నక్కా ఇళయరాజా ఇక లేరు

ప్రముఖ వైద్యులు, కథారచయిత డా. నక్కా విజయరామరాజు గారి కుమారుడు, యువకార్టూనిస్టు అయిన నక్కా ఇళయరాజా (26 ఏళ్ళు) న్యుమోనియా వ్యాధి కారణంగా స్వర్గస్తులైనట్లు తెలిసి చింతిస్తున్నాము. వీరి పవిత్రాత్మకు శాంతిచేకూరాలని, సద్గతులు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. 64కళలు.కాం తరపున వీరి కుటుంబసభ్యులకు ప్రగాఢసంతాపం తెలియజేస్తున్నాము.

20-11-2021 నాడు కొంటెబొమ్మలబ్రహ్మలు పుస్తకావిష్కరణలో పాల్గొన్న యువ కార్టూనిస్టుగా అందరిమనసుల్లో నిలిచిపోయాడు. చక్కని సందేశాన్నిచ్చే కార్టూన్లు తక్కువగా గీసినా ఇళయరాజా తెలుగు కార్టూన్ రంగంలో కొంటె బొమ్మల బ్రహ్మలు పుస్తకం ద్వారా చిరకాలం నిలిచిపోతాడు.
……………………………………………………………………………………………..
ఇళయరాజా అకాల మరణానికి చింతిస్తూ ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారు తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు…
“బుర్రకి పదును పెట్టడం, బుర్రకి మేత, మేధోమధనం ఇవన్నీ తెలియని కార్టూనిస్టులెవరన్నా ఉన్నారా అని వెతికితే నాకు కనిపించే ఏకైక కార్టూనిస్టు చిరంజీవి ఇళయరాజా. బుద్ధిగా ఒక చోట కూర్చుని డ్రాయింగ్ పేపరూ, స్కెచ్ పెన్నూ, కలర్ పెన్సిళ్ళూ పెట్టుకుని సరదాగా బొమ్మల కధలూ, కార్టూన్ స్ట్రిప్పులూ, కార్టూన్లూ గీసుకుంటూ, హాయిగా రోజు గడపడమే తన హాబీ. అతని బొమ్మల కధలన్నా, కార్టూన్లన్నా, నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా బొమ్మల కధలు. ఆ స్టోరీ బోర్డింగ్ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నాడో గానీ, వ్యాఖ్య రచనా, స్క్రీన్ ప్లే చదవడానికీ, కంటికీ ఇంపుగా వుంటాయి. కేరక్టర్ డెసైనింగ్ లో ఇళయరాజా కొట్టొచ్చిన ప్రత్యేకతతో కనిపిస్తాడు. పాత్ర చిత్రీకరణ కి సాధారణం గా ప్రతీ కార్టూనిస్టు, ఎవరైనా ఒక సీనియర్ ని ఫాలో అవుతాడు. అవాలి. కానీ ఇళయరాజా అలాంటి ప్రయత్నాలేమి చేసినట్లు కనిపించడు. తన కధా వస్తువుకీ, కార్టూన్ పాత్రలకి , టాప్ టు బాటం తనే స్రుష్టికర్త. ఇళయరాజాని అనుకరించే కార్టూనిస్టులెవరన్నా ఉన్నారా అని గాలించాను. ఒక్కడంటే ఒక్కడు తగిలాడు. అతడి పేరు ఆగస్ ఎకో సాంటోస్. ఇండొనీసియా లో వుంటాడు. సన్నటి గీతలు, ఎరుపు, నీలం, పచ్చ, పసుపు రంగులు అతడి ప్రత్యేకతలు. ఇళయరాజా కి దగ్గరగా కనిపించాడు. కార్టూన్ ఊహల మాటకొస్తే, ఇళయరాజా అసలు సిసలు తెలుగు కార్టూనిస్టు. మనందరికీ తట్టే అయిడియాలే తనకీ తట్టుతాయి. గాంధీ, అరటి తొక్క, సెల్ ఫోను, సెల్ఫీలు, వినాయకుడు,సూర్యుడు, పోలీసు, ఆత్మలు, బర్గరూ, పిల్లల పెంపకం, కరోనా, ఇంకా ఇలా ఎన్నో. అయితే ఇళయరాజా కొంచెం డిఫరెంట్. నేటి యువతకి ఒక కొత్త బాట వేసి తన హాబీ కొన సాగిస్తున్నాడు.  అతన్ని పాఠకులు మెచ్చుకున్నారు. ఎడిటర్లు మెచ్చుకున్నారు. ఈమధ్య 64 కళలు. కాం ఎడిటర్ కళాసాగర్ గారు వెలువరించిన దేశం లోనే మొట్ట మొదటి తెలుగు కార్టూనిస్టుల స్వపరిచయాలూ, కారికేచర్ సెల్ఫీల సంకలనం ‘ కొంటెబొమ్మల బ్రహ్మలు ‘ తొలి ప్రతిని ఇళయరాజాకే అందజేశారు. ఎంతో భవిష్యత్ వున్న యువ తార హటాత్తుగా రాలిపోవడం నన్ను నిశ్చేష్టుడను చేసింది ” అన్నారు.

ఇళయరాజా గురించి పూర్తి వ్యాసం :……………………………………
https://64kalalu.com/youngest-cartoonist-illayaraja/

SA:

View Comments (2)