జనప్రియ గీతాలు జ్యోతిర్మయి గజల్స్

“చూపు ఎంత అలిసిందో” మళ్ళ జ్యోతిర్మయి గజల్స్ సంపుటి ఆవిష్కరణ

జ్యోతిర్మయి తెలుగు అకాడమీ (జ్యోట్గా) ఆధ్వర్యంలో మే 3 వ తేదీ శనివారం సాయత్రం, విశాఖపట్టణం పౌర గ్రంథాలయంలో మళ్ళ జ్యోతిర్మయి రచించిన “చూపు ఎంత అలిసిందో” గజల్ సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్యఅతిథి పూర్వరాజ్యసభ సభ్యులు, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేతులు మీదుగా జరిగింది. ముందుగా అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము నిర్వహించారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ ఈ సభకు విజ్ఞులైన వారు ఎందరో హాజరైనారని అన్నారు. గజల్ ప్రక్రియ 60 సంవత్సరాలు క్రితం తెలుగు లోకి వచ్చిందని, దానిని డా. సి. నారాయణ రెడ్డి, గజల్ శ్రీనివాస్ ప్రాముఖ్యత కల్పించారన్నారు. మళ్ళ జ్యోతిర్మయి స్త్రీ అయి, గజల్ గాయనీమణి కావడం అభినందనీయం మన్నారు. కొన్ని గజల్ చరణాలను చదివి విశ్లేషించారు. గజల్ వ్రాయడం వల్ల కాక పాడడం వల్ల ప్రసిద్ధి పొందుతుందన్నారు. ప్రముఖ వైద్యనిపుణులు, కవి, విమర్శకులు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు సభకు అధ్యక్షత వహిస్తూ ఉర్దూ సాహిత్యం నుండి వచ్చిన గజల్ గురించి మళ్ళ జ్యోతిర్మయి కృషిచేసి, రాణించడం అభినందనీయమన్నారు. లీడర్ పత్రికాధిపతి, చైర్మన్ రైటర్స్ అకాడమీ వి.వి. రమణమూర్తి విశిష్ట అతిథిగా హాజరై జ్యోతిర్మయి కృషిని కొనియాడారు. ఆమె పట్టుదల ఉన్న స్త్రీ అని అభినందించారు. ప్రేమ తో కూడిన గజల్ ప్రక్రియలో ముందుకు పయనించడం గొప్ప విషయమన్నారు. దీనికొరకు ఒక సంస్థను స్థాపించడం విశేషమన్నారు.

ప్రసిద్ధి కవి, విమర్శకులు, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ అధ్యక్షులు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ గజల్ సంపుటిని సమీక్షిస్తూ జ్యోతిర్మయి గొప్ప గాయినీమణి అని, విషాదాన్ని పలికించగల రచయిత్రి అన్నారు. తాను కృషి చేయడమే కాకుండా, ఎందరినో ప్రోత్సాహించారని అన్నారు. గజల్ లో భావనా బలము గుప్పించిన, సంఘ రుగ్మత లను నిర్మూలించే విధంగా జ్యోతిర్మయి రచనలు ఉన్నాయని తెలిపారు. “ప్రేమించి పొందింది ఏమున్నది? ఈ బాధ సుఖమెంత బాగున్నది” గజల్ పాదాలను ఉదహరించారు.

ఆత్మీయ అతిథులుగా ప్రధాన కార్యదర్శి ఆత్రేయ స్మారక కళా పీఠం గంటి మురళి, చిత్రకారులు ప్రపంచ యాత్రికులు రచయిత ప్రొఫెసర్ యమ్. ఆదినారాయణ, సహృదయ సాహితి అధ్యక్షులు శేఖరమంత్రి ప్రభాకర్, హిందీ విభాగాధ్యక్షులు సెయింట్ జోసెఫ్ కళాశాల ఆచార్య పి.కె.జయలక్ష్మి హాజరు కాగా ప్రత్యేక ఆహ్వానితులుగా సాహితీ ప్రముఖులు డాక్టర్ డి.వి. సూర్యారావు, అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, సినీ గేయ రచయిత బల్లా విజయకుమార్, రచయిత వ్యాఖ్యాత మేడా మస్తాన్ రెడ్డి, లాల్ కార్టూనిస్ట్ సదాశివుని లక్ష్మణరావు, కళాభిమాని కొణతాల రాజు, సాహితీ ప్రముఖులు పెనుమత్స లలితా వాశిష్ట , స్వరరంజని అధ్యక్షులు లతా రాములు, ప్రముఖ గాయనీమణులు సుభాషిణి, ప్రభాశర్మ చల్లారాంబాబు జ్యోట్గా గౌరవాధ్యక్షులు హాజరైనారు. గజల్స రచయిత్రి మళ్ళ జ్యోతిర్మయి స్పందిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక గజల్ ను మధురంగా పాడి వినిపించారు. గజల్ సంపుటి శీర్షిక “చూపు ఎంత అలసిందో” గజల్ ను పాడి, అది శీర్షిక గా పెట్టడానికి కారణాలు వివరించారు. బోర భారతీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Share via
Copy link
Powered by Social Snap