యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయి

విజయవాడలో యుద్ధోన్మాదులపై గళమెత్తిన గాయకులు, కలమెత్తిన కవులు

యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయని, అందుకే యుద్ధం కోరే దేశాలపై మనం అప్రమత్తంగా వుండాలని నోబెల్ పీస్ ప్రైజ్ సెలక్షన్ కమిటీ మెంబర్, ప్రపంచశాంతి దూత డా. బాలకృష్ణ కుర్వే అన్నారు. ది. 27-12-23 న, విజయవాడ, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవభారత్ నిర్మాణ సంఘం-గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైటర్స్ మీట్ & కవి సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డా. కుర్వే మాట్లాడుతూ- ఇండియా మొత్తం తిరిగి శాంతి ఉద్యమాన్ని మేం 30 యేళ్ళుగా కొనసాగిస్తున్నామన్నారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న ఎన్నో రకాల ఆయుధాలలో కీలక పాత్ర పోషిస్తున్నవి మానవ మందుపాతరలేనన్నారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న చిన్నతరహా మారణాయుధాలలో ఇవి పెద్దన్నలు అని చెప్పుకోవచ్చన్నారు. కంబోడియా, వియత్నాం, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వంటి యుద్ధాలు జరిగిన దేశాల్లో విపరీతమైన నష్టాన్ని కలిగించాయన్నారు. మానవుల కంటే జంతువులు వీటిపై కాలు మోపిన వెంటనే గాయపడటమో, చనిపోవటమే జరుగుతుందన్నారు. మందుపాతరలు పాతిపెట్టే ఖర్చుకంటే వాటిని వెలికితీసే ఖర్చు ఎక్కువగా వుంటుందన్నారు. మందుపాతరలు వెలికి తీసే ప్రయత్నంలో అంతర్జాతీయ మరియు ఐక్యరాజ్య సమితి సభ్యులు గాయపడటం, మరణించడం కూడా జరుగుతుందన్నారు. కాబట్టి వీనిని నిషేధించాలని 1994లో కెనడ దేశ రాజధాని హటోవా మరియు అన్ని దేశాలు కలిపి ఒక తీర్మానాన్ని ఆమోదించాయని. మానవ మందుపాతరలు నిషేధించాలని, వాటి నిలువలను కూడా నిర్మూలించాలని దాదాపు 164 దేశాలు సంతకాలు చేశాయన్నారు. అసలు విషయమేమిటంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదన్నారు. సరిహద్దుల సమస్యల కారణంగా, టెర్రరిస్టులు, చొరబాటు దారులు కారణంగా భారతదేశం కూడా సంతకం చేయలేదని ఆయన వివరించారు.
నవభారత్ నిర్మాణ సంఘం ఛైర్మన్ సూరేపల్లి రవికుమార్ మాట్లాడుతూ- శాంతికాముకులు, కొన్ని శాంతి కోరే దేశాలు, స్వచ్ఛంద సంస్థల 30 సంవత్సరాల కృషి వల్ల నేడు మందుపాతరలు లేకుండా పోయాయని, కానీ క్లస్టర్ మునిషన్స్ని (సామూహిక బాంబులు) నేటికీ కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయని అన్నారు. వీటిని తక్షణమే నిషేధించాలని శాంతికాముకులుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కవి సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు.

గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్, ప్రముఖ సాహితీవేత్త డా. గుమ్మా సాంబశివరావు, సీనియర్ జర్నలిస్టు డా. ఘంటా విజయ్కుమార్, నవమల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ, సీనియర్ జర్నలిస్టు యేమినేని వెంకటరమణ, సింగర్ సత్యస్వాతి, 64 కళలు డాట్కామ్ ఎడిటర్ కళాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సాహితీవేత్త పంతుల వెంకటేశ్వరరావు సమన్యయం చేశారు. ప్రపంచశాంతి, పర్యావరణంపై పలువురు గాయకులు పాటలు పాడగా, వివిధ ప్రాంతాలకు చెందిన కవులు తమ కవితల్ని వినిపించి సభికుల్ని అలరింపజేశారు.

SA: