విశాఖ నగరం పారిశ్రామిక రాజధానిగా, ఇటు ఆర్థిక రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. ఈ అందాల నగరం కళా రాజధానిగా కూడా ఎదుగుతుంది. ఈ ప్రాంత కళాకారులకు ఇక్కడ ఉన్న సముద్రం స్ఫూర్తి కలిగిస్తుంది. ఇక్కడ ప్రకృతితో మమేకమై కళాకారుడైన వ్యక్తి ఇ.ఇ. జాన్ రాజు. విశాఖలో నా ప్రియమిత్రులలో రాజు అతి ముఖ్యులు. నా 60 సంవత్సరాల జీవితంలో 40 సంవత్సరాలు నాకు ముఖ్య సహాయకుడుగా ఉండి, నేను నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలకు ముందుండి సహకరించే జాన్ రాజు లేడంటే నేను కూడా లేనట్లే భావన కలుగుతుంది.
ప్రముఖ జానపద చిత్రకారులు, శిల్పి అంట్యాకుల పైడ్రాజు ‘చిత్రకళా పరిషత్ ‘ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. ఆ సంస్థను ఆయన పావు శతాబ్దం పాటు నిర్వహించి, వయోభారంతో హైదరాబాదులో నివసిస్తున్న కుమారుడు రాజేశ్వరరావు దగ్గరకు వెళ్లే సమయంలో పరిషత్తు నిర్వహణ బాధ్యతలు నాకు అప్పగించారు. అదే సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైనార్ట్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన జాన్ రాజ్ తో నాకు పరిచయం కలిగింది. అప్పటి పరిచయం స్నేహంగా మారి, మేము ఇరువురం పరిషత్ కార్యక్రమాల్ని సంయుక్తంగా నిర్వహించేవాళ్ళం . యారాడ, సింహాచలం, భీమిలి, కోణార్క్ చిత్రకళా కార్యశాలలు, చిత్రకళా ప్రదర్శనలు, బాలలకు స్పాట్ డ్రాయింగ్ పోటీలు విరివిగా నిర్వహించే వాళ్ళం. 90వ దశకంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించిన సమయంలో మద్యపానం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు షిప్ యార్డ్ కూడలిలో నలుగురు చిత్రకారులతో బహిరంగ చిత్రలేఖనం ఏర్పాటు చేశారు. అందులో జాన్ రాజు మద్యం రక్కసి పై సందేశాత్మక చిత్రం వేశారు. ఆ చిత్రాన్నే తర్వాత జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారికి అప్పగించగా దాన్నే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేశారు.
జాన్ రాజు తండ్రి నవజీవన్ రైల్వే ఉద్యోగి. తీరిక సమయాల్లో ఆయన చిత్రాలు గీసేవారు. వారి చిత్రాలు కొన్ని భారతి, ఆంధ్రపత్రిక లలో వచ్చాయి. ఆయన స్ఫూర్తితోనే జాన్ చిన్ననాటి నుండి చిత్రాలు గీయటం ప్రారంభించాడు. ఏ.యు.లో పైడిరాజు ప్రముఖ శిల్పి, వై. లక్ష్మయ్య ల వద్ద చిత్రకళలో మెళుకువలు నేర్చుకున్నారు. అప్పట్లో ఉపన్యాసకులుగా ఉన్న ప్రముఖ ప్రకృతి చిత్రకారుడు జోగి జగన్నాధరాజు వద్ద ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ నేర్చుకున్నారు. ఆధునిక చిత్రకళ పై కూడా పట్టు సాధించి నప్పటికీ ప్రకృతి చిత్రకళపైనే దృష్టి పెట్టారు.
జాన్ ప్రథమ చిత్రకళా ప్రదర్శనను విశాఖ నగర ప్రథమ మేయర్ ఎన్.ఎస్.ఎన్.రెడ్డి ప్రారంభించారు. న్యూఢిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ఉత్తమ చిత్రకారునిగా ఎంపికయ్యారు.
స్కెచ్చింగ్, హ్యాండ్ వర్క్ తో ప్రకృతి చిత్రాన్ని కాన్వాసుపై సజీవంగా బంధించడం జాన్ రాజు ప్రత్యేకత. చిత్ర కళాపరిషత్, అంతర్ విశ్వవిద్యాలయాల స్థాయి యువజనోత్సవాలు, ఏ.పీ. లలితకళా అకాడమీ తదితర సంస్థల నుండి బహుమతులు అందుకున్నారు. 1985 లో నాటి ఏ.యు. వి.సి. కె.వి.రమణ జాన్ రాజును సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
పోస్టరింగ్, కామిక్స్,పద్య విభాగాల్లో కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటుచేసిన పోటీలకు రెండు లక్షలు ఎంట్రీలు రాగా పోస్టరింగ్ విభాగంలో జాన్ రాజు ప్రథమ బహుమతి గెలుపొందారు. కాలుష్యనియత్రణ- పర్యావరణ శాఖ ప్రచారంలో వీరి పోస్టర్ను ప్రభుత్వం వినియోగించింది.
విశాఖపట్నం జింక్ కర్మాగారం కు చెందిన పాఠశాలలో 30 సంవత్సరముల పాటు ఆర్ట్ టీచర్ గా పని చేసి, గత డిసెంబర్లో ఉద్యోగ విరమణ చేశారు. విశాఖ జిల్లాలో జరిగిన అనేక చిత్రకళా పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అరుదయిన ఈ కళాకారుడు మే 12 న ఆకస్మికంగా కన్నుమూసారు. ఆయన మృతి విశాఖ కళారంగానికి తీరని లోటు.
-సుంకర చలపతిరావు
Raju garu nice gentleman ART geallary also sunkara