జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్య రంగంలో ఇటీవల అత్యంత విశేష కృషి సల్పుతున్న రచయితకు ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం‘ ఏటా ఇచ్చే ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం 2021కి గాను ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ కు ప్రకటించారు. భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల చరిత్రను వెలికితీసి అనేక పుస్తకాలు వెలువరించడంతోపాటు ఇతర భాషల్లోకి కూడా అనువాదమయ్యి జాతీయస్థాయిలో నశీర్ రచనలకు మంచి గుర్తింపు లభించింది. ఆయన చేసిన విశేష కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ‘జ్ఞానజ్యోతి’ పురస్కారానికి ఎన్నిక చేసింది. ఈ పురస్కారం కింద్ర 3,000/- నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం, శాలువాలతో ఈ నెల 15వ తేది సాయంత్రం విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులోగల రాగూర్ స్మారక గ్రంథాలయంలో రచయితను సత్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కంచల నాగరాజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నెలకొల్పిన ఈ ‘జ్ఞానజ్యోతి’ మొట్టమొదటి పురస్కారం 2019లో బహుగ్రంథకర్త, రచయిత, పరిశోధకుడు గబ్బిట దుర్గాప్రసాద్ కు అందజేయగా 2020లో కరోనా కారణంగా ప్రకటించలేదు. ఇప్పుడు ఈ అవార్డు తీసుకుంటున్న రెండవవారు సయ్యద్ నశీర్ అహమ్మద్.