శ్రీకాంత శర్మ జ్ఞాపకాలు – పాండురంగ

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కన్నుమూసి నేటికి (జూలై 25) సంవత్సరం గడిచింది. ఈ సందర్భంగా ఆకాశవాణి విశ్రాంత కేంద్ర సంచాలకులు, పి.పాండురంగ గారి జ్ఞాపకాలు.

ప్రముఖ సాహితీ వేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగు, సంస్కృత భాషలలో అనేక కవితలు, అనుభూతి గీతాలు, సినిమా పాటలు, సాహిత్య ప్రసంగాలు, కథలు, నవలలు, సంగీత రూపకాలు మొదలయినవి రాసి బహుముఖ ప్రజ్నశాలి అనిపించుకున్నాడు. వీటన్నింటికి మించి అతను కొన్ని రేడియో నాటకాలు, మరికొన్ని రంగస్థల నాటకాలు వ్రాసి అగ్రగణ్య నాటక రచయితయ్యాడు.
1976లో రేడియోలో చేరకముందు శర్మ నాటకం జోలికి వెళ్లలేదు. ఆ అవసరం కూడా కలగలేదు. కాని రేడియోలో చేరాక అతను రాసిన తొలి శ్రవ్య నాటిక “సిరి-శాంతి” మనిషికి డబ్బు ఎక్కువయితే, మనస్సుకి శాంతి వుండదు అనే ఇతివృత్తం మీద సాగిన నాటిక ఇది. అప్పట్నించి శర్మ నాటక ప్రస్థానం ప్రారంభమయింది. రేడియోకి ఎన్నో నాటికలు రాసాడు. మెల్లిమెల్లిగా శ్రవ్య నాటకంలోని మెళకువలు నేర్చుకున్నాడు. అంతేకాకుండా రంగస్థల నాటకాల్లో పేరు పొంది రేడియో కళాకారునిగా పేరు గడించిన సి. రామమోహనరావు, నండూరు సుబ్బారావు, సుత్తి వీరభద్రరావు, కోకా సంజీవరావు, భవదీయుడు మొదలయిన వారి సాంగత్యంలో నాటకం రాయాలనే ధృఢ నిశ్చయం, తనని ఈ ప్రక్రియలో కూడా, గొప్ప రచయితగా పేరుపొందే అవకాశం కలిగింది.
తరువాత Jarom K. Jaron వ్రాసిన “Three men in a boat” రచన ఆధారంగా “ఇరుగు-పొరుగు” పేరిట హస్య నాటికలు రాస్తే, అవి నలభై వారాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి. అలాగే “గొడుగు”, “తెరలు” అనే నాటికలు రాసాడు.
శ్రీకాంతశర్మ రాసిన అద్భుత నాటకం “శిలామురళి”. ఇదివరలో దీన్ని గేయకావ్యంగా రాస్తే, ఇప్పుడు రేడియో నాటకంగా మలిచాడు. ఇందులో ప్రద్యుమ్నుడు, అతని మేనమామ, దురాధిపతి, సునంద, పడవవాడు మొదలయిన పాత్రలుంటాయి. ఈ నాటకంలో శారదా శ్రీనివాసన్, సి.రామమోహనరావు, రామచంద్ర కాశ్యప్, మాచినేని వెంకటేశ్వరరావు, సుత్తి వీరభద్రరావు మొదలయిన హేమాహేమీలు నటించగా ప్రముఖ సంగీత విద్వాంసులు ఓటిగారు నేపథ్యగానం ఆలపించారు. ఈ నాటకం నిర్వహణలో నేను కూడా భాగస్వామిని అయినందుకు గర్విస్తుంటాను. ఈ నాటకం వల్ల శ్రీకాంతశర్మకి, ఆకాశవాణికి మంచి పేరు వచ్చింది.

అలాగే “నిరుద్యోగి ధర్మయుద్ధం”, “కెరటాలు పల్లకి”, “వెలుగు రేఖలు” మొదలయిన నాటకాలకి కర్త అయ్యాడు. అమరావతిలో వున్న అమరేశ్వరుని దేవాలయం గురించి, దాని ప్రాశస్త్యం గురించి ఒక గంట రూపకం “అమరారామం ” పేరుతో వ్రాస్తే దానికి ఆకాశవాణి వార్షిక పోటీల్లో బహుమతి లభించింది. అలా బహుమతి లభించిన ఇంకో నాటిక “గాలివాన” ప్రఖ్యాత కథకులు శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారికి “గాలివాన కథకి ప్రపంచస్థాయి కథల పోటీలో ద్వితీయ బహుమతి లభించిన ఈ కథని రేడియోకి గొప్పగా నాటకీకరణ చేసిన ఖ్యాతి శ్రీకాంత శర్మది.
సామాన్యంగా రేడియో నాటకం నిడివి 15 ని.లు, 30 ని.లు, లేదా 60 ని.లు. కాని ఈ నిడివికి భిన్నంగా తెన్నేటి సూరి గారి నవల “చెంఘిజ్ ఖాన్”ని చాలా ఆసక్తి కరంగా, 90 ని.లు నాటకంగా వ్రాసాడు. ఈ నాటకాన్ని నేనూ, ఎస్.బి. శ్రీరామమూర్తి నిర్వహించగా చెంఘీజ్ ఖాన్ గా కోకా సంజీవరావు ప్రాణం పోసాడు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా శర్మ “ఆకుపచ్చని కోరికలు” అనే గంట నాటకాన్ని వ్రాశాడు. ఈ నాటకం అఖిల భారత స్థాయిలో 14 భాషలలో ప్రసారమయింది. అతను గొప్ప నాటక కర్త అనడానికి అంతకన్నా తార్కాణం ఏం కావాలి.
మనిషిలోని కోరికలు, ఆలోచనలు, జీవితంలో ఎలా ప్రభావితం చేస్తాయి అన్న అంశం మీద రాసిన నాటకం “స్మృతి”. ఈ నాటకానికి కూడా వార్షిక పోటీలలో మెరిట్ సర్టిఫికెట్టు లభించింది.
నేను అడిగిన వెంటనే ఒక మంచి నాటకం క్రమశిక్షణతో, స్నేహభావంతో రాసిచ్చే దొడ్డ గుణం శ్రీకాంత శర్మది. మా కిద్దరికీ వున్న అనుబంధం అలాంటిది. అందుకే నేను అడగ్గానే శర్మ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి “సాక్షి”ని 13 భాగాలుగా రేడియో నాటకీకరణ చేసి ఇచ్చాడు. ఈ ధారావాహికని 72 మంది కళాకారులతో మార్కాపురం లాంటి చిన్న స్టేషన్ లో రికార్డు చేసాము. ఈ నాటకంలో సినీనటులు సాక్షి రంగారావు, కాకరాల, సుత్తివేలు, కోట శంకరరావుతో బాటు, రంగస్థల, రేడియో కళాకారులు, స్థానిక కళాకారులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసారు. అలాగే ఆకాశవాణి వార్షిక పోటీలకి “పంజరం కోరిన పక్షి” అనే 30 ని.లు నాటికని వ్రాశాడు.

“నువ్వు సగం స్వప్నానివి, సగం వాస్తవానివి” అని రవీంద్రనాథ్ ఠాగూర్ స్త్రీని అభివర్ణించాడు. సంతానం కోసం పరితపించే మల్లికని, ఆవిడ భర్త రాఘవ, ఆవిడ పిన్ని కలిసి మోసం చేస్తారు. ఈ సంగతి తెల్సుకుని మల్లిక భర్తని చంపేస్తుంది. ప్రఖ్యాత రచయిత చలంగారి “దివ్యమైన మాతృ అనుభవంలోపమయితే, స్త్రీ జీవితం శూన్యం అవుతుంది” అన్న మాటలు ఈ నాటికకి మూలం.
“సాహిత్య ప్రక్రియలలో నాటకం శక్తివంతమయింది. ఒక కథలాగా చదివి మర్చిపోవడానికి వీలు లేనిది. మహానది ప్రవాహం, పరిపూర్ణ జాతి జీవనం లాంటిది నాటకం”. అటువంటి రంగస్థల నాటక రచనలోనూ ఆరితేరాడు శ్రీకాంతశర్మ. ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలోని శ్రవ్య నాటక కళాకారులు, ప్రవృత్తి రీత్యా పేరుగాంచిన రంగస్థల కళాకారులే. వీళ్ళందరి సమ్మేళనంతో ఆవిర్భవించింది. ‘ఆర్టిస్ట్ అసోసియేషన్’, ఒక నాటక రచయితగా శ్రీకాంతశర్మ ఇందులో సభ్యుడే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని P.G. Wood house వ్రాసిన “Leave it to Psmith” అనే నవల ఆధారంగా ‘నెక్లెస్ దొరికింది” పేరుతో రంగస్థల నాటకం వ్రాసాడు. ఇదే నాటకాన్ని రేడియోలో ఒక గంట నాటకంగా ప్రసారమయింది. ఇది మంచి హాస్య నాటకం.
పంచారామాలలో ఒకటైన అమరారామం నేపథ్యంగా సత్యం శంకరమంచి “హరహర మహాదేవ” పేరుతో ఒక గొప్ప శ్రవ్య నాటకం వ్రాసారు. దీనిలో ఆధ్యాత్మిక అంశాలతో బాటు, ధర్మకర్తల అరాచకాలు, కులాంతర వివాహం మొదలయిన విషయాలతో కూడిన ఈ నాటకం 1976లో విజయవాడ రేడియో కేంద్రం నుంచి ఒక గంట నాటకంగా ప్రసారమయింది. ఈ నాటకాన్ని విన్న అనేక మంది శ్రోతలు స్పందించారు. స్థానిక రంగస్థల కళాకారులు, ఈ నాటకాన్ని రంగస్థల నాటకంగా మలిస్తే, తెలుగు నాటకరంగానికి ఒక ఆణిముత్యం దొరుకుతుందనే ఆశతో, సత్యం గారిని సంప్రదించారు కానీ. నాకు స్టేజి నాటకం రాయడం అలవాటు లేదు. శ్రీకాంతశర్మ అయితే నాటకానికి పూర్తి న్యాయం చేయగలడు అని సత్యంగారు సలహా ఇచ్చారు. వెంటనే శ్రీకాంతశర్మ ఆ బాధ్యత తీసుకుని “హరహర మహాదేవ’ నాటకాన్ని దాదాపు రెండు గంటలు రంగస్థల నాటకంగా వ్రాసాడు.

ఈ నాటకం అర్చకుల దైవభక్తి ధర్మకర్తల అహంభావం, వారు దేవాలయం ద్వారా సంక్రమించే ఆస్తిని తమ స్వంత విషయాలకు వాడుకోవడం, అర్చకులను అవమానించడం, కులాంతర వివాహాన్ని అడ్డుకోవడం మొదలయిన అంశాలను, తన పాండిత్యంతో అసమాన నాటకంగా రూపొందించాడు. నాటకం చూసిన ప్రతి ప్రేక్షకుడికి, అందులోని సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి. ఈ నాటకంలోని సంభాషణలు విన్న వారందరికీ రచయిత మాత్రమే కనిపిస్తాడు.
“వీరాస్వామిగారూ! ధర్మం కొండకాదు, స్థిరంగా పడి వుండడానికి, ధర్మం చెట్టుకాదు – పాతుకుపోయి వుండడానికి, ధర్మం తామరాకు మీద నీటి బొట్టు కాదూ కదిపితే జారి చక్కా పోవడానికి, ధర్మం యుగ యుగానికి మారుతుంది”. ఇంత గొప్ప సంభాషణలు విన్న ప్రేక్షకులందరికీ ఒళ్ళు జలదరిస్తుంది.

సామాన్యంగా, ఒక స్టేజి నాటకాన్ని శ్రవ్యనాటకంగా కుదించడం ఆకాశవాణిలో మామూలుగా జరిగే విషయం. కానీ, ఒక శ్రవ్య నాటకాన్ని రంగస్థలానికి రాయడం ఇదే
మొదటిసారి. ఆ ఘనత శ్రీకాంత శర్మకే దక్కింది. ఈ నాటకాన్ని మా ఆర్టిస్ట్ ఆసోసియేషన్ నిర్వహణలో దాదాపు నలభై ప్రదర్శనలు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లోనూ, కోల్ కత్తా, ఆహ్మదాబాద్ పట్టణాల్లో ప్రదర్శిస్తే విపరీతమయిన రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం రచనలో గొప్పతన, వాక్సుద్ధిగల నటీనటుల కృషి.

అలాగే, అతను హాస్యరసం మీద కూడా దృష్టి పెట్టి “అప్పుసత్యాగ్రహం” అనే ఒక పూర్తి హాస్యనాటకం వ్రాశాడు. ఇది ఒక కుటుంబ కథ –
‘లోకనాధం అనే చిరుద్యోగి, బ్యాంక్ ఉద్యోగి అయిన సువర్ణ అనే భార్యకు తెలియకుండా. తన సొంత ఖర్చులకోసం కాస్త డబ్బు దాచి పెడ్తాడు. ఇది పసిగట్టిన సువర్ణ, భర్తని నిలదీస్తుంది. ఈ సంఘటన చివరికి చిలికి చిలికి గాలివానగా మారి, లోకనాధం తన మిత్రుల సలహాతో, ఇంట్లోనే తన భార్య మీద సత్యాగ్రహ దీక్ష చేస్తాడు. చివరికి అతను పనిచేసే ఆఫీస్ సెక్రటరీగారు ప్రవేశించి, అతన్ని మందలించి, భార్యాభర్తలు ఆర్ధికంగానూ, హార్దికంగానూ పరస్పర అవగాహనతో మెలగాలని లోకనాధానికి బుద్ధి చెప్తాడు.”
ఈ నాటకాన్ని కూడా మేము మన రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లోనూ, చెన్నై, అహ్మదాబాద్ పట్టణాలలో ప్రదర్శించాం.
శ్రీకాంతశర్మ రేడియోకి వ్రాసిన చివరి నాటకం “ఆమ్రపాలి” ఈ నాటకం 90 ని. ల నిడివితో ఆకాశవాణి, హైదరాబాద్ నుండి గత ఏడాదే ప్రసారమయింది.
అతను అన్ని సాహిత్య ప్రక్రియలతో బాటు నాటక రచనతో కూడా విజయం సాధించాడు. మా ఇద్దరి స్నేహ బంధం వల్ల కొన్ని మంచి రేడియో నాటకాలు, అలాగే మంచి రంగస్థల నాటకాలు వెలుగు చూసాయి. అందుకే మా స్నేహానికి ప్రతీకగా అతను విశ్లేషించిన 41 నాటకాల ‘అలనాటి నాటకాలు’ పుస్తకాన్ని నాకు అంకితమిచ్చాడు. కాని అతనికి నేనేమి ఇవ్వగలను! అశ్రువులు తప్ప.

-పి.పాండురంగ, విశ్రాంత కేంద్ర సంచాలకులు,
ఆకాశవాణి

1 thought on “శ్రీకాంత శర్మ జ్ఞాపకాలు – పాండురంగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap