జగన్నాథ పండిత రాయలు నవల యాద్రుచ్చికంగా డాక్టర్ పూర్ణచంద్ గారి టేబుల్ మీద చూసి పేజీలు తిరగేస్తూ ఉంటే చదవాలనే ఇచ్ఛ కలిగి, వారిని అడిగి, తీసికొని చదవటం మొదలు పెట్టాక మధ్యలో ఆపలేనంత ఉత్సుకత కలిగించి, చదివించింది. అంత్యంత ఉత్సాహం కలిగించింది. మృదువైన విహారిగారి చేతి నుంచి ఒక వీర సాహస కవి జగన్నాథ పండితరాయలు కథ అద్భుతం.
పొట్ట చేత పట్టుకొని లోక సంచారము చేస్తూ దక్షిణ ప్రాంతంలో అవమానము పొందియున్నా, తండ్రి సలహాతో ఉత్తర ప్రాంతంలో తన సాహస ధైర్యముతో, పాండిత్య ధీధిషణతో పండిత సమాజమును, రాజుల మెప్పు, గౌరవ అధికారులు పొందిన ఘనుడు. ముఖ్యంగా జహంగీర్ పాదుషా, షాజహాన్ పాదుషాల మెప్పు పొందటం, కుడి భుజంగా, సలహాదారుగా ఉండి, అటు పరిపాలన, ఇటు ఉత్తమ శిష్య పరంపర కలిగి ఉండటం పండిత జగన్నాథ రాయలుకే చెల్లు. అనేక ప్రసిద్ధ రచనలు చేశారు. అందులో గంగాలహరి ఈనాటికీ కాశీ ఘాట్ లలో విన పడుతుంది సంధ్యవేళ. పంచలహరులు, ఇంకా అనేక రచనలు వ్రాసిన ఈయన, గొప్ప మేధతో పాటు, మహాజ్ఞాని, తత్వవేత్త, కళాహృదయుడు. అనేక విషయాలలో పండితుడు.
3 నెలల వ్యవధిలో అరబ్బీ, పారశీకం, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించి మౌల్వీ లను అలవోకగా చర్చలలో ఓడించి, సంస్కృతం దేవ భాష అని, అరబ్బీ కన్నా పురాతనమైన వేదభాషగా ఢమరుకం వాయించుచు, వచ్చే శబ్దము లతో ఋజువు చేసాడు. జయసింహ మహారాజు చే కవి సార్వభౌమ బిరుదు, సన్మానం, మహారాజా కళాశాలలో ప్రధాన ఆచార్య పదవి పొందిన, జగన్నాథుడు సయ్యద్ అనే ముస్లిం కుర్ర వానికి సంస్కృత భాష నేర్పడం, కాశీ పండిత వర్గాల తో ఘర్షణ, గెలుపు, హిందూ ముస్లిం మత ఘర్షణలు నివారించేందుకు సర్వ విధాలా కృషి చేశాడు.
జహంగీర్ పాదుషా జగన్నాథుని ప్రతిభకు మెచ్చి, సన్మానము చేసి, పండిత రాయలు బిరుదు, తన ఆస్థానంలో అత్యున్నత ధర్మాధికారి పదవి, మరియు, ముఖ్య సలహాదారునిగా చేసుకుని, ఒక పాఠశాల నిర్మించి ఇవ్వడం, రాజకీయ పరిణామాలలో, ఖుర్రం షాజహాన్ పాదుషా కావటానికి కారకుడగుటయే కాక, తానే ముహూర్తం నిర్ణయం చేసాడు జగన్నాథ పండిత రాయలు. రెండు తరాల మొగల్ పాలనకు సాక్ష్యీభూతుడుగా ఉన్నాడు.
అతని తెగువ వల్లనే నూర్జహాన్, ఆమె బిడ్డ ప్రాణములు రక్షించుకొనగలిగారు. ముఖ్యంగా దారాషకోవ్ తో పండిత రాయల గురుశిష్య సంబంధం, ఉపనిషత్తులు, భగవద్గీత యోగవాసిష్టం వారి భాషలోకి అనువదించేలా ప్రోత్సాహం అందివ్వడం, పాదుషా కుడి భుజంగము ఉండి తగిన సలహాలు అందించటం, చివరి రోజులలో తన కుడి భుజం అయిన భార్య మరణం, దారాషకోవ్ ను సోదరుడు ఔరంగజేబు మత ఛాందసుడై, కిరాతకంగా చంపటం, పాదుషాని జైలులో చూడవలసి రావటం, తనకు అండగా ముందు నుంచి ఉన్న ఆసఫ్ ఖాన్ మరణ వార్త, తన ప్రియమైన వారిని కోల్పోయిన దుఃఖము వెన్నంటి, శిష్యులతో కాశీలో చివరి దశ గడపటం ఎంతో హృద్యంగా మనకు అందించారు.
పాత్ర చిత్రణలో విహారి గారి ఔన్నత్యము, ఔచిత్యం కనిపిస్తుంది. ఎక్కడా పాత్రలు పరిధి దాటి నడవవు. ఉన్నత విలువలతో చరిత్రకు చక్కని రూపం ఇచ్చారు. ఇంకా రాయవలసిది ఉన్నా, ఒక చరిత్ర నవలాభిమానిగా, వయస్సులో చిన్న దాన్నిగా వారి కృషికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
వెల: రూ. 200/
ప్రతులకు: ఎమెస్కో బుక్స్
-శిపురపు అన్నపూర్ణ
నమస్తే… చాలా సంతోషం. మంచి సమీక్ష.
అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు..