మన ‘చిత్రకళ’

చిత్రాలు మానవునిలోని భావ సౌకుమార్యానికి, భావ వ్యక్తీకరణలోని సృజనాత్మకతకు కొలమానాలు.
అయితే ఒకరికి నచ్చిన చిత్రం మరొకరికి అదేస్థాయిలో నచ్చుతుందని అనడానికి లేదు. సాధారణ ప్రేక్షకుని, అనుభవజ్ఞుడైన చిత్రకారుని దృష్టికోణం ఒకలాగే ఉండదు.
అనుభవజ్ఞుడైన చిత్రకారుని దృష్టికోణంలో చూసినపుడు చిత్రీకరణలో భావ వ్యక్తీకరణలో అనుసరించిన చిత్రకారుని మార్గాలు ప్రమాణాలుగా ఆ చిత్రపు స్థాయి నిర్ధారణ అవుతుంది.
చిత్రకళా ప్రదర్శనలో అనేక చిత్రాలు ప్రదర్శింపబడినపుడు ఉన్నత స్థానాలను గెలుచుకున్న చిత్రాలు సాధారణ ప్రేక్షకులకు, మరికొందరు చిత్రకారులకు కూడా అసంతృప్తిని కలిగించవచ్చు. కనుక చిత్రాలస్థాయిని పరిశీలించేటపుడు కొంత పరిజ్ఞానం అవసరమౌతుంది. మంచి చిత్రాలు చిత్రించడానికి కూడా అదే పరిజ్ఞానం అవసరమౌతుంది.
అటువంటి పరిజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? అని పరిశీలిస్తే ప్రాచీన గ్రంథాలు ఎన్నో చిత్రకళా విషయాలను, ఇతర కళలను గురించి కూడా శాస్త్రయుక్తంగా వచించాయి. శాస్త్రము అంటే శాసించేది. చిత్రకళ గురించి కూడా సంపూర్ణ విషయ సమాచారమును అందించాయి.
రేఖలు, వర్ణాలు, చిత్రణా విధానము గురించే కాక చిత్రశాలల వాస్తును గురించి కూడా చర్చించాయి. ఉత్తమ చిత్రరచనా విధానాలను కూడా సూచించాయి. చిత్ర రచనలో ఆచరించకూడనివి కూడా తెలియజేశాయి. అవన్నీ ఆచరణ యోగ్యాలు. శిరోధార్యాలు.
భారతీయ సంస్కృతి అతి పురాతనమైనది. క్రీ.పూ 3300 నాటికే అభివృద్ధి చెందిన హరప్పా మొహంజదారో నాగరికత పాకిస్థాన్ నుండి గుజరాత్ లోని లోథాల్ ప్రాంతం వరకూ విస్తరించింది. ఆ నాటికే కళలు మొదలగు అంశాలన్నీ పూర్తిగా సంస్కరించబడ్డాయి. సింధు నాగరికత ఆధారంగా మన భారతదేశ సంస్కృతి నిర్మాణమైంది. అందులో భాగమైన కళలు అంతటి ప్రాచీనమైనవని గుర్తించక తప్పదు. కళలకు సంబంధించిన గ్రంథాల పరిశీలన చేసిన మన భారతీయులు క్రీ.శ. 2వ శతాబ్దము నాటి నుండి (శాతవాహనుల కాలం) లభిస్తున్న చిత్రకళా విశేషాల గురించిన అనేక గ్రంథాలను పఠించారు.

19 వ శతాబ్ద కాలములోని యురోపియన్ చిత్రకళ తమ సంస్కృతితో పాటు ప్రపంచదేశాలను ప్రభావితం చేసినా ప్రాచీనమైన చిత్రకళ మన భారతీయులదేనని గుర్తించక తప్పదు.
ఇంతటి ఘనచరిత కలిగిన మన భారతీములు కూడా మన మూలాలను మరచి అద్భుత (చిత్ర) కళా సామర్థ్యాన్ని తరాల నుండి తరాలకు అందించ లేక యురోపియన్ కళను ఆధారం చేసుకొని కళాసాధన చేయవలసి రావడం శోచనీయం.
ఆమోదయోగ్యమైన విధానాన్ని ఆచరించడం తప్పుకాదు. కానీ మనదైన నిధిని వదిలి వేరొకరిని ఆశ్రయించవలసిన స్థితికి రావడం నిజంగా బాధాకరం.
క్రీ.శ. 4వ శతాబ్ద కాలము నాటి “విష్ణు ధర్మత్తరము” అనే గ్రంథములోని “చిత్రసూత్ర” భాగమును మరల అనుసరించవలసిన అవసరమున్నది.
సంస్కృతి కాలానుగుణంగా మార్పులకు లోను కావడం అత్యంత సహజం. అలా కాని నాడు అభివృద్ధి ఆగిపోయినట్లే. అయితే పటిష్టమైన మన సంస్కృతీ మూలాల పై నూతన భవనాలు నిర్మించు కోవాలనేది నా ఉద్దేశ్యం.
విషుధర్మత్తరము, అభిలాషితార్గ చింతామణి, శివతత్త్వరత్నాకరం, శిల్పరత్న, నారదశిల్ప, సరస్వతీ శిల్ప, ప్రజాపతి శిల్ప గ్రంథాలు చిత్ర శిల్పకళల పూర్తి సమాచారాన్ని అందించాయి.

విష్ణుధర్మోత్వరము చిత్రాలు 4 రకాలని సత్య (స్వాభావిక), వైణిక (కవితాత్మక), నాగర (బౌద్దిక), మిశ్ర (కలీ) అను వర్గీకరించింది. చిత్రణకు ‘వర్తన’ (shading), పత్రజ, వైఖిక, బిందుజ – అని 3 పద్దతులను పేర్కొంది. మానవుని శారీరక నిర్మాణము 5 రకముల విభజన చేసింది. చిత్రం నిర్మించే గోడను తయారు చేసుకోవడం (భిత్తి సంస్కారము) దగ్గరనుండి ప్రథమ, ద్వితీయ, మిశ్రణ విధానాల గురించి వివరించింది. అత్యల్ప రేఖలతో కూడిన చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా పేర్కొంది. చిత్రాలలోని మానవ రూపాలు, వస్తువుల రూపాలను పూర్తిగా చూపగలిగే గుండ్రంగా మలచడం అనేది ఉత్తమ రచన అనీ, గాలి వీచే దిశను చూపగలిగే చిత్రకారుడు, తరంగాలవంటి రేఖలను, జ్వాలలను, పొగను, పతాకనూ సమర్థంగా చిత్రించగలుగుటను
మెచ్చుకుంటుంది. చిత్రాల్లో నిద్రిస్తున్నవారికి, మరణించినవారికి తేడాను చూపగలుగుట, కోమలరేఖలతో గీయబడి, కాంతివంత వర్ణాలతో చిత్రించుటను, వీటన్నితోపాటు చిత్రకారుడు తన కుంచె విసురుతో చేసే విన్యాసానికి ప్రథమస్థానమిచ్చి గౌరవించింది.
సమముగా లేని, అనిశ్చిత రేఖలను, సమముగాలేని చిత్రణ, రంగులమాలిన్యం, చెడ్డ భంగిమ, ఏ భావం లేకపోవడం, హీనమైన నిర్మాణం, జీవంలేకపోవడం ఇవన్నీ హీనమైనవిగా పరిగణించింది.
పాత్రలను తగిన శరీర నిర్మాణం, వస్త్రాల ఆభరణాల అలంకరణ, ప్రకృతిలో ఋతువుల్లో వచ్చే మార్పులను చూపగల చిత్రణను ప్రశంసనీయమైనదిగా పేర్కొన్నది.
ఈ గ్రంథం గొప్ప కళాసమీక్షా గ్రంథంగా మన ప్రాచీన భారతంలో గణుతికెక్కినది.
ఇంతటి శాస్త్రీయతతో కళాధ్యయనం చేయగల ఆనాటి చిత్ర, శిల్ప కళాకారులు కాలానికి అతీతమైన గొప్ప సృష్టిచేసి శాశ్వతులైనారు. ఆనాటి రాజుల ఆదరణలో కళ వైభవంగా అధ్యయనం చేయబడింది. రాజుల పోషణలో కళాకారులు సమాజంలో ఉన్నతంగా గౌరవించబడ్డారు.

కనుకనే ఒక నిర్దిష్ట ప్రమాణంతో దంతాలను, దారువులకు, గండశిలలను మహద్భుత శిల్పాలుగా మలచారు. గుహల్లో, మంటపాలల్లో, పైకప్పుల్లో, గోడలపై అద్భుత సుందరమయ నగిషీలు, లతలు అల్లి, చిత్ర కళాకౌశలంతో మందిరాలను సుందరంగా తీర్చారు.
కుర్చీలు, మంచాలు, పేటికలు, కిటికీలు, సింహద్వారాలు వస్తువులు నగిషీలు చెక్కారు. నేలపై కూడా పద్మాలవంటి డిజైతో పక్షులతో తీర్చిదిద్దబడి ఎటుచూసినా కళామయ జగత్తుగా తీర్చిదిద్దారు.
మన చిన్నతనంలోని పందిరి మంచాన్ని గుర్తు తెచ్చుకుంటే చిలుకలు, లతలు, రహస్య అరలు, పందిరి చుట్టూ వివిధ పక్షులు అద్భుతంగా అమరిన విధం గుర్తు వస్తుంది. అలంకరణ సామాగ్రి పెట్టుకొనే పెట్టె నుండి దువ్వెనవంటి వస్తువులు కూడా కళామయంగా తీర్చబడేవి.
ఏ శిల్పమైనా దానికి ఆది రూపం చిత్రకళే కదా. ఏ ఆకారం మలచాలన్నా చిత్రం గీయకుండా జరుగదు కదా. అద్భుత చరిత్ర కలిగిన మన చిత్రకళ సరియైన ఆదరణ లేక ప్రాభవం మసకలబారుతున్నది.
ఇటీవల ఎ.పి.ఎ. అనే వెబ్ పత్రికలో చిత్రకళ గురించి వ్రాస్తూ అమెరికాలో జరిగిన మన ఆంధ్రుల చిత్రకళా ప్రదర్శన చూసి “ఆ ఇది ఒకనాటి యురోపియన్ చిత్రకళ ధర్డ్ గ్రేడ్ అనుకరణే” అని విమర్శకులు తేల్చేశారు అని వ్రాశారు. ఇటువంటి అభిప్రాయాన్ని మనం అంగీకరించకూడదు. నూతన ఒరవడిని మన భారతీయ మూలాలపైనే నిర్మించుకుని మన యువత మన దేశఘనతను తిరిగి నిలబెట్టాలని ఆశిస్తున్నాను.
ఈ మహాగ్రంథాల నుండి సేకరించిన గొప్ప సమాచారాన్ని ‘భారతీయ చిత్రకళ’ అనే పేరుతో శ్రీ శివరామమూర్తిగారు అందించిన గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినవారు శ్రీ సంజీవదేవ్ గారు. ప్రచురించినవారు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఈ గొప్ప గ్రంథం చదివిన ఏ చిత్రకారుడైనా మన భారతీయ కళామూలాలను తెలుసుకుంటాడు. కనుక ఇటువంటి గ్రంథాలు అన్నీ మరల అందుబాటులోకి తెచ్చి, అధ్యయనం చేయించి ఆదరించవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే అని ముమ్మాటికీ చెప్పవచ్చు.

-ఎన్.వి.పి.ఎస్.ఎస్. లక్ష్మి 

SA: