
*పీ.సీ. సర్కార్ సీనియర్ 102వ జయంతి వేడుకలు
*ఇండియన్ మ్యాజిక్ అకాడమి పదవ వార్షికోత్సవం
ప్రపంచ ఇంద్రజాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 23 న ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ కార్యక్రమం విశాఖపట్నంలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఇండియన్ మ్యాజిక్ అకాడమి స్థాపించి పదేళ్లయిన సందర్భంగా పదవ వార్షికోత్సవ వేడుకలను సంస్థ వ్యవస్థాపకులు బి.ఎస్. రెడ్డి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికులు పీ.సీ. సర్కార్ సీనియర్ జయంతిని పురస్కరించుకుని ఇండియన్ మ్యాజిక్ అకాడమీ వ్యవస్థాపకులు ప్రపంచ ప్రసిద్ధ ఇంద్రజాలికులు బి.ఎస్. రెడ్డి ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత పీ.సీ. సర్కార్ సీనియర్ 102వ జయంతి వేడుకలు కనులపండుగగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఇంద్రజాలకులు పీ.సీ. సర్కార్ జూనియర్ తో పాటు, ప్రపంచ ప్రసిద్ధ ఇంద్రజాలికులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పురస్కార గ్రహీత డా. గుగాంపు (కువైట్) హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దేశనలుమూలల నుండి పలువురు ఇంద్రజాలికులు హాజరై తమ ప్రదర్శనలతో ప్రేక్షలను మంత్రముగ్దులను చేశారు. అనంతరం జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో భాగంగా విజయవాడకు చెందిన డా. గుగాంపు గోల్డెన్ మెజీషియన్ అవార్డుతో పాటు, జీవిత సాఫల్య పురస్కారాన్ని సైతం అందుకున్నారు. గత 30 ఏళ్లుగా కువైట్ లో ఉంటూ, 23 దేశాల్లో, 16 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన డా. గుగాంపును పీసీ సర్కార్ జూనియర్ తో పాటు, బిఎస్ రెడ్డిలు ప్రశంసించారు.
డా. గుగాంపు తో పాటు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న వారిలో ప్రముఖ ఇంద్రజాలకులు పీ.సీ. సర్కార్ జూనియర్ (కోల్కతా) తో సహా… సామల వేణు (హైదరాబాద్), కె.యస్. రమేష్ (బెంగలూరు), బూపేష్ దావే (ముంబై), కుడ్రోలి గణేష్ (మంగలూరు), సామ్రాజ్ (కేరళ), మామడా (థాయిలాండ్), యోనా (తమిళనాడు), జె.వి.ఎల్.ఎన్. చారి (విజయనగరం) వున్నారు.
విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సెంచూరియన్ విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. జి.ఎస్.ఎన్ రాజు, పార్లమెంట్ సభ్యులు భరత్, లీడర్ పత్రిక ఎడిటర్ రమణమూర్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని భారతీయ చలనచిత్ర రంగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారో, అలాగే ఈ ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ 2025 ను అంతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించారని పలువురు మెజీషియన్ బి.ఎస్. రెడ్డిని ప్రశంసించారు.
-కళాసాగర్

Famous magicians who received lifetime achievement awards.