ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?

ఇంటర్నెట్ ఆవిష్కరణతో అన్ని రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రకటనా రంగం (అడ్వర్టైజింగ్)లో పెనుమార్పులు సంభవించాయి. తొంభయ్యవ దశకం వరకూ ప్రచారం కోసం ప్రింట్ మీడియా పై ఆధారపడేవారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా పవేశించింది. ప్రస్తుతం ఆ రెండు మీడియాలను అధిగమించింది సోషల్ మీడియా. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో 2006 సంవత్సరం నుండి ప్రచారానికి సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. సెర్చ్ ఇంజన్లో ప్రపంచంలో ప్రథమ స్థానంలో వున్న గూగుల్ ఇంటర్నెట్ లో ప్రచారానికి తెరతీసింది. అంతే ఫేస్బుక్, జి.మెయిల్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా వేదికలపై ప్రకటనలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇదంతా గూగుల్ ఆధ్వర్యంలో నడుస్తున్న గూగుల్ యాడ్సెన్స్ నిర్వహిస్తుంది. దీని ప్రభావం ప్రింట్ మీడియా పై తీవ్రంగా పడింది. ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడానికి బీజం ఇక్కడే పడిందని చెప్పోచ్చు. తమ తమ వెబ్ సైట్ ల ద్వారా, యూట్యూబ్ ద్వారా నేడు ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.

ఇప్పుడు డిజిటల్ సురేష్  రచించిన ‘ఇంటర్నెట్ లో డబ్బు సంపాదించడం ఎలా ‘ నేర్చుకొండి… పుస్తకం పైన పేర్కొన్న గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా డబ్బులు ఎలా ? సంపాదించవచ్చు అనే విషయాలను తనకున్న ఆరేళ్ళ అనుభవాన్ని రంగరించి తన లాగే మరికొంత మంది సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించుకునేందుకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో పుస్తక రూపంలో అందించారు. కాస్తో కూస్తో చదువుకొని ఇంటర్నెట్ గురించి అవగాహన కలిగిన వారికి అర్థమయ్యేలా …
వెబ్ సైట్ రూపొందించుకోవడం ఎలా?
డొమైన్ అంటే ఏమిటి?
వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి? అందులో రకాలు అంటే ఏమిటి?
వర్డ్ ప్రెస్ అంటే అంటే ఏమిటి?
ఎలాంటి కంటెంట్ సేకరించాలి?
గూగుల్ యాడ్ సెన్స్ అంటే? ఏమిటి దానికి ఎలా అప్లై చేయాలి?
వెరిఫికేషన్ ఎలా తీసుకోవాలి?
యాడ్ వర్డ్స్ అంటే ఏమిటి? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?
ఈ-మెయిల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది ?
Affiliate marketing అంటే ఏమిటి?
SEO అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?
SMO అంటే ఏమిటి ?
వెబ్ సైట్ లో ఎన్ని రకాల క్యాటగిరీలు ఉన్నాయి? అవి ఏమిటి?
వెబ్ సైట్ కు ట్రాఫిక్ ను పెంచుకోవడం ఎలా?  ఫేస్ బుక్ పేజ్ క్రియేట్ చేయడం ఎలా ?
అనే అంశాల గురించి సవివరంగా తెలుగులో, ఫొటోలతో సహా వివరించారు సురేష్ గారు.
అయితే ఇందులో కీలక అంశాలైన వెబ్ డొమైన్, వెబ్ హోస్టింగ్ ల గురించి వివరించే టప్పుడు అవి మనకు ఉచితంగా లభించవు కొనుక్కోవలసి ఉంటుందనే విషయాన్ని రాస్తే బావుండేది సురేష్ గారు. ఎందుకంటే చాలామంది వెబ్సైట్ నిర్వహించడానికి ఖర్చేమీ ఉండదు అనుకుంటారు. నిర్వహణకే కాదు డొమైన్, హోస్టింగ్ లకు ప్రతి సంవత్సరం కొంత డబ్బు చెల్లించాలి అనే విషయం చాలా మందికి తెలియదు. ఇంకా సురేష్ గారు “నేను నెలకు 25 వేల నుండి 30 వేల వరకు సంపాదిస్తున్నాను ” ఆని రాసుకున్నారు ఈ పుస్తకంలో. ఆ వెబ్సైట్ వివరాలు కూడా ఇందులో పొందుపరిస్తే మరింత బావుండేది. సమాచారం చాలా చోట్ల కట్టె, కొట్టె, తెచ్చే అన్నట్లు వుంది కాని సరళంగా లేదు.

చివరిగా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ? యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ? మోనిటైజేషన్ కి ఎలిజిబుల్ ఎప్పుడు అవుతుంది లాంటి సమాచారం ఇచ్చారు.

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించుకునేందుకు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోండి అంటూ… నిత్యం అనేక ప్రకటనలు చూస్తూంటారు. అలాంటివి చూసినప్పుడు మనకి ఇది నిజమా ? కాదా ? అని సందేహాలు వస్తాయి. ఆలాంటి వారికి ఈ పుస్తకం ఉపయోగపడగలదు. ఈ రంగంలోకి రావాలనుకునే వారు ఈ 200 పేజీల పుస్తకం చదివితే డబ్బు సంపాదించగలరా? అంటే … అది మీకృషి మీద అధారపడి వుంటుంది… ఇది మీకొక మార్గదర్శి గా మాత్రమే ఉపయోగపడగలదు. మీచేత తొలి అడుగులు వేయించగలదు.

ప్రస్తుతం ఎలాంటి సమాచారం కావాలన్నా యూట్యూబ్ లో దొరుకుతున్న తరుణంలో ఈ పుస్తకం వెల కాస్త ఎక్కువనిపిస్తుందేమో? .

-కళాసాగర్ యల్లపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap