తెలుగు నాటక రంగంలో ఇటీవల కనిపించిన ఒక కొత్త దశ గురించి మాట్లాడుకుంటూ ఆ నేపథ్యంలో భారతీయ నాటకం బహుళత్వం నుండి ఏకత్వం దిశగా ఎలా పయనిస్తూ వస్తుందో.. గత దశాబ్ద కాల పరిధిలో నేను చూసిన తెలుగు నాటక ప్రదర్శనలతో పాటు భారతీయ భాషా నాటకాల్లో కూడా కనిపించిన ఈ ‘బహుళత్వం నుండి ఏకత్వం’ దిశగా నాటక రంగం ఎలా పయనిస్తూ ఉందో ఈ కోణం నుంచి మాత్రమే పరిశీలిస్తూ, అందులో కనిపిస్తున్న వస్తు, ప్రదర్శన పద్ధతులు (డిజైన్ టెక్నిక్ ప్రజెంటేషన్) గురించి నాకు కలిగిన అవగాహన మేరకు ప్రపంచ రంగస్థల దినోత్సవ( మార్చి 27 2026) వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో మీతో పంచుకుంటాను.
ఇటీవలి భారతీయ నాటక రంగంలో తెలుగు కూడా కలుపుకొని
1. దళిత బహుజన స్వరం, 2. మహిళా- లింగ చైతన్యం, 3. చరిత్ర, పురాణాల పునర్వ్యాఖ్యానం– అనే ధోరణల గురించి ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ఈ వ్యాసరచన కొనసాగిస్తాను.
దాశరధి రంగాచార్య గారి ‘చిల్లర దేవుళ్ళు’ అప్పటి రంగస్థల ప్రదర్శనతో తెలంగాణ గ్రామీణ జీవితం, కులాధిపత్య నిర్మాణపై విమర్శ, స్థానిక గ్రామదేవతల సంస్కృతి నేపథ్యంలో నాటకం నడుస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఈ విషయంగా ఆయా ప్రాంత సాంస్కృతిక జీవనశైలిలో స్వల్ప భేదాలు ఉన్నప్పటికీ,పోలికలతో కూడిన నాటక ఇతివృత్తాలు కనిపిస్తాయి.
1. ‘కోర్టు మార్షల్’ అనే హిందీ నాటకం కూడా తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. ప్రధానంగా ఇందులో సైనిక వ్యవస్థలో.. మనకు ఎంత మాత్రం పరిచయం లేని అక్కడి ‘హైరార్కి’..ఆధిపత్య అహంకార, అధికారస్వామ్య వ్యవస్థలో కులవివక్ష ఎంత లోతుగా ఏ స్థాయిలో ఉందో (ఇది సార్వజనీకరణ కాదు కానీ), ఒక సైనికుడు తిరుగుబాటు ద్వారా దాని ప్రతిఘటన ప్రతీకారం పర్యావసానం కొట్ట వచ్చినట్లు కనిపిస్తాయి. మరింత వివరంగా ప్రసంగించడానికి అవకాశం ఉన్న సందర్భంలో ఆ వస్తు విస్తృతి వ్యాప్తిని ప్రస్తావిస్తాను.
2.ఇప్పుడు మహిళా అస్తిత్వం-లింగ చైతన్యం, పురాణాల పునర్ వ్యాఖ్యానం అనే అంశం తీసుకుంటే.. యావత్ భారతంలో మనకు సీత ద్రౌపది అహల్య వంటి పాత్రలు ప్రముఖంగా కనిపిస్తాయి. శీలం, పాతివ్రత్యం నేపథ్యంలో అప్పుడు, ఇప్పుడు అటువంటి స్త్రీల తిరుగుబాటు ప్రతిఘటన వ్యక్తిత్వ నిరూపణ మొదలైన అంశాలు అందరికీ చొప్పున స్ఫురిస్తాయి. ఈ ఆధునిక కాలంలో మహిళలు పురుషులతో సమాన అవకాశాల కోసం పోరాడుతున్న నేపథ్యంలో కనిపిస్తున్న వివక్ష దోపిడీ లైంగిక వేధింపులు పితృస్వామ్య భావజాలం పనిచేస్తున్న చోట,ఇంటిలో మహిళల వ్యక్తిగత జీవితాలలో ఒత్తిడులు మొదలైన అంశాలు విస్పష్టంగా రంగస్థలంపై చోటుచేసుకుని ప్రశ్నిస్తున్నాయి, ఆలోచింపచేస్తున్నాయి. ఆత్మ విమర్శకు దోహదపడుతున్నాయి.
ఇక్కడ జెండర్ అంశం- థర్డ్ జెండర్ (ఎల్.జి. బి. టి.) కూడా తెరమీదకు వస్తుంది. ఈ విషయంలో భారతీయ నాటకంగా గిరీష్ కార్నాడ్ ‘నాగ మండల’ కన్నడ జానపద మూలంలో మహిళ శరీరం, మనసు స్వేచ్ఛ అస్తిత్వం వ్యక్తిత్వం వంటి అంశాలు చోటు చేసుకోవడం వంటి ఒక ప్రధాన మలుపు, మైలురాయిగా కనిపిస్తుంది. ఆ ప్రయాణం ఇప్పటి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ దాకా వివిధ కోణాల్లో ఆవిష్కృతం అవుతూనే ఉంది. మత సహనం సహజీవనం అపనమ్మకం దేశ విభజన నేపథ్యం, ఇటీవలి రాజకీయ ధోరణుల నుండి మత ఉగ్రవాదం వరకు మన మనసులో, రంగస్థలంపై చూసిన దృశ్యాలు మెదులుతాయి.
మహేష్ దత్తాని ‘ఫైనల్ సొల్యూషన్స్’ నుంచి వివిధ ప్రాంతాల్లోని రాజకీయ వ్యంగ్యాత్మక నాటకాలు కూడా (పొలిటికల్ సెటైర్) కనిపిస్తాయి, గుర్తుకొస్తాయి. మహారాష్ట్ర విజయ్ టెండుల్కర్ ‘ఘాసీరామ్ కోత్వాల్’ లాగే కొన్ని మన తెలుగు,ఇతర నాటకాలు కూడా గుర్తుకొస్తాయి.
దేశం నాలుగు చెరగులా చూసిన వివిధ ప్రాంతీయ భాషా నాటకాల్లో మనం అనుకుంటున్న ‘బహుళత్వంలో ఏకత్వం’ నాకు స్పష్టంగా కనిపించింది. వాటిలో ప్రతిపాదించబడిన ముఖ్య అంశాలతో, పరస్పర సాన్నిహిత్యం పోలికలు, తెలుగు నాటకంతో అనుసంధానమై కనిపిస్తాయి. ఇప్పుడు థియేటర్ ఉద్యమం బలంగా, నిరంతరం ప్రదర్శనలు కొనసాగించే సమాజాలు, ప్రఖ్యాత సుప్రసిద్ధ నాటకాలను తమ తమ ప్రాంతీయ భాషలోనికి అనువదించి, అనుకరించి ప్రదర్శించడం కూడా కనబడుతుంది. అలా భారతీయ నాటక బహుళత్వంలో ఏకత్వాన్ని సుస్థిరపరుస్తాయి. ఇతివృత్త వైవిధ్యంతో ప్రదర్శించబడ్డాయి. ప్రపంచీకరణ, అస్తిత్వ రాజకీయాల ప్రాబల్యం పెరిగాక మనకు అక్కడక్కడ కులం లింగం మతం ప్రాంతీయత.. ఈ అంశాలలో కూడా భిన్నత్వంలో ఏకత్వం, న్యాయం సమానత్వం విచక్షణ వివక్ష అమానవీయత, ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తాయి.
భారతీయ నాటకాన్ని ఒక విహంగ వీక్షణ మాత్రంగా చూస్తే.. భిన్న భాషలలో భిన్న సంస్కృతిలో, భిన్న అస్తిత్వాల మధ్య మనిషి సంఘర్షణ, సామాజిక మానవ గౌరవం (హ్యూమన్ ప్రైడ్) అనేవి ప్రశ్నార్ధకాలుగా కనిపిస్తాయి. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలు భారతీయ సమాజంలో, అలాగే భారతీయ నాటక రంగంలో అన్నింటినీ కలిపి వివిధ ప్రాంతాలలో, అంతరాలలో కలనేతగా (all combined to create a layered civilizational fabric) కనిపిస్తాయి.
(గిరీష్ కర్నాడ్ ‘తలెదండ్’ నాటకం కూడా జాతి కుల భేదాలు అంతస్తులు అంతరాలకు సంబంధించినదే)
‘అమ్మా బైలెల్లినాదో’..నాటక రచన రవీంద్రబాబు. అవినీతిపరుడు, లంచగొండి అయిన భర్త ఉద్యోగం పోగొట్టుకుని బావమరిది సలహాతో భార్యతో చీటీల వ్యాపారం ప్రారంభించి ఆమెని ‘స్వామిని’ గా మార్చి ఆపై రాజకీయాల్లో ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకునే క్రమంలో బాబాలు స్వాములు, రాజకీయ అడ్డాగా చేసుకొనే అడ్డమైన నాటకాలను ఈ రచయిత హాస్య వ్యంగపూర్వకంగా చెబుతాడు.
‘శవతాండవం* నాటిక ..స్వార్ధ రాజకీయం మనుషులను రాక్షసులుగా చేస్తుండగా, డబ్బు పరపతి ఉన్నవారే రాజ్యాలేలుతుండగా.. లేనివారు వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లా ఉంటున్నారు. ఓ ఆసుపత్రి మార్చురీ గదిలో జరిగిన శవ రాజకీయమే ‘శవతాండవం’
సముద్ర గర్భంనాటిక.. సాక్షాలపై ఆధారపడి ఇచ్చే తీర్పులను బట్టి చట్టాన్ని న్యాయాన్ని తప్పు పట్టకూడదు. అది సాక్షుల అనైతికతే కానీ చట్టంలో లోపం కాదు. ఆ చట్టమే లేకపోతే సమాజంలో న్యాయం ధర్మం సత్యం బతికి బట్ట కడతాయా? అన్న ఆలోచన రేకెత్తిస్తుంది.
మంటేస్వామి కన్నడ సమాజం నలుమూలలా ఆవరించిన మూఢాచారాలు కులవివక్ష సామాజిక అసమానతలను వ్యతిరేకించే, బసవేశ్వర సమకాలీనుడైన జ్ఞాన సాధువు.. ఈ మంటేస్వామి.
కోర్టు మార్షల్ రామచందర్ అనే సిపాయి పైఅధికారి ఒకరిని చంపి మరొకరు తీవ్రంగా గాయపడడానికి కారణం అవుతాడు. సైనిక వ్యవస్థలో పైకి కనిపించని కులాహంకారం, దళిత పీడన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కులం పేరుతో దూషించడం వల్ల అతడి రక్తం మరిగి తుపాకీతో దాడి చేయడానికి కారణం అవుతాయి. భార్యను లైంగికంగా వేధిస్తుండడంతో ఆమె అతడి నుంచి విడాకులు కోరుకుని, ఆ అధికారి నుంచి విడిగా ఉంటుంది. చివరి దశలో ఆ అధికారి ఆత్మహత్య చేసుకోవడంతో ‘పొయిటిక్ జస్టిస్’ జరిగినట్లు రచయితే పలికిస్తాడు. గత నాలుగు దశాబ్దాలుగా పలు భారతీయ భాషల్లో ఈ నాటకం ప్రదర్శించబడుతోంది.
కేకేఎల్ స్వామి కొత్త పరిమళం నాటిక.. మనుషుల మనసుల్లో, దేశాల మధ్య నిర్మించుకున్న సరిహద్దులు తొలగి మానవత్వం వర్ధిల్లాలి’ అన్న సందేశంతో సాగుతుంది.
రైతే రాజు నాటిక- రైతులు తమకు మాత్రమే సరిపడా పంటను పండించుకుని తన శ్రమకు, పండించే పంటకు విశ్రాంతిని ప్రకటిస్తే.. పాలకులు ప్రజలు, తక్కిన జీవకోటి ఏం తిని బ్రతుకుతారు? అన్న ఆలోచన కలిగిస్తుంది.
నాన్నా! నేనొచ్చేస్తా నాటిక.. “పెళ్లంటే సర్దుబాటు, సంసారం అంటే దిద్దుబాటు” అన్న సూత్రాన్ని అర్థం చేసుకొని తన వైవాహిక జీవితాన్ని సరిదిద్దుకొని, ఆ ఆనందాన్ని తల్లిదండ్రులకు చూపించాలని ముచ్చటపడిన స్త్రీయే.. అంతకుముందు ఈ సంసారం నేను చేయలేను, నాన్నా నేను వచ్చేస్తా అన్న గృహిణి చెప్పిన ఆహ్వానమే ఈనాటిక. ‘అమ్మా నాన్న, మా ఇంటికి రండి మీరు” అని స్వాగతించడమే “నాన్నా నేనొచ్చేస్తా”.
అందిన ఆకాశం ఎస్.ఎం. భాషా దర్శకత్వంలో ప్రదర్శించబడిన నాటిక ఇది. ‘సంపదలో కాక దారిద్ర్యంలో కూడా దంపతులు ఒకరికొకరు అనురాగ బంధంలో కలిసి ఉండటమే దాంపత్యంలోని మాధుర్యమని, దివ్యాంగులైన పిల్లలకు- తల్లిదండ్రులు ప్రేమను పంచితే, వారు ఆకాశం అంది వచ్చినంత సంబరపడతారన్న’ సందేశం ఇచ్చిన నాటిక ఇది.
*ఇంకానా?.. వాసు దర్శకత్వంలో కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన నాటిక ఇది. ఆనాటి నుండి ఈనాటి వరకు మహిళలపై, యువతులపై, బాలికలపై, అత్యాచారం హింస దౌర్జన్యం పెత్తందారీతనం దోపిడీ.. ఇంకా కొనసాగాలా? అంటూ ప్రశ్నిస్తుంది.
గారడి నాటిక త్రినాధ రావు దర్శకత్వంలో ప్రదర్శించబడినది. రాజకీయ నాయకుడిగా చలామణి అయ్యే వ్యక్తులు నిరుపేదల జీవితాలతో ఆడుకొని వారి బ్రతుకును గారడీ చేసి, ఇక్కట్ల పాలు చేసి ఊరుని విడిచి పోయేటట్లుగా ఏమేమి చేశారో, ఎలా చేశారో, కళ్ళకు కట్టిన విషాదమే ఈ నాటిక. న్యూ బాంబే టైలర్స్ జాన్ బషీర్ దర్శకత్వంలో ప్రదర్శింపబడిన నాటిక. రెడీమేడ్ దుస్తుల వ్యాపారం- సంప్రదాయ ధర్జీల బతుకులను వీధిపాలు చేస్తే, కూటికి కరువైన దుస్థితిని అనుభవిస్తూ ఆత్మాభిమానం చంపుకుని అస్తిత్వాన్ని వదులుకొని, వ్యక్తి గౌరవం లేని బ్రతుకు బ్రతకలేక ఆ కుటుంబాలు ఎలా కనుమరుగవుతున్నాయో.. అన్న విషయ ప్రధానంగా సాగి గుండెలవిసేలా చూపిన నాటిక.
ఉస్నే కహా థా నాటిక. పావురాలకు మతం లేదు కాబట్టి సరిపోయింది లేకుంటే ఆకాశం నుండి రక్తపు వర్షం కురిసేది. 1947 దేశ విభజన సమయంలో నదులలో నీళ్లకు బదులు రక్తం ప్రవహించింది. ఆ విభజన జాతుల మధ్య కాక- స్నేహం ప్రేమ విశ్వాసాల మధ్య జరిగింది. అదొక విషాదం.
అంతర్ ద్వంద్వ్ మగ శిశువుగా జన్మించినా, మానసికంగా స్త్రీ స్వభావంతో పెరిగే చిన్నారులు.. ఎదుగుతున్న కొద్దీ వారిలోని ద్వంద్వ ప్రకృతి, మానసిక సంఘర్షణ, అంతర్ద్వంద్వ్ నాటిక చూపించే మహాసంగ్రామం.
జినే లాహోర్ న వేఖ్య గురుగ్రామ్ విశ్వవిద్యాల విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ఇది. దేశ విభజన సమయంలో పాకిస్థాన్లో ఉండిపోయిన ఒక వృద్ధ స్త్రీ తన ఇంటి హక్కును కోల్పోనని గట్టిగా చెబుతుంది. ఆమె పొరుగు ముస్లిం కుటుంబం మొదట్లో కొంత వైముఖ్యం చూపించినా, ఆపై వారిరువు మధ్య ఏర్పడిన సామరస్యత వల్ల చివరకు ఆ వృద్ధ మహిళ చనిపోతే.. ఊరంతా వ్యతిరేకించినా ఆమెకు అంత్యక్రియలు హిందూ సంప్రదాయంలో జరిపిస్తారు.
ఏ రక్త్ బీజ్ హై స్త్రీ బహిష్టు కావడం, స్త్రీ బహిష్టు రక్తస్రావం కారణంగా చూపే వివక్ష.. ఈ నాటిక ఇతివృత్తం. ఆ రక్తస్రావమే లేకపోతే మానవజాతి మనుగడకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తుంది.
బే రంగ్ ఒక వేశ్య. ఆమె తన సంతానం కోసం, లైంగిక శ్రామిక హక్కుల కోసం పోరాటం ఈనాటిక.
సబ్సే బురా కౌన్ హై?.. మనిషే! మనిషిలోని మరో మనిషే! అని చెప్తుంది నాటిక. ఉల్లూ కే పఠే మానవత్వాన్ని మించిన సారం లేదని, గుడ్లగూబలు గ్రహిస్తాయి, కానీ మనిషే దానిని గ్రహించలేని అమాయకుడందామా? స్మశాన కురుక్షేత్ర ద్వాపరంలో కలిపురుషుడితో, కలియుగ స్త్రీ జరిపిన సంవాదంలో, ఆధునిక
స్త్రీవాద దృక్పథం కనిపిస్తుంది.
కులక్షేత్రం కులాలు- ఉప కులాల మధ్య అంతర్గత పోరు నేటి సమాజంలో కురుక్షేత్రాన్ని సృష్టిస్తోంది. ఆడ మగ ఎవరైనా వారికి కులం లేదు. సమాజంలో మనుష జాతికి కులం లేదనే భావన ఏర్పడితేనే.. నిజమైన అభ్యుదయం, సమాజశాంతి, ప్రగతి సాధ్యపడుతుంది’ అన్న సందేశం ఇచ్చే నాటిక. డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు ధారపాలెం మెజారిటీ నాటిక, రాజకీయ ఆషాడభూతులను కడిగిపారేస్తుంది. స్వార్థపరుల కపట నాటకాలను దుయ్యబడుతూ, సంప్రదాయం పేరుతో తమ పబ్బం గడుపుకునే వ్యక్తులను ఎండగడుతూ సాగుతుంది. ఈ రచయితే రాసిన సామాన్య శాస్త్రం నాటిక నేటి నిచ్చెన మెట్ల సమాజంలో రాజకీయ బలుపుతో ఓట్లు దండుకొని స్వార్థమే పరమావధిగా భూములు, కొందరు జల వనరులను స్వాహా చేస్తుండడాన్ని ఎత్తిచూపి ఎండగడుతుంది. సమాజాన్ని రక్షించే రాజ్యాంగంగా సామాన్య శాస్త్రం తయారు కావాలి! సమాజానికి ఇది దిశా నిర్దేశం చేయాలే తప్ప తప్పించుకుపోయే దిక్కులను చూపకూడదు. సామాన్యుడిని అసామాన్యుడిని చేసి సమాజ ప్రక్షాళనకు నడుం కట్టించాలని సందేశం ఇస్తుంది.
పరిహారం పనిచేసే ప్రదేశంలో ఉద్యోగం పేరుతో ఉద్యోగ స్వాములు చేసే లైంగిక వేధింపులు ఇతివృత్తంగా సాగుతుంది నాటిక. అలాంటి స్వభావం కలవారికి కీలెరిగి వాత పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతుంది.
రాతిలో తేమ మనుషుల్ని దోమల్లా, చీమల్లా, మోచేతి నీళ్లు తాగే ఎలాంటి అస్తిత్వ ప్రాధాన్యత లేని వారిగా, అడవి మనుషులుగా, చాకిరీ చేసే పశువులుగా, భావించే భర్తలో, తన సహనం ప్రేమ కరుణ జాలి గుణాలతో మానవీయంగా వ్యవహరించి, భర్త భూస్వామిక నిరంకుశ ధోరణిలో, దృక్పథంలో మార్పు సాధించుకున్న సహన శీలి రెడ్డిసాని విజయ-గాథ.
ఇది కేకేఎల్ స్వామి నాటకీకరణ చేసిన వ్యసనం నాటిక, రైతుకు వ్యవసాయం ఒక వ్యసనమైతే, రైతు మూలుగులు పీల్చే దళారుల తీరు, దోపిడీ, మార్కెట్ మాయాజాలం, పచ్చని పంట భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్నో
అననుకూలతల మధ్య, ఆటుపోట్ల మధ్య, బ్రతుకీడ్చే బడుగు జీవుల జీవితమే ‘వ్యసనం’ నాటిక.
త్రిజుడు నాటిక- కులం గోత్రం వంశం హోదా పుట్టుక సంపద మనిషి ఉన్నతికి, వ్యక్తిత్వానికి గీటురాయి కాదు. మంచితనం, మానవత్వమే మనిషిని ఉన్నతంగా, ఉత్తమంగా తీర్చిదిద్దుతాయి’ అన్న సందేశం ఇచ్చే నాటిక. చందమామ రావే ఈ నాటిక ‘తల్లి రుణం తీర్చుకోలేనిదే అయినా తీర్చుకునే ప్రయత్నం చేయమంటుంది. మరి ఎంతమంది అలా తల్లి రుణం తీర్చుకుంటున్నారు??
ఉత్తిష్ఠ భారత ప్రజాస్వామ్య సౌధానికి నాలుగవ స్తంభంగా చెప్పబడే పాత్రికేయ వృత్తి ఎవరి ముందు సాగిలపడకూడదు. వృత్తిపరమైన నిబద్ధతతో జర్నలిస్టు తలెత్తుకొని నిలబడగలిగిన నాడు భారతదేశం సగౌరవంగా ప్రపంచ దేశాల ముందు తలెత్తుకుని నిలబడగలదని’ చెప్పే నాటిక.
సంతానం విదేశాల్లో స్థిరపడి వృద్ధులైన తల్లిదండ్రులను విస్మరించడం, ఆ చింత ఒక డిమెన్షియా వ్యాధిగా పరిణమిస్తే.. జరిగే పరిణామాలను వాస్తవంగా చూపుతుంది ఈనాటిక.
సరూ మధ్యప్రదేశ్ లోని సీఢి పట్టణంలో ఉన్న ఇంద్రావతి థియేటర్ వారి సరూ నాటిక హిజ్రాల పాత్రలతో నడిచిన మానవీయ ప్రదర్శన. మూడో రకం మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో?.. వాళ్ళ బాధలు, పైకి కనిపించని మానసిక గాయాలను చూపే మచ్చుతునక.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిషుంబిత హైదరాబాద్ థియేటర్ సంస్థ వారు రెండు రోజులపాటు నాటికలు ఏకాంకికలు ఏకపాత్రలు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలలో ప్రదర్శించారు. అందులో ‘మొబైల్ అడిక్షన్,’ ‘ఏక్ కహాని’ ఒక ట్రాన్స్ జెండర్ జీవితంలోని విషాదపరంపర, ‘బ్రాహ్మిన్ హో?.. ఒక కులంలో పుట్టడం ఖర్మా, తప్పిదమా? వ్యక్తి ప్రమేయం ఇందులో ఏ మేరకు? అన్న ఆలోచన కలిగిస్తుంది. ‘తాల్- ఏ డాన్సర్స్ లైఫ్’ స్త్రీని భోగ వస్తువుగా భావిస్తూ తమ క్షణిక శారీరక సుఖం కోసం మగజాతిలో కొందరు కాముకులు ఎంతటి ఉత్పాతాన్ని సృష్టించి ఒక యువతి జీవితంతో ఆడుకోవడాన్ని కరుణరసాత్మకంగా చూపించింది.
బాలల దినోత్సవ సందర్భంగా బాలోత్సవంలో బాలల నాటికలు- ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు? ఏం కోరుకుంటున్నారు? పెద్దలు పిల్లల జీవితాన్ని మంచిగానో చెడుగానో ఎలా ప్రభావితం చేస్తారో.. కౌమార దశలోని ఒక నవ యువతి తన్ను తాను ఎలా ఉన్నతీకరించుకుందో.. చూపించే లఘు నాటికలు కూడా ఆ నటోత్సవం లో చోటు చేసుకున్నాయి.
దివాకర బాబు మంత్ర నగరి కూడా తెలుగు నాటక రంగానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ముందుచూపుతో హెచ్చరిస్తుంది. నెట్ నాటిక యవ్వనంలో మదిని తొలి చేసే కోరికలు మనిషిని ఒక పట్టాన నిలబడనీయవు. అందులో శారీరకవాంఛలు అదుపు తప్పితే ఎన్నో అవాంఛనీయ సంఘటనలకు అది దారితీస్తుంది. కోరికల మత్తు- ఆలోచన విచక్షణ నశింప చేసి భయానికి తావు లేకుండా చేసి అక్రమ సంబంధాలకు, వాంఛల విశృంఖలత్వానికి, నీతి బాహ్య చర్యలకు పాల్పడేలా చేసి, అనైతికతను హిమాలయాల ఎత్తుకు ఎగరవేస్తుంది’ అని హెచ్చరిస్తుంది ఈ నాటిక. ఇప్పటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు లక్షల్లో జీతాలు, కెరీర్ ప్రోగ్రెస్ పైనే దృష్టి గాని సంసారం సంతానంపై దృష్టి లేదు. సహజీవనం, బ్రేకప్ లు నిత్య కృత్యం కాబోతున్నాయి. పదిమంది నడిస్తే అది దారి అవుతుంది ఎక్కువ మంది నడిచే దారి రహదారి అవుతుంది. అంత మాత్రం చేత అన్ని దారులు సరైన గమ్యాన్ని చేర్చలేవు. సంస్కృతి సంప్రదాయం మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు మనుషులను సరైన రహదారిలో నడిపించినప్పుడే అది మానవ సమాజం అవుతుంది’ అన్న సందేశం ఇచ్చే నాటిక ఇది రహదారి కాదు భాస్కర చంద్ర రచన.
ఇలా నేను చూసినంతమేరా గుర్తున్నంతమేరా ‘భారతీయ నాటకం- బహుళత్వంలో ఏకత్వం’ అన్న అంశం గురించి ఆలోచించినప్పుడు నేను నెమరు వేసుకున్న జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను. వీటికి నేను రాసిన రంగ వీక్షణం రంగ విపంచిక అనే విమర్శ- విశ్లేషణ పూర్వక గ్రంథాలే ఈ సందర్భానికి రిఫరెన్స్ గా నాకు పనికి వచ్చాయి.
–మల్లేశ్వరరావు ఆకుల
ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు (7981872655)
