జర్నలిజం జగాన కృష్ణం’రాజు’

(పాత్రికేయునిగా కృష్ణంరాజుగారి మూడున్నర దశాబ్దాల కృషి గురించి వెంకట్ పూలబాలగారి వ్యాసం…)

Journalist KrishnamRaju

జనహితు లెల్లరు కనఘన కార్య
శీలు రేతమ కీర్తిని శిరమున దాల్చి
కాంతు లీనుచు సాగరె కారణ జన్ము
లేమి యులెక్క సేయరు రేరాజు ల్వారె

రాష్ట్ర ఆర్ధిక, సాంఘిక పరిస్థితులతో పాటు, దేశ సాంస్కృతి, ప్రపంచ చరిత్రపై లోతైన అవగాహన కలిగి నిత్యం ప్రజాసమస్యలపై టీవీ కార్యక్రమాల్లో పాల్గొడమే కాక తరుచుగా ప్రజాక్షేత్రంలో జనజాగృత యజ్ఞాలు నిర్వహించిన సోమయాజి, జ్ఞాన దక్షుడు, గుణనిధి, అకుంఠిత ధర్మ పరిరక్షణా దీక్షాపరుడు క్రియాశీలి కృష్ణంరాజు. స్వపర బేధాలు చూడక తప్పైతే ఎంతటివారినైనా ఖండించే ఖడ్గం, సంచలనాత్మక వార్తలకోసం కాక మేధో మథనం కోరి సంచార జీవితం జరుపుతున్న బహుగ్రంథ కర్త, బహు నగర విహర్త బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణంరాజు.

ఓరోజు మచిలీపట్నం… మరో రోజు విశాఖపట్నం… ఒకరోజు గుంటూరు… మరోరోజు ఏలూరు కృష్ణంరాజుని చాలా మంది పాత్రికేయుడు అంటారు. ఆంధ్ర భవిష్యత్ కు బాబు జగన్ దొందు దొందే అని నిర్ద్వందంగా చెప్పి ప్రత్యామ్నాయం లేకపోతే ఆంధ్ర భవిష్యత్ అంధకారమే అని హెచ్చరిస్తాడు, విశాఖ సాగర తీరంలో అటామిక్ సబ్ మరీన్స్ వల్ల రేడియేషన్ ముప్పు గురించి హెచ్చరిస్తాడు, రైతుల కు మద్దత్తిస్తూ ఉద్యమిస్తాడు, చర్చలకు పిలవాలని జగన్ ప్రభుత్వాన్ని మేలుకొలుపుతాడు, నవరత్నాలను నాశనం చేస్తున్న దాని కేంద్రంపై ధ్వజమెత్తుతాడు. కలుషిత సంస్కృతితో సమాజానికి చేటుతప్పదని మంచి కవులు కళాకారులు రావాలని కళలు వెల్లివిరియాలని ఆశిస్తాడు. సవ్యసాచిని మించిన ద్రవ్యరాశి ఏదో ఇతనిలో ఉంది. సవ్య సాచి అంటే కేవలం రెండు చేతులని వాడడమే. కానీ నిత్య ఙ్ఞాన యజ్ఞాలు చేయాలంటే రెండు చేతులు సరిపోవు పది తలలు కూడా సరిపోవు.

Krishnam Raju in press meet

మూడు దశాబ్దాలు తెలుగు ఇంగ్లిష్ జర్నలిజంలో నడిచి, జ్ఞాన సంద్రంలో ఈది ఉదయం, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతిలలో సంపాదకీయం నడిపి సి. ఛానల్, జెమిని, ఏ.బి.ఎన్ ఆంధ్రజ్యోతిలలో ఎడిటర్ గా చేసి, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, సైన్స్ వ్యవసాయ రంగాల్లో వందలాది వ్యాసాలందించి, జాతీయ స్థాయిలో తన కృషితో గుర్తింపు పొందిన కృష్ణంరాజు తన రచనా ప్రతిభతో పలు అంతర్జాతీయ అవార్డులు పొందారు. జర్మన్ వెల్ల (జర్మన్ రేడియో) రష్యన్ రేడియో నిర్వహించిన వ్యాసరచనలో విజేతగా నిలిచిన జ్ఞాననిధి కృష్ణంరాజు. అటువంటి జ్ఞానాన్ని తన కోసం కాక తన వారికోసం, తన దేశం కోసం అని నమ్మి ప్రజలకోసం పనిచేస్తూ కర్మయోగి అనే అవార్డును పొందిన మనిషిలో మనీషి వి.వి.ఆర్.కృష్ణంరాజు.

సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, జె.డి. లక్ష్మీనారాయణ, తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మి పార్వతి వంటివారిని ఒక వేదికపై నిలిపి విజయవాడలో ఆంధ్ర విజ్ఞాన ఉత్సవం నిర్వహణకు కారణ భూతుడైన ఈయన పాత్రికేయుడేనా? అతిరథులు సరసన అనేక సభలకు ఊతమిచ్చి అభికుల అభినందనలు అందుకొన్న మహారథుడు (పదకొండు వేల మందితో ఏక కాలంలో యుద్ధం చేయగలిగిన యోధుడు) VVR కృష్ణంరాజు.

-పూలబాల

SA: