జీవనవేదం – యుగధర్మ కావ్యం

జీవన వేదాన్ని 5 అధ్యాయాలలో 31 ఖండికల్లో అందించారు మన్నే శ్రీనివాసరావు. ఈ చిరు పొత్తానికి ముందు మాటలు రాసిన వారు, ఆధునిక జీవన సమస్యలకు వేదాలలోని శాశ్వత సత్యాలను అన్వయించిన ‘ఒక దార్శనిక మహాకావ్యం’ అన్నారు. ఆత్మజ్యోతిని గుర్తించి పరమాత్మ, ప్రకృతి, పంచజనుడు అనే త్రిశూల సత్యముల ద్వారా నిరూపించడం అత్యంత ప్రశంసనీయం. ఇందులోని ఖండికలు రిథమిక్ ఫ్రీవెర్స్. వేద మంత్రపు గాంభీర్యాన్ని అందించాయి. ‘ఈశావాస్యం ఇదం సర్వం’ అన్న వేద వాక్యం. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ దైవంతో నిండి ఉన్నది’ అనే సత్యాన్ని సరళమైన విలక్షణమైన రీతిలో ఈ చిరు పొత్తం అందిస్తుంది. మార్పుకు సాయుధ పోరాటం కాదు, జ్ఞానాయుధ పోరాటం, సృజనాత్మక సంకల్పం యొక్క అవసరాన్ని సూచిస్తుంది. మానవుడు తనను తాను తెలుసుకొనడానికి తన పాత్రను సమర్థవంతంగా పోషించడానికి కావలసిన స్పష్టమైన మార్గనిర్దేశాన్ని అందిస్తాయి ఈ ఖండికలు. వేదాలు- దేవుడు జీవుడు ప్రకృతి’ ఈ మూడింటిలో, దేవుడు సృష్టి స్థితి లయ కారకుడు అని చెబుతూ మన్నే శ్రీనివాసరావు సమాజ సాగర మధనం చేసి చిలికి తత్వ సారాన్ని జీవనవేదంగా అందించారు. ఇది ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక భావనల మీద మధనం, తత్వ శాస్త్రము జీవశాస్త్రము సామాజిక శాస్త్రాల త్రివేణి సంగమం అయితే సాహిత్యం అనేది భావోద్వేగాల ప్రవాహం. అది ఈ కావ్యంలో తర్కంతో జోడించబడి వివరిస్తుంది.

మొదటి అధ్యాయంలో మహాన్వేషణ శీర్షికన అంతర్వేదన అనే ఖండికలో నిర్యాణాన్నే నిర్జించి అమరత్వమందుటెట్లు? అన్న ప్రశ్నతో ఆరంభమవుతుంది. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? అన్నట్లు నేతి నేతి నేతి అనుకుంటూ తివిరి ఇసుమున తైలం తీసినట్లు అణువు పరమాణువు లాంటి జగత్తత్వాన్ని భగవత్ తత్వాన్ని పిండి సారభూతంగా అమృత రస బిందువులు రసరేణువు లాంటి పదాలను కవితాత్మక
వాక్యాలుగా, ఇది కాదు ఇది కాదు అంటూ వేదాంత ధార్మిక దార్శనిక దృక్పథంతో మేథో మథనం జరిపి ఆలోచన అక్షర సింధు మథనంతో పైకి తేలిన వెన్నలా, బయటపడిన అంతస్సీమల జ్ఞాన జ్యోతులను వెలిగించి ఆత్మ జ్యోతిని పరంజ్యోతిలో విలీనం చేయడం ద్వారా జన్మ సాఫల్యం పొంది సార్ధక్యంతో అమరత్వసిద్ధి పొందమన్న నికషోఫలమే ‘జీవనవేదం’. రచన అంతస్సారం.

అధ్యాయం 2. అంతర్వీక్షణం.ఆశ్వాసం1 పరమాత్మ అన్న శీర్షికతో ఎయ్యది నీ వర్ణము? తర్కిస్తూ. ‘చూడగంటి హరివిల్లు మూలవర్ణమే నీ వర్ణము,శాంత్యహింసల పవిత్రత నిర్మలతల చాటు చుండే నీ వర్ణము’ అంటారు మన్నే. ఎయ్యది రసత్తత్వము అంటే.. త్రిగుణ బంధన విముక్త విశుద్ధ రుచియే నీ రుచి. అరిషడ్వర్గాలకు అతీతమౌ అరుచియే, దోష గుణ రహిత చిత్త జనిత రస రుచియే నీ రుచి, అద్వైతమందు పండిన అమృచిత్తమే నీ రుచి’ అంటారు.

మూడవ ఖండికలో ఎయ్యది నీ గంథము? అంటే.
“పసిగట్టితి వసివాడని నిరంజన సౌరభమే నీ వాసన, ద్వైతమందు దాగినట్టి అద్వైత అమర పరివాసమే నీ వాసన’ అంటారు. ఎయ్యది నీ బ్రహ్మనాదము అంటే.. ‘వేదోపనిషత్తుల అనంత విజ్ఞాన ఘోష నీ నాదం. జగతి జనని మంత్రమౌ ప్రణవ నాదమే నీ నాదము, ఆలకించి గ్రహించితి నాదాంతపు నిశ్శబ్ద మౌనమే నీ నాదము, త్రిమూర్తుల కతీతమో అద్వైత చైతన్య శంఖారావమే నీ నాదము” అంటారు కవి.
ఎయ్యది నీ తేజము? అంటే, భవోపశాంత దివ్య రోచిస్సే నీ తేజము, అండపిండ బ్రహ్మాండాన దాగిన చిత్కళ కాంతియే నీ తేజము, అహం బ్రహ్మాస్మిగ దీపించు అఖండ అద్వైత జ్యోతియే నీ తేజము” అంటారు. కాయమ్ము కైవల్యముల పరమ సంధాతృత్వ పరాశక్తియే నీ శక్తి, పరమాత్మను ప్రకృతిని బింబ ప్రతిబింబాలుగా నిలిపిన అద్వైతమే నీ శక్తి’ అంటారు. ఇక ఏది నీకేతనము? అని అడిగితే.. జ్ఞాన కర్మల కార్యకారణ సంయోగ అఖండ క్షేత్రమే నీ పరమ ధామము, అంతరంగ ఆశ్రమాన నామరూప తత్వ అద్వైత స్థితియే నీ నికేతనము’ అని నిగ్గు తేలుస్తారు. తన అంతర్వీక్షణలో ఆ పరమాత్మ స్వరూపాన్ని అంతిమంగా చూడదలచి, చూచి అద్యంత రహితమౌ సత్య శివ సుందర చిదానంద స్వరూపమే నీవు” అని వ్యాఖ్యానిస్తారు. విరాట్ రూప దర్శనంతో వామన దేహమున దాగిన విరాట్ రూప జ్యోతి నిశ్చయముగా నీవే! నేనే నీవై, సకలమై నిలిచి పొందిన అమృత జ్ఞానమే నిశ్చయంగా నీవే! అని ఖరాఖండిగా చెబుతారు.

ఇక రెండవ అధ్యాయం అంతర్వీక్షణ’లో ప్రకృతి అనే రెండవ ఆశ్వాసాన్ని ప్రారంభిస్తూ మొదటి ఖండికలో.. జీవావిర్భవం’ గురించి చెబుతూ- పదార్థమే ప్రాణశక్తినంది జీవిగా మారెను, పంచ శక్తుల విన్యాసమే నిత్యమై సత్యమై ప్రకృతిన పల్లవించుచుండెను” అంటారు. రెండవ ఖండికలో నరావతారం శీర్షికన పరమాణు చైతన్య సంకల్పమే అంబోధిని ఆది జీవిగా అవతరించెను, సరీసృపముగా, క్షీరదమై కపియై, ఆది నరుడై అవతరించెను. ఆపై పంచభూతాత్మ వికాసపు ధీర సంకల్పమే మేధో కిరీటమై అలరించెను” అంటారు. అనంతరము అనవరత గవేషనమున జ్ఞానప్రకాశాన ప్రకృతి పరమాత్మల దర్శించెను. ప్రకృతి పురుషుల అద్వైత సిద్ధియే జమిలి జీవితాన్ని గృహస్థమై వెలసెను’ అంటారు. నాలుగవ ఖండికలో ఉత్తాన పతనములు అన్న ఖండికలో రజోగుణ కరాళ జ్వాల విశ్వ సమత్వ ప్రజ్ఞా తత్వమును మసిబార యధేచ్చగా దహించ సాగెను, సహజ వనరుల విధ్వంస పథ గమనమే పతన హేతువని ప్రచండ ప్రకోప రూపాన ప్రకృతి చాటుచుండెను” అని దర్శిస్తారు. పంచభూత సవ్య వినియోగ సంకల్ప కంకణ ధారివియై నిసర్గ ఋణము తీర్చమని జీవన వేదము చాటుచుండెను’ అని ప్రకటిస్తారు. సహజీవన వేదం అన్న ఖండికలో సహజీవన వికసిత అమృత సిద్ధికై పంచజనుడు ప్రకృతి మంత్రాన్వేషియై, పరమాత్మ వేదియై సతతము చరియించవలెను’ అని జ్ఞానబోధ చేస్తారు.

రెండవ అధ్యాయం అంతర్వీక్షణలో ఆశ్వాసం మూడులో ‘పంచజనుడు’ శీర్షికన ‘లివ్ అండ్ లెట్ లివ్’ అనేదే నాగరికత అంటూ వ్యవస్థ వినాశక వ్యష్టి వికాసం కూడదెన్నడు, సమిష్టి వికాసమే జీవన సూత్రం కావాలెన్నడు, అదియే సిసలైన నాగరికత’ అంటారు. మతం అనే ఖండిక రెండులో.. జీవునికి దేవునికి అనుసంధాన సోపానమే మతం, కోరాలది సదా సకల లోకా కళ్యాణం’ అనే ఉదాత్త వాక్యాలను ఉద్ఘాటిస్తారు. సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ.. ‘వసుధైక విశ్వ నర భావనలే మానవీయ మాతా పితలు, విశ్వమానవ కళ్యాణ మార్గదర్శక జీవన వేద కిరణాలు’ అంటారు. నాలుగవ ఖండికలో కుటుంబ వ్యవస్థ గురించి చెబుతూ ” ద్రవ్య చదరంగమున పావులు కారాదు బంధాలెన్నడు, గృహస్థాశ్రమ మూల ధర్మమే నవజీవన వేదసారమై సదా వెలసిల్ల వలె’ అని ఆకాంక్షిస్తారు.

భాష అనే ఖండికలో ‘తల్లి భాష బోధ చేయని రాజ్యం స్వరాజ్యమగునే? అన్యభాషా దాస్యం ఆత్మ వినాశకమని ఎరుగవే? అమ్మ భాష అవనిని చూపు అసలు నయనము, జనని భాష విధిగా, అన్యభాష అవసరావధిగా నేర్వవలే’ అనే ఆకాంక్షను వ్యక్తం చేస్తారు. కుల వివక్షపు గాంధారి గంతలు దాల్చుట తగదెప్పుడు, మానవ సంబంధాలే మహాసేతువై నిలువ వలె” అని ప్రవచిస్తారు. ఎనిమిదవ ఖండిక రాజకీయంలో ప్రజాస్వామ్య ఫలసిద్ధికై రాజనీతికి నిత్యం జరగవలె కాయకల్ప చికిత్స అంటూ రోగ గ్రస్త సమాజానికి వైద్య కర దీపికయై ఈ జీవన వేదం వెలుగులనిస్తుంది. విద్య అనే తొమ్మిదవ ఖండికలో సమకాలీనత, జాతీయతల సంగమమే విద్యాతరంగిణి కావలె, భారతీయత- శాస్త్రీయతల మేళవింపే పఠన విద్య కావలె’ అనే సమన్వయ వాదాన్ని ముందుకు తీసుకువస్తారు. పదవ ఖండిక సమాజ సాగర మధనం’ లో శ్రమజీవుల కాయ కష్టాన్ని కబళించే దోపిడీ సర్పపు ఉద్గారమే హాలహలమాయే, సమధర్మమే ఐరావతమై, కలం కల్పవృక్షమై, గళం కామ ధేనువై వెలయ వలె” అనే నవ్యాభివ్యక్తిని ప్రకటిస్తారు. చివరి అధ్యాయము ఆవిష్కరణ అన్న మొదటి ఖండికలో తత్వ వేదం గురించి ‘కుంభకర్త లేక కుంభమెట్లు ఉండును?. మానవ దృష్టితో దైవదృష్టిని తర్కించ తగునా? అని ప్రశ్నిస్తూ.. సుకర్మయే యజ్ఞమై, లోక కళ్యాణమే హోమఫలమై, సత్వగుణపు పంచజనునికి అమరత్వము అందియవలె’ అన్న అమరత్వ ఆకాంక్షను వెలుబుచ్చుతారు. మూడవ చివరి ఖండికలో నవజీవన వేదం’ శీర్షికన మాతృమూర్తి మాతృభాష మాతృదేశములే ఆది ఆరాధ్యములు కావలె! మాతృత్రయ విస్మృతే జీవన్ మృతిని చేయుట తథ్యం! సమాజమే దేవాలయం, పంచజనుడే పరమాత్మ’ అనేదే పరమతత్వము, అదియే జగతికి కావాలి శరణాగత తారక మంత్రం’ అన్న తాత్విక దర్శన సారంగా నిర్వచనోత్తర నవజీవన వేదాన్ని ముగిస్తారు మన్నే శ్రీనివాసరావు. జీవితానుభవం అభివ్యక్తి పై పట్టు, భాష పై సాధికారత కలిగి దార్శనిక తాత్విక అద్వైత నావపై ఈవలి నుండి ఆవలి తీరం చేరి దర్శించిన వారు మాత్రమే చెప్పగల మర్రి విత్తనం లాంటి ఆధ్యాత్మిక మేలి మంజూష ఈ జీవనవేదం .

మల్లేశ్వరరావు ఆకుల
79818 72655
ప్రతులకు:
పేజీలు:62, వెల: రూ. 50/-,
(రచయిత: 94402 41271)

Share via
Copy link
Powered by Social Snap