హ్యూస్టన్ లో దిగ్విజయంగా జరిగిన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
ఆగస్ట్ 16-17, 2025 తేదీలలో అమెరికాలో, హ్యూస్టన్ మహానగరంలో జరిగిన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు తెలుగు భాషా, సాహిత్యాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి అత్యంత అర్థవంతంగా, వైభవంగా, ఆత్మీయ వాతావరణంలో జరిగింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక సాహితీ సదస్సులో భారత దేశం నుంచి 15 మంది పైగా ప్రముఖ సాహితీవేత్తలు, అమెరికాలో పలు నగరాల నుండి 75 మందికి పైగా 28 విభిన్న వేదికలలో పాల్గొని సుమారు 250 మంది ఆహూతుల సమక్షంలో తెలుగు భాషా, సాహిత్య సౌరభాలని, తమ ప్రజ్ఞాపాటవాలను పంచుకున్నారు. హ్యూస్టన్ ల్ తెలుగు బడి, మన బడి బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న ఉపాధ్యాయులకి గురువందన సత్కారాలతో మొదలయిన ఈ జాతీయ స్థాయి సాహిత్య సదస్సుని “పద్మభూషణ్” ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంచనప్రాయంగా ప్రారంభించగా భారత దేశం నుంచి తొలిసారి అమెరికా విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ “సినిమా సాహిత్యం, తెలుగు భాష” అనే అంశం మీద సాధికారంగా ప్రధాన ఉపన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు.

కాలిఫోర్నియా లోని ఆరియా విశ్వవిద్యాయం తెలుగు శాఖ పురోభివృద్ధికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపున వంగూరి చిట్టెన్ రాజు, గిరిజ దంపతులు లక్ష డాలర్ల భూరి విరాళం చెక్కు సభా ముఖంగా ఆ విశ్వవిద్యాలయం ప్రోక్టర్ రాజు చమర్తి గారికి అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషా, సాహిత్యాలకి ఎవరో, ఏడో చెయ్యాలి అనే కంటే ఉన్న వ్యవస్థలని పటిష్టం చెయ్యాలి అని వంగూరి చిట్టెన్ రాజు అని పిలుపునివ్వగా, దానికి ఆచార్య యార్లగడ్డ, రాజు చమర్తి సముచితంగా స్పందించారు. శాయి రాచకొండ, రాధిక మంగిపూడి, బుర్రా సాయి మాధవ్ పాల్గొన్న ఈ ప్రత్యేక వేదిక సదస్సు విశిష్ట ప్రాధాన్యతని సంతరించుకుంది. వంగూరి చిట్టెన్ రాజు సహాధ్యాయులుగా ఆ విశ్వవిద్యాలయంలో తెలుగులో మాస్టర్స్ డిగ్రీ చేసిన శివరామ్ యార్లగడ్డ తన అనుభవాలని పంచుకోగా అమృతవల్లి కవి, చంద్రిక పిసుపాటి ఈ వేడుకలో పాల్గొన్నారు.
‘అమెరికా డయాస్పోరా కథ షష్టిపూర్తి” ప్రత్యేక వేదికలో ఆచార్య కాత్యాయని విద్మహే గారి “అమెరికా కథ వైవిధ్యత” ప్రసంగం, డయాస్పోరా కథ వర్తమానం, భవిష్యత్తు మీద ఎస్. నారాయణ స్వామి, శ్రవణ సాహిత్య పోకడల మీద భాస్కర్ పులికల్ విశ్లేషణలు, పాణిని జన్నాభట్ల నిర్వహణలో దీప్తి పెండ్యాల, మధు పెమ్మరాజు, సుభద్ర వేదుల, మెడికో శ్యామ్ పాల్గొన్న ‘అమెరికా కథ” చర్చా వేదిక, విన్నకోట రవిశంకర్ సారధ్యం లో రేణుక అయోల, కె. గీత, ఇంద్రాణి పాలపర్తి పాల్గొన్న కవితా చర్చా వేదిక, స్వీయ రచనా పఠనం, అప్సర్- కల్పనా రెంటాల నిర్వహించిన “సారంగ వేదిక -సమకాలీన సాహిత్యం”, ఊరిమిండి నరసింహారెడ్డి నిర్వహణలో అందరూ పాల్గొన్న “మన సిరి సంపదలు”. శారద కాశీవఝుల నిర్వహణలో స(శా)రదా సాహిత్య ప్రహేళిక అత్యంత ఆసక్తికరంగా జరిగాయి. 50 మందికి పైగా వక్తలు పాల్గొన్న ఎనిమిది ప్రసంగ వేదికలలో రాధిక మంగిపూడి (నిత్య జీవితం లో సంఘటనలని కథలుగా మలచడం ఎలా?), ఈమని శివనాగిరెడ్డి (తెలుగు భాష ప్రాచీనతకి తిరుగులేని ఆధారాలు శాసనాలు), హరి మద్దూరి (తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలు), విన్నకోట రవిశంకర్ (సాహిత్యంలో సతీమణి) జ్యోతి వలబోజు (పుడ్రుచులలో సాహిత్యం), పి. సాయి సత్యనారాయణ (తెలుగు సినిమా నాడు-నేడు), చింతపల్లి గిరిజా శంకర్ (నేనెందుకు రాశాను?1, శారద ఆకునూరి దాశరధి సినీగీతాల ఆలాపన, ఉమాభారతి (అన్నమయ పదాలు- నవరస భరితం), ఇర్దాద్ జేమ్స్ ‘నిలబదే హాస్యం’, దయాకర్ మాడా నిర్వహణలో డాలస్ బృందం వారి “నెల నెలా తెలుగు వెన్నెల” ప్రత్యేక వేదికలో తోటకూర ప్రసాద్ (ఉపాధ్యాయ సాహితీవేత్తలు), మద్దుకూరి విజయ చంద్రహాస్, అనంత్ మల్లవరపు, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, లెనిని వేముల ప్రసంగాలు, వారి గేయాలాపన ఆహూతులని ఆకట్టుకున్నాయి. కృత్రిమ మేధ మీద కొచ్చెర్లకోట బాపారావు విశ్లేషణ, ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం మీద కె. గీత ప్రసంగం అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాయి. తమ తొలి అమెరికా పర్యటనలో ప్రొ. ఎస్. యజ్ఞశేఖర్ (చెన్నై), వ్యాసకృష్ణ బూరుగుపల్లి (ఉగాండా), జయంతి ప్రకాశ శర్మ తెలుగు భాషహాస్య సౌందర్య లహరి) ప్రసంగాలు, పుట్టపర్తి నాగపద్మిని, ఎ.ఎల్, శివకుమారి, చీదెళ్ళ సీతాలక్ష్మి, కె. వరలక్ష్మి, అత్తలూరి విజయలక్ష్మి, నిహారిణి కొండపల్లి, రాజ్యశ్రీ కేతవరపు, జి. వల్లీశ్వర్ (మన కథలకు మూలాలు) తదితర భారత దేశ సాహితీవేత్తల విశ్లేషణలు సదస్సుకి వన్నె తెచ్చాయి. విభిన్న అంశాల మీద అమెరికా సాహితీవేత్తలయిన గ@ లలితా త్రిపుర సుందరి, సుభద్ర వేదుల, శ్యామలాదేవి దశిక, సత్యం మండపాటి, రేవతి వల్లూరి (ఎంకి పాటలు), చంద్రిక పిసుపాటి (కాశ్మీర సాహిత్యం), శివ మల్లవరపు, వేణు నక్షత్రం, లక్ష్మి గోపరాజు (స్త్రీల యాత్రా సాహిత్యం), తదితరుల ప్రసంగాలు ఆసక్తికరంగా సాగాయి.
డాలస్ నివాసి డా. తోటకూర ప్రసాద్ గారికి జీవన సాఫల్య పురస్కార సభ మొదటి రోజు సదస్సుకి పరాకాష్టగా నిలిచింది. రెండవ రోజు సదస్సులో ఆచార్య యార్లగడ్డ వారి “తెలుగు సాహిత్యంలో దళిత కవులు ప్రసంగం, బుర్రా సాయి మాధవ్ గారితో శాయి రాచకొండ నిర్వహించిన ముఖాముఖీ అత్యంత ఆసక్తికరంగా ఆకట్టుకున్నాయి.
సదస్సు నిర్వహణకి ఆర్ధిక సహకారం అందజేసిన వదాన్యులు శాయి రాచకొండ & లలిత (సార్వభౌమ పోషకులు) మల్లిక్ పుచ్చా హ్యూస్టన్ తెలుగు బడి (చక్రవర్తి పోషకులు), డా. యలమంచిలి రాజశేఖర్, శారద ఆకునూరి, శ్యామల & రామకృష్ణ దశిక, జితేందర్ రెడ్డి (మహారాజ పోషకులు), తదితర రాజాధిరాజ, యువరాజ సాహితీ పోషకులకి సభాముఖంగానూ, రెండు రోజులపాటు తెర మీద ప్రత్యక్ష ప్రసారాలలోనూ నిర్వాహకులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
హ్యూస్టన్ లో అత్యంత ఆహ్లాదంగా, విజయవంతంగా జరిగిన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కార్యక్రమ రూప కల్పన, నిర్వహణలో వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, దీప్తి & శ్రీనివాస్ పెండ్యాల, ఇంద్రాణి పాలపర్తి, కోటి శాస్త్రి, ప్రధాన నిర్వాహకులైన శ్రీకాంత్ రెడ్డి (తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు) సారధ్యంలో పంకజ్ మల్లిక్, రామ్ చెరువు & బృందం (ప్రతినిధుల ప్రయాణ సౌకర్యాలు), పల్లారెడ్డి & బృందం (భోజన సదుపాయాలు), వేదిక అలంకరణ, అతిధి సదుపాయాలలో కావ్య రెడ్డి, ఇందిర చెరువు, శాంత సుసర్ల, ఉమ దేశభొట్ల, వాణి దూడల, సుమారు 25 మందికి పైగా స్వచ్చంద సాహితీ సేవకులు తమ సహకారాన్ని అందజేశారు. వీరందరికీ పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.
-కళాసాగర్ యల్లపు
