జానపద చిత్రకళ

జానపద చిత్రకళ అంటే నాగరికతా ప్రభావం సోకని జానపదాల్లోని గ్రామీణులు తమకు స్వహతగా అబ్బిన ప్రజ్ఞతోనూ, తరతరాల వారసత్వం ద్వారా సంక్రమించిన ప్రావీణ్యంతోనూ సృష్టించేకళని నిర్వచించవచ్చు. సుమారు శతాబ్ది కాలానికి పూర్వమే నాగరికుని దృష్టి ప్రపంచ వ్యాప్తంగ జానపదుల కలల మీదకు మళ్ళింది.
జానపద సాహిత్యం , జానపద సంగీతం, జానపదనృత్యం, జానపద చిత్రకళ సుశిక్షుడైన కళాకారుని మేధను ఆకర్షించి అతనిలో కొత్త ఊహలనూ, కొత్త ఆశలనూ రేకెత్తించింది. పట్టణ వాతావరణం, జీవనం, సంస్కృతుల పట్ల విసుగు పుట్టో, లేక తనలో అణగారి ఉన్న ప్రాధమిక సహజాత ప్రవృతుల ప్రభావం వల్లనో, తనజాతి సంస్కృతికి జీవగజ్జమైన గ్రామవాసుల కళాభిని – వేశం గురించి తెలుసుకోవాలని, వారితో ఆడిపాడి తనకళా ప్రాభవాన్ని మరింత సుసంపన్నం చేసుకోవాలని, నగరవాసులు ఆకాంక్షించారు ఫలితంగా జానపద కళలన్నింటినీ క్రమ బద్దంగ పరిశీలన చేయడమూ, అధ్యయనం చేయడమూ ఆదరించడము జరుగుతూ వస్తోంది.
జానపదులు జానపదులు కోసం రూపొందించుకొన్న కళే నిజమైన ప్రజాకళగా చెప్పవచ్చు. శాస్త్రీయమైన సంప్రదాయ సిద్ధమైన, నియమబద్దమైన శిక్షణ లేకుండా స్వచ్ఛందమైన ప్రేరణతో గ్రామీణ కళాకారుడు చిత్రించే కళ-జానపద చిత్రకళ. ఈ చిత్రకళ లక్షణాలు ఏవి? వారు చిత్రించే ఇతివృత్తాలూ విషయాలూ ఎలాంటివి?
జానపదచిత్రకళకు ప్రేరణ ఏమిటి? చిత్రకళా పరిణామంలో జానపద చిత్రకళ ప్రభావం ఎటువంటిది? అని ప్రశ్నించుకుంటే ఆసక్తికరమైన విషయాలు అనేకం అవగతమౌతాయి. జానపద చిత్రకళ కేవలం ఒక ఆర్టేగా కాక జానపద జీవన విధానంతో ముడిపడి ఉన్నది. పుట్టుకనుండి గిట్టేవరకు వ్యక్తి నిర్వహించవలసిన వివిధ ధర్మాలలో, కార్యకాలాపాలలో కళకు ప్రత్యేక స్థానం ఉన్నది. నిత్య విధి అయిన దైవారాధనలో కళకు సన్నిహిత సంబంధమున్నది. పండగలూ పర్వాలూ వివాహాది శుభకార్యాలూ వంటి అనేక సందర్భాలలో తప్పనిసరిగా ఎదిద్దవలసిన ముగ్గులూ, అలంకరణలూ జానపద చిత్రకళకు కొన్ని ఉదాహరణలు. ఈ అలంకణకు ప్రేరణ కళానుభూతి కంటే ముఖ్యం దైవప్రీతి తత్సంబంధమైన నమ్మకాలూను. శుక్రవారం ఇల్లు అలికి ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి యింటనర్తిస్తుందని, సంక్రాంతికి యింటిముందు రధాలు చిత్రిస్తే సంకురుమయ్య తమ యింటి ముందుగా ప్రయనిస్తాడనీ నమ్మకాలే.
జానపదుల చిత్రకళకు ప్రేరకాలు. ఈ కళకు ప్రారంభమంటూ లేదు. అనాది నుంచి జానపదుల జీవనంలో భాగంగా వస్తూనే ఉంది. కళా రుపాలు ఏళ్ళతరబడి మార్పు చేర్పులేకుండా అనుకరించబడతాయి. కొత్తదనం కోసం జానపదకళాకారుడు అన్వేషించడు. ఇది విశ్వజనీనమైన కళ. అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఇంచుమించు ఒకే రీతిలో ఒకే స్థాయిలో కనిపిస్తుంది. కాలప్రభావంతో ఈ కళా రూపాలు నాగరిక ప్రభావానికి లొంగిపోలేదు. అవే పద్ధతులు, అవేరూపాలు, అవే వస్తువులూ, వారి చేతులలో అందాలు దిద్దుకుంటున్నాయి. జానపద చిత్రకళకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. చిత్రాలకు ధృడమైన అవుట్ లైన్ ఉంటుంది. చిత్రంలో వివరణ తక్కువగా ఉంటుంది. వర్ణవిన్యాసం అతి తక్కువ పాలు ఉంటుంది. వెలుగు నీడలు అసలుండవు. చిత్రాలలో ప్రపోర్షన్ పాటించరు.
జానపదుల జీవన సరళివలే వీరి చిత్రాలూ సరళత్వమూ నిరాడంబరత్వమూ కలిగి ఉంటాయి. రంగులు పరిసరాల్లో దొరికే సహజ వర్ణాలే. ఈ కళ వివిధ ప్రాంతాలలో వివిధ రూపాల్లో ప్రత్యక్షమవుతుంది. ఉత్తర భారతంలో లోక కళ అని, బెంగాలులో కాలిఘట్ చిత్రాలని, ఒరిస్సాలో పటచిత్రాలని, ఆంధ్రప్రాంతంలో తోలు బొమ్మలూ, కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలూ, తెలంగాణాలో నక్కాశీ చిత్రాలని పిలుస్తారు.

జానపద కళలోని సరళ స్నిగ్ధ సౌందర్యానికి ముగ్ధుడైన నగర కళాకారుడు కొంతకాలం క్రితం వారి కళను అనుకరించడమూ, వారినుండి ప్రేరణ పొందడమూ జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో ఆఫ్రికన్ జానపద రూపాలనుంచి ప్రేరణ పొంది తన కళలకు మెరుగులు దిద్దుకున్నట్లు ఆధారాలున్నాయి. భారత దేశంలో బెంగాల్ చిత్రకారుడు జైమినీరాయ్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతపు చిత్రాలనుండి ప్రభావితుడై జానపదశైలికి ఆధునిక కళారంగంలో స్థానం కల్పించాడు. అందుకే ఆయనను జానపద కళకు పితామహుడని అంటుంటారు. ఆంధ్రదేశంలోనూ పలువురు చిత్రకారులు జానపదశైలిని చేపట్టి ఎన్నో చిత్రాలు సృష్టించారు. వారిలో డా. కాపురాజయ్య, క్రీ.శే. అంట్వాకుల పైడిరాజు, శ్రీనివాసులు ప్రభృతులు జానపద చిత్రకారులుగా ప్రఖ్యాతి పొందారు. ఇంకనూ ఎందరో చిత్రకరారులు ఈ రంగంలో కృషిచేస్తూ, జానపద కళలను బావితరాలకు అందిస్తూనే వున్నారు. ఒక జాతి సంస్కృతులను, సంప్రదాయాలను భవిష్యతరాలకు అందించే ఇలాంటి అపురూపమైన కళలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ఆదరించడమూ అంతే ముఖ్యమన్న విషయం మనము గుర్తించిన రోజున – నేటి ఆధునిక కళల సుడి గుండాలలో పడి తన ఉనికిని కోల్పోతున్న జానపద చిత్రకళ తిరిగి తన స్వస్థానం చేరుకుంటుంది. అజరామరంగా నిలుస్తుంది.

-కళాసాగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap