పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

ఆంధ్రపత్రికకు, ఆంధ్రపత్రిక నుండి వెలువడే ‘కలువబాల’ మహిళా పత్రికకు సంపాదకులుగా పని చేసిన వీరాజీగారు నిన్న (18-08-21) మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ తార్నాకలో చివరిశ్వాస విడిచారు. వీరాజీ అసలు పేరు పిళ్ళా కృష్ణమూర్తి. మూడున్నర దశాబ్దాల క్రితం ఆంధ్రపత్రికలో వీరాజీ గారి దగ్గర పని చేసిన వాళ్లలో నేను ఉండడం మరచిపోలేని జ్ఞాపకం. ఆ తర్వాత భూమిలో ‘వీరాజీయం’ ‘కాలం’తో పదికాలాలు నిలిచిపోయే రచనలు చేశారు. .వీరాజీ గారికి భార్య,ఇద్దరు కుమారులు.ఇద్దరు కుమార్తెలు వున్నారు. విజయనగరంలో 1940 జులై 30 తేది జన్మించిన వీరాజీ ఐదు దశాబ్దాలు పైగా జర్నలిజం తన ఊపిరిగా జీవించారు….1973-75 మధ్య కాలంలో విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొనసాగారు. చివరి దశలో కొంతకాలం కృష్ణా పత్రిక బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే వివిధ పత్రికల్లో పాఠక మనోరంజకమైన పలు శీర్షికలను నిర్వహించారు….అన్నింటిమించి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకుని ఐదు దశాబ్దాల పాటు తన పాత్రికేయ జీవనంలో ఎన్నో కధలు, నవలలు, కధా సంకలనలు రచించారు.

ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత గీతా సుబ్బారావు వీరి సోదరులే. పదేళ్ల క్రితం వరకు విజయవాడ సత్యనారాయణపురం లో వుండేవారు. వీరి మృతికి 64కళలు.కాం నివాళులర్పిస్తుంది.
-కళాసాగర్
………………………………………………………………………………………………………………
రచయితగా గుర్తించింది వీరాజీ గారే…

1975 నుండీ నన్నొక రచయితగా గుర్తించి ప్రోత్సహించిన గురువు వీరాజీ గారు నిన్న మధ్యాహ్నం పరమపదించారన్న వార్త ఇప్పుడే తెలిసింది. 2009లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, 2019లో సద్గురు శివానంద పురస్కారం ఆ మహనీయునితో కలిసి పుచ్చుకునే అదృష్టం దక్కిన శిష్యుడిని. నన్ను పూర్ణా అని ప్రేమగా పలకరించేవారు. నేనువ్రాసింది చదివినప్పుడు god bless you my son అని వ్రాసేవారు.

ఆంధ్రభూమి దినపత్రికలో ఆయన ఆత్మకథ వచ్ఛేది. మద్రాసులో ఆయన ఉన్నప్పటి విశేషాలు వ్రాస్తూ ఉండగా ఆ పత్రిక ఆగిపోయింది. ఇంక బెజవాడలో పనిచేసినప్పటి విశేషాలు మొదలెడతాను. నీ గురించి ఒకపేజీ అయినా అందులో ఉంటుంది… అన్నారాయన. ఇంతలోనే వారి కాలం. కలం ఆగిపోయాయి. జులై నిండి ఆయన వాట్సాప్ లో ప్రతిస్పందించటం లేదేమా అని ఫోన్ చేస్తే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. కృష్ణాజిల్లా రచయితల సంఘం పురస్కారం ఇచ్చి ఆయన్ని గౌరవించుకొంది. చివరి క్షణం దాకా వ్రాస్తూనే ఉన్న కలం యోధుడు. ఆంధ్రపత్రికకు పర్యాయ పదంగా నిలిచిన పాత్రికేయుడు. ఆంధ్ర సచిత్ర వారపత్రిక కు సంపాదకుడుగా వార్తాపత్రికల కొక ఒరవడిని కల్పించిన వీరాజి గారి మరణం బాధాకరం. కరోనా కారణం కాకపోయినా తుర్లపాటి వారు, రాఘవాచారి గారూ, వీరాజి గారూ ఈ త్రిమూర్తుల్ని కరోనా కట్టడి కాలంలో తెలుగువారు కోల్పోయారు. అంతటి పుణ్యశ్లోకులు మనకున్నందుకు తెలుగువారు గర్వించాలి.
-జి.వి.పూర్ణచంద్

Purnachand with Veerajee
SA:

View Comments (2)

  • 47 సంవత్సరాల క్రితం 1975లో నాకు 19 సంవత్సరాల వయసు లో వీరాజీ గారు నాకు పరిచయం అయ్యారు. అప్పుడువారు విజయవాడ ఆంధ్రపత్రిక వీక్లీలో పని చేస్తున్నారు. వారు నన్ను ఆంధ్రపత్రిక యజమానీ , సంపాదకులు శ్రీ శివలెంక రాధాకృష్ణ గారికి పరిచయం చేశారు. అప్పటినుంచి ఆంధ్ర పత్రిక లో అమర్ పేరుతొ ఎన్నో బొమ్మలు, కార్టూన్లు వేశాను . వీరాజీ గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వారితో నా స్నేహం కొనసాగింది. వారి ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను.
    - జి వి అమరేశ్వర రావు

  • 47 సంవత్సరాల క్రితం 1975లో నాకు 19 సంవత్సరాల వయసు లో వీరాజీ గారు నాకు పరిచయం అయ్యారు. అప్పుడువారు విజయవాడ ఆంధ్రపత్రిక వీక్లీలో పని చేస్తున్నారు. వారు నన్ను ఆంధ్రపత్రిక యజమానీ , సంపాదకులు శ్రీ శివలెంక రాధాకృష్ణ గారికి పరిచయం చేశారు. అప్పటినుంచి ఆంధ్ర పత్రిక లో అమర్ పేరుతొ ఎన్నో బొమ్మలు, కార్టూన్లు వేశాను . వీరాజీ గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వారితో నా స్నేహం కొనసాగింది. వారి ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను.
    - జి వి అమరేశ్వర రావు