అంతర్జాతీయ నృత్య దినోత్సవం

అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడింది. ఈ ‘అంతర్జాతీయ నృత్య దినోత్సవం ‘ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు.

నాట్యాభ్యాసం నాడు-నేడు
భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. హైందవ సనాతన ధర్మం ప్రకారం గురువే ప్రత్యక్ష దైవం. పరమాత్మ స్వరూపం. వేద పురాణేతిహాసాలు, సద్గురువు చరిత్రలో గురుస్వరూపం, మహిమ, ఔన్నత్యాలను సమగ్రంగా దర్శించవచ్చు. ఇక అనాదిగా, అనుచానంగా వస్తున్న గురుశిష్య పరంపరను కూడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంది. వాస్తవానికి గురుశిష్యులిద్దరూ సమాన శక్తివంతులేనని, తాను బద్దుడనే అజ్ఞానం మాత్రమే శిష్యుడిని గురువునుండి వేరు చేస్తుందనీ, గురువు తన అనుభవంతో ఈ అజ్ఞానాన్ని తొలగించినపుడు శిష్యుడి భ్రమ తొలగిపోయి నిజమైన జ్ఞానముదయిస్తుందని సద్గురువుల చరిత్రలు ప్రభోదిస్తున్నాయి. ప్రాచీన కాలము నుండి ఏ విద్యనైనా గురుముఖంగానే అభ్యసించాలన్నది సనాతన సంప్రదాయం. ఈ సంప్రదాయాను గుణంగానే అవతార పురుషులు సైతం గురువులను ఆశ్రయించి విద్యార్జన చేసారనే వృత్తాంతాలు పురాణాల్లో పుష్కలంగా కనిపిస్తాయి. అలాగే చక్రవర్తులు, రాజులు తదితర వర్గమంతా గురువుల వద్దనే విద్యనభ్యసించ రనడానికి చరిత్ర పుటలు చాలా ఉన్నాయి. కాలక్రమేణా విద్యార్జన ఆధునికతను జోడించుకున్న నేపథ్యంలో గురుకుల పద్ధతి దాదాపు కనుమరుగు కాగా ఒక్క నాట్యకళ విషయంలో మాత్రం 20వ శతాబ్దం వరకు గురుకుల పద్దతి కొనసాగింది. ఈ పద్ధతిలో నాట్యకళను బోధించిన  భరతనాట్య కళాకారిణి గురించి తెలుసుకొందాం.

శ్రీమతి రుక్మిణీదేవి ఆరుండేల్ (భరత నాట్యము)

శ్రీమతి రుక్మిణీదేవి ఆరుండేల్ చరిత్రలో చెప్పుకోదగిన నర్తకీమణులలో ప్రముఖురాలు. ఈమె సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1904లో జన్మించారు. సదాచారపరులు. వీరి కాలంలో నాట్యాన్ని పురుషులుకాక స్త్రీలు చేయటం అంటే కేవలం దేవదాసీ స్త్రీలు చేయడమే.. అటువంటి సమయంలో దేవదాసీలు దైవత్వాన్ని కోల్పోయి ఉంపుడుగత్తెలై సమాజంలో గౌరవాన్ని కోల్పోయి ఉన్నారు. ఈ తరుణంలో శ్రీమతి రుక్మిణీదేవి గారు ప్రదర్శనలు ఇవ్వడమే కాక భరతనాట్యాన్ని ఉన్నతమైన స్థానంలో నిలపడానికి కారకులైనారు. భరతనాట్యానికి ఒక దైవత్వాన్ని కల్పించిన ఘనత ఈమెది. వీరి నాట్య సేవ ప్రదర్శనలతో ఆగక 1936లో గురుకుల పద్ధతిన కళాక్షేత్రాన్ని కూడా స్థాపించారు. మైసూర్ వాసుదేవాచారి, టైగర్ వరదాచారియార్, మీనాక్షి సుందరం పిళ్ళైలు వీరికి మంచి ప్రోత్సాహాన్ని అందించారు. అంతేగాక శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు సి.పి. రామస్వామి అయ్యర్లు వీరి అభివృద్ధిని కాంక్షించారు. 1936 నుండి ఇప్పటి వరకు నిరవధికంగా కాలానుగుణంగా అభివృద్ధిచెందుతూ నిత్యనూతనంగా విరాజిల్లుతున్న గురుకుల కళాక్షేత్రముగా శ్రీమతి రుక్మిణీదేవి స్థాపించిన కళాక్షేత్రమును పేర్కొనవచ్చును.

1952 ఏప్రిల్‌లో రుక్మిణీదేవి రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది.
రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం “పద్మభూషణ్” తోను, శాంతినికేతన్ “దేశికోత్తమ” బిరుదుతోను ఆమెను సత్కరించాయి. భరతనాట్యానికి గుర్తింపు, గౌరవాన్ని కలిగించి, దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీదేవి అరండేల్ కు ప్రధాన పాత్ర ఉంది. కళాక్షేత్ర విద్యార్ధులు అనేకమంది నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్నారు.

కాలక్రమేణా గురుకుల పద్ధతిలో మహోన్నతంగా సాగిన నాట్యాభ్యాస ప్రక్రియ కేవలం కొంత సమయాన్ని కేటాయించి విద్యార్థులకు నేర్పే స్థితికి సరిపెట్టుకోవలసి వచ్చింది. విద్యార్థులు అభ్యాసవిషయంలో గురువునకే ప్రాధాన్యతను ఇచ్చేవారు. గురువును గౌరవిస్తూ ప్రదర్శనా తొందరకన్నా విద్యను ఆసాంతం నేర్చుకోవాలనే కోరికనే కలిగివుండేవారు. ప్రదర్శనలు అప్పుడప్పుడు జరిగేవి కాని మంచి ప్రమాణాలు కలిగి జనరంజకంగా సాగేవి. ఈ క్రమంలో కూడా నాట్యమూలాలను ఏ గురువూ వదలలేదనే చెప్పవచ్చు. రాను రాను ప్రదర్శనకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా కొందరు గురువులు ప్రేక్షకులను ఆకర్షించడానికై శాస్త్రీయనృత్య ప్రదర్శన మధ్యలో ఎంకిపాటలను, జానపద పాటలను చేర్చి ప్రదర్శన ముగించిన రోజులు లేకపోలేదు.

తరువాత శాస్త్రీయ కళలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. సంగీత నృత్య కళాశాలలను స్థాపించి లలితకళలను నేర్చుకునే అవకాశాన్ని ప్రజలకు అందించాయి. కానీ నాట్యం యందు ప్రతిభ కలిగి దానినే వృత్తిగా చేసుకొనే వారి సంఖ్యకు తగిన ఉద్యోగా వకాశాలను, ప్రదర్శనా అవకాశాలను కల్పించలేక పోయారు. అందుకే దీనిని వృత్తిగా తీసుకున్న వారికంటే, ప్రవృత్తిగా తీసుకున్నవారే ఈ కళలో ఉన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతున్నారనడం తప్పు కాదేమో.

ప్రస్తుతం లలిత కళలన్నీ కళాశాల విద్యలుగా ప్రకాశిస్తున్నాయి. కళాశాలలో నియమిత కాల పరిమితిలో, నియమిత అంశాలను బోధించాలనే నిబంధనతో నాట్యాభ్యాసం కొనసాగుతుంది. ఆచార్యులను, కళాశాలలు నియమిస్తాయి, కాబట్టి ఈ కళాశాల పద్ధతిలో గురువును యెంచుకొనే అవకాశం శిష్యులకు లేదు.
కళాశాలలో ఒక విద్యార్ధి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడా లేదా అన్న ప్రసక్తి కంటే ఆ అంశాన్ని నియమిత కాలంలో అందరికీ బోధించామా లేదా అన్నదే ఆచార్యులకు అనివార్యమవుతోంది. ఒక విద్యార్థి క్షుణ్ణంగా విద్యను అభ్యసిస్తేనే గురువుగా తన ప్రస్తాన్నాన్ని మొదలుపెట్టాలి అని నిర్దేశించే అవకాశం ఇక్కడ గురువుకు లేదు. కళాశాల యందు కొంతమేర అభ్యాసానికి వచ్చే కొన్ని మార్కులతో శిష్యుడు ఒక గురువుగా సమాజంలో అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు.

అయితే కళాశాలలో ఒకే కాలంలో వేరు వేరు అంశాలను వేరు వేరు గురువులు బోధిస్తారు. ఏ గురువుకైనా ఆ విద్యలో తనకంటూ ఒక ప్రత్యకమైన ప్రతిభ ఉంటుంది. కాబట్టి తెలివిగల, ప్రతిభగల శిష్యులు ఆ గురువుల వద్ద ఉన్న ప్రత్యేకతలను ఆకళింపు చేసుకునే అవకాశం దక్కుతుంది. ఇది కళాశాల విద్యలో మాత్రమే దక్కే చక్కని అవకాశం. ఇక్కడ కాలం, పరిమితం కాబట్టి, గురు-శిష్య సంబంధానికి అంత ప్రత్యేకత లేకపోయినా తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను నేర్చుకునే అవకాశం దొరుకుతుంది.

ప్రస్తుతం నాట్యగురువులు, విద్యార్థులు కూడా నాట్యం పట్ల మక్కువను పెంచుకుని అంకితభావంతో “ఇది మన భారతీయ సంస్కృతి, దీనిని తరువాతి తరాలకు అందించే వారధులం మనం” అని గుర్తించి నాట్యం యొక్క శాస్త్రీయతా మూలాలను వదలకుండా జాగ్రత్తగా తరువాతి తరాల వారికి అందించాలి. ఎందుకంటే ప్రస్తుత సమాజం మొత్తం సాంకేతిక ప్రవాహంలో కొట్టుకుపోతోంది. అన్నిటితోపాటు నాట్యం అనే అంశాన్ని కూడా ఇది తాకింది. దానితో యూట్యూబ్లు తామే ఒక గురువుగా దర్శనమిస్తున్నాయి. కానీ సాంకేతికతకు అంతుచిక్కని మూలాలు, భగవత్ ప్రసాదితమైన ఒక అంశ ఈ నాట్యంలో ఉందని గుర్తించాలి. కాబట్టి గురువే ప్రత్యక్షంగా శిష్యులలోని లోపాలను, లోటుపాట్లను సరిదిద్దుతూ వారిని ఒక శిల్పంగా మార్చగలడు కానీ ఇది వేరొకరు చేయగలిగిన పనికాదు.

అందుకే వేదనంహితమైన నాట్యకళకు యూట్యూబు ఎంత మాత్రమూ గురువులు కాలేవు. కానీ నాట్యం నేర్చుకునే చిన్నారులు అనేకమంది ప్రముఖుల, ప్రతిభావంతుల ప్రదర్శనలను చూసి ప్రేరణ పొంది, వారు నేర్చుకునే విద్యకు మెరుగులు దిద్దుకునే చక్కని అవకాశాన్ని కలిగిస్తున్నాయి ఈ యూట్యూబు.

ఏది ఏమైనా భరతముని మొదలుకొని అనేకమంది గురువులు తమ జీవితసర్వస్వాన్ని ధారపోసి మనకు అందించిన ఈ నాట్యకళకు కళాకారులందరూ కంచు గోడలా నిలబడి దానియొక్క శాస్త్రీయతా మూలాలను చెక్కుచెదర నీయకుండా చూడాలి. ఇది ఈతరం నాట్యకళాకారులందరి బాధ్యత. “నాణ్యత” అన్నది చెదరనంతకాలం “నాట్యం” ఈ ప్రపంచంలో తన అందెలన వ్వడులతో అందరినీ ఆనందడోలికలో ఊగిస్తుందనడంలో సందేహం లేదు.

-డి. కనక విజయలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap