ఆగస్ట్ 15 అంటే జెండా పండగ. దేశానికి పుట్టినరోజు. భారత జాతి స్వేచ్చా ఉపిరులు పీల్చుకున్న రోజు. పరాయి పాలన నించి బయట పడ్డ రోజు. ఇలా ఎన్నో ఎన్నెన్నో పడికట్టు పదాలు మాటలు చెప్పచ్చు. రాయచ్చు. 1947 నాటి స్ఫూర్తి , ఆనందం ఇన్నేళ్ల తర్వాత ఎందుకో కనిపించటం లేదు అనిపిస్తుంది కొద్ది సేపు. కానీ గుండె నిండా గాలితీసుకుని , మనసులోకి ఉత్తేజం తెచ్చుకుని , ఒక్క క్షణం కళ్ళు మూసుకుని భరత మాతను తల్చుకోండి. కొత్త ఉత్తేజం , ఉత్సాహం వస్తాయి.పెళ్ళాం బిడ్డల పుట్టినరోజులకి ఆనందించే మనం, మన అందరినీ కన్న తల్లి భరత మాత పుట్టినరోజుకి ఎంత ఆనందం పొందాలి. మహాకవి శ్రీ శ్రీ ….స్వాతంత్రం ఒక విలువైన వజ్రం ….పదునైన కత్తి అన్నారు. స్వాతంత్రం….సమభావం… సౌహార్ద్రం….పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి…. ఈ స్వర్గం నిజమవుతుంది….ఈ స్వప్నం ఋజువవుతుంది అని ఎంతో ఆశను వ్యక్తం చేశారు. 15 ఆగస్ట్ 1947 నించి ఇప్పటిదాకా ఏటా దేశం మొత్తం ఏకమై జరుపుకునే పండుగ జెండా పండుగ. అసలు పతాక అనే మాటలోనే ఒక పొగరు ఇమిడి ఉంది. కవి శేషేంద్ర తనలో ‘ఒక దేశపు జెండాకు ఉండే పొగరు ఉంది ‘ అన్నారు. జెండా లేని దేశము ఉండదు. రాజకీయ పార్టీలు సరేసరి. ప్రతి పార్టీకి ఒక జెండా , ఏజండా తప్పనిసరి. రాజకీయ నాయకులు ఇదివరలో పార్టీ జెండాలు పట్టుకు తిరిగే వాళ్ళు , ఈ మధ్య కండువాలు కప్పుకొని తిరుగుతున్నారు. ప్రజల మనస్సుల్లో స్వతంత్ర భావనల్ని సగం పాడుచేసింది రాజకీయ పార్టీలు. కుల మతాల కుమ్ములాటలు రేపి సమైక్య భావనని నీరుగారుస్తున్నారు.
నిజం చెప్పాలి అంటే స్కూల్ పిల్లల్లో తప్ప పెద్ద వాళ్ళ మనసుల్లో స్వతంత్ర దినోత్సవ ఉత్సాహం తగ్గిపోతోంది. అలా తగ్గవలసిన అవసరం లేదు. దేశభక్తి భావన జాతి గుండెల్లో యుద్ధ సమయంలో స్పష్టంగా వ్యక్తం అవుతున్నది , కార్గిల్ యుద్ధం , మొన్నటి చైనా దాడి , ఆ సమయంలో ఎంతటి ఉద్వేగాన్ని ప్రదర్శించాము ? ఆగస్ట్ 15 న కూడా అలాగే ఆలోచించాలి. దేశ పౌరులుగా ఉండి మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రాల్ని గుర్తు చేసుకోవాలి. పిల్లలకు చెప్పాలి. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పెద్దలు , స్వాతంత్ర సమర యోధులు ఎక్కువ మంది మిగిలి ఉండక పోవచ్చు. కానీ జాతి స్ఫూర్తిని ముందు తరాలకు అందజేయవలసిన బాధ్యత అందరి పైనా ఉంటుంది అనే విషయం మరచిపోకూడదు. బాధ్యతాయుత పౌరుడు అనే మాటకు అర్థం కల్పించేలా మసలు కోవాలి. దానికోసం ఏదో ప్రత్యేక కసరత్తు చెయ్యక్కరలేదు…మాములుగా ఉంటే చాలు. ఉద్యోగం, వ్యాపారం , వ్యవసాయం ఏదైనా కొద్ది పాటి నిజాయితీ కలిగి , అవతలి వాడిని మోసం చెయ్యాలి అనే ఆలోచన మానేస్తే చాలు. అదే గొప్ప విషయం. దేశభక్తి. మహాకవి గురజాడ చెప్పింది కూడా అదే కదా !
దేశమును ప్రేమించుమన్నా !
మంచి అన్నది పెంచుమన్నా !
సొంత లాభం కొంత మానుకో
పొరుగు వాడికి తోడు పడవోయ్ !
కవి తిలక్ చెప్పినట్టు “సంకుచితమైన జాతి మతాల సరిహద్దుల్ని చెరిపి వేసి అకుంఠితమైన మానవీయ పతాకను” ఎగురవేద్దాం మనం అనే మాటకు సంపూర్ణమైన అర్థాన్ని సాధిద్దాం. సమైక్యతకు భారతదేశం ఆదర్శం అని తెలియచేద్దాం !
జైహింద్ !