ధగధగల వెనుక చీకట్లు: ‘గాజు గోడల’ నిశ్శబ్ద పోరాటం

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్…
రాత్రి వేళల్లో ఆకాశాన్నంటే కాంతులతో, మిరుమిట్లు గొలిపే గ్లాస్ బిల్డింగులతో ఒక సరికొత్త ప్రపంచంలా కనిపిస్తుంది. దేశ విదేశాల ఐటీ దిగ్గజాలు కొలువుదీరిన ఈ కలల సామ్రాజ్యం వెనుక, ఆ ధగధగలాడే విద్యుత్ దీపాల లోపల… వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నిశ్శబ్ద పోరాటం, ఒంటరితనం, కరిగిపోతున్న జీవితాలు దాగున్నాయనేది నగ్న సత్యం.

వెలుగుల వెనుక చీకటి: నైట్ షిఫ్ట్ నరకం
బయటి ప్రపంచానికి ఐటీ ఉద్యోగం అంటే లక్షల జీతాలు, ఏసీ రూములు, వీకెండ్ పార్టీలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ ఏసీ గదుల్లో గడ్డకట్టుకుపోతున్న భావోద్వేగాల గురించి ఎవరికీ తెలియదు. యూరప్, అమెరికా టైమ్ జోన్లకు అనుగుణంగా ఇక్కడ రాత్రి పూట సూర్యుడు ఉదయిస్తాడు. సాయంత్రం అందరూ ఇళ్లకు చేరుకునే వేళకు, వీరు ల్యాప్‌టాప్ బ్యాగులతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు పయనమవుతారు. రాత్రంతా నిద్రను చంపుకుని, స్క్రీన్ల వంక చూస్తూ గడపడం వీరికి ఏళ్ల తరబడి సాగే ఒక జీవన శిక్ష. కెఫెటెరియాలో దొరికే ఉచిత కాఫీ కప్పులు వారి నిద్రను తాత్కాలికంగా ఆపొచ్చు ఏమో కానీ, శరీరంలో పేరుకుపోతున్న అలసటను, ఒత్తిడిని ఆపలేవు. తెల్లవారుజామున క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్తున్నప్పుడు, “డబ్బు సంపాదిస్తున్నాం సరే, కానీ జీవితాన్ని కోల్పోతున్నామా?” అనే ప్రశ్న ప్రతి టెక్కీని వేధిస్తూనే ఉంటుంది.

ఒంటరితనం.. బంధాలకు దూరం
నైట్ షిఫ్ట్‌లు చేసే ఐటీ ఉద్యోగి జీవితంలో అతిపెద్ద శాపం – సామాజిక దూరం. సమాజం మెలకువగా ఉన్నప్పుడు వీరు నిద్రపోతారు, లోకం నిద్రిస్తున్నప్పుడు వీరు కోడింగ్ రాస్తుంటారు లేదా క్లయింట్ కాల్స్‌లో తలమునకలై ఉంటారు. దీనివల్ల ఒకే ఇంట్లో ఉంటూ కూడా భార్యాభర్తలు మాట్లాడుకునే సమయం దొరకదు. తండ్రి ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు పిల్లలు నిద్రపోతుంటారు, తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు స్కూల్‌కి వెళ్తుంటారు. ఫలితంగా “నాన్న” అనే పిలుపు కేవలం వీకెండ్‌కే పరిమితమైపోతోంది. ఊరంతా పండగ సంబరాల్లో ఉన్నా, వీరు మాత్రం ఆఫీసు మూలన కూర్చుని ‘క్రిటికల్ ప్రొడక్షన్ ఇష్యూస్’ సాల్వ్ చేస్తుంటారు. పండగ నాడు అమ్మ ఫోన్ చేసి భోజనం చేశావా అంటే, కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా గుటక మింగుతూ “చేశానమ్మా, ఇక్కడ పని ఉంది” అని అబద్ధం చెప్పే ఐటీ ఉద్యోగులు ఎందరో ఉన్నారు.

‘డెడ్‌లైన్స్’ ఒత్తిడి మరియు అనారోగ్యం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనేది కేవలం పని కాదు, అదొక నిరంతర యుద్ధం. ప్రతిరోజూ ఒక కొత్త డెడ్‌లైన్, స్ప్రింట్ డెలివరీలు, మేనేజర్ల మైక్రో-మేనేజ్‌మెంట్, అప్రైజల్స్ భయాలు… ఇవన్నీ కలిసి మనిషిని మానసికంగా ముక్కలు చేస్తాయి. స్క్రీన్ మీద కనిపించే ‘ఎర్రటి ఎర్రర్ లైన్’ చూస్తే గుండె ఆగినంత పనవుతుంది. లాగ్స్ చెక్ చేస్తూ, కోడ్ డిబగ్ చేస్తూ గడిపే రాత్రుల్లో… బిపి, షుగర్, డిప్రెషన్ వంటి జబ్బులు చాలా చిన్న వయసులోనే జీవితంలోకి ఇన్ స్టాల్ అయిపోతాయి. లగ్జరీ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, కాస్ట్లీ కార్లు ఉండొచ్చు… కానీ మనశ్శాంతిగా ఒక ఆరు గంటలు నిద్రపోయే లగ్జరీ మాత్రం వీరికి దొరకదు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని పెద్ద పెద్ద టవర్లు కేవలం కాంక్రీట్ కట్టడాలు కావు. అవి మధ్యతరగతి కుర్రాళ్ల కలలు, కుటుంబ బాధ్యతల కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన వేలాది మంది యువతీ యువకుల స్వేద బిందువుల సమాహారం. హైదరాబాద్ ఐటీ హబ్ వెలుగుతోంది అంటే, అక్కడ ఎవరో ఒక టెక్కీ తన రాత్రిని, తన సంతోషాన్ని త్యాగం చేస్తున్నాడని అర్థం. ఈ మెరుపులు కేవలం బిల్డింగులవి కావు… ఐటీ ఉద్యోగుల జీవితాలు కరుగుతుంటే వస్తున్న వెలుగులు!
ఇటీవల నాలుగురోజుల పాటు హైదరాబాద్ తిరిగొచ్చినాక కలిగిన అభిప్రాయం.

-కళాసాగర్

Share via
Copy link
Powered by Social Snap