ముగిసిన ‘ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్’

హైదరాబాద్, జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో ముగిసిన ‘ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్’

హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ‘ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్’ ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా ముగిసింది. ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహించిన ఈ కళా మేళా, నగర వాసులకు మరియు కళాభిమానులకు ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది.

ప్రదర్శన విశేషాలు:
దేశవ్యాప్తంగా వచ్చిన ప్రముఖ కళాకారుల ప్రతిభను ఒకే చోట చేర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో అనేక ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి:
మొత్తం 30 గ్యాలరీలలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 300 మంది చిత్ర మరియు శిల్పకళాకారులు తమ ప్రతిభను చాటే కళాఖండాలను ప్రదర్శించారు. ఆధునిక (Modern Art), సంప్రదాయ మరియు సమకాలీన శైలుల్లో రూపొందించిన సుమారు 3000 కళాఖండాలకుపైగా ప్రదర్శించారు. కాన్వాస్ పెయింటింగ్స్, అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్, మెటల్, ఫైబర్ గ్లాస్ మరియు రాతి శిల్పాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ కళలయిన రాజస్తాని, ఉదయగడ్ మినేచర్ చిత్రాలు ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి.

కళాప్రియుల కోలాహలం:
ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం కల్పించారు. సెలవు దినాలు కావడంతో నగరంలోని ప్రముఖులు, విద్యార్థులు, కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళాకారులతో నేరుగా ముచ్చటించే అవకాశం కలగడం ఈ ఫెస్టివల్ యొక్క ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున కళా ప్రదర్శన జరగడం హైదరాబాద్ వాసులకు గర్వకారణం. పండుగలా జరిగిన ఈ ఈవెంట్ హైదరాబాద్ పర్యాక రంగానికి అదనపు ఆకర్షణ. ఇది మూడవసారి కావటం, వ్యాపారపరంగా కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉండటం చెప్పుకోదగ్గ అంశాలు. యువ కళాకారులకు ఇది ఒక గొప్ప వేదిక… అని పలువురు సందర్శకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్వాహకులు ఒక కార్పొరేట్ ఈవెంటును తలపించేలా నిర్వహించటం సామాన్య ప్రేక్షకులకు ఈ ప్రదర్శన దూరమనే చెప్పాలి.

కళాకారుల సృజనాత్మకతకు, నగరవాసుల ఆదరణ తోడవ్వడంతో బంజారాహిల్స్ ప్రాంతం ఈ మూడు రోజులు కళాశోభతో కళకళలాడింది. మొత్తంమీద వ్యయప్రయాసలకోర్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్న కళాకారుల ఉత్సాహం చూస్తుంటే ‘ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్’ ప్రతి ఏటా ఒక సంప్రదాయంగా హైదరాబాదుకు కానున్నదన్న సూచన ఘనంగా కనిపించింది.

ఆత్మకూరు రామకృష్ణ

Share via
Copy link
Powered by Social Snap