మువ్వన్నెలపతాకం… రెపరెపల అమృతోత్సవాలు!!

దాదాపు 190 ఏళ్ల బ్రిటిష్ ముష్కరుల దుష్కర దాస్య శృంఖలాలు తెంచుకుని భారతావని స్వేచ్ఛావాయువు పీల్చి ఈ ఆగస్టు 15 వ తేదీకి 75 సంవత్సరాలవుతున్న చారిత్రక సందర్భమిది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఘనత వహించిన ఈ దేశంలో అంబానీ, ఆదానీ, ఇతర పారిశ్రామిక ముఠాకీ, ఈస్టిండియా కంపెనీని మించిన వ్యాపార కూటమికీ ఉన్నంత స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు జనసామాన్యానికి లేనేలేవు. ఉన్నంతలో గొప్ప పరిణామం దిల్లీ గద్దెపై మధ్యతరగతి కేజీవాల్ మందహాసం. ఆ సామాజిక మార్పు అక్కడితో ఆగక పంజాబ్ చేరటం ఊరట కలిగించే అంశం. దేశం యావత్తూ ఈ నూతన రాజకీయ సమీకరణలు సంతరించుకుంటేనే సామాన్యులకి ఊరట. నిజానికి నిత్యావసర వస్తువుల ధరలకి స్వాతంత్ర్యం వచ్చింది.. పెట్రో ధరలకి స్వేచ్ఛ వచ్చింది. డాలర్ విలువతో పోల్చితే రూపాయి మారకం నానాటికీ క్షీణిస్తోంది.. డాలరుతో రూపాయి మారకం జులై నెలాఖరున రూ. 79.65 పైసల కనిష్టస్థాయికి పడిపోయింది. నిరుద్యోగం రెట్టింపైంది. దారిద్ర్యం నాలుగింతలయింది. పౌరుల వలసలు పెరిగాయి. భారత్ చైనా, భారత్ పాక్ వాస్తవాధీన రేఖ వెంబడి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రతిష్టంభన, వివాదం అలానే ఉన్నాయి. తూర్పు లద్దాఫీ లో 2020లో భారత్-చైనాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. ఆత్మనిర్భరత, స్వావలంబన పడికట్టు పదాలు తప్ప వాస్తవ స్థితి భిన్నంగా ఉంది. ఇదీ స్వతంత్ర భారతం సాధించిన ఘనత.

మరోవైపు, ప్రపంచదేశాల సంపదను దోచుకుని పునర్నిర్మితమైన బ్రిటన్ దేశంలో ఆకలికేకలు వినపడుతున్నాయి. మూడొంతుల ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకుని, స్థానిక సంస్కృతులను సర్వనాశనం చేసిన పాపం శాపమై బ్రిటన్ దేశాన్ని వెంటాడుతోంది. ఇంగ్లండ్, వేల్స్ లో 1976 తరవాత ఈ ఏడాది కరవు తాండవిస్తోంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహెూత్సవ్ లో భాగంగా త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి రోజైన ఆగస్టు 2వ తేదీ నుంచి స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ సామాజిక మాధ్యమ యాప్ లలో ప్రొఫైల్ పిక్ గా పింగళి వెంకయ్య జ్ఞాపకంగా ఆయన రూపొందించిన మువ్వన్నెల జెండాని ఉంచాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15న దేశంలోని ప్రతి ఇంటి పై జాతీయజెండా ఎగరాలన్నారు. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల నివాసాలపై జాతీయపతాకం రెపరెపలాడాలని కేంద్రప్రభుత్వం పిలుపునిచ్చింది. జాతీయపతాకాల తయారీకి సంబంధించిన కోడ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం సడలించింది. పాలిస్టర్, కాటన్, ఉన్ని, సిల్క్ ఖాదీ వస్త్రాలన్నింటినీ జాతీయజెండా తయారీకి వినియోగించవచ్చని పేర్కొంది. జాతీయ పతాక స్ఫూర్తిని బలంగా చాటడానికి జెండా పరిమాణం పైగానీ, ఎగరవేసే సమయం పై కానీ అమల్లో ఉన్న ఆంక్షలను కొద్దిరోజులపాటు సడలిస్తున్నట్టు ప్రకటించింది.

ఏమైనా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రివర్యులు భీమవరం ఇలా వచ్చి అలా వెళ్లారు. ప్రధానమంత్రిస్థాయి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముచ్చటగా మూడోసారి రావటం వల్ల కొత్తగా వచ్చే గౌరవం ఏదీ లేదు. అటు పింగళి వెంకయ్య, ఇటు అల్లూరి సీతారామరాజు ఇద్దరినీ కానీ కనీసం వారిలో ఒకరిని కానీ భారతరత్నతో గౌరవించటం బీజేపీ ఎజెండాలో ఉందా లేదా అన్నది ప్రశ్న. నిష్కళంక దేశభక్తితో జాతీయోద్యమంలో తమదైన ముద్ర వేసిన తెలుగువీరులకి జేజేలు…

  • డాక్టర్ సశ్రీ
SA:

View Comments (1)

  • స్పూర్తి దాయక వ్యాసం….అభినందనలు