నెమలి పించంతో వుండే సంతకం 2005 నుంచి తెలుగు పాఠకులకి పరిచయమే. ఆ సంతకం సొంతదారు నాగేశ్వరం హరికృష్ణ అనుబడే నేను. 20-5-1988న హనుమాన్, విజయలక్ష్మి గార్లకు జన్మించాను. నా చదువు గోదావరి జిల్లాల్లోని చాగల్లు, కొవ్వూరు, రాజమండ్రిలలో జరిగినది. బి.ఎస్సీ. (కంప్యూటర్స్) తర్వాత 3D యానిమేషన్ హైదరాబాదులో నేర్చుకున్నాను. ప్రస్తుతం కృష్ణ జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో ఉంటున్నాను. ఫ్రీలాన్స్ కార్టూనిస్టుగా, గ్రాఫిక్ డిజైనర్గా స్వయం ఉపాధి ఏర్పరుచుకున్నాను. చిన్నతనంలో ఉయ్యూరు దగ్గర వీరవల్లి మొఖాసాలో తాత గారింటికి వెళ్ళినపుడు వారింట్లో, ఎదురుగా వున్న కరణంగారింట్లో ఉన్న పాతకాలంనాటి పత్రికలలో కార్టూన్లు నన్ను ఆకర్షించాయి. అలాంటి కార్టూన్లు వేయాలని అనుకున్నాను. అలాగే “కొంటె బొమ్మల బాపు” అనే బాపు గారి కార్టూన్ల పుస్తకం తాత గారింట్లో దొరికింది. అదే నేను చదివిన మొదటి కార్టూన్ల పుస్తకం. అప్పుడు నేను పదో తరగతి పరీక్షలు రాసి శెలవులు ఎంజాయ్ చేస్తున్నాను. ఇంటర్ మొదటి ఏడాది నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఎక్కువగా గ్రంధాలయంలోనే గడిపేవాడిని. వార్తాపత్రికలు, వార, పక్ష, మాసపత్రికలు, కార్టూన్ సంకలనాలు ఎక్కువగా చూస్తుండేవాడిని. అప్పట్లో “హాస్యానందం” మాసపత్రికలో వచ్చిన కార్టూన్లు, కార్టూనిస్ట్ సుభాని గారు అంతర్జాతీయ కార్టూన్ పోటీల గురించి రాసిన వ్యాసాలు నన్ను బాగా ఆకర్షించాయి. నా కాలేజీ పుస్తకాల సంచీలో ఎప్పుడూ ఆ పత్రిక ఉండేది. నేను కార్టూన్లు గీసే తొలిరోజుల్లో ప్రముఖ కార్టూనిస్టులు శేఖర్ గారు (రాజమండ్రి), హరి వెంకట్ గారు కార్టూన్లకి సంబంధించిన కొన్ని విషయాలు ఉత్తరాల ద్వారా చెప్పారు. నేను మొదట కలిసిన కార్టూనిస్టులు పుష్ప (బోలెం సత్యనారాయణ) గారు, శేఖర్ గారు (రాజమండ్రి),. తరవాతి రోజుల్లో నేను ఎందరో కార్టూనిస్టులను పలు కార్యక్రమాల్లో కలవడం జరిగింది.
నా మొదటి కార్టూనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005లో కార్టూనిస్ట్ రామ్ శేషు గారు వారి నాన్న గారి జ్ఞాపకార్థం హాస్యానందం పత్రికతో కలిసి నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్టూన్ పోటీలో బెస్ట్ కార్టూన్ బహుమతి అందుకుంది.
అప్పటి వరకు సోషల్ కార్టూన్లు వేసే నాకు 2012లో మొదటగా “సన్ ఫ్లవర్ న్యూస్” అనే దినపత్రికలో పొలిటికల్ కార్టూన్లు వేసే అవకాశం వచ్చింది.ఆ తర్వాత నేను “indiabells.com” వెబ్సైట్కు, “మనం” దినపత్రికకు పొలిటికల్ కార్టూన్లు విరివిగా వేశాను. “మహదానందం” శీర్షికతో ”మనం” పత్రిక ఆదివారం అనుబంధంలో ఫుల్ పేజీ కార్టూన్లు వేసేవాడిని. కార్టూన్ వాచ్, మనం, సన్ ఫ్లవర్ న్యూస్, ఫొటోగ్రాఫర్ల గుండె చప్పుడు, హాస్యానందం, జయ జయహే, స్మైల్ ప్లీజ్, న్యూస్ మేకర్ వంటి పత్రికలలో, Indiabells.com, gotelugu.com,, extrainsights.in, BuddyBits వంటి వెబ్సైట్లలో నా కార్టూన్లు ప్రచురించబడినాయి.
నేను గత 10 సంవత్సరాలుగా గ్రాఫిక్ టాబ్లెట్ మీద కార్టూన్లు వేస్తున్నాను. ప్రస్తుతం Wacom MobileStudio Pro అనే టాబ్లెట్ వాడుతున్నాను. Adobe Photoshop, Adobe Illustrator సాఫ్ట్వేర్లలో కార్టూన్లు వేస్తాను. కార్టూనిస్టులు, ఆర్టిస్టుల కోసం డిజిటల్ కార్టూనింగ్, డిజిటల్ కలరింగ్ మీద ఆన్లైన్ వర్కుషాప్స్ నిర్వహించే ఆలోచనలో వున్నాను.
ఒకసారి ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారు మరో ప్రముఖ కార్టూనిస్ట్ సత్యమూర్తి గారికి నన్ను పరిచయం చేస్తూ నేను వేసిన ఒక కార్టూన్ గురించి చెప్పారు. అది మరచిపోలేని గుర్తు. ప్రముఖ కార్టూనిస్టులు శంకర్, మాధవ్, సరసి గార్లు వివిధ సందర్భాల్లో నన్ను ప్రశంసించారు.ఇలా వివిధ రంగాల్లో వున్న అనేకమంది ప్రముఖుల, పాఠకుల ప్రశంసలు పొందాను.
2012లో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన మూడు రోజుల కార్టూన్ ఉత్సవంలో పాల్గొనటం గొప్ప అనుభూతి.. 2017లో బెంగుళూరులో జరిగిన తెలుగు కార్టూనోత్సవం నిర్వహణలో, అదే సంవత్సరం మచిలీపట్నంలో జరిగిన తెలుగు కార్టూన్ల ప్రదర్శన నిర్వహణలో నేను గణనీయమైన సేవలు అందించాను.
171 మంది తెలుగు కార్టూనిస్టులతో “Cartoonists chit chat” అనే వాట్సప్ గ్రూపు నిరహిస్తున్నాను. ఆ గ్రూపులో ఒకసంవత్సరం పాటు ప్రతి నెలా వివిధ పత్రికలు,వెబ్సైట్లలో ప్రచురించబడిన కార్టూన్లలో రెండు ఉత్తమ కార్టూన్లకు బహుమతులు కూడా స్పాన్సర్ల ద్వారా అందించాను. జనవరి 2021 నుంచి మరొక సారి సంవత్సరకాలం పాటు ఈ విధంగా 3 బహుమతులు అందజేయనున్నాను.
సినిమాలకు డైలాగ్స్, సాంగ్స్ రాయటం, డబ్బింగ్, నటనల్లో ఆసక్తి వుంది నాకు. స్కూల్స్, కాలేజీల్లో చదివే రోజుల్లో వివిధ హాస్య నాటికల్లో నటించి మెప్పు పొందాను.హైస్కూల్లో, కాలేజీల్లో చదివే రోజుల్లో వక్తృత్వ పోటీల్లో బాగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నాను.
నేను అందుకున్న అవార్డులు, బహుమతులు:
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిజ్ఞాస సంస్థ వారు అందజేసిన “సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్” అవార్డు,
*కార్టూన్ వాచ్ మాసపత్రిక వారు నిర్వహించిన జాతీయ స్థాయి కార్టూన్ పోటీలో మొదటి బహుమతి,
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోరుట్ల ఫన్నీ క్లబ్ వారు నిర్వహించిన రాష్ట్రీయ స్థాయి కార్టూన్ పోటీలో మొదటి బహుమతి,
*రెండు తెలుగు రాష్ట్రాల కార్టూనిస్టుల కోసం మాలిక వెబ్ పత్రిక వారు నిర్వహించిన కార్టూన్ పోటీలో రెండో బహుమతి,
*5 సార్లు కార్టూన్ వాచ్ మాసపత్రిక వారు నిర్వహించిన జాతీయ స్థాయి కార్టూన్ పోటీల్లో స్పెషల్ ప్రైజ్లు,
*తలిశెట్టి రామారావు కార్టూన్ కాంటెస్ట్లో స్పెషల్ ప్రైజ్, గోతెలుగు.కామ్ వారు నిర్వహించిన కార్టూన్ కాంటెస్ట్లో స్పెషల్ ప్రైజ్, ఇంకా అనేక కార్టూన్ పోటీలలో రాష్ట్రీయ, జాతీయ,స్థాయిల్లో బహుమతులు.
UMO ఇంటర్నేషనల్ కార్టూన్ ఎగ్జిబిషన్లో, వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్లో జరిగిన కార్టూన్ ప్రదర్శనలో, ఆస్కా వారు నిర్వహించిన “తెలుగు భాష సంస్కృతి సంప్రదాయం” కార్టూన్ ప్రదర్శనలో మరియు అనేక అంతర్జాతీయ,జాతీయ,రాష్ట్రీయ స్థాయి కార్టూన్ ప్రదర్శనల్లో నా కార్టూన్లు ప్రదర్శింపబడ్డాయి. నా మిత్రుడు, ప్రముఖ కవి నేలపూరి రత్నాజీ గారి సహకారంతో చాగల్లులో సోలో కార్టూన్ ప్రదర్శన కూడా నిర్వహించాను.
-హరికృష్ణ
Youngest Cartoonist. ఈ వయసులో తెలుగు భాష మీద, కార్టూన్ రంగం మీద, దైనందిక సామాజిక సమస్యల మీద అంత పరిజ్ఞానం కలిగి ఉండడం నిజంగా అభినందించదగ్గ విషయం. (ప్రసిద్ధ)
నా వందలాది కార్టూన్లు ఇక్కడ చూడండి:
Facebook.com/HariKrishnaCartoons
మీరు నాతో మాట్లాడాలనుకుంటే 9951817518 నెంబర్కి కాల్ చేయండి. ఆర్డర్ పై మీ బంధువుల, స్నేహితుల బొమ్మలు వేసివ్వబడును. నా వ్యాసాన్ని పోస్ట్ చేసినందుకు 64కళలు. కాం కు ధన్యవాదాలు.
-కార్టూనిస్ట్ హరి కృష్ణ
హరికృష్ణ గారి కార్టూన్లు చాలా బాగుంటాయి. అందంగా ఉంటాయి.హాయిగా నవ్వుకునేలా ఉంటాయి.
nice…….harikrishna………you are really great…..
Nice