జంపాల చౌదరి గారు 2004లో అనుకుంటాను అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు తాను మొదలెట్టబోతున్న ‘తెలుగునాడి’ మంత్లీకి ఎడిటర్‌ను వెతకడానికి.
జంపాల గారు అమెరికాలో సుప్రసిద్ధ, సీనియర్ సైకియాట్రిస్ట్. ఆ సమయంలో అక్కడాయన చాలా బిజీగా ఉన్నారు. డబ్బు సంపాదిస్తున్నారు. పత్రిక పెట్టడం తలనొప్పి అని తెలుసు. డబ్బులు పోతాయని తెలుసు. తెలుగువారికి పత్రికలను మూతేయించడంలో విశేష ప్రావీణ్యం ఉందని కూడా తెలుసు. కాని ఆయనకు తెలుగంటే ప్రేమ. కథంటే మమకారం. తెలుగువారికి నాణ్యమైన ఒక పత్రిక అమెరికాలో ఉంటే బాగుండుననే అభిలాష. ఇద్దరు కొడుకులకు ‘నన్నయ’, ‘వేమన’ అని పెట్టుకున్న వ్యక్తి ఇలా ఆలోచించడంలో వింత లేదు.
వారినీ వీరినీ వాకబు చేసుకున్నాక ‘తెలుగునాడి’కి నన్ను ఎడిటర్ అని అనుకున్నారు. అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో బంగారంలాంటి ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ రైటర్‌గా ఉండటమే నాబోటి వారికి సరైన పని అనుకుంటూ ఉండగా… రోజులో నాలుగ్గంటలు పని చేస్తే చాలు మంచి జీతం ఇస్తాము… ఇక్కడి నుంచి మేగజీన్ తయారు చేసి పంపితే అమెరికాలో ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము అని ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాని ఆ సమయంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా ఉన్న కె.రామచంద్రమూర్తి గారు నన్ను ఆపారు. రెగ్యులర్ జర్నలిజంలో ఉండటమే మంచిదనీ కావాలంటే ఆ పత్రిక పని కూడా చేసుకోమని హితవు పలికారు. అది నా కెరీర్‌కు సంబంధించి చాలా విలువైన సూచన. కాని ‘తెలుగునాడి’ పని కూడా ఎలా మానుతాను? జంపాల గారు కూడా నా కథలకు సంబంధించి చాలా విలువైన వ్యక్తే.
జంపాలకు కథను కనిపెట్టడం తెలుసు. తెలుగు ప్రాంతంలో ఉండి కథలు చదివే చాలామంది కంటే ఆయన ఎక్కువ కథలు చదివారని కచ్చితంగా చెప్పగలను. సి.రామచంద్రరావు, అల్లం శేషగిరిరావు గార్ల కథలు బాగా ఇష్టం. బాపు గారు శ్రీరమణ ‘మిథునం’ కథను బాగా ఇష్టపడి, చేతి రాత కాపీ రాసి, దానిని మొదటగా అమెరికాలో ఉన్న జంపాల గారికి పంపితే ఆయన ఆ కథను అమెరికా అంతా వ్యాప్తిలోకి తెచ్చారు మెచ్చి. ఇక్కడి తెలుగు పాఠకుల కంటే ముందు అమెరికా తెలుగు పాఠకుల్లోనే శ్రీరమణ స్టార్ అయ్యారు. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్లు ‘కథ’ సిరీస్‌ను మొదలెట్టాక జంపాల గారు ఆ సిరీస్‌కు బేషరతు శాశ్వత ఆర్థిక సహాయం ప్రకటించారు ‘తానా’ తరఫున. ప్రమేయం అంత వరకే. ‘కథ’ సంకలనం అచ్చయ్యాకే ఆయనా చదువుకుంటారు. ఫలానా కథ ఎందుకు వేయలేదు అని తతిమా పాఠకులకు మల్లే ఆయనా నవీన్ గారితో పోట్లాడటం నాకు తెలుసు.
‘దర్గామిట్ట కతలు’ రావడంతోటే అప్పట్లో అన్నీ పత్రికలనూ ఆయన అమెరికా తెప్పించుకునేవారు కనుక నేను జరూరుగా తెలిశాను. ఆయన శ్రీమతి అరుణ గారు కూడా ఆ కథలకు ఫ్యాన్. ఇండియా వచ్చినప్పుడు కబురు చేసి ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో ఏదో కార్యక్రమం జరుగుతుంటే అక్కడ కలిశారు. ఫేస్‌బుక్ లేని రోజుల్లో అమెరికా మిత్రులు మాట్లాడుకునే ‘రచ్చబండ’ గ్రూప్‌లో ఎవరైనా నన్ను ఏమైనా అంటే ఆయన రక్షణగా కాకపోయినా నా రచనా సామర్థ్యాన్ని ఎక్కువ తక్కువ లేకుండా ప్రస్తావించేవారు. కన్నెగంటి రామారావు గారు, కెవిఎస్ రామారావు గారు, అక్కిరాజు భట్టిప్రోలు… ఇక్కడ తెలుగు వారు నలుగురు కలిసి ఎంత మాట్లాడుకునేవారో ఆ గ్రూప్‌లో అంత కంటే ఎక్కువ మాట్లాడుకునేవారు. మనం అనుకుంటాముగాని మనల్ని ఎవరు గమనిస్తారని. గమనిస్తూ ఉంటారు. చెప్పరు.
నేను కావలి కథలు దాటి 2007లో మొదటిసారి అర్బన్ కంటెంట్‌తో ‘కింద నేల ఉంది’ రాశాక నాకు ఆ కథను అసెస్ చేయడానికి జంపాల గారి సాయం కావాల్సి వచ్చింది. ‘ఆయనైతే దీనిని కరెక్ట్‌గా చెబుతారు. ఆయన బాగ లేదంటే మళ్లీ కావలి కథలు రాసుకుందాం’ అనుకొని మెయిల్ చేశాను. నాలుగైదు రోజులకు ఏదో పెళ్లిలో ఉన్నాను… కవులు, రచయితలు చాలామంది ఉన్నారు ఆ పెళ్లిలో. వాసిరెడ్డి నవీన్ గారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు.. ‘ఖదీర్.. జంపాలగారు ఫోన్ చేశారు.. నీ కథ కింద నేల ఉంది అద్భుతంగా ఉందట’ అన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఆ కథ నేను ఆరు నెలలు రాశాను. ఆ కథ తెలుగు పాఠకులకే కాదు జంపాల గారికి కూడా నా మీద నమ్మకాన్ని పెంచింది. ఆయన వెంటనే దానిని ‘తెలుగునాడి’లో రెండు సంచికల్లో వేశారు గొప్పగా. చంద్రగారి బొమ్మ కుదర్లేదు ఎందుచేతనో.
జంపాల గారు, వాసిరెడ్డి నవీన్ గారు, అక్షర సీత గారు, నేను… ‘తెలుగునాడి’ కోసం చాలా శ్రద్ధగా పని చేశాం. అద్భుతమైన కవర్లతో కంటెంట్‌తో ఆ పత్రిక అమెరికా తెలుగువారికి అందేది. నేను రెండు మూడేళ్లు పని చేసినట్టున్నాను. ఆ తర్వాత మరి కొన్నాళ్లు నడిచి ఆ పత్రిక జంపాల గారికి యథావిథిగా నష్టాన్ని మిగిల్చి ఆగిపోయింది. విలువైన పత్రికల సహజ ప్రస్థానం తెలుగులో అలాగే ఉంటుంది. ‘తెలుగునాడి’కి పని చేస్తున్నప్పుడు శుభ్రమైన వచనం రాయడంలో, క్షుణ్ణంగా ప్రూఫ్ చూడటంలో జంపాల గారి ప్రతిభ పసిగట్టాను. ‘మీరు బాలీవుడ్ క్లాసిక్స్‌కు ముందుమాట రాయాలి’ అంటే రాశారు. నా ‘న్యూ బాంబే టైలర్స్’, ‘మన్ చాహే గీత్’, ‘నూరేళ్ల తెలుగు కథ’ పుస్తకాలకు ఆయనే ప్రూఫ్‌రీడర్. అంత పెద్ద బిజీ డాక్టర్ నా పుస్తకాలకు ప్రూఫ్ చూడటమా? కాని ఆయన చేస్తారు… కథ, కథకుడు నచ్చితే. ‘న్యూ బాంబే టైలర్స్’ పుస్తకం ఆవిష్కరణకు హాజరయ్యి మాట్లాడారు. ‘నూరేళ్ల తెలుగు కథ’ను నెత్తిన పెట్టుకున్నవారిలో ఆయన మొదట. తర్వాతి స్థానంలో ఆ ఒక్క పుస్తకం చదివి నాకు ‘అజొవిభో’ పురస్కారం ఇచ్చిన అప్పాజోస్యుల సత్యనారాయణ గారు.
జంపాల గారిని నేను బానే విసిగించాను. ‘తానా’ కథల పోటీని గట్టిగా వ్యతిరేకించి 25 వేల బహుమతి పంచి ఇస్తున్నందుకు విమర్శించాను. కాని అది అదే ఇది ఇదే. ఆ పోటీ, నవలల పోటీ మెల్లగా ఆగిపోయింది. నాలుగేళ్ల క్రితం అక్కిరాజు భట్టిప్రోలు ఇంట్లో కలిసినప్పుడు ‘నవలల పోటీ పెట్టే సమయం వచ్చినట్టుంది సార్. మంచి నవలలు తయారవుతున్నాయి’ అనంటే అప్పటికే ఆ ఆలోచనలో ఉన్న ఆయన నా మాట బలం కూడా అందుకుని తిరిగి తానా నవలల పోటీ అనౌన్స్ చేశారు.
జంపాల చౌదరి గారి వయసెంతో నాకు తెలియదు. కాని ఆయన రోజుకు 26 గంటలు ఉంటాయని తెలుసు. అలసట అనేదే ఎరగక రోజులో ప్రతి నిమిషం ఏదో ఒక పని చేస్తూ ఉంటారని అది ఆయన నుంచి నేర్చుకోవాలని అనుకుంటాను.
ఎవరైనా ఒక గొప్ప కథ రాస్తే సాటి తెలుగు కథకుడు సంతోషపడతాడో లేదో చెప్పలేము. జంపాల గారు సంతోషపడతారు. అందుకని ఆయనంటే నాకు గౌరవం.
తెలుగు కథను ఎరిగి భుజాన మోసే పల్లకీ జంపాల గారు.
– మహమ్మద్ ఖదీర్‌బాబు