ఏప్రిల్ 18, ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా …
మ్యూజియం అంటే ఏమిటి? దానివల్ల మనకొనగూడే ప్రయోజనం ఏమిటి? అది ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి?
మ్యూజియం ఒక సంస్కృతి నిలయం. ఒక సాంస్కృతిక దర్పణం. అద్దంలో మనం చూస్తే ఏం కనిపిస్తుంది? మనం కనిపిస్తాం. మ్యూజియంలో చూస్తే మన తండ్రులు, తాతలు, పూర్వీకులు అందరూ కనిపిస్తారు. మనం ఈనాడు ఇలా ఆనందంగా ఉండటానికి వారు పడ్డ శ్రమ, చేసిన కృషి సృజనాత్మకత అంతా మ్యూజియంలో తేటతెల్లమవుతుంది. ఆకాశంలోనికి దూసుకుపోయిన చిటారు కొమ్మలోని చివురుటాకు తనకు సాయాన్ని అందిస్తున్న వేళ్ళ ఉనికిని మరిచిపోదుకదా! మనలో ఎందుకు ఆ ఉపేక్షాభావం?
వ్యక్తిగత జీవితం గందరగోళం. వర్తమాన జీవితం సమస్యల సుడిగుండం. భవిష్యత్తు భయానకం. వీటి నుండి మనకి ఊరట కావాలి. ఆ ఊరట కలిగించేదే కళ. శరీర ఊరట తగ్గించటానికి నిద్ర ఎంత ముఖ్యమో మానసిక ఊరట ఉపశమించటానికి కళలు కూడా అంతే ముఖ్యం. నిజమైన కళ మనస్సును శుభ్రపరుస్తుంది. తిరిగి జీవన పోరాటానికి రెట్టించిన ఉత్సాహంతో మనల్ని సంసిద్ధులను చేస్తుంది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం జీవితాన్ని ఎంత సుఖమయం చేశాయో అంతగా విషయలంపటం అనే సుడిగుండంలోనికి మనల్ని నెట్టేస్తుంది. ఆధునిక మానవుడు ఒంటరిగా మిగులుతున్నాడు. తనలో తానే కృంగిపోతున్నాడు. కళకు, ప్రజలకు మధ్య ఎడబాటు పెరిగింది. మనిషి నేను నుంచి మనం నుంచి మనందరంలోనికి మారాలి. తన అభిప్రాయ అభిరుచులను అందరితో పంచుకోవాలి. అది అనేక కళారూపాలలో బహిర్గతమవ్వాలి. ఆదిమానవుడు గుహలలో చిత్రాలు ఎందుకు గీశాడు? ఎందుకంటే వేయాలనుకున్నాడు, వేశాడు. కళ తిండి, బట్టను ఇవ్వదు. అది నిద్ర, తిండి, మైథునంలానే ఒక బయాలాజికల్ అవసరం. అటువంటిదే కళ. కళ యొక్క సాంఘిక అవశ్యకత, ప్రయోజకత్వాలపై అనేకసార్లు అనేకకాలాల్లో చర్చ జరిగింది. భవిష్యత్తులోనూ జరగబోతుంది. ఆ చర్చ అనంతం. కళను సృష్టించినవానిలోనే కాదు స్వీకరించేవానిలో కూడా సౌందర్యదృష్టి ఉండాలి. సృష్టించడం, ఆస్వాదించటం సమానంగా ప్రయాణించాలి. ఇప్పుడు మనలో కళను స్వీకరించే స్థాయి అంతగా లేదు. మనం ఇంకా కేలండర్ ఆర్ట్ స్థాయిలోనే మిగిలిపోయాం . కళారూపాలు సాహిత్యం , సంగీతం, నాట్యం, చిత్రం, శిల్పంలో ఏదైనా కావచ్చు. వీటన్నిటినీ వస్తురూపంలో భద్రపరిచే కళారూపమే మ్యూజియం. అక్కడ ఉన్నవి మన ప్రాచీన జ్ఞాపకాల మంజూషలు. ప్రముఖులైన ఎందరో కళాకారులు ఇక్కడి గోడలపై సేదతీర్చుకుంటున్నారు.
మ్యూజియం ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి?
దుమ్ము, ధూళి, వేడి, బొగ్గుపులుసు వాయువు ఇవి తైలవర్ణ చిత్రాలకు ప్రథమ శత్రువులు. వీటివల్ల రంగులు వివర్ణమవుతాయి. తైలవర్ణ చిత్రాలలోని తెలుపురంగు క్రమేపీ తమ స్వచ్ఛతను కోల్పోయి పసుపు రంగులోకి మారుతుంది. గది లోపల శీతోష్ణస్థితి ఏ ఋతువులోనైనా 25° డిగ్రీల సెంటీగ్రేడ్ ను మించి ఉండకూడదు. మ్యూజియం ఒక పార్కులో చెట్ల మధ్య నిర్మించటం అన్ని విధాలా శ్రేష్టం. చెట్లు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చి ఆక్సిజనను వదలి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. నాలుగురోడ్ల కూడలిలో, ఎక్కువ ట్రాఫిక్ ఉన్నచోట, రోడ్డుకు ఆనుకుని ఉండేచోట మ్యూజియం నిర్మాణం జరగకూడదు.
ప్రతి నగరానికి లంగ్ స్పేస్ అనే పేరుతో 50 నుండి 100 ఎకరాల స్థలం గార్డెన్ గా డిజైన్ చేయబడాలి మ్యూజియం అక్కడే నిర్మించాలి. దీనిని సోలార్ పవర్ ద్వారా ఎయిర్ కండీషన్ చేయగలిగితే మరీ మంచిది. మ్యూజియం హాల్ లో రెండు గోడల మధ్య వెడల్పు కనీసం 20 అడుగులు ఉండాలి. ఎత్తు 14 అడుగులు ఉండాలి. అక్కడక్కడా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను అమర్చాలి. గోడలన్నీ తెల్లటి నేపథ్యంలో ఉండాలి. చిత్రాలను శిల్పాలను ఎవరూ తాకకుండా ఒక రక్షణ బారికేడ్ ఉండాలి. ఒక సిగ్మంట్ లో నుండి మరొక సిగ్మం లోనికి వెళ్ళడానికి 25 మంది కంటే ఎక్కువ మందిని ప్రవేశించడానికి అనుమతించకూడదు. ఎగ్జిబిషన్లోని చిత్రాలు వస్తువులు కానలాజికల్ ఆర్డర్ లో ఉండాలి. ప్రాచీనమైనవి ముందు గదులలో ఉంచాలి. ఉదయం లేస్తూనే మంగళకర వస్తువులను చూడాలని భారతీయ తత్త్వశాస్త్రం పేర్కొంది. కాబట్టి మ్యూజియం మొదట్లో చావు దుఃఖం, భేదం మొదలైనవి చూపించే చిత్రాలు మ్యూజియం మొదట్లో ఉండకూడదు.
పూర్వం ప్రతీ కళావిభాగానికి అకాడమీలు ఉండేవి. కొన్ని కారణాలవల్ల అకాడమీలు రద్దుచేయబడి తెలుగు యూనివర్శిటీ ప్రారంభించబడింది. కళలకు సంబంధించిన అన్ని శాఖలు ఆ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ క్రింద తీసుకురాబడటంతో ఆ వ్యక్తి యొక్క ఇష్టాఇష్టాలను అనుసరించి మిగిలిన విభాగాలు పనిచేశాయి. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత తిరిగి అకాడమీలను పునఃప్రతిష్టించాలి. ప్రతీ కళకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. 1960-70ల మధ్య కేంద్ర ప్రభుత్వం లలిత కళావిభాగం, రాష్ట్ర లలిత కళావిభాగం లబ్దప్రతిష్ఠులైన చిత్రకారులు, శిల్పకారులపై కొన్ని మోనోగ్రామ్స్ ను ప్రచురించాయి. ఇందులో ఆయా వ్యక్తులకు చెందిన జీవితం, వారి సేవలు వీలైనంత క్లుప్తంగా చెబుతూ కొన్ని వర్ణచిత్రాలను ప్రచురించేవారు. వీటిని అతి తక్కువ ధరకు అమ్మేవారు. ఈ ప్రయత్నం తిరిగి ప్రారంభించాలి. వెంటనే ఒక వెబ్ సైట్ ను కాని, ఫేస్టును ప్రారంభించాలి.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మ్యూజియంలు రెండు. మొదటిది లూర్ మ్యూజియం, పారిస్. ఇది రినయ్ జాన్స్, క్లాసికల్ విభాగాలకు చెందిన చిత్రకళా భవనం. రెండొవది ఎమ్. ఒ.. ఎమ్. అంటే మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్. ఇది న్యూయార్క్ లో ఉంది. ఇది కేవలం ఆధునిక, అవ్యక్త చిత్రకళకు సంబంధించినది. దీనిని రూపొందించినవారు ఫ్రాంక్ లాయిడ్. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నారదశిల్పం అనే ప్రాచీన గ్రంథంలో ప్రదర్శితమయ్యే చిత్రశాల వృత్తాకారంలో విశాలంగా ఉండాలని చెబుతోంది. చిత్ర ప్రదర్శన జరుగుతున్నప్పుడు సుగంధ ద్రవ్య పరిమళాలతో ఆ శాల శోభించాలని భారతీయ చిత్రకారుడు పేర్కొన్నాడు. ఎమ్. … ఎమ్. ఆ విధంగానే డిజైన్ చేయబడింది.
– కాండ్రేగుల నాగేశ్వరరావు
🌷🙏🌷very good article