కాలపరీక్షకు నిలిచిన అపూర్వ విజయం:
పత్రికను నడపడం అనేది ఒక నిత్యాన్నసత్రం నిర్వహణ లాంటిదే. పాఠకులకు ప్రతిరోజూ ఉదయాన్నే రుచికరమైన, ఆరోగ్యకరమైన వార్తలను కడుపారా వడ్డించాలి. పది పేజీల దినపత్రికైనా, నలభై పేజీల వారపత్రికైనా నిరంతర శ్రమ, ఏకాగ్రత తప్పనిసరి. సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే ఒక సాధారణ వార్త కాగితంపై అద్భుత కథనంగా మారుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కాలపరీక్షకు తట్టుకుని నిలబడే పత్రికలు చాలా తక్కువ. పాఠకుడి అభిరుచులను అంచనా వేసి మెప్పించడం బ్రహ్మవిద్యతో సమానం. సంపాదకులు మారినా, యాజమాన్యాలు మారినా పత్రికల భవితవ్యం తలక్రిందులైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎంతో సుదీర్ఘ చరిత్ర గల పత్రికలు సైతం కాలగర్భంలో కలిసిపోయాయి. అలాంటి వాతావరణంలో ఒక పత్రిక యాభై ఏళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగడం సాధారణ విషయం కాదు. పైగా అశేష ప్రజాదరణతో పాటు వ్యాపారపరంగానూ అద్భుత విజయం సాధిస్తూ ముందుకు సాగడం దాని అసలైన గొప్పతనం. నేడు ‘ఇండియా టుడే’ ఆ అపూర్వ మైలురాయిని అధిగమించి, విజయకేతనం ఎగురవేసింది.
చరిత్రకు దర్పణంగా స్వర్ణోత్సవ సంబరాలు: పత్రికలు చదివే అలవాటు ఉన్నవారికి ‘ఇండియా టుడే’ పేరు తెలియకుండా ఉండదు. డిసెంబర్ 1975లో ప్రారంభమైన ఈ పత్రిక యాభై ఏళ్ల మైలురాయిని విజయవంతంగా దాటింది. కలకాలం గుర్తుండిపోయేలా ఈ ఘన విజయ సంబరాల కోసం సంస్థ చక్కని ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచే స్వర్ణోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టింది. ఈ సుదీర్ఘ ప్రయాణ విశేషాలతో ఒక ప్రత్యేక సంచికను కూడా వెలువరించింది. ప్రతి పదేళ్లను ఒక భాగంగా చూపిస్తూ, మొత్తం ఐదు భాగాలుగా ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని నిర్మించింది. 1975 నుండి 2025 వరకు దేశంలో చోటుచేసుకున్న ప్రధాన ఘట్టాలు, రాజకీయ ప్రస్థానాలు, ప్రభుత్వాల మార్పులు, యుద్ధాలు, క్రీడలు, కళలు.. ఇలా సకల అంశాలను ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. పత్రికలో పనిచేసిన ఉద్దండ పాత్రికేయుల అనుభవాలు, ముఖాముఖీలతో గత అర్ధశతాబ్దపు కాలగమనాన్ని రికార్డు చేశారు.
సి.ఎ. కావాలనుకుని.. సంపాదకుడిగా మారి!: ‘ఇండియా టుడే’ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చే పేరు అరుణ్ పురి. గత యాభై ఏళ్లుగా ఆ పత్రికకు ఆయనే ఎడిటర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. నిజానికి, జర్నలిజం ఆయన కోరుకున్న వృత్తి కాదు. అనుకోకుండా పత్రికా నిర్వహణ భారం భుజాలపై పడినా, చేపట్టిన కార్యాన్ని విజయతీరాలకు చేర్చాలనే ఆయన దీక్ష, దక్షతలే ‘ఇండియా టుడే’ను ఈ స్థాయికి తీసుకెళ్లాయి. పత్రిక ప్రారంభమైన నాటికి ఆయన వయసు కేవలం 31 ఏళ్లు; పత్రికా సారథ్యంలోనే ఆయన జీవితం పరిపక్వత చెందింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత, ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ (సి.ఎ.) కావాలని ఆకాంక్షించారు. అయితే, అప్పటికే వారి కుటుంబ వ్యాపారమైన ‘థామస్ ప్రింటింగ్ ప్రెస్’ బాధ్యతలను చూస్తున్న ఆయన తండ్రి, అరుణ్ పురి కూడా ప్రెస్ నిర్వహణలో భాగస్వామి కావాలని ఆశించారు. తండ్రి కోరిక మేరకు తన సి.ఎ. కలలను పక్కనపెట్టి ప్రెస్ బాధ్యతలను స్వీకరించారు. అదే సమయంలో ఆయన సోదరి పక్షపత్రికగా ‘ఇండియా టుడే’ను ప్రారంభించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఆ బాధ్యతలను మధ్యలోనే వదిలి విదేశాలకు వెళ్లిపోవడంతో, ఆ భారం అనుకోకుండా అరుణ్ పురిపై పడింది. అలా ముద్రణా వ్యాపారం నుండి పత్రికా రంగానికి మారిన ఆయనకు, జర్నలిజమే సర్వస్వమైంది. కాలక్రమేణా తనతో పాటు కుటుంబం మొత్తాన్ని ఈ మీడియా సామ్రాజ్యంలో భాగస్వాములను చేశారు.
నాణ్యతకు పెద్దపీట.. పాత్రికేయ సామ్రాజ్య విస్తరణ: ‘లివింగ్ మీడియా పబ్లికేషన్స్’ స్థాపించి, అప్పటివరకు పక్షపత్రికగా ఉన్న ‘ఇండియా టుడే’ను వారపత్రికగా మార్చారు. ప్రతిభావంతులైన పాత్రికేయ మేధావులను సంస్థలోకి ఆహ్వానించి, దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రాజకీయ, సామాజిక పత్రికగా దీనిని తీర్చిదిద్దారు. పత్రికలో ఫోటో జర్నలిజానికి పెద్దపీట వేశారు. ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ దాదాపు పదేళ్ల పాటు తన అద్భుత కెమెరా నైపుణ్యంతో పత్రిక స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కాలక్రమేణా వేలల్లో ఉన్న సర్క్యులేషన్ లక్షల మైలురాయికి చేరుకుంది. ఆ తర్వాత హిందీ ఎడిషన్ తో పాటు, కొంతకాలం పాటు దక్షిణాది భాషల్లోనూ ప్రాంతీయ ఎడిషన్లు వెలువడ్డాయి. తర్వాత రోజుల్లో ప్రాంతీయ భాషా పత్రికలను నిలిపివేశారు. పత్రికారంగం కూడా ఒక వ్యాపారమేనని, అందించే సమాచారంలో నాణ్యత ఉంటే పాఠకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఆయన నిరూపించారు. ‘ఇండియా టుడే’ విజయవంతమైన ప్రస్థానానికి అనుబంధంగా మరికొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మీడియా రంగానికి ఆయన చేసిన అనన్య సామాన్యమైన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2001లో ఆయనను ‘పద్మభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. భారతదేశంలో ఒక ప్రముఖ పత్రిక అర్ధ శతాబ్ద కాలం పూర్తి చేసుకోవడం సమస్త పాత్రికేయ లోకానికే గర్వకారణం.
–బద్రి నర్సన్ (94401 28169)
