కైలాస విశ్వనాథుని చెంతకు కళాతపస్వి

సినిమా పరిశ్రమను ఒక కళామాధ్యమంగా గౌరవించి, కార్యదీక్ష, నిబద్ధతతో, కార్యాచరణకు నాంది పలికే సందేశాత్మక చిత్రాలకు ప్రాణం పోసి, ప్రేక్షకులకు ఆరోగ్యవంతమైన వినోదాన్ని పంచిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ 02, ఫిబ్రవరి,-2023 రాత్రి అనాయాస మరణం చెందారు. 19, ఫిబ్రవరి 1930 న గుంటూరు జిల్లా రేపల్లె లో జన్మించిన విశ్వనాథ్ కు 92 ఏళ్ళు. చిత్త శుద్ధితో యాభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలను అందుకున్న విశ్వనాథుడు తెలుగు చిత్రసీమకు బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఆదుర్తి వంటి మహనీయుల సరసన హేమాహేమీ గా నిలిచినఘనత దర్శకుడు విశ్వనాథ్ ది. ముఖ్యంగా 70, 80 వ దశకాలలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే చిత్రాలకు ప్రాణం పోసిన ఈ ధన్యజీవి సంగీతానికి, నాట్యానికి, నటనకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ చిత్రాలను నిర్మించడం విశేషం. ‘శంకరాభరణం’ వంటి కళాఖండం ద్వారా లలిత శాస్త్రీయ సంగీతానికి పెద్దపీట వేసి కొత్త వరవడికి నాంది పలికారు. ‘పాశ్చాత్య సంగీతపు పెనుతుపానుకు రెపరెపలాడుతున్న శాస్త్రీయ సంగీతానికి అరచేతులు అడ్డుపెట్టిన చిత్రంగా ‘శంకరాభరణం’ ద్వారా తెలుగువారి సంస్కృతిని గుర్తుచేశారు. సంస్కృత పదబంధలో నిండిన చక్కని పాటలు ఆబాల గోపాలాన్నే కాకుండా రిక్షావాళ్లు కూడా పాడుకునేలా చేశాయి…. నాలుగు జాతీయ పురస్కారాలు తెచ్చి పెట్టాయి. అలాగే ‘సాగర సంగమం’ చిత్రం ద్వారా నాట్యానికి పెద్ద పీట వేస్తూ మరో ఆణిముత్యాన్ని మనకు అందించారు. ‘స్వాతిముత్యం’ చిత్రం ద్వారా స్వచ్చమైన అమాయకత్వం ఎలావుంటుందో, కష్టపడి బ్రతకడంలో ఎంతటి తృప్తి వుంటుందో కమలహాసన్ పాత్రలో ప్రదర్శింపజేశారు. ఉండమ్మా బొట్టు పెడతా, చెల్లెలి కాపురం, కాలం మారింది, ఓ సీత కథ, జీవన జ్యోతి, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, సప్తపది, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం విశ్వనాథ్ అందించిన ఆణిముత్యాలు. 1981 ఫ్రాన్స్ ఫెస్టివల్ లో సత్కారం పొడడం విశ్వనాథ్ మకుటంలో కలికి తురాయి. ఆడియోగ్రాఫర్ గా చిత్రరంగ ప్రవేశం చేసి ‘ఆత్మగౌరవం’ చిత్రంతో దర్శకుడుగా మారిన విశ్వనాథ్ జాతీయ స్థాయిలో 5 బహుమతులు అందుకున్నారు. 10 ఫిల్మ్ ఫేర్ బహుమతులు, 7 నంది బహుమతులు అందుకున్న విశ్వనాథ్ తన చిత్రాలకు తానే స్క్రిప్ట్ రాసుకునేవారు. విశ్వనాథ్ చిత్రాలలో పాటల చిత్రీకరణకు ఓ ప్రత్యేకత వుంది. వారి మరణానికి అంజలి ఘటిస్తూ కొన్ని పాటల విశేషాలు తెలుసుకుందాం.*

విశ్వనాథ్ నేపథ్యం:

ఫిబ్రవరి 19, 1930 న విశ్వనాథ్ గుంటూరు జిల్లా రేపల్లె లో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రైస్తవ కళాశాలలో బియ్యస్సి పూర్తిచేసి మద్రాసు పయనమయ్యారు. విశ్వనాథ్ తండ్రి సుబ్రహ్మణ్యం వాహినీ స్టూడియోలో సహకార శాఖలో పనిచేసేవారు. అలా వాహినీ స్టూడియోలో విద్యార్థిగా ధ్వనిముద్రణ విభాగంలో ఏ. కృష్ణన్ వద్ద రికార్డిస్టుగా చేరారు. వాహినీ స్టూడియోలో అప్పట్లో ప్రతి టెక్నీషియను కెమెరా ప్రొజెక్షన్, లేబరేటరీ వంటి అన్ని విభాగాలలో పనిచేయాలి అనే నిబంధన వుండేది. అలా ఆడియో విభాగంలో విశ్వనాథ్ యెన్నో చిత్రాలకు సౌండ్ రికార్దిస్టుగా పనిచేశారు. తర్వాత రామనాథ్ కు సహాయకుడిగా కూడా పనిచేశారు. అన్నపూర్ణా వారి “తోడికోడళ్ళు” సినిమాకు సౌండ్ రికార్దిస్టుగా పనిచేస్తున్నప్పుడు విశ్వనాథ్ కు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం యేర్పడింది. ఆ పరిచయంతో అన్నపూర్ణా వారి “ఇద్దరు మిత్రులు”, “వెలుగునీడలు”, “చదువుకున్న అమ్మాయిలు”, “డాక్టర్ చక్రవర్తి” వంటి చిత్రాలకు సహాయదర్శకుడిగా పనిచేస్తునప్పుడు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, హీరో అక్కినేనిల దృష్టిని ఆకర్షించడం జరిగింది. విశ్వనాథ్ పనితనం గమనించిన అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణా సంస్థలోకి ఆహ్వానించి, దర్శకత్వశాఖలో రెండేళ్ళు పనిచేశాక సొంతంగా దర్శకత్వం నిర్వహించే అవకాశాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. అలా అన్నపూర్ణా సంస్థలో “వెలుగునీడలు” చిత్రం నుంచి యెక్కువ సినిమాలకు సహకార దర్శకునిగా విశ్వనాథ్ పనిచేశారు. అన్నమాట ప్రకారం “డాక్టర్ చక్రవర్తి” సినిమా తర్వాత అన్నపూర్ణా సంస్థ “ఆత్మగౌరవం” సినిమాకు దర్శకత్వ పగ్గాలు విశ్వనాథ్ కు అప్పగించింది.

ఆత్మగౌరవం తో ఆత్మవిశ్వాసం…

ఈ సినిమాకు సాలూరు రాజేశ్వరరావు అందించిన సంగీతం అమరం. “ఆత్మగౌరవం” సినిమాలో మొత్తం పది పాటలున్నాయి. ఇందులో పాటలన్నీ మరలామరలా వినాలనిపించి అమృతగుళికలే. రేలంగి తన పొలాల గొడవ పరిష్కారంకోసం పల్లెటూరికి వచ్చి, గుమ్మడి ఇంటిలో విందు ఆరగించినప్పుడు చిన్ననాటి వాసు, సావిత్రి ఆలపించే సినారె గీతం “మారాజు లొచ్చారు మహరాజు లొచ్చారు మాయింటికొచ్చారు…మా మంచి వారంట మనసున్న వారంట మా కెంతొనచ్చారు” అనే అద్భుతమైన పాట చిత్రీకరణ యెంత గొప్పగా వుంటుందో చూసి తీరాల్సిందే. ఈ సన్నివేశంలో రేలంగికి కుర్చీ వేసి, బల్లమీద భోజనం వడ్డించి గుమ్మడి విసనకర్రతో సేదదీర్చుతుంటే, రేలంగి సహాయకుడు అల్లు రామలింగయ్యకు పీట వేసి భోజనం వడ్డించడం విశ్వనాథ్ ప్రతిభ. ఈ పాటలో ముద్దపప్పు, ఆవకాయ, గుత్తివంకాయ, గారెలు, బూరెలు, నేతిబొబ్బట్లు ఆప్యాయంగా వడ్డించే గ్రామీణసంప్రదాయం గౌరవప్రపత్తులకు అద్దంపడుతుంది. సినిమా కథకు ఈ పాటే మలుపు. అంతర్ కళాశాల వక్తృత్వ పోటీల్లో అక్కినేని అలపించే ఆరుద్ర గీతం “ప్రేమించి పెళ్లి చేసుకో…నీ మనసంతా హాయినింపుకో” లో ప్రేమవివాహానికి పెద్దపీట వేశారు దర్శకుడు. ఈ ధృక్పథంతోనే కాంచనను తన మేనకోడలని తెలియకుండానే ప్రేమించడానికి దారితీస్తుంది. వరుని వలపు, వధువు తలపు తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపినా, కట్నాలకోసం పాకులాడినా చివరకు యెడమోము పెడమోములే మిగుల్తాయని, పురాణాలలో కూడా ప్రేమపెళ్ళిళ్ళు జరిగాయని కృష్ణుడు-రుక్మిణి; దుష్యంతుడు-శకుంతల; నలుడు-దమయంతిల ఉదంతం పాటలో జొప్పించడం బాగుంటుంది. ముఖ్యంగా చెప్పుకోవలసిన పాట రామప్ప గుడి, పాకాల సరస్సు వద్ద చిత్రీకరించిన దాశరథి గీతం “ఒక పూల బాణం తగిలింది మదిలో, తొలిప్రేమ దీపం వెలిగిందిలే”. శంకరాభరణ రాగస్వరాలతో అల్లిన ఈ పాట కు హిందీ సినిమా “తాజ్ మహల్” లో పహాడి రాగంలో రోషన్ స్వరపరచిన “జో వాదా కియా వో నిభానా పడేగా” పాటను గుర్తు చేస్తుంది. పహాడిరాగం కూడా శంకరాభరణ రాగజన్యం కావడం ఈ పోలికకు కారణం కావచ్చు. సినిమా మొత్తం మీద ఈపాట మకుటాయమానం. గుడిలో దీపం ఎల్లప్పుడూ వెలుగుగుతూనే వుటుంది. అలాగే అక్కినేని-కాంచన ల తొలి ప్రేమ అనే దీపం కూడా వెలిగిందనే సారూప్యాన్ని చూపించేందుకు రామప్ప గుడిని దర్శకుడు ఎన్నుకున్నారు. అంతవరకు రామప్ప గుడిలో ఏ సినిమా కూడా చిత్రీకరణకు నోచుకోలేదు. నందీశ్వరుడు మహేశ్వరునికి నమ్మినబంటేకాదు విశ్వాసపాత్రుడు కూడా. అలాగే అక్కినేని-కాంచనల ప్రేమ కూడా పవిత్రమైనదని, విశ్వాసపాత్రమైనదని తెలియజేయాలని రామప్ప గుడిలోని నందిని, గుడి ప్రాంగణంలో వెలసిన నాగిని శిల్పాలను విశ్వనాథ్ సింబాలిక్ గా చూపారు. కారులో మొదలై విడిది గృహంలో చిరుజల్లుల మధ్య ఒదిగే శ్రీశ్రీ గీతం “వలపులు విరిసిన పూవులే కురిపించే తేనియలే” మరో అద్భుతగీతం. ఇందులో “ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి“ అంటూ అక్కినేని ఆలపిస్తే, “నీ హృదయములో ఒదిగినచో బెదురింక యేమున్నది” అని కాంచన గోముగా జవాబివ్వడం మంచి ప్రయోగం. విశ్వనాథ్ ఈ పాటను అద్భుతంగా మలిచారు. అన్నపూర్ణ సంస్థకు హీరాలాల్ నృత్యదర్శకుడుగా వుండేవారు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలిరావడంతో, స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని ప్రముఖ నృత్య కళాకారిణి డాక్టర్ సుమతీ కౌశల్ ను నృత్యదర్శకురాలిగా ఈ చిత్రంలో పరిచయం చేశారు. ఆమెకు హీరాలాల్ సహకరించారు. ఆరోజుల్లో సుమతీ కౌశల్ ”నృత్యశిఖర డ్యాన్స్ స్కూల్” పేరుతో బాలబాలికలకు కూచిపూడి, భరత నాట్యం, ఒడిస్సీ నాట్యరీతుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తుండేవారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తొలి మహిళా నృత్యదర్శకురాలు ఈమే! ఈ సినిమాలో రాజశ్రీ, కాంచన నృత్యం చేసే క్షేత్రయ్య పదం “ముందటివలె నాపై నెనరున్నదా సామి ముచ్చటలిక నేలరా… మువ్వగోపాలా” కు సుమతీ కౌశల్ కూర్చిన కూచిపూడి నృత్యరీతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో పాటలన్నింటిని రామప్ప దేవాలయ ప్రాంగణంలోను, దిండి ప్రాజెక్టు, పబ్లిక్ గార్డెన్ లోను స్థానికంగానే విశ్వనాథ్ చిత్రీకరించడం విశేషం.

తరవాత, ఆదుర్తి సుబ్బారావు సమర్పణలో బాబూ మూవీస్ వారు నిర్మించిన ‘ఉండమ్మా బొట్టు పెడతా’ (1968) సినిమాకు దర్శకత్వం వహించినప్పుడు విశ్వనాథ్ పాటలన్నీ దేవులపల్లి కృష్ణశాస్త్రి చేత రాయించారు. ఈ సినిమా సౌండ్ ట్రాక్ ను ప్రత్యేక రికార్డుగా విడుదల చేయడం విశేషం. మహదేవన్ సంగీతం సమకూర్చిన “రావమ్మా మహాలక్ష్మి రావమ్మా ఈ కోవెల నీ ఇల్లు కొలువై వుందువుగాని, కొలువై వుందువుగాని కలుముల రాణి” పాట బాగా పాపులర్ అయింది. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఈ పాటను అవుట్ డోర్ లో చిత్రీకరించారు. ముత్యాలవంటి ముగ్గులు పెట్టడం వాటిమీద గొబ్బిళ్ళు పెట్టి పండగ వాతావరణం సృష్టించడం; గోవులకు పసుపు కుంకుమ పెట్టడం, గాదెల్లో ధాన్యం నింపడం వంటి గ్రామీణ అలవాట్లను కళ్ళకు కట్టినట్టు చూపారు. సుశీల ఆలపించిన “ఎందుకీ సందెగాలి, సందెగాలి తేలి మురళి… తొందర తొందరలాయే విందులు విందులు చేసే” పాటను జమునమీద ఇండోర్లో చిత్రీకరించారు. ఈ పాటలో దేవులపల్లి “ఏనాటిదోగాని ఆ రాధా పల్లవ పాణీ…ఏమాయెనోగాని ఆ పిల్లనగ్రోవిని విని, ఏదీ ఆ యమున హృదయగీతిక” అంటూ చరణాన్ని అద్భుతంగా మలిస్తే, విశ్వనాథ్ రాధాకృష్ణుల ప్రతిమ మీద ఫోకస్ చేసి అంతే అద్భుతంగా ఆ చరణాన్ని రంజింపజేశారు. పాట చివర్న కృష్ణ వచ్చి తన్మయత్వంతో వినడంతో చిత్రాన్ని మలుపు తిప్పుతుంది. “అడుగడుగున గుడి వుంది అందరిలో గుడి వుంది ఆ గుడిలో దీపముంది అదియే దైవం” పాటను జమున పిల్లలకు ప్రబోధిస్తుండగా స్టూడియోలో చిత్రీకరించారు. విశ్వనాథ్ పాటల చిత్రీకరణలో ఆదుర్తి సుబ్బారావు ప్రభావం వుందనేది నిజం. హరిదాసు (ధూళిపాళ) కూతురు లక్ష్మి గా జమున నటించగా, కృష్ణ (కృష్ణ) ఆమెకు జోడిగా నటించాడు.

నటుడు, నిర్మాత బాలయ్య సమర్పణలో నిర్మించిన ‘చెల్లెలి కాపురం’ (1971) కూడా పల్లె వాతావరణంలో నిర్మించిందే. ఇందులో రెండు అద్భుతమైన పాటలకు విశ్వనాథ్ తన ప్రతిభతో చిత్రీకరణ జరిపారు. మొదటిది బాలు, సుశీల పాడిన యుగళగీతం “కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా తొలి చిగురుల చూడగానే కలకోకిల కూయదా” శోభన్ బాబు, వాణిశ్రీ లమీద ఒక ఊహాగానపు పాటగా చిత్రీకరించారు. బృందావన గార్డెన్స్ లో చిత్రీకరించిన ఈ పాట పూదోటల పరిమళాలతో నిండిన జలాశయాల నేపథ్యంలో షూట్ చేశారు. రెండవ పాట బాలు ఆలపించిన “ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ..నీ కులుకునుగని నా పలుకు విరియ… నీ నటననుగని నవ కవిత వెలయగా ఆడవే మయూరీ” అనేది. ఈ రెండు పాటల్ని రాసింది నారాయణరెడ్డి. పాటకు, నాట్యానికే మధ్య జరిగే పోటీ పాట ఇది. నారాయణరెడ్డి విజృంభించి సంస్కృత పదాలతో “ఫాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా, పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమదియై రోదించగా, హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధగణము కనిపించగా…” అంటూ ఆలపిస్తూ వాణిశ్రీని ఓడించడం ఈ పాట నేపథ్యం. ఇది విశ్వనాథ్ చేసిన గొప్ప ప్రయోగం.

ప్రముఖ పాత్రికేయుడు వాసిరాజు ప్రకాశం నిర్మించిన ‘కాలం మారింది’ (1972) చిత్రంలో దేవులపల్లి రచించగా ఘంటసాల ఆలపించిన “ఏతల్లి పాడేను జోల, ఏతల్లి ఊపేను డోల, ఎవరికీ నీవు కావాలి ఎవరికి నీమీద జాలి” పాటను విశ్వనాథ్ యెంతో హృద్యంగా మలిచారు. 1973లో అన్నపూర్ణా సినీ ఎంటర్ ప్రైజెస్ నిర్మాత క్రాంతికుమార్ విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శారద’ చిత్రాన్ని నిర్మించారు. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాటలన్నీ హిట్లే. సుశీల ఆలపించిన “రేపల్లె వేచెను వేణువు వేచెను, వనమెల్ల వేచేనురా… నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా” పాటను శారద తన భర్త రాకకోసం వేచిచూస్తూ పాడుతుండగా చిత్రీకరించారు. ఈ పాట నేపథ్యం కూడా గ్రామీణ ప్రాంతమే కావడం విశేషం. వీటూరి రచించిన “రాధాలోలా గోపాలా గాన విలోలా యదుబాలా నందకిశోరా, నవనీత చోరా బృందావన సంచారా” పాటను గుడిలో చిత్రీకరించారు.

వేటూరితో సాంగత్యం…

వేటూరి సుందరరామమూర్తి సినీ గేయ రచనా జీవితానికి ఓనమాలు దిద్దిన గురువు విశ్వనాథ్. ‘సిరికాకొలను చిన్నది’ అనే రేడియో సంగీత నాటిక ప్రభావంతో విశ్వనాథ వేటూరి చేత ‘ఓ సీత కథ’ చిత్రానికి మూడు పాటలు రాయించారు. ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో సూపర్ హిట్ పాట “ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈవేళా చెలరేగింది ఒక రాసలీల”. మూగదైన హీరోయిన్ జయప్రదకు నాట్యమంటే చెప్పలేనంత ఇష్టం. ఇందులో సాంబయ్య (చంద్రమోహన్) డప్పు వాయించుకుంటూ కాలంగడిపే యువకుడు. వీరిమధ్య సంధానకర్త గుడి పూజారి(జె.వి. రమణమూర్తి). జయప్రదకు చంద్రమోహన్ కాలి అందెల జత కొని తీసుకొచ్చి, తొడిగించి ఆమెలోవున్న నాట్యకళకు మెరుగులు దిద్దుతాడు. అప్పుడు వచ్చే ఊహాజనిత పాటగా “ఝుమ్మంది నాదం” పాటను ఊటీలో చిత్రీకరించారు. “ఎదలోని సొదలా ఎలదేటి రొదలా కదిలేటి నదిలా కళల వరదలా” చరణం కోసం జలపాతాలవద్ద చిత్రీకరణ జరిపి హీరోయిన్ లో నిద్రాణమై వున్న నాట్యకళ ఉరకలెత్తినట్లు చూపించారు. “సిరిసిరి మువ్వలు పులకించగా” అంటుండగానే చంద్రమోహన్ డప్పుతో ప్రత్యక్షమై పాటను అందుకోవడం మంచి ప్రయత్నంగా చెప్పుకోవాలి. “కైలాసమే వంగె నీకోసం” అంటున్నప్పుడు ఇంద్రధనస్సును చూపడం మంచి సింబాలిజం. “అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా అందరికీ అందనిదీ పూఛిన కొమ్మ” పాట ‘మూగమనసులు’ చిత్రంలో “ముద్దబంతి పూవులో మూగకళ్ల ఊసులో” అనే పాటను గుర్తుకు తెస్తుంది. ఆ సినిమాకు సహకార దర్శకుడే కాకుండా రెండవ యూనిట్ కు విశ్వనాథ్ దర్శకుడుగా వ్యవహరించడం విశేషం. “పలకమన్న పలకదీ పంచదార చిలక- నిదురించే పెదవిలో పదముంది పాడుకో” అంటున్నప్పుడు ఆమె మూగజీవి అని, ధైర్యంగా పెళ్లి వద్దని చెప్పలేని దుర్బరురాలు అని విశ్వనాథ్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ సన్నివేశంలో. 1975 లో డి.వి.ఎస్ రాజు నిర్మించిన ‘జీవనజ్యోతి’ చిత్రానికి దర్శకుడు విశ్వనాథ్. వాణిశ్రీ, శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో హీరోకి ఇల్లొకచోట, ఇల్లాలు మానసిక ఆసుపత్రిలో. ఆ నేపథ్యంలో వచ్చే జోలపాట “ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు, గోపాలక్రిష్ణయ్య రేపల్లెకు వెలుగు, మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు” సూపర్ హిట్టయింది. తదనంతర కాలంలో పదేళ్ళ తరవార విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘స్వాతిముత్యం’ (1985) సినిమాలో ఇలాంటిదే “వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి” పాటను విశ్వనాథ్ అందించారు. అయితే ఈ రెండు పాటల్ని నారాయణరెడ్డి రాయడం విశేషం. 1978 లో నిర్మాత మురారి యువచిత్ర బ్యానర్ మీద నోర్మించిన ‘సీతామాలక్ష్మి’ చిత్రంలో మహదేవన్ అందించిన సంగీతం అమృతంతో సమానం. అందులో దేవులపల్లి “మావిచిగురు తినగానే కోవిల పలికేనా కోవిలగొంతు వినగానే మావిచిగురు తొడిగేనా ఏమో ఏమవునోగాని ఆమని… ఈవని” అనే పాట రాశారు. ఈ పాటను చిత్తూరు దగ్గరవున్న కురబలకోట అనే వూరిలో చిత్రీకరించారు. ఈపాట మధ్యలో ఓ విజిల్ వినపడుతుంది. పాట సందర్భాన్నిబట్టి రైల్వే స్టేషన్ మాస్టర్ వేసే విజిల్ అది. ఆ ఊహ విశ్వనాథ్ దే. సినిమాలో కొండమీద క్లైమాక్స్, టూరింగ్ టాకీసు సన్నివేశాలతోసహా సింహభాగం ఇక్కడే చిత్రీకరణ జరిగింది. కొంత హార్స్లీ హిల్స్ వద్ద తీశారు. సినిమా 125 రోజులు ఆడింది. “సీతాలు సింగారం మా లచ్చి బంగారం” అనే పాట ఇంటర్వెల్ తరవాత వస్తుంది. ఈ పాట ఎందుకో మొదట విశ్వనాథ్ కు నచ్చలేదు. అయితే చిత్రీకరణ గొప్పతనంతో సూపర్ హిట్టయింది.

శంకరాభరణంతో విశ్వనాథ్ విశ్వరూపం…

భారతీయ సంస్కృతి మూలాల పట్ల కించిత్ వైకల్యం ఏర్పడుతున్న రోజులలో దానిని సరిదిద్దడానికి అమృతప్రాయమైన రీతిలో ఒక అద్భుతమైన కథని సృజించి అందులోని సజీవములైన పాత్రల ద్వారా భావితరాలకు స్పూర్తిదాయకంగా వుండేలా కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ తీర్చిదిద్దిన దృశ్యకావ్యం ‘శంకరాభరణం’. అందులో ముఖ్య నేపథ్యం లలిత శాస్త్రీయ సంగీతం. అది శాంతిని ప్రసాదించే ఒక అమృతధార. వేటూరి సుందరరామమూర్తి ఋషిప్రజ్ఞతతో ఇందులో పాటలు సృష్టించారు. “అద్వైతసిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము” అంటూ ఉపాసనాసిద్ధి నేపథ్యాన్ని వివరించారు. ఈశ్వరుని మెడలో ఆభరణంగా భాసిల్లే వాసుకే ‘శంకరాభరణం’ అని పురాణం చెబుతోంది. అలాంటి వాసుకి పాత్రే ‘శంకరం’ అనే తులసి కుమారుడు. గతస్మృతులను గుర్తుచేసుకుంటుండగా సినిమా ఊపందుకుంటుంది. “శంకర గళ నిగళము శ్రీహరి పదకమలము రాగరత్న మాలికా తరళము శంకరాభరణము” అంటూ ఆ శంకరం (తులసి) అనే కుర్రవాడి పాత్రను దృష్టిలో వుంచుకొని ప్రారంభగీతం “ఓంకారనాదానుసంధానమే శంకరాభరణము” అంటూ వేటూరి రాశారు. ఈ పాటను సినిమాకి మొదటి పాటగా జూలై 11, 1979 న విజయా గార్డెన్స్ రికార్డింగ్ థియేటర్ లో రికార్డు చేశారు సంగీత దర్శకుడు మహదేవన్. శంకరశాస్రి (జె.వి. సోమయాజులు) గానసభకు తన తల్లితో హీరోయిన్ తులసి (మంజుభార్గవి) వెళ్తుంది. ఆమె తల్లి రత్నపాప (ఝాన్సి) వేశ్య. అటువంటి గంజాయివనం లాంటి వేశ్య కుటుంబంలో పుట్టిన తులసి మొక్క వంటిది హీరోయిన్. ఈ పాట సాగుతున్నంతసేపు ఆమె మనోనేత్రం శంకరశాస్త్రి ఆలపిస్తున్న సంగీతం మీద కేంద్రీకృతమై వుంటే, తన తల్లి రత్నపాప ధ్యాననేత్రం రామవరం జమీందారు వంటి ఖరీదైన విటుడెవరైనా ఆ సభకు వచ్చి తన కూతురి అందాన్ని చూసి పొందు కోరుకుంటాడేమోనని ఎదురుచూస్తూ వుంటుంది. విశ్వనాథ్ ఈ ఒక్క సన్నివేశంలో తులసి పవిత్రతను, సంగీతనాట్యాల మీద ఆమెకున్న మక్కువను సినిమా తొలిభాగంలోనే నిర్ధారించారు. పల్లవి పూర్తికాగానే తులసి ‘ట్రాన్స్’ లోకి వెళ్ళిపోతుంది. శంకరాభరణ రాగానికి అనుగుణంగా నాట్యం చేస్తుంది. ఆమె ఊహాలోకంలో విహరిస్తూ గానంతోబాటు నాట్యాన్ని ఊహించుకుంటూ విహరిస్తున్నది అనేందుకు సాక్ష్యంగా వేదికవద్ద ఆమె ఆసీనురాలై తాదాత్మ్యం పొందుతున్న ఛందాన్ని దర్శకుడు ప్రేక్షకుడికి గుర్తుచేస్తారు. రెండవ చరణంలో “సత్యసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము” అంటున్నప్పుడు ఒక జమీందారు (భీమేశ్వరరావు) హాల్లోకి రావడం, కచేరీ జరుగుతుందన్న విచక్షణాజ్ఞానాన్ని మరచి కుర్చీ లాక్కుని రత్నపాపతో మాట్లాడుతుండగా, ఆ శబ్దానికి సంగీత ఏకాగ్రతకు భంగం వాటిల్లడంతో శంకరశాస్త్రి అర్ధాంతరంగా లేచి సభనుంచి నిష్క్రమించడం అద్భుతంగా విశ్వనాథ్ చిత్రీకరించారు. ఈ పాట అనంతరం సినిమా మలుపు తిరుగుతుంది. తులసిని జమీందారు బలాత్కారం చేయడం, తులసి అతణ్ణి హతమార్చి ఆ నెత్తుటి చేతులతో శంకరశాస్త్రి పాదాలను ప్రక్షాళన చేయడం, గర్భవతి కావడం వంటి సన్నివేశాలతో ఆ 14రీళ్ల సినిమా మలుపులు తిరుగుతుంది. నృత్యదర్శకుడు శేషు ఈ పాటకు అద్భుతంగా శాస్త్రీయ నృత్యరీతుల్ని కంపోజ్ చేయగా సినిమాటోగ్రాఫర్ బాలుమహేంద్ర అంతే అందంగా అవుట్ డోర్ లో మంజు భార్గవి నృత్యరీతుల్ని సెల్యూలాయిడ్ మీదకు ఎక్కించారు. ఇందులో గోపాలం పాత్రలో సాక్షి రంగారావు చేత మృదంగ నాదాన్ని అతి సహజంగా చిత్రీకరించడం కూడా విశ్వనాథ్ ప్రతిభే అనాలి. ఇక బెంగుళూరులో కన్నడ సంఘం వారు శంకరశాస్త్రికి ఘనసన్మానం చేసిన సందర్భంగా శాస్త్రి గారు చేసే కచేరిలో వినవచ్చే “రాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతేరమన్నవి” అనే పాటలో గంధర్వ కన్యలా నర్తిస్తున్న అనుభూతి పొందుతున్నట్లు మంజుభార్గవి విశ్వరూపాన్ని దర్శకుడు ఆవిష్కరించారు. హాళిబీడు నృత్యశిల్పసంపదను, కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద గల గోదావరి నదిని నేపధ్య వేదికగా చేసుకుని చిత్రీకరించిన ఈ పాట చిత్రానికి హైలైట్ గా నిలిచింది. యుగాలు అంతరించిపోతున్నా సంగీతమనే జీవకళకు చావు, అంతం లేదనే సంకేతాన్ని దర్శకుడు ప్రతి ఫ్రేములో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక హిందోళ రాగంలో వినిపించిన “సామజవర గమనా సాదుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత” అనే త్యాగరాయ కృతిని రాజ్యలక్ష్మి మీద చిత్రీకరించిన తీరు కూడా వర్ణనాతీతం. త్యాగరాజు లిఖించిన “దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ” తో మొదలుపెట్టి వేటూరి క్లైమాక్స్ గీతాన్ని “రాగాలనంతాలు నీ వేయిరూపాలు భవరోగ తిమిరాలు పోకార్చు దీపాలు” అంటూ చరణాలు పూర్తిచేసిన విధానం ప్రేక్షకుణ్ణి కంట తడిపెట్టించింది. రాజమండ్రి శ్రీరామలింగేశ్వరా కళ్యాణమంటపం లో ఈ పాటను షూట్ చేశారు.

Kamal with Viswanath

విశ్వనాథ్ ప్రభంజనం…

వేటూరి రాకతో విశ్వనాథ్ సినిమా సంగీతంలోను, సాహిత్యంలోను, సన్నివేశ చిత్రీకరణలోను పెనుమార్పులు వచ్చాయి. ప్రాసక్రీడలాడడం వేటూరికి ‘పెన్ను’తోపెట్టిన విద్య. స్వరపద సంధానం సాధించడానికి కావలసిన మెలకువలన్నీ వేటూరి వద్ద వున్నాయి. వీరిరువురికి తోడు మహదేవన్ వుండడం కలసొచ్చిన అంశం. ‘సాగరసంగమం’(1983) లో వేటూరి రాసిన “వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే మా ముద్దు గోవిందుడే” పాట చిత్రీకరణ ఒక అద్భుతం. ఈ పాటను విశాఖపట్నంలోని పార్క్ హోటల్ ప్రాంగణంలో తీశారు. నాట్యమంటే ఓనమాలు రాని ఒక డ్యాన్స్ డైరెక్టరు (మిశ్రో) ఈ పాటను ఆధునికంగా కంపోజ్ చేస్తే అసలు సిసలైన అభినయం ఈ పాటకే ఎలావుండాలో కమల హాసన్ తెలియజెప్పే సన్నివేశానికి ముడిపడిన పాట ఇది. పూర్వార్ధంలో భాగవత సారాంశాన్ని, ఉత్తరార్ధంలో మహాభారత సారాంశాన్ని నిక్షేపించి ప్రేక్షకులను పరవశింపజేసిన పాట ఇది. గాయని ఎస్.పి. శైలజ చేత జయప్రద కూతురుగా నటింపజేసి ఆమెచేత తెరంగేట్రం చేయించి నూతనత్వాన్ని తెచ్చిన ఘనత విశ్వనాథ్ దే. “మౌనమేలనోయి ఈ మరపురాని రేయి” పాటను కూడా విశాఖపట్నంలోనే చిత్రీకరించారు. ఇందులో కమలహాసన్ చేసిన నృత్యాలను తిలకించిన కథక్ నాట్యాచార్యుడు బిర్జూ మహారాజ్ స్వయంగా కమల్ ఇంటికివెళ్ళి నాట్యం మీద రెండుగంటలపాటు చర్చలు జరిపి కమల్ ను ఆశీర్వదించారు. కమల్ తల్లి కూడా ఈ చిత్రంలోలాగే కమల్ అరంగేట్రం చూడకుండానే కాలం చేశారు. కమల్ తండ్రి కూడా ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ వంటి నాట్యప్రదానమైన సినిమాలో నటించమని కోరుతుండేవారట. ఆ రెండు కోరికలు ఇలా తీరాయని కమల్ చెప్పుకున్నారు. ఈ సినిమాలో పాటల పాత్ర వాటి చిత్రీకరణ గొప్పతనం నభూతో న భవిష్యతి. తరవాత కమల్ నటించిన మరొక విశ్వనాథ్ చిత్రం ‘స్వాతిముత్యం’(1985) నాలుగు నంది బహుమతుల తోబాటు ఫిలింఫేర్ బహుమతి కూడా అందుకుంది. రాజమండ్రి, తొర్రేడు, పట్టిసీమ, తాడికొండ వంటి కోస్తాప్రాంతాల్లో సినిమాతోబాటు పాటల చిత్రీకరణ జరిపారు. “సువ్వి సువ్వి సువ్వాలమ్మా”, “రామా కనవేమిరా రఘురామ కనవేమిరా” పాటను పట్టెసీమలో చిత్రీకరించారు. ఈ రెండుపాటలకు సినిమా కథతో అవినాభావ సంబంధముంది. ఇక “వటపత్ర శాయికి” అనే జోలపాటగురించి ముందే చెప్పుకున్నాం. ఇళయరాజా ముందుగా ఇచ్చిన ట్యూనుకు కాకుండా విశ్వనాథ్, నారాయణరెడ్డి మరోవిధంగా పాటను సమకూర్చితే, అందుకు అనుగుణంగా ఇళయరాజా మట్లు కట్టడం ఈ పాట గొప్పతనం.

సిరివెన్నెలతో సంగీత బంధం…

1986లో విడుదలైన ‘సిరివెన్నెల’ చిత్రం ద్వారా సీతారామశాస్త్రి వెండితెరకు పరిచయమయ్యారు. అందులో శాస్త్రి రచించిన పాటలు సాహిత్యపరంగా గొప్పవిగా నిలిచాయి. తొలిపాటగా శాస్త్రి రాసిన “విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం…” అంటూ మొదలై “విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం” గా సాగే మొహనరాగపు ఈ పాటలో శాస్త్రి కఠినమైన సంస్కృతపదాలు పొదిగారు. “ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన, జాగృత విహంగతతులే వినీల గగనపు వేదికపైన” వంటి వాక్యాలతో కూడుకున్న పాటను అంధుడైన గొప్ప వేణుగాన విద్వాంసుని మీద చిత్రీకరించిన పాట ఇది. విశ్వసృష్టికి మూలాధారమైన ఓంకారనాద ప్రాముఖ్యాన్ని అద్భుతంగా విశ్వనాథ్ ఈ పాటద్వారా ఆవిష్కరించారు. తూర్పుదిక్కు అనే వీణకి సూర్యకిరణాలను తంత్రులుగా కూర్చి ఆకాశమనే రంగస్థలం మీద పక్షిగణం రెక్కలనే వ్రేళ్ళతో సృష్టిస్తున్న కిలకిలారావాలు నిద్రాణమై వున్న జగతిని మేలుకొలుపుతున్నాయనే భావనలో శాస్త్రి ఈ పాటను రాయడం జరిగింది. మహదేవన్ సంగీతం, హరిప్రసాద్ చౌరాసియా వేణునాదం, విశ్వనాథ్ చిత్రీకరణ ఈ పాటకు ప్రత్యేకత చేకూర్చింది. ఈ సినిమాలోనే “ఈగాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ననుగన్న నావాళ్లు, నాకళ్ళ లోగిళ్ళు”, “ఆదిభిక్షువు వాడినేదికోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది” అద్భుతాలు కాగా ఒక అంధురాలైన బాలికకు వెన్నెల్లో చందమామ ఎలావుంటుందో చూపడం విశ్వనాథ్ చేసిన ప్రయోగం. 1992 లో వచ్చిన ‘స్వాతికిరణం’ చిత్రంలో సిరివెన్నెల గీతం “తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఇలగొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ” ఒక తాత్విక గీతంగా భాసిల్లింది. ఈ పాటను వింటుంటే ‘మేఘసందేశం’ చిత్రానికి దేవులపల్లి రాసిన “ముందు తెలిసేనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా” గుర్తురాకమానదు. ఇక 1987లో వచ్చిన ‘శ్రుతిలయలు’ చిత్రంలో “తెలవారదేమో స్వామీ నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలవేలు మంగకు” అనేపాటను అన్నమాచార్యుల కీర్తనగా భ్రమించేలా సీతారామశాస్త్రి రాయడం ఒక ఎత్తైతే ఈ పాటకు పల్లవిని విశ్వనాథ్ సూచించడం మరో ఎత్తు. అందులో ఒక చరణంలో “కలల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి” అంటూ అభివ్యక్తీకరించడం శాస్త్రి భావుకతకు దర్పణం. 1988 లో విడుదలైన ‘స్వర్ణకమలం’ చిత్రంలో పాటల్ని విశ్వనాథ్ కాశ్మీర్ లో చిత్రీకరించారు. ఉత్తమగీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పది నందులు గెలుచుకోగా, ‘స్వర్ణకమలం’ లో ఆయన రాసిన “అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా, అమితానందపు ఎదసడిదా” పాట ఆ బహుమతులు తెచ్చిపెట్టిన దానిలో ఒకటి కావడం విశేషం. ఈ చిత్రంలో విశ్వనాథ్ చూపిన కళాప్రతిభకు “కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి”, “ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్లు”, “శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వ” పాటల చిత్రీకరణ కొలమానమే!

శివ సాన్నిధ్యం చేరుకున్న కాశీనాధుని విశ్వనాథుడు నిరంతరం మన మదిలోనే మెలుగుతుంటారనేది నిజం!
-ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap