మాతృభాష కోసం ప్రాణాలర్పించిన భాషా ప్రేమికుల భూమి బంగ్లాదేశ్. ప్రపంచానికి భాషాపరంగా ఆదర్శప్రాయమైన దేశం. భారతదేశ విభజన సమయంలో ఈనాటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఒక భాగంగా ఉండేది. దాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. ఉర్దూ జాతీయ భాషగా గుర్తించిన పాకిస్తాన్. బంగ్లాదేశ్ లో కూడా ఉర్దూ అధికార భాష అయింది. కానీ బెంగాలీ మాతృభాషగా గల బంగ్లాదేశ్ వారు అందుకు వ్యతిరేకించారు. ఉద్యమించారు మాతృభాష కోసం బెంగాల్ లో అనేక పోరాటాలు జరిగినాయి. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. 1952 ఫిబ్రవరి 21న ఢాకా లో ఉద్యమకారులపై కాల్పులు జరిగినాయి. నలుగురు ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అంతర్జాతీయ సమాజాన్ని కలిచివేసింది. ఒక భాష వారిపై మరొక భాషను రుద్దడం నీచమైన చర్యగా ఎందరో భాషాభిమానులు వ్యతిరేకించారు. ఫిబ్రవరి 29, 1956 న పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి అధికార భాషగా బెంగాలీని గుర్తించింది.
బంగ్లాదేశ్ ప్రజలు ఈ రోజుని SHOHID DIBOSH లేక SHAHEED DAY గ జరుపుకుంటారు. “భాషోద్యమ అమరుల సంస్మరణ దినం”అని దీని అర్థం. న్యూజిలాండ్ భాషలో Aotearaoa (మనందరం సంబంధీకులం) అనే పదాన్ని 30 ప్రపంచ భాషల్లోకి అనువాదం చేసి ఆ దేశ మాతృభాష ప్రచారం చేసింది. ఆస్ట్రేలియా ఆష్ఫీల్డ్ పార్క్ సీడ్నీలో “అంతర్జాతీయ మాతృభాషా స్తూపం” నిర్మించింది.
భారతదేశం, మలేషియా, కెన్యా ఇంకా మరికొన్ని తూర్పు ఆసియా దేశాలలో ప్రజలు ఇంగ్లీష్ వ్యామోహంలో మాతృభాష పట్ల నిరాదరణ ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులు మాతృభాషలో వెనుకబడి పోతున్నారు. అందుకు కారణం మాతృభాషపై మమకారము లేకపోవడమే.
పాఠ్యాంశాన్ని ఇంగ్లీషులో చదవడం దానికే పరిమితం కావడం. మాతృభాషలో వెనుకబడి ఉండడం వల్లనే, ఆలోచనాశక్తి భావవ్యక్తీకరణ, సృజనాత్మకత లేక విద్యార్థుల ఎదుగుదల కుంటుపడుతుంది. అభివృద్ధి ఆగిపోయే ఆస్కారం ఉన్నది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న యొనెస్కో సంస్థ ప్రభుత్వాలకు, పాలనా వ్యవస్థలకు, విద్యారంగ ప్రముఖులకు మాతృభాష అవసరం గూర్చి నొక్కి చెప్పింది.
మాతృభాషలోనే విద్యాబోధనను మేము ప్రోత్సహిస్తున్నాం. అది నిరక్షరాస్యతను రూపు మాపుతుంది. మంచి చదువు అలవడుతుంది.
మాతృభాష అవసరం చాలా ఉన్నది. మాతృభాషలోనే విద్యాబోధన స్వజాతి భాషను, పరిజ్ఞానం, సంస్కృతులను పరిరక్షించి భావితరాలకు వారసత్వాలు గా ఇవ్వడం కుదురుతుంది. అప్పుడే భాషకు ఉన్నతస్థితికి చేరుతుంది… అంటూ యొనెస్కో పేర్కొన్నది. “బహు భాషా ప్రపంచంలో మాతృభాషలోనే ప్రాథమిక విద్య” అనేది ఈ యొనెస్కో సంస్థతో పాటూ ప్రపంచ మేధావులు చెపుతున్నారు.
శాస్త్రవేత్తలు చూపించిన మార్గం ఇది. విద్యా మాధ్యమంగా ఏదైనా మాతృభాషను సమానంగా నేర్పించాలి. పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. భాష పట్ల ద్వేషం పెంచకూడదు, ప్రేమను పంచాలి. గౌరవించాలి. వ్యవస్థలు మారాలి. గాంధీ చెప్పినట్లు “మాతృభాష తృణీకారం మాతృమూర్తి తిరస్కారమైన విద్యారంగంగా గ్రహించాలి”అని చెప్పారు.
మన భాషలో తెలుగును ఆధునికీకరించుకొని గౌరవించుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత,శాస్త్ర జ్ఞానాన్ని తెలుగులోకి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బ్రతుకు కోసం ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషను మర్చిపోయేంతగా కాదు. తెలుగు మాట్లాడడం నేడు అవమానంగా భావిస్తున్నాం. మన భాషను మనమే తక్కువ చేస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం. భాషతో పాటు సంస్కృతి సంప్రదాయాలను వదిలేస్తున్నాం అన్న విషయం మనకు తెలియడం లేదు. పరోక్షంగా దీనిపై ప్రభావం చూపుతుంది.
ఈ సమస్య నుండి మనం భాషను కాపాడుకోవాలంటే, భాషావేత్తలు, సాహితీకారులు, భాషాభిమానులు మరియు ప్రభుత్వము పరిష్కార మార్గాలు వెతకాలి. అలా చెయ్యకపోతే భావితరాలకు మన భాషను సజీవంగా అందించలేము. మన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఆంగ్లాన్ని ఆహ్వానిద్దాం మంచిదే. కానీ మన తెలుగును ప్రమాదంలో నెట్టడం ఏమాత్రం మంచిది కాదు. “ఈ ప్రపంచంలో తెలుగు మాధ్యమంలో చదువుకొనే అవకాశం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఏ కేరళలోనో, మధ్యప్రదేశ్ లోనో లభించదు”… కావున ప్రతి తెలుగు వాడు తెలుగుభాష పరిరక్షణ కుటుంబం బాధ్యతగా గుర్తించి ముఖ్యంగా తల్లులు తన పిల్లలకు మాతృభాషలో మమకారాన్ని పంచితే, మన భాషను కాపాడుకోగలం. తెలుగును తర్వాతి తరాలకు అందించగలం. లేకుంటే మూకుమ్మడిగా తెలుగుజాతి అంతా తెలుగుభాషా ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతాం.
-కొప్పుల ప్రసాద్