“గణతంత్ర దినోత్సవానికి వందనాలు, వందనాలు”

జనవరి 26 మన దేశ చరిత్రలో మహోన్నతమైన రోజు. దీనినే మనం తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటాము. ఒక దేశపు రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజుని ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే జాతీయ దినోత్సవమే ఈ గణతంత్ర దినోత్సవం. “ఎందరో త్యాగమూర్తులు అందరికీ వందనాలు” అన్న చందాన ఎంతోమంది త్యాగమూర్తుల కష్టాల ఫలితంగా మనమంతా కులమతాలు, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా ఓ గొప్ప వేడుకగా జరుపుకునేవి రెండే రెండు పండుగలు. అవి ఒకటి స్వాతంత్ర దినోత్సవం, రెండవది గణతంత్ర దినోత్సవం. ఎందరో వీరులు, ధీరులు, త్యాగమూర్తులు, మహిళా మత తల్లులు బ్రిటిష్ వారితో పోరాడి అహింసా మార్గంలో సాధించుకున్న మనదేశ స్వాతంత్రానికి, రిపబ్లిక్ డే కి గుర్తుగా భారతదేశ ఆణిముత్యం పింగళి వెంకయ్య గారు ఎంతో అందంగా రూపొందించిన మువ్వన్నెల జాతీయ పతాకానికి వందనాలు అర్పిస్తు ఈ వేడుకను ఎంతో ఘనంగా జాతీయ వేడుకగా చేసుకుంటున్నాము.

సుమారుగా 250 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు క్వీన్ ఎలిజిబెత్ ఆధ్వర్యంలో వ్యాపారం పేరుతో మన దేశంలోకి ప్రవేశించి రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని ఆక్రమించుకుని దుష్ట, దురాగత పాలన సాగించారు. అంతటితో ఆగకుండా మన దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుని వారే రాజులుగా అధికారం చెలాయిస్తూ ఇష్టం వచ్చినట్లు పన్నులు వసూలు చేశారు. ఎదురు తిరిగిన వారిపై దౌర్జన్యాలు చేస్తూ వచ్చారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆణిముత్యాల్లాంటి నాయకులు సంఘటితమై ప్రజల్లో దేశభక్తిని రగిలించారు. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపారు. నాయకులతో పాటు ప్రజలు కూడా సంఘటితమై పోరాటాలు సాగించారు. జాతిపిత మహాత్మా గాంధీ అందరినీ ఒక్కత్రాటిపై నిలబెట్టారు. ఇలా గాంధీజికి అండగా ఉండి సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, అల్లూరి సీతారామరాజు, సుభాస్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, రాజ్ గురు, నెహ్రూ,ఇందిర… ఇలా మొదలైన వారంతా బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించారు. గాంధీజీ ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా సత్యం, అహింస పద్ధతులతో పోరాడి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకి అడ్డుకట్ట వేశారు. ఇలా గాంధీ గారి నాయకత్వంలో జరిగిన ఎన్నో పోరాటాల ఫలితమే 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. మన భారత మాతకు విముక్తి కలిగిన పోరాటాల ఫలితమే మనమంతా ఈనాడు పండగ జరుపుకుంటున్నాం. జాతులు, మతాలు వేరైనా, భాషలు వేరైనా మనమంతా భారతీయులం, భారతమాత ముద్దుబిడ్డలం అన్న భావనతో అందరం కలిసికట్టుగా ఒక్కత్రాటి మీద నిలబడి ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము.

భారత గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. మరి ఈ స్వేచ్ఛ ఎక్కడి నుండి వచ్చింది. మాట్లాడే హక్కు అందరూ కలిగి ఉంటారు అంటారు. ఇలా మాట్లాడే హక్కును ఎలా కలిగి ఉన్నారు. అందరితో సమానంగా జీవించే హక్కును ఎలా పొందారు. భావవ్యక్తీకరణ హక్కును, నచ్చిన మతాన్ని పొందే హక్కు ని, రిజర్వేషన్లు, ఆస్తి హక్కు అందరూ చదువుకునే హక్కు ఏమైనా తగాదా వస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చనే హక్కుల గురించి…. ఇలా అన్నింటినీ అందరూ స్వేచ్ఛగా అనుభవిస్తూ సుఖసంతోషాలతో ఉంటున్నారు. కానీ ఇవన్నీ ఎలా వచ్చాయి అనే విషయాలు మనలో చాలామందికి తెలియదు. ఇవన్నీ మనకు మన రాజ్యాంగం కల్పించింది. మన జీవితాలను రాజ్యాంగం స్వేచ్ఛా పతంగులుగా మార్చింది. ఈ రాజ్యాంగం మన దేశానికి వెన్నెముక లాంటిది. మంచిచెడులను తెలియజేస్తూ దేశాన్ని సరైన మార్గంలో నడిపించే మాతృమూర్తి మన ‘రాజ్యాంగం’.

అలాంటి రాజ్యాంగం చరిత్ర మూలాల్లోకి వెళ్ళి ఒక్క సారి పరిశీలిస్తే 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. కేవలం స్వాతంత్ర్యం మాత్రమే సిద్ధించింది. సర్వసత్తాక, లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించలేదు. దేశాన్ని నడిపించడానికి సరైన నాయకులు ఉన్నారు కానీ సరైన విధివిధానాలు లేవు. బ్రిటిష్ వారి చట్టాలే అమల్లో ఉన్నాయి. మనల్ని మనం పరిపాలించు కునే విధంగా ప్రభుత్వం చక్కగా పరిపుష్టంగా ఉండేలా ఉత్తమ దిశా, నిర్దేశం చేసే “రాజ్యాంగం” మనకి కూడా ఉండాలని ఆనాటి మహానుభావులు భావించారు. కానీ జలియన్ వాలాబాగ్ ఉదంతం ఉద్దండులైన రాజకీయ నేతల్ని కూడా ఉలిక్కి పడేలా చేసింది. ఇక నేతలంతా కూడా పూర్ణ స్వరాజ్యం చేయించడంలో సఫలమయ్యారు. ఆరోజే పూర్తి స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాలని పిలుపునిచ్చారు. అంతటి ప్రాధాన్యత ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న మంచి ఉద్దేశంతో బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 ను రద్దు చేశారు.

స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ ని ఏర్పాటు చేశారు. మనల్ని మనం పరిపాలించుకునే విధంగా ప్రభుత్వం చక్కగా పరిపుష్టంగా ఉండాలని భావించారు. 1946 డిసెంబర్ 9 న జరిగిన మొదటి సమావేశంలో డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ తర్వాత డిసెంబర్ 11న జరిగిన సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. న్యాయ కోవిదులు అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు రాజ్యాంగ ముసాయిదా తయారీ బాధ్యతలు అప్పగించారు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ ప్రముఖ పాత్ర పోషించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో వివిధ దేశాల రాజ్యాంగాలను అవపోసన పట్టారు. ఎన్నో దేశాలు తిరిగి ఎంతో పరిశోధన చేశారు. వాటన్నింటి ఆధారంగా కొన్ని దేశాల నుంచి మంచి సూత్రాలను తీసుకుని అందమైన, అద్భుతమైన రాజ్యాంగ రచన చేశారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జి.

ఈ రాజ్యాంగ రచన చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలము పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షల రూపాయలు ఖర్చయింది. భారతీయ పౌరులు అందర్నీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర్య పోరాటాల ఆశయాలు నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ నేతలంతా గర్వపడే విధంగా అద్భుతంగా రూపొందించారు. అలాగే భారత రాజ్యాంగం పై ఉండే జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ లో అశోక చక్రవర్తి స్థాపించిన అశోక స్తంభం నుంచి సేకరించారు. దానిపై నాలుగు సింహాలు, గుర్రం, ఎద్దు లతోపాటు అశోకచక్రం, “సత్యమేవ జయతే” అనే అక్షరాలను కలిపి 1950 జనవరి 26న మన దేశ జాతీయ చిహ్నంగా పెద్దలంతా కలిసి ఏర్పాటు చేశారు.

గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి వీలుగా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించినప్పటికీ, 1950 జనవరి 26 న ఉదయం 10 గంటల 18 నిమిషాల నుంచి 395 అధికరణలు, 22 భాగాలు 9 షెడ్యూళ్ళతో అమలులోకి వచ్చింది. దీంతో జనవరి 26న భారత దేశ నూతన గణతంత్ర రాజ్యం రిపబ్లిక్ గా అధికారికంగా ప్రకటించబడింది. భారత జాతీయ గణతంత్ర దినోత్సవం రోజున భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేసి సైనిక వందనం స్వీకరించడం కూడా ఒక సత్ సంప్రదాయం. గణతంత్ర దినోత్సవం రోజున ఎవరో ఒక దేశాధినేతల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి సకల లాంఛనాలతో సత్కరించే సంప్రదాయం కూడా 1976 నుంచి కొనసాగుతూ వస్తోంది. అలాగే వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకం ఎగురవేస్తారు.

అలాగే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాహసబాలల అవార్డుల గురించి. ఆపదలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం తెగించి నిస్వార్థంతో రక్షించి ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలబాలికలను ప్రోత్సహిస్తారు. వీరికోసం భారత ప్రభుత్వం “సాహస బాలబాలికల పురస్కారాలు, నేషనల్ బ్రేవరీ అవార్డులు” ప్రవేశపెట్టింది. ఈ అవార్డును ప్రతి ఏటా అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు ప్రదానం చేస్తారు. ఈ అవార్డులను పొందిన బాలబాలికలు గణతంత్ర దినోత్సవం రోజున జరిగే కవాతులో పాల్గొంటారు. ఈ అవార్డును పొందిన వారికి ఒక మెడల్, సర్టిఫికేట్, క్యాష్ అవార్డు కలిపి ప్రదానం చేస్తారు. భారత అవార్డులు పొందిన వారికి గోల్డ్ మెడల్ ను, మిగిలిన ఇతర అవార్డులను పొందినవారికి సిల్వర్ మెడల్ ప్రదానం చేస్తారు. ఇవే కాక ఈ అవార్డులను పొందిన వారికి నగదు పురస్కారాలతో పాటు ఉపకారవేతనం ఉచిత విద్యను కూడా అందిస్తారు ప్రభుత్వం వారు.

భారతదేశం సామ్రాజ్య పాలన నుంచి జనసంద్రంగా మారి మనకంటూ ఒక సొంత అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్న రోజే ఈ గణతంత్ర దినోత్సవం. ప్రతి పౌరుడు తనకున్న హక్కుల్ని వినియోగించుకొంటూ దేశాభివృద్ధికి పాటుపడదాం.

పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
కాలామిస్టు రచయిత్రి.
(ఫోన్ -9704725609)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap