ప్రముఖ కవి, సంస్కృతాంధ్ర పండితుడు, విమర్శకుడు, రచయిత శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పేరు మీద ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహితీ పురస్కారం’, 2022వ సంవత్సరానికి గాను విలక్షణ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య గారికి ప్రదానం చేయబడింది.
శ్రీకాంత శర్మ గారి తనయుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్వగృహంలో, ఆత్మీయులైన మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు జరిగిన సభలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ పురస్కారంలో భాగంగా శ్రీ శ్రీనివాసా చార్య గారిని పురస్కార సంబంధిత మెమెంటో, శాలువా, 25వేల రూపాయల నగదుతో సత్కరించారు. శ్రీ శ్రీకాంత శర్మ సహచరి ఐన శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల ఆప్తవాక్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శ్రీనివాస చార్య గారి కవితా ప్రస్థానం గురించి ముఖ్య అతిథి కోడూరి విజయ్‌కుమార్ గారు విస్తృతంగా ప్రసంగించారు. పిదప మహమ్మద్ ఖదీర్ బాబు, సుబ్బరాయ శాస్త్రి, శ్రీమతి ఎ. విద్యాదేవి, ఒమ్మి రమేష్ బాబు, శ్రీమతి కె. సజయ తదితరులు తమ స్పందన తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఇంద్రగంటి మోహనకృష్ణ వ్యవహరించగా, శ్రీకాంత శర్మ గారి కుమార్తె ఇంద్రగంటి కిరణ్మయి వందన సమర్పణ చేశారు.