వంటకంలో సాటిలేని – ఇందిర ఐరేని

కేవలం యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా సామాజిక ప్రయోజనం కలిగించే మట్టితోను, పసుపుతోనూ వినాయకుని ప్రతిమ తయారుచేసుకోవడం ఎలా ? లాంటి చక్కటి బొమ్మలు చేసి చూపిస్తున్న యూట్యూబ్ స్టార్ ఇందిర ఐరేని స్వస్థలం తెలంగాణాలోని సిద్దిపేట. తల్లిదండ్రులు కళావతి, వెంకట్రాములు. భర్త అనిల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇద్దరు పిల్లలు. అమ్మాయి స్పెయిన్ లో ఆర్కిటెక్చర్ మాస్టర్ డిగ్రీ చేస్తున్నది. అబ్బాయి ఇక్కడే చదువుతున్నాడు. ఇందిర డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈఎస్ఎ హాస్పిటల్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నది. తీరిక సమయంలో వంటింటిని ప్రయోగశాలగా మార్చేది. పాత రుచులపట్ల మమకారంతో అమ్మ, అమ్మమ్మల నుంచి సంప్రదాయ వంటకాల గురించి తెలుసుకునేది. ఓసారి, సరదాగా స్పైసీ హైదరాబాద్ బిర్యానీ వండి, రెసిపీని వివరిస్తూ ఓ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. దీనికి మంచి స్పందన వచ్చింది. లైకులు వెల్లువెత్తాయి. మరిన్ని రుచులు పరిచయం చేయమంటూ నెటిజన్ల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో, 2016 లో ‘హైదరాబాదీ రుచులు’ పేరిట యూట్యూబ్, ఫేస్బుక్ లో ఛానళ్ళను ప్రారంభించింది. ఆ వేదిక మీద గత ఏడేండ్లుగా వారానికి మూడు వంటకాలను పరిచయం చేస్తూ.. యూట్యూబ్ స్టార్ చెఫ్ గా పేరు తెచ్చుకున్నది.

పన్నెండు వందల వంటకాలు..16 కోట్లకు పైగా వ్యూస్..
ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో కొత్త వీడియోలను అప్లోడ్ చేస్తూ భోజనప్రియుల అభిమానాన్ని పొందుతున్నది ఇందిర. ఇప్పటికే హైదరాబాదీ దమ్ బిర్యానీ, స్పైసీ ఎగ్ కర్రీ, చేపల పులుసు, బగారా చికెన్ రైస్, తలకాయ కూర.. ఇలా ఎన్నో వంటకాలను పరిచయం చేసింది. పచ్చళ్లు, స్నాక్స్, స్వీట్లు, కారంపొడులు, పండుగల స్పెషల్ వంటకాల రెసిపీలనూ అందించింది. రాగి జావ, అంబలి, సర్వపిండి గొప్పదనాన్ని వీక్షకులకు ఇ-రుచి చూపింది. అలా అని, ఒక్క తెలంగాణ వంటకాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ భోజనాలూ వడ్డించింది. ఇప్పటికే దాదాపు పన్నెండు వందల రెసిపీలను అప్లోడ్ చేసింది. ఎన్ని వంటలు వండినా, తనకు మాత్రం ఎగ్ కర్రీ అంటేనే ఇష్టమని చెబుతుంది ఇందిర. తరచూ గృహిణులకు కిచెన్ టిప్స్ కూడా అందిస్తుంది. పాకశాస్త్ర గురువు హోదాలో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇస్తుంది. పలు పత్రికలకు కిచెన్ సైన్స్ కాలమిస్ట్ కూడా.

ఎల్లలు దాటిన రుచుల గుబాలింపు…
ఇందిర చానల్ కు యూట్యూబ్ లో 8.23 లక్షల మంది, ఫేస్ బుక్ లో 5.22 లక్షల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. నెస్లీ, ఎంటీఆర్, ఈస్టన్ మసాలా, కెంట్, స్పెన్సర్స్, గోల్డ్ డ్రాప్ ఆయిల్, హిమాలయ, ఫార్చ్యూన్ ఫ్రెష్ ఆటా, కంట్రీ చికెన్ తదితర కంపెనీల ఉత్పత్తులకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. భారత పర్యటనకు విచ్చేసిన దాదాపు 500 మంది విదేశీ ప్రతినిధులకు తన వంటకాలను రుచి చూపింది ఇందిర, తెలంగాణ టూరిజం నుంచి, ఏపీ ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా ఇన్ ఫ్లూఎన్సర్ అవార్డును కూడా అందుకున్నది. ‘రెస్టారెంట్లలో ఎన్నో వంటకాలను రుచి చూస్తుంటాం. కానీ చాలామందికి వాటిని ఎలా తయారు చేయాలో తెలియదు. తినాలనిపించిన ప్రతిసారీ రెస్టారెంటు వెళ్లడమంటే.. ఖరీదైన వ్యవహారమే. ఆ ఇబ్బంది లేకుండా, మధ్యతరగతి కుటుంబాలకు రెస్టారెంట్ను మరిపించే రెసిపీలను పరిచయం చేస్తున్నా, మరీ ముఖ్యంగా, అసలైన హైదరాబాదీ రుచులను ప్రతి వంటగదికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఓ చానల్ ఏర్పాటుచేశాను. నా ప్రయత్నానికి నెటిజన్ల నుంచి ఎంతో ప్రోత్సాహం లభిస్తున్నది. ఇన్నేండ్లుగా, ఇన్ని వీడియోలు అప్లోడ్ చేశానంటే.. నా భర్త అనిల్, ఇతర కుటుంబసభ్యుల సహకారమే కారణం. విదేశీయులు సైతం తెలంగాణ వంటకాల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. సందేహాలుంటే ‘నన్ను సంప్రదిస్తున్నారు’ అంటారు ఇందిర.
కళాసాగర్

ఇందిర చేసిన రెసిపీ లలో ఫిష్ ప్రై వీడియోకు 13 మిలియన్ల వ్యూస్ వచ్చాయి… లింక్ చూడండి…

https://www.youtube.com/watch?v=sUkt91x-cOY&t=2s

‘హైదరాబాదీ రుచులు’ యూట్యూబ్,ఫేస్బుక్ లింక్స్ క్లిక్ చేయండి…

https://www.facebook.com/hyderabadiruchulu
https://www.youtube.com/hyderabadiruchulu




1 thought on “వంటకంలో సాటిలేని – ఇందిర ఐరేని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap