కళాకారులకు గుర్తింపు కార్డులు-మంత్రి రోజా

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 19, 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

జాతీయ సాంస్కృతిక ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా

జగనన్న ప్రభుత్వం కవులు, కళాకారులకు పెద్దపీట వేస్తుందని, వారికి చేయూతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీమతి ఆర్.కె.రోజా అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 19, 20 తేదీలలో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న’జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’ కార్యక్రమ లోగోను ఆమె బుధవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కవులు, రచయితలు, కళాకారుల ఆత్మీయ సమ్మేళనంగా రెండు రోజులపాటు జరుగనున్న సాంస్కృతిక ఉత్సవాల ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి రోజాని కలిసి కార్యక్రమ ప్రారంభ సభకు ఆహ్వానించారు.

సాంస్కృతిక శాఖామంత్రిగా నేను ఈ సాంస్కృతిక ఉత్సవాలకు తప్పక హాజరవుతానని చెబుతూ, ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- అర్హత కలిగిన కవులు, రచయితలు, కార్టూనిస్టులు, కళాకారులకు గుర్తింపు కార్డులిచ్చేందుకు జగనన్న ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వపరంగా జరుగుతున్నాయన్నారు. వివిధ రంగాలతో పాటు సాహితీ, కళా రంగాల్లో కృషి చేస్తున్న సేవామూర్తులను గుర్తించి ప్రతిష్టాత్మకమైన వైయస్సార్ అవార్డులను రెండు సంవత్సరాలుగా జగనన్న ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు కవులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, కార్టూనిస్టులు ఈ ఉత్సవాలకు తప్పక హాజరు కావాలని కోరారు. వివరాలకు 92464 15150 నెంబరులో సంప్రదించవచ్చని తెలియజేశారు. మంత్రిని కలిసినవారిలో ఆహ్వాన కమిటీ సభ్యులు కలిమిశ్రీ, చొప్పా రాఘవేంద్రశేఖర్, ఇస్కా రాజేష్ బాబు, యేమినేని వెంకటరమణ, అంతిమతీర్పు వల్లూరు ప్రసాద్ కుమార్ వున్నారు.

SA: