భారతీయరైల్వే పుట్టినరోజు నేడు …

భారతీయరైల్వే ప్రారంభించిన రోజు ఏప్రిల్16 1853 … 167 ఏళ్ళ చరిత్ర కలిగిన భారతీయరైల్వే గురించి సరదా కబుర్లు…

మిత్రులారా నన్ను గుర్తుపట్టారా….?
ఇవాళ నా పుట్టినరోజు. సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్16, 1853 లో నేను పుట్టాను. పుట్టింది మొదలు నిరంతరాయంగా భారతజాతికి సేవలు అందిస్తూనే ఉన్నాను. కాలక్రమేణా నేను రూపాంతరం చెందుతూ మీ కోసం పని చేయాలనే యావను రెట్టించుకుంటున్నాను. సరుకు రవాణాతో ప్రారంభించిన నేను ఇవాళ ప్రపంచంలో 4వ అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థగా ఎదిగాను. ఇప్పుడు ప్రతి రోజు లక్షలాది ప్రయాణికుల్ని వారి గమ్యానికి చేరుస్తున్నాను. లక్షల టన్నుల సరుకురవాణా నిరంతరాయంగా చేస్తూనే ఉన్నాను. నా తపన అంతా నా దేశం కోసం. నా ధ్యాస అంతా నా జాతి ఔన్నత్యాన్ని పెంపొందించడం కోసం. దినదిన ప్రవర్ధమానమైన ఎదుగుదలతో నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కు మూలస్థంభంగా పిలువబడుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. పాల నుండి ప్రత్తి, పెట్రోలు వరకూ, బిస్కెట్లు నుండి బియ్యం, బొగ్గు వరకూ, నిరంతరాయంగా మీకోసం మోస్తూనే ఉన్నాను. మీకు ఒక నిజం చెప్పనా నేను మిమ్మల్ని ఎప్పుడూ భారంగా ఎంచలేదు, మీ కోసం చేస్తున్న ఈ సేవలో ఎప్పుడూ అలసట అనేదే దరి చేరనీయలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎపుడైనా ఆలస్యంగా నడుస్తున్నన్నపుడు మీకన్నా నాకే చింత ఎక్కువగా ఉంటుంది, అందుకే పరుగుపరుగున మీ వద్దకు వస్తాను. నా కోసం వేచి చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూడగానే పోయినప్రాణం తిరిగివచ్చినట్టయి మరింత ఉత్సాహంగా మిమ్మల్ని తీసుకుని పరుగులు తీస్తాను. నా ఆశ, నా ధ్యస అంతా మీ పైనే, నా భారతపౌరులపైనే. ఇంత చేస్తున్నా మీరే నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, నా సేవలు గుర్తించనూలేదు. క్రమం తప్పకుండా ప్రతిరోజూ మీకోసం అందంగా ముస్తాబయి వస్తాను. మీరేమో ఎక్కడబడితే అక్కడ ఉమ్మి, చెత్తాచెదారం , వ్యర్థాలు గట్రా ఇబ్బడిముబ్బడిగా ఎక్కడ చూసినా విసిరేసి నాపై నాకే అసహ్యం వచ్చేంతగా రోతగా మార్చేస్తున్నారు. అయినా మీపై నాకెప్పుడూ కోపం రాలేదు. భరిస్తున్నాను – భరిస్తూనే ఉంటాను.సహిస్తున్నాను – సహిస్తూనే ఉంటాను. అందుకే మరుసటిరోజు మరింత అందంగా ముస్తాబయి మీ ముందుకు వస్తున్నాను. మీరేమో నన్ను అస్సలు పట్టించుకోరు. అయినా నేను ఓపికతో ఎదురుచూస్తాను, ఎప్పటికైనా నేనంటే మీరు ఇష్టపడకపోరు. నేను కారుచౌకగా మిమ్మల్ని మోస్తున్నాననే మీకు లోకూవైపోయాను. అయినా ఫర్వాలేదు సహనంతో సర్దుకుపోతాను, ఏదో ఒకరోజు రానే వస్తుంది. ఆ రోజు నన్ను అర్థం చేసుకోకపోరు.

కర్ఫ్యూలు, బందులు జరిగినపుడు అసహనంతో ఊగిపోయి నాపైనే రాళ్ళు రువ్వి గాయంచేస్తారు. పెట్రోలు చల్లి బూడిద చేయాలని చూస్తారు. మీరు నన్ను భాదించినంత ఉత్సుకతో నేను మీరంటే అభిమానం పెంచుకుని మీకోసం రంకెలు వేస్తూ ముందుకు సాగిపోతాను. ఒకవైపు సహజ విపత్తు లోనూ, సంఘవిద్రోహుల చేతిలో నలిగిపోతూనే మీకోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాను. ఇప్పుడు కరోణా మహమ్మారి విజ్రృంబిస్తున్న తరుణం లో కూడా మీకోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను. మాస్కులు, శానిటైజర్లు, ఐసోలేషన్ బోగీలు, వెటిలేటర్లు మొదలయినవి తయారుచేసి, నిరంతరాయంగా సరఫరా చేస్తూనే ఉన్నాను. పాలు, కూరగాయలు, పళ్ళు, ఔషధాలు రవాణాచేస్తూ, ఇలా మీకోసం కష్టపడుతూనే ఉన్నాను. నాప్రాణం ఉన్నంతకాలం నాదేశం కోసం పనిచేస్తూనే ఉంటాను. ఇకనైనా మీపైని నా ప్రేమను అర్థం చేసుకుని మీ భాద్యత గా నన్ను చూసుకుంటారని ఆశిస్తున్నాను.

ఇంతకూ నేనెవరో గుర్తుపట్టారా మిత్రులారా….? నేనేనండి భారతీయరైల్వేని. నాకు ఏంతో గర్వంగా ఉంది భారతజాతి జీవనరేఖగా గుర్తించినందుకు.ఇప్పుడుకూడా మీకు మాట ఇస్తున్నాను, మీపై ఆప్యాయత కొరవడకుండా అదే భారతజాతి జీవనరేఖగా కొనసాగుతానని, నాపై దేశం పెట్టుకున్న నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ముచేయనని.
నేటితో 167 సంవత్సరాలుగా నా దేశం కోసం నా జీవనాన్ని సాగించాను.. ఇకపై కూడా కొనసాగుతాను.

సదా భారతజాతి సేవలో తరిస్తూ……
మీ భారతీయరైల్వే -జాతి యొక్క జీవనరేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap