అంతర్జాతీయ తెలుగు చిత్రకారుడు పి.టి. రెడ్డి

తెలుగు చిత్ర కళారంగానికి సంభందించిన తొలి తరం చిత్రకారులైన దామెర్ల రామారావు భగీరధిల తర్వాత దేశం గర్వించదగిన స్థాయికెదిగిన గొప్ప చిత్రకారుడు పి టి రెడ్డి. వీరు ముగ్గురూ బొంబాయి లోని ప్రఖ్యాత జే జే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్ధులే అయినప్పటికీ వీరి కళా యానం బిన్న,విభిన్న శైలులలో సాగింది. వీరిలో మొదటి వాడైన దామెర్ల రామారావు కేవలం 28 స్వల్ప కాలమే జీవించినప్పటికి తాను నేర్చిన పాశ్చాత్యవిధానానికి భారతీయ ఆధ్యాత్మికతని జోడించి తెలుగు చిత్ర కళకు ఒక వెలుగుని తీసుకు వస్తే, భాగీరధి ప్రకృతి చిత్రణలో ఆరి తేరి విమర్శకులచే ఆంద్రా టర్నర్ గా ప్రఖ్యాతిగాంచారు. ఇక మూడవ వాడైన పాకాల తిరుపతి రెడ్డి చిత్రకళలో వినూత్నమైన ప్రయోగాలు ఎన్నో చేసి అత్యాధునిక పద్దతుల దారా చిత్రకళలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు గడించిన వ్యక్తి శ్రీ పాకాల తిరుపతి రెడ్డి.

artist PT Reddy in 1980

26 సంవత్సరాల క్రితం యువ చిత్రకారునిగా ఉన్నప్పుడే పి. టి. రెడ్డి చిత్రకారునిగా శిల్పకారుడిగా చేసిన కృషికి చిహ్నంగా పన్నెండు వర్ణ చిత్రాలు మూడు శిల్పాకృతులు మరికొన్ని రేఖాచిత్రాలతో ఒక పోర్ట్ పోలియోను వెలువరించడం ఆ రోజులలో ఒక సాహసోపేతమైన చర్యగా అభివర్ణిస్తారు. ఆ పోర్ట్ పోలియో నందలి చిత్రాలు ఒక పరిపూర్ణమైన చిత్రకారుని యొక్క ఆత్మ విశ్వాసానికి అమోఘమైన ప్రతిభకి ప్రతీకగా వున్నాయని నాటి కళావిమర్శకుల యొక్క మెప్పు పొందడం గొప్ప విషయం .

శ్రీ పి.టి. రెడ్డి తెలంగాణా రాష్ట్రము నందలి కరీంనగర్ జిల్లా అన్నవరం గ్రామంలో1915 జనవరి 4వ తేదీన శ్రీమతి పాకాల రమణమ్మ, రాంరెడ్డి దంపతులకు ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1919 నుండి 1926వరకూ పుట్టిన ఊరిలోనే ప్రాధమిక విద్యనభ్యసించారు. ఆపై మానుకొండూరు మరియు కరీంనగర్ ఉన్నత పాటశాలలో చదువుకున్నారు. నిజం పాలనలో వున్న ఆ ప్రాంతంలోని రాజభాష ఉర్దు కావడంతో తెలుగు ఆంగ్ల భాషలకు అక్కడ ప్రాముఖ్యం ఉండెడిది కాదు. అందుకే భాల్యములో రెడ్డిని అక్షరాల కన్నా ఆక్రుతులే ఎక్కువగా ఆకర్షించేవి. అయా రోజుల్లో వ్యవసాయాన్ని మించిన వృత్తి వేరొకటి లేదు కనుక ఉంటె వ్యవసాయంలో వుండాలి లేదా చదువులో వుండాలి అని భావించేవాడు తన తండ్రి, కాని రెండింటికి భిన్నంగా పి టి రెడ్డి బొమ్మలపై ఆసక్తి చూపిస్తూ వుండడం తన తండ్రికి ఏ మాత్రం నచ్చేది కాదు. అందువల్ల చిత్రకళపై అమితాశాక్తుడైన రెడ్డి తన తండ్రికి తెలియకుండా చాటుమాటుగా డ్రాయింగులు వేస్తూ సంతృప్తి పొండుతుండేవాడు. అంతేగాక రహశ్యంగా ఆనాడు మద్రాస్ ప్రభుత్వం నిర్వహించే డ్రాయింగ్ లోయర్ హయ్యర్ పరీక్షలకు కూడా హాజరయ్యి ఉత్తీర్ణుడు కావడం అతనిలో మరింత ఆత్మవిశ్వాసం ఏర్పడేలా చేసింది. ఈ దశలోనే ఆయన ఉపాధ్యాయుడు శ్రీ అబ్దుల్ సతార్ సుభాని ఇచ్చిన ప్రోత్సాహం రెడ్డి జీవితాన్ని మార్చివేసింది అని చెప్పవచ్చు. చిత్రకళను అమితంగా ప్రేమించే అబ్దుల్ సతార్ సుభాని ఎందరో చిత్రకారులను హైదరాబాదు పంపించి తమ నైపుణ్యాలను పెంపొందించుకునెందుకు అవకాశాలను కల్పించేవారు . అదే రీతిలో శ్రీ రెడ్డిని కూడా పంపడం అతని జీవితాన్ని గొప్ప మలుపు తిప్పినట్లయింది. 1933 లో హైదరాబాద్ చేరుకున్న రెడ్డికి దారుల్ ఉల్ హైస్కూల్ ప్రవేశం లబించింది. కాని ఇంటినుండి ఎలాంటి ప్రోత్సాహం లభించని కారణంగా ఆర్ధికంగా ఎన్నో సమశ్యలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇదే సమయంలో రెడ్డి హాస్టల్ నందు జరిగిన ఒక స్కౌట్ కార్యక్రమంలో లార్డ్ బాడెన్ పౌల్ రూప చిత్రాన్ని వేసే అవకాసం రావడం అంతే గాకుండా బొంబాయ్ లోని చిత్రకళాశాలలో చిత్రకళా విద్యనభ్యసించదానికి అవసరమయ్యే స్కాలర్ షిప్ కూడా గెల్చు కోవడం ద్వారా తన కళను గురించిన కలను సాకారం చేసుకునే గొప్ప అదృష్టం రావడంతో మెట్రిక్యులేషన్ పూర్తి చేయకుండానే రెక్కలు కట్టుకుని బొంబాయి నగరంలో వాలిపోయాడు.

PT Reddy

బొంబాయి లోని విక్టోరియా టెర్మినల్ రైల్వే స్టేషన్ లో దిగిన రెడ్డికి ఎటు చూసినా భారీ కట్టడాలు రోడ్లపై పరిగెత్తుతున్న కార్లు, బస్సులు, లోకల్ రైళ్ళతో ఎంతో బిజీగా వున్న అక్కడి వాతావరణం అతనిని సంబ్రమాచార్యాలకు గురి చేసింది. బతుకు దెరువు కోసం ఎక్కడినుండో వచ్చిన జనంతో కిటకిటలాడుతున్న ఆ ఊపిరి సలపని గజిబిజి వాతావరణంలో ఎట్టకేలకు ఒక హోటల్ లో ఆశ్రయం దొరికింది. ఎంతో ఆశతో అక్కడికి వెళ్ళిన రెడ్డికి అప్పటికే ప్రభుత్వ చిత్రకళాశాలలో ప్రవేశాలు పూర్తి కావడంతో ఒక ప్రవేట్ సంస్థ అయిన నూతన్ కళామందిర్ లో చేరక తప్ప లేదు. అక్కడ చదువుతూనే ప్రతిష్టాత్మకమైన జే జే స్కూల్ ఆఫ్ ఆర్ట్ కళాశాలలో ప్రైవేట్ గా రెండవ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యి ఉత్తీర్నుడు కావడంతో జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నందు మూడవ సంవత్సరం కోర్స్ లో ప్రవేశానికి అవకాసం లభించింది. అక్కడ మూడవ సంవత్సరం చదువుతున్న కాలంలో నెలకొకసారి కళాశాలలో పి.టి. రెడ్డి చిత్ర ప్రదర్శన జరిగేది. నాటి కళాశాల సంచాలకుడు గెరాల్డ్ ఆ చిత్రాలను నిశిత పరిశీలన చేసి పలు సందర్భాలలో పి.టి రెడ్డిని ప్రసంశించేవారట. ఆపై బొంబాయి ఆర్ట్ సొసైటీ ప్రదర్శనలలో కూడా తన చిత్రాలను ప్రదర్శంచి 1937లోనే అక్కడ బహుమతిని అందుకున్నాడు. వీటితో పాటు పూనా, సిమ్లా, కలకత్తా, నగరాలలోని చిత్రకళా సంస్థలు నిర్వహించిన పోటీలలో కూడా పాల్గొంటూ వుండేవారు. ఐదో సంవత్సరం పరీక్షలలో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్నుడయిన రెడ్డికి మేయో స్కాలర్ షిప్ తో బాటు ప్రతిస్టాకరమైన కుర్సాట్ జీ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఆ రోజుల్లో బొంబాయి, కలకత్తా రెండు చిత్రకళా శాలలు కూడా యురోపియన్ భారతీయ సంవిధానం లోనే విద్య కొనసాగిస్తున్నప్పటికీ యురోపియన్ కళలనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి అన్న అభియోగం వుండేది. ఆ రెండింటి మధ్యా విపరీతమైన పోటీ వుంటున్న తరుణంలో రెండింటికి సమ ప్రాధాన్యతను ఇస్తూ తన సహజాత విచక్షణ మేరకు తన చిత్రకళా యానాన్ని కొనసాగించారు శ్రీ పి టి రెడ్డి.

చిత్ర రచన విషయంలో నియమాలకంటే తన అనుభూతి స్వేచ్చలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన రెడ్డి భిన్న విభిన్న రీతులలో చిత్రాలను రూపొందించాడు .మానవ సంభందాలను ప్రక్రుతితో పెనవేసుకున్న సంగతులను, ఆకలి భాదలను అలజడులను, హాహాకారాలను, సమాజ మునందలి వికృత రూపాలను, రాజకీయ క్రీనీడలను కుట్రలను కుతంత్రాలను ఇలా సమస్త విషయాలను రెడ్డి తన కాన్వాస్ పై ప్రతిష్టింపజేసి అన్ని స్థాయిల కళాకారుల యొక్క మెప్పును పొందగలిగాడు . 1941నాటికే తన చిత్రాలతో రెడ్డి పోర్ట్ పోలియోలను స్వయంగా ప్రచురించుకోగలగడం అతని ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

శ్రీ రెడ్డి చిత్రాలలో సింహభాగం ఆధునిక రీతికి చెందినవిగానే చెప్పుకోవచ్చు. ఒక సాధారణ సంఘటనను లేదా దృశ్యాన్ని ఫోటోగ్రఫి చేసిన పనిలా గాకుండా తనవైన రేఖలు రంగుల సౌజన్యంతో దృశ్యాన్ని సృష్టించి వీక్షకుడికి ఒక సరికొత్త కళా ప్రపంచాన్ని అతడు చూపించాడు. రైతు కుటుంభం, మేన్ అండ్ ది ఒమెన్,కిసాన్,సంగీతకారులు, రొమాన్స్, హ్యాండ్ ఇన్ హ్యాండ్. అలంకరణ, సాంగ్ ఆఫ్ లైఫ్ మొదలగు చిత్రాల రూప నిర్మాణంలోగాని రంగుల పొందికలో గాని చూడగానే మనసుని హత్తుకునే లక్షణం మనకు కనిపిస్తుంది . అటు తర్వాత వాత్సాయన, కొక్కోక, అనంగారంగా, హరిహర భద్ర, వంటి పూర్వీకుల భావాలకు రూపకల్పన చేసాడు.తాంత్రిక కళను సమకాలీన దృష్టితో అధ్యయనం చేయడానికి గాను భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ ఫెలో షిప్ తో పాటు నేషనల్ అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫెలో షిప్ కూడా పొందిన రెడ్డి చిత్ర కళలో వేలాదిగా డ్రాయింగులు, కుడ్య చిత్రాలు, బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు, గ్రాఫిక్ చిత్రాలు , దారు శిల్పాలు , సృష్టించి తన ప్రతిభను చాటుకున్నారు.

దేశంలోని ప్రధాన నగరాలతో పాటు లండన్ , జపాన్ ఆస్ట్రేలియా పశ్చిమ జర్మని తదితర యురఫ్ , ఆసియా దేశాలలో కూడా తన ప్రదర్శనలు నిర్వహించి తెలంగాణకి ఖండాంతర కీర్తి సాధించి పెట్టిన గొప్ప చిత్రకారుడు శ్రీ పి. టి. రెడ్డి. తనతో భావ సారూప్యత కలిగిన నాటి యువ చిత్రకారులు మాజిద్, ఎం. ఏ. భోస్లే, బాప్తిస్టా, ఎం వి , కులకర్ణి లతో కలిసి ది కాంటెంపరరీ గ్రూప్ ఆఫ్ పైంటర్స్ అనే సంస్థను కూడా స్థాపించి నిరంతరం చిత్రకళా కార్యక్రమాలను నిర్వహించేవారు ..యంగ్ టర్క్స్ అనే పేరుతో నాడు ఈ యువ చిత్రకారుల గ్రూప్ ప్రాచుర్యం పొందింది . 1942లో జరిగిన క్విట్ ఇండియాఉద్యమంలో పాల్గొన్న రెడ్డి స్వదేశీ స్పూర్తితో ఆనాటికి ఆంగ్ల వాసనలున్న తన పతకాలన్నింటిని తిరిగి ఇచ్చేసి తన దేశ భక్తిని చాటుకున్నారు. ఈ దశలో పది సంవత్సరాలు చిత్రకళకు దూరమవ్వాల్సిన పరిస్తితులేర్పడినాయి. ఈ సమయంలోనే లాహోర్ నందు లీలామందిర్ స్టుడియోలో పంచోలి పిక్చర్ కి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసారు. లాహోర్ వెళ్ళే ముందు బొంబాయి నందు తన గదిలో భద్రపరిచిన చిత్రాలన్నీ లాహోర్ నుండి మరలా తిరిగి వొచ్చేసరికి ద్వంశం చేసి వుండడం అతనికి తీవ్ర వేదన కలిగించింది . ఆ వేధనతోనే హైదరాబాదుకి చేరిన శ్రీ రెడ్డికి సరైన వృత్తి కూడా దొరకని సందర్భంలో కల్పనా ఇండస్త్రీస్ పేరుతో ఒక పర్నిచర్ షాపుని కూడా నడిపాడు . ఆర్ధికంగా స్తిమిత పడిన పరిస్థితుల్లో కళా శూన్యం తో గడిచిన దశాబ్ద కాలాన్ని పూరించడానికి మరలా చిత్ర కళాసృజనపై ద్రుష్టి పెట్టాడు. పదేళ్ళ సుదీర్గ విరామం తర్వాత బొంబాయి లోని ప్రతిష్టాత్మకమైన జహంగీర్ ఆర్ట్ గేలరీ లో ప్రదర్శన చేసాడు . హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ కి పంపిన చిత్రాలు కూడా వరుసగా మూడు బహుమతులు సొంతం చేసుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో చిత్రకళపై ద్రుష్టి పెట్టి భిన్న విభిన్న ప్రయోగాలతో చిత్రాలను సృష్టించడం జరిగింది.

PT Reddy art

జాతీయం గానూ అంతర్జాతీయంగానూ చేసిన ప్రదర్శనలలో శ్రీ రెడ్డి చిత్రాలు ఎన్నో కళాసంస్థల మరియు ఔత్సా హికుల సేకరణలో చేరాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి బకింగ్ హాం పేలస్ ,లండన్,న్యూ డిల్లినందలి రాష్ట్రపతి భవన్,ఎంబసీ ఆఫ్ జి.డి.ఆర్.,పార్లమెంట్ హౌస్, ఇంకా డిల్లి కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, నేషనల్ గేలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్,కేంద్ర లలిత కళా అకాడమీ న్యూడిల్లి, కర్నాటక, కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీలతో పాటు జే జే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బొంబాయి, అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కలకత్తా, హైదరాబాద్ స్టేట్ మ్యూజియం, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ హైదరాబాద్,సాలార్జంగ్ మ్యూజియం, ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్అండ్ క్రాఫ్ట్స్. న్యూ డిల్లి, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పండమెంటల్ రీసర్చ్ బొంబాయి,ఇంకా అవనిగడ్డ, గుంటూరు, హైదరాబాద్ లే కాక యునైటెడ్ కింగ్ డం, అమెరికా, యుగోస్లోవియా, పిలిపీన్స్ , ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, జర్మనీ ఆస్ట్రేలియా తదితర దేశాలనందు వివిధ ప్రైవేట్ వ్యక్తుల సేఖరణలో కూడా వీరి చిత్రాలు వుండడం గొప్పవిషయం. భారత ప్రభుత్వం వెలువరించిన ఇయర్ బుక్ 1976 లో సమకాలీన భారతీయ చిత్రకారుని పై నమోదు చేయబడ్డ ఏకైక ప్రచురణ పి టి రెడ్డిది కావడం ఎంతో గొప్ప విషయం.

కళ ప్రజల కోసం అని భావించే రెడ్డి తన ఎనబై ఏళ్ళ సుధీర్గ కళాయానంలో ప్రతిభంధకాలెన్ని ఎదురైనా తన అనితర సాధ్యమైన మైన కృషి పట్టుదలతో తెలుగు చిత్రకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఈ అసమాన ప్రతిభాశాలి 1996 అక్టోబర్21 నాడు శాశ్వత రంగుల లోకంలో విలీనమైనప్పటికి అతను సృష్టించిన కళా ప్రపంచంనందలి రంగుల పరిమళాలు మనల్ని ఎల్లవేళలా మురిపిస్తూనే వుంటాయి.
-వెంటపల్లి సత్యనారాయణ

2 thoughts on “అంతర్జాతీయ తెలుగు చిత్రకారుడు పి.టి. రెడ్డి

  1. పిటి రెడ్డి గురుంచి నేను పేరు వినడమే గాని
    సమగ్రంగా తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను.

    వాళ్ల జీవితాలనుండి మనం నేర్చుకోవలసినది
    చాలా వుంటుంది.దన్యవాదాలు.

  2. పిటి రెడ్డి గురించి తెలియచేసినందుకు
    దన్యవాదములు మరియు అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap