద్దాం… ఆధునిక నాటక రచన 1860 ప్రాంతాల్లో ఆరంభం కాగా నాటక ప్రదర్శన మాత్రం 1880 లో ప్రారంభమయ్యింది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం “మంజరీ మధుకరీయము”. దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి 1860 ప్రాంతాల్లో రచించాడు. ముద్రణ మాత్రం 1908 లో జరిగింది. సంస్కృతంలో నుంచి నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది.

1880 సెప్టెంబరు 1881 మార్చి ప్రాంతంలో ధార్వాడకు చెందిన ఆల్ టేకర్ నాటక కంపెనీ రెండో విడత తెలుగు నాటక సంచారం చేసిన అనంతరం ఆ ప్రదర్శన స్ఫూర్తితోనే కందుకూరి వారి తొలి ఆధునిక నాటక ప్రదర్శన “వ్యవహార ధర్మబోధిని” జరిగిందని చరిత్రకారుల భావన కందుకూరి వారు తమ శిష్యులైన విద్యార్థులతో వివేకవర్ధిని సమాజాన్ని ఏర్పరిచి స్థానికంగా నాటకాల్ని ఓ రకంగా చెప్పాలంటే ప్రహసానాలను (skits), ప్రదర్శించారు.

దాదాపు 1880-81 లో గుంటూరు పట్టణాన్ని కొండుబొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి (రేపల్లె తాలూకా, కారుమూరి నివాసి) హిందూ నాటక సమాజం( ఫస్ట్ కంపెనీ)ని ఏర్పరిచారు,ఈ సమాజం విద్యార్థులు విద్యాదేతరులతో రాష్ట్రవ్యాప్తంగా సంచారం చేస్తూ కొండుబట్ల వారు రాసిన 31 వచన నాటకాల్ని అంటే ప్రహసనాల్ని ప్రదర్శింపజేశారు. ఇలా సంచారం నాటకం వేసిన తొలి సమాజంగా చరిత్రపుటల్లో నిలిపారు. ఆ సమాజం స్ఫూర్తితో తెలుగువారిలో నాటక రచన ప్రదర్శన అభిలాషలు బలంగా అంకురించాయి. ఈ నేపద్యం అందించిన స్ఫూర్తితోనే మచిలీపట్నం బళ్ళారి, విజయనగరం, నెల్లూరు, ఏలూరు, ఇలా పలు ప్రాంతాల్లో అనేక నాటక సమాజాలు ఆనాడు ఏర్పడినవి. అనేక నాటక రచయితలు ఉద్భవించారు. ఇంచుమించు ఆ సమయంలోనే అంటే 1900 సంవత్సరానికి పూర్వమే గుడివాడ ప్రాంతంలో నాటక రంగానికి అంకురార్పణ జరిగిందని చరిత్ర చెబుతోంది. ఆ తదుపరి గుడివాడ నాటక రంగం వికాసం ఎలా చెందింది అనేది ఒక్కసారి గమనిద్దాం.
1900 సంపూర్వమే ఈడ్పుగంటి సీతయ్య (నందివాడ వాసి) గారి ఇంట సుబ్బిచెరువు గ్రామంలో ఆంధ్ర నాటకసమాజం పేరిట పుట్టావు.

గుడివాడలో లింగం సీతారామాంజనేయులు, తుమ్మల సీతారామయ్య చౌదరి గార్ల తాటాకుల శాలలో తుంగల చలపతిరావు, మాధవపెద్ది వెంకటరామయ్య, సి.ఎస్.ఆర్. ఆంజనేయలు, స్థానం, దైతా గోపాలం లాంటి నటులను ఒడిలో పెంచావు. బాలుడైన పామర్తికి స్ఫూర్తి కాంక్ష వయ్యావు..

గుడివాడలో రాచగుళ్ల ధియేటర్ తాటాకుల ప్రదర్శనశాలలో (రాచగుళ్ళవారి వీధి, శ్రీనివాస్ సినిమా
హాల్ ప్రాంతంలో 1930 కు పూర్వమే ఉప్పలూరి సంజీవరావు, దేవరకొండ రామారావు, తీగల వెంకటేశ్వర్లు, కోడూరు శ్రీరాములు పంతులు, డి.వి.ఎల్. నరసింహం, నిమ్మగడ్డ పరదేశి, పువ్వుల అనసూయ, కె.ఆర్. తిలకం, పువ్వుల నాగరాజకుమారి, దాసరి చిన అంజనీబాయి, దాసరి రామతిలకం లాంటి నటీమణులు బాసటగా ప్రదర్శనలతో రాణకెక్కావు.

1930 సం తరువాత శ్రీవత్స వెంకటేశ్వరరావు (శ్రీకృష్ణ దేవరాయలు, మల్లేశ్వరి సినిమా) స్థాపించిన శ్రీ రామవిలాససభకు ఆలంబనవయ్యావు.
రాచగుళ్లవారి ధియేటర్, శ్రీరామవిలాస సభ ప్రదర్శనలో బాల పామర్తికి స్ఫూర్తి ప్రధాత వయ్యావు.
1931 సం – కంచు కంఠం పువ్వుల సూరిబాబు (బొమ్మూలూరు వాసి) స్థాపించిన బాలకృష్ణ నాటక సమాజమయ్యావు.
1937 తర్వాత హార్మోనిస్ట్ వై.వి. భద్రాచార్యులు స్థాపించిన గంధర్వ నాట్యమండలి ద్వారా రాగాలు నేర్పావు. అక్కినేనికి సంభాషణ విద్య నేర్పావు. గుడివాడ హార్మోనిస్ట్ మొటూరు వీరారాఘవయ్య చౌదరి అక్కినేనికి పద్యారాగాలు నేర్పారు.
1938 సం, బుద్దిరాజు శ్రీరామమూర్తిగా గుడివాడ ఔ త్సాహిక నటులకు (అక్కినేని) హార్మోనిస్టు రూపంలో పద్య గానాలలో పరిణితి అందించావు.

1938 తరువాత గుడివాడ కేంద్రంగా ఎక్సల్స్ యర్ డ్రమిటిక్ సమాజంగా, కోడూరి అచ్చయ్య చౌదరి దుక్కిపాటి మాధుసూదనరావు నిర్వహణలో రాటు దేలావు. మహానటులైన అక్కినేని, సూరపనేని, పామర్తి సుబ్బారావు లాంటి ఉద్ధండ నటరత్నాలకు వేదిక వయ్యావు.

1940సం తరువాత ఆంధ్ర నాటక కళాపరిషత్ గా గుడివాడలో నూజివీడు జమిందార్ శ్రీ ఎం.ఆర్. అప్పారావు. కాజా వెంకటరామయ్య(శరత్ టాకీస్), ఎర్రోజు మాధవాచార్యులు పోలవరపు సూర్యప్రకాశరావు (డోకిపర్రు) ఆచార్య ఆత్రేయ ( సినీ కవి) గార్ల సేవలందుకున్నావు.
1946 లోజరిగిన 13వ ఆంధ్ర నాటక కళా పరిషత్, 1958 లో జరిగిన 20వ ఆంధ్ర నాటక కళా పరిషత్తు (దుర్యోధన ఏకపాత్ర పోటీలు) 1962 లోజరిగిన 22వ, ఆంధ్ర నాటక కళా పరిషత్ మహాసభలకు, నాటకపోటీ లకు గుడివాడలో నీవే వేదిక వయ్యావు.
కోడూరి అచ్చయ్య గారి శ్యామల నాట్యమండలికి బాటవై, సాంఘిక నాటకాల ఆటవై నడిచావు.
ఆత్రేయ,వేదాంతం వెంకట సుబ్రహ్మణ్యకవి, సూరపనేని శోభనరావు, కోనేరు కుటుంబరావు, లాంటి సాంఘిక నాటక రచయితల కలంలో బలమయ్యావు.
1942 లో పామర్తి, సూరపనేని స్నేహానికి చిహ్నంగా ప్రభాకర నాట్య మండలిగా గుడివాడలో పోస్టాపీసు రోడ్ లో వెలిశావు.
తరువాత కాలంలో, వందలాది నాటకప్రదర్శనలకు కారణభూతమయ్యావు. పామర్తి శిక్షణలో వందలాది నటులను రంగస్థలానికి అందచేసావు.
కొందరు చిరస్మరణీయులు, ఆ నటరాజు సానిధ్యం చేరగా, కొందరు నీ బిడ్డలు ఇప్పటికీ కళా పిపాసతో, నీ ఒడి బడిలో నటిస్తున్నారు.

దివంగత ప్రముఖులైన అక్కినేని పామర్తి, సూరపనేని, కైకాల లాంటి నట దిగ్గజాలు, అక్కినేని కి స్త్రీ పాత్రలోని మేలుకోలు నేర్పిన బాలబంధు బి.వీ. నరసింహారావు గారు, వై. అమ్మణీ బాయి దాసరి తిలకం, పువ్వుల అనసూయ, గుంటూరు కోమలాదేవి రంగ పుష్ప రంగ, పుష్పకుమారి, రాధా మనోహరమ్మ, సీతా కుమారి టేకు అనసూయ లాంటి దివంగత నటీమణులు, జాలాది, బోడి నారాయణరావు, రేడియో ఏకంబరం, సినీ నటులు చలం, హేమలత, పుష్ప కుమారి నిర్మలమ్మ, ఎం. ఎస్. చలం, పూడి పరమేశం, కొంగరాపి అప్పారావు, పి.ఎస్.వి. ప్రసాదరావు. జి. రామకృష్ణరావు, ఎస్.డి. లాల్, మాస్టార్ కల్యాణి, ఎస్.పి. లక్ష్మణ స్వామి, బి.ఎన్. సూరి. సమ్మెట దేవీ ప్రసాద్, టంకాల అప్పలసూరి, భయంకర భీభత్స అట్టహాసాలతో ఖాఫాలికా ఉపాసన చేసిన మాయలఫకీరు, బి. ఎన్. సూరి. ఆంధ్రదేశ మంతటా చిందులువేస్తూ, చిరునవ్వులు పంచిన పూలరంగడు అక్కినేని వెంకటరత్నం, తరువాత కాలంలో శారద కళా సమితి, నర్రా చక్రధరరావు గారు, నందిరాజు నారాయణమూర్తి, నర్రా దామోదర్ రావు లాంటి దిగ్గజ నట దర్శకుల చెంత చేరావు. ఎందరో.. వరిష్ట, వర్ధమాన, వర్తమాన నటరత్నాలకు నీ ఒడిలో అవకాశం ఇచ్చావు. అటువంటి వరిష్టనటులలో శ్రీ బండారు రాధాకృష్ణ, శంబంగి లక్ష్మణరావు, ఎస్.వి. కృష్ణారావు, ఆచారి, ఈడ్పుగంటి అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి దివంగత చిత్రకారులు నటులు తాతా రమేష్ బాబుగారూ, మరియు ఈడ్పుగంటి శ్యాంప్రసాద్ లాంటి సీనియర్ నటులు ఉన్నారు. అలాగే సర్వ శ్రీ చలసాని శ్రీకృష్ణ (ఎస్.బి.ఐ) ఎం.ఈ.డి మల్లేశ్వరరావు. నరహరిశెట్టి ప్రసాద్, వంశీ, విజయకుమార్, శీరం శ్రీనివాసరావు,పి. వి సత్యనారాయణ, మట్టా రాజా, ఆర్.వి ఎల్. నరసింహారావు, బి. నాగశాయి, పి. కృష్ణ హితేష్, పి. సంతోష్, బి.వి. సత్యం., ఏ. సాంబశివరావు, కూరాళ్ల కుమార్, శొంఠి శ్రీనివాసరావు, వై. నాగేశ్వరావు, యలమర్తి కోటేశ్వరరావు,పోలుకొండ నాగులు.. శ్రీనివాస నాయుడు, పోలిశెట్టి రమణ, ముత్యాల నాగేశ్వరరావు, లాంటి నటులు, కళాకారులసంఘాల అధ్యక్షులుగా బి. వి. రామ్మోహన్ రెడ్డి, శ్రీ నెరుసు చింతయ్యలు, గుణ నిర్దేశకులు శ్రీ సుఖమంచి మల్లిక్, లాంటివారు నీకు సేవలు అందిస్తున్నారు.

వర్తమాన నటీ మణులలో, సీనియర్ లయిన అమ్ముల పార్వతి, అమ్ముల సువర్ణ లు మరియు అమ్ముల పద్మా, పి. విజయరాణి, కోటేశ్వరి, బి. నాగలక్ష్మి, కొంగ మేడ విజయ, గొట్టాపు శివకుమారి, రాజేశ్వరి, కమల కుమారి, కే. అరుణ, చిత్తజల్లు అరుణ సాయి కుమారి, గుమ్మడి విమల కుమారి, బి. సుజాత లాంటి నటీమణులు నీ రంగస్థలం వేదికలపై అలరారుతున్నారు.

అలనాటి అక్కినేని, పామర్తి సుబ్బారావు, సూరపనేని లాంటి నటీనటుల రూపశిల్పి మంగయ్యగారు, తుమ్మలపల్లి సాంబశివరావు, తుమ్మ ల్లపల్లి ప్రకాశరావు, గొట్టాపు కృష్ణ లాంటి దివంగత చేయితిరిగిన మేకప్ నిర్దేశకులు, నిన్ను సేవించారు. నేటి తుమ్మలపల్లి బాబు, బాబ్జి, శ్రీరంగం, లాంటి మేకప్ మెన్లు నీకు రంగులద్దుతున్నారు.
అలాగే దివంగత వై.వి. భద్రాచార్యులు, బుద్ధి రాజు శ్రీరామ మూర్తి, మొటూరు వీరారాఘవయ్య చౌదరి, పెండ్యాల నాగేశ్వరరావు జమ్మి బాబు, కొడాలి ఆంజనేయులు, లాంటి సంగీత దర్శకులు నీకు రాగాలు అల్లారు. నేటి వర్తమాన యువ సంగీత హార్మోనిస్టు కొడాలి రాజా, ch. నాగేశ్వరరావు (ఉయ్యురు) కలపర్రు రాజు లు నీకు సేవలందిస్తున్నారు.

నాటక సమాజాలలో శ్రీ ప్రభాకర నాట్యమండలి, కళాకారుల సంఘం, కళాకారుల సమైక్య, జై శ్రీ నాట్యమండలి, స్పందన ఆర్ట్స్, యార్లగడ్డ ఫైన్ ఆర్ట్స్, చార్లెస్ చాప్లిన్ క్లబ్, కళా రంజని ఆర్ట్స్, రాజేశ్వరి నాట్యమండలి, సరిగమ సంగీత పరిషత్, నవ్వుల పొదిరిల్లు, నట సమాఖ్య, విమలా నాట్యమండలి
చంద్రకళ నిలయం లాంటి వివిధ సమాజాలతో గుడివాడలో విస్తృతమైన కళాసేవలు నీ బిడ్డలు అందిస్తున్నారు.
అలనాటి నాటికల కళాపోషకులైన శ్రీ కాజా వెంకట్రామయ్య శ్రీ కటారి సత్యనారాయణ గార్ల స్పూర్తితో నేటికీ ఎందరో కళాభిమానులు కళాపోషకులు నీకు సహకరిస్తూ సౌజన్యం అందిస్తున్నారు.

అటువంటి కళా ప్రేమికుల, కళాభిమానుల, కళా పోషకుల సౌజన్యంతో, సహకారంతో ఈనాడు మన గుడివాడ గడ్డపై కళాకారుల ఉపాధ్యాయుల, కళా పోషకుల, నాటక సమాజ నిర్వహకుల, సహాయ సహకారాలతో శ్రీ కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ కళాపరిషత్ ను స్థాపించి, దిగ్విజయముగా నడిపిస్తున్న, సీనియర్ నటుడు, కళాసేవకుడైన, శ్రీ పెద్దిబోయిన లక్ష్మణరావు గారి వారసుడయిన కళారత్న, కళాపిపాసి, కృష్ణా ఆర్ట్స్ అధినేత శ్రీ పి.వి సత్యనారాయణ మాస్టారు ఎన్నో వ్యయప్రయాస కొర్చి గుడివాడ నాటకరంగ వైభవాన్ని పునురుజ్జీవింపచేస్తూ, ఎపుడో 60 సం., పూర్వం 1962 లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు నాటక పోటీలను తలపింప చేస్తూ, రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు పొందిన అద్భుతమైన సమకాలీన సామాజిక, కుటుంబ, సమస్యలే కధనంగా గల అష్ట ఐశ్వర్యాలు లాంటి ఎనిమిది సాంఘిక నాటకాలు ప్రదర్శింప చేస్తూ, ప్రేక్షక మహాశయులకు అల్పాహారాలు అందిస్తూ, నటులు, సాంకేతిక నిపుణులకు షడ్రషోపితమైన భోజన సదుపాయములు, వసతి కల్పిస్తూ, రాష్టంలో పేరు గాంచిన సీనియర్ నటులకు పురస్కార, సత్కారము కొరకు ప్రదర్శన వేదికకు సమాన్తరంగా రెండోవేదిక నిర్మించి, ప్రేక్షకులను కదలనీయకుండా, నాటకానికీ నాటకానికే మధ్య సెట్టుంగులు వేసుకునే టైము ప్రదర్శన చేసే సంస్థలకు కల్పిస్తూ, అదే సమయంలో ప్రేక్షకుల ద్రుష్టి పురస్కారాలు, సత్కారాలు, ఉపన్యాసాలు రెండవ స్టేజిపై జరిపేట్లు విసృతమయిన ఏర్పాట్లతో సభలను జరుపుతూ, నాటకపోటీలు నిర్వహిస్తూ, నిన్ను సేవిస్తున్నారు… మన రాష్టంలో గుడివాడ పేరును ఇనుమడింపచేస్తూ, ప్రజలకు సామాజిక, కుటుంబ నేపథ్య అంశాలతో చేర్చి కూర్చిన గొప్ప సాంఘిక నాటికలను ప్రదర్శింపచేస్తూ నిన్ను ఆరాధిస్తున్నారు. ఇంత విసృ తమైన ఏర్పాట్లతో భారీ ఖర్చుతో, కళాపరిషత్ పోటీల నిర్వహణకు సాహసించిన మాస్టారు పి.వి. సత్యనారాయణ కళా మూర్తికి నా నమోవాకములు..!!
వారికి సహకరించిన కళా పోషకులకు, మిత్రబృందానికి, నా ప్రణామములు…!!

నూలు సాంబశివరావు (నటులు)
(సేకరణ, రచన)
పొరబాట్లకు క్షంతవ్యుణ్ణి: ఈ వందేళ్ల పైబడిన చరిత్రలో నాకు తెలియని, నేను మరచిన, ఎందరో మహానుభావులుండొచ్చు. వారికి నా క్షమాపణలు…


Share via
Copy link
Powered by Social Snap