‘హ్యూమర్ టూన్స్ ‘ సరికొత్త హాస్య మాసపత్రిక

తెలుగు కార్టూన్ కు 90 ఏళ్ల చరిత్ర ఉంది. తలిశెట్టి రామారావు గారు తెలుగు వారికి కార్టూన్ ను పరిచయం చేస్తే, బాపుగారు ఆ కార్టూన్కు గ్లామర్ నద్దారు. తెలుగులో హాస్య రచయితలకు కొదవలేదు. కానీ తెలుగులో కార్టూన్ ప్రధానంగా వస్తున్న హాస్య పత్రికలు బహు తక్కువ. అందులో ‘హాస్యప్రియ ‘ శంకు గారి ఆధ్వర్యంలో 90వ దశకంలో హాస్యప్రియులను అలరించడమే కాకుండా, ఎందరో యువ కార్టూనిస్టులు పుట్టుకొచ్చేందుకు ప్రేరణ, ప్రోత్సాహం ఇచ్చింది. తర్వాత శ్యామ్ మోహన్ గారి ఆధ్వర్యంలో ‘స్మైల్ ‘ ప్రత్యేక కార్టూన్ సంచికలు తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘హాస్యానందం ‘ పత్రిక ఒక్కటే గత దశాబ్ద కాలం పైగా వెలువడుతోంది. ఇప్పుడు మరో పత్రిక కార్టూనిస్ట్ కిరణ్ ఆధ్వర్యంలో ‘హ్యూమర్ టూన్స్ ‘ పేరుతో ద్విభాషా హాస్య పత్రికగా వెలువడింది.

62 పేజీలున్న ఈ పత్రిక లో ఏముందో చూద్దాం. ప్రారంభ వ్యాసంగా సీనియర్ కార్టూనిస్ట్ జయదేవ్ గారు కార్టూన్కో తతంగం ఉందంటూ.. పత్రికలు సాధక బాధకాల గురించి… పంచ్, శంకర్ వీక్లీ లాంటి పత్రికల ప్రస్థానం గురించి.. పత్రికల ప్రాముఖ్యత గురించి వివరించారు.   నవతరానికి నవ్వు నందిద్దాం అంటూ – బ్నిం గారు, బాల కార్టూనిస్టుల ను తయారు చేద్దాం అంటూ –  అంబటి చంటిబాబు గారు, కార్టూన్లు సామాజికంగా ఉపయోగకరంగా ఉంటున్నాయా అంటూ – పి.వి. రామశర్మ  గారు, కార్టూన్ల కథాకమామిషు గురించి- గణేష్ రావు గారు, చిత్రకళా ఆవస్యకత గురించి… వాసుదేవరావు గారు, మూడు హాస్య కథలతో పాటు, రెండు పేజీలు కవితలకు కూడా కేటాయించారు, అయితే హాస్య ప్రధానంగా వస్తున్న పత్రికల్లో కవితలు అసందర్భంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇక ఇంగ్లీష్ లో బిజీ నరేంద్ర, శ్రీధర్ కొమరవెల్లి, డాక్టర్ స్మితా బండారి, వర్చస్వి, యారి షాన్మే, లాంటి ప్రముఖ కార్టూనిస్టులు వ్యాసాలు ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇంకా ఇందులో ఎన్నో కార్టూన్లు, కొన్ని క్యారికేచర్లు కూడా ఉన్నాయి.
హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది. అవి వార్తలయినా, వినోదానికయినా, పత్రికలైనా, సరదా కబుర్లు కైనా… ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోయిన ఈ రోజుల్లో ప్రింట్ పత్రికల మనుగడకే ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో ఒక పత్రిక ను ప్రారంభించడం అంటే సాహసోపేత నిర్ణయం అని చెప్పాలి.  అన్నిటికీ సంసిద్ధులై పత్రికా రంగంలోకి అడుగు పెట్టిన కిరణ్ కి అభినందనలు తెలియజేస్తుంది 64 కళలు డాట్కాం.

SA:

View Comments (2)

  • హృదయపూర్వక ధన్యవాదాలు సర్💐
    నా మొదటి కార్టూన్ 64కళలు. కాం లో ప్రచురితమైనది, హ్యూమర్ టూన్స్ పత్రిక పై ఆర్టికల్ రావడం కూడా యాదృచ్చికమైనా 64కళలు. కాం సెంటిమెంట్ గా నాకు కలిసి వచ్చింది, సంపాదకులు కళాసాగర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు💐💐💐
    హ్యూమర్ Toons💐