‘సిరిసిరిమువ్వ’ మూగబోయింది…

కాశీనాథుని విశ్వనాధ్ వెళ్లిపోయారు. మరో పదిహేను రోజులలో తన 94 వ పుట్టిన రోజు జరుపుకోకుండానే విశ్వనాధ్ వెళ్లిపోయారు. తన ఇరవై ఒకటవ ఏట శబ్ద గ్రాహకుడుగా సినిమా రంగంలో అడుగుపెట్టిన విశ్వనాధ్ ఆ తరువాత దర్శకుడుగా చరిత్ర సృష్టించారు. 1965లో వచ్చిన ఆత్మ గౌరవం ఆయన మొదటి సినిమా కాగా 2010 లో వచ్చిన శుభప్రదం ఆయన చివరి సినిమా. ఇంత సుదీర్ఘమైన కెరీర్ లో ఆయన అందుకోని అవార్డులు లేవు. చేరుకొని శిఖరాలూ లేవు. అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ అవార్డు ఆయన్ని వరించాయి. తెలుగు సినిమా మీద ఆయన ముద్ర ఏమిటి ? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు ఆయనకు ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన పలు వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు గుర్తుకు వచ్చాయి

ఒక విమర్శకుడు….

“సాహిత్యం లో విశ్వనాథ సత్యనారాయణ చేసిన పనే సినిమాలలో కె. విశ్వనాధ్ చేశాడు. కాక పోతే విశ్వనాథ సత్యనారాయణ విద్యుత్ ప్రవేశాన్నీ, రైళ్ల ప్రవేశాన్ని కూడా వ్యతిరేకించే చాంధసుడు. సినిమా విశ్వనాధ్ మాత్రం ఉపరితల రిఫార్మ్ రూట్ తీసుకున్నాడు. ఒక రకంగా వివేకానంద స్కూల్ అని చెప్పవచ్చు” అని వ్యాఖ్యానించాడు.

ఇంతకూ విశ్వనాధ్ దృక్పథం ఏమిటి ?

సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ దృక్పథం అందరికీ తెలిసిందే. ఆయనకు సనాతన ధర్మం ప్రధానం. తన రచనా వ్యాసంగం యావత్తు ఆ సనాతన ధర్మాన్ని తన సమకాలీన సమాజంలో ప్రతిషించటానికి కృషి చేశాడు ఆయన అనితర సాధ్యమైన రచన వేయి పడగలు లో చివరకు చిన్న ధర్మారావు చిన్న అరుంధతి మిగులుతారు. చివరకు ఏమి మిగిలినది అని ప్రశ్నిస్తే చివరకు నీవు మిగిలితివి. చివరకు నేను మిగిలితిని అని చిన్న ధర్మారావు చిన్న అరుంధతి తో అంటాడు. చిన్న ధర్మా రావు విశ్వనాధ కోరుకున్న ధర్మానికి ప్రతీక. ఆ ధర్మం ఒక తరం నుండి మరొక తరానికి పయనిస్తూ ఉంటుందని అది సజీవమని విశ్వనాథ భావన.

అచ్చు ఇలాగే సినిమా విశ్వనాధ్ కూడా శంకరాభరణం సినిమాలో పాశ్చ్యాత్య సంగీతం ధాటికి రెప రెప మంటూ కొడిగట్టబోతున్న సంప్రదాయ సంగీతానికి శంకర శాస్త్రిని కాపు కాసే ధీరోదాత్తుడుగా సృష్టించి ఆ సంప్రదాయ వారసత్వాన్ని తులసి చేతిలో పెట్టి కన్ను మూస్తాడు. అలాగే సాగర సంగమం సినిమాలో బాలకృష్ణ సాంప్రదాయ నృత్య వారసత్వాన్ని శైలజ చేతి లో పెడతాడు.

ఈ సన్నివేశాలు చూసినప్పుడు పై వ్యాఖ్యలు నిజమే అనిపిస్తాయి. నిజం కూడా. ఇలా తాను నమ్మిన ధర్మాన్ని ముందు తరాలకి అందించాలనుకోవడం ఉక్క పోత కి గురి చేస్తుందా ? అది సమాజంలో ఆవిరై విజిల్ వేసే స్థాయికి వచ్చిందా అన్నది ప్రశ్న.

ఇలాంటి ముగింపులు మనకు ఆర్. నారాయణమూర్తి సినిమాలలో కూడా కనిపిస్తాయి. ఒక చిన్న పసిపిల్లాడు ఎర్ర జెండా భుజాన మోసుకుంటూ తూర్పు దిక్కుకు పరుగెత్తడం, లేదా ఎర్రగా జ్వలిస్తున్న సూర్యబింబం మెల్ల మెల్లగా పైకి వస్తున్నట్టు ప్రతీకాత్మకం గా చూపించడం చాలా సినిమాలలో కనిపిస్తుంది. విప్లవం చిరంజీవి అని చూపించినట్టు గానే విశ్వనాధ్ కూడా సంప్రదాయం కూడా చిరంజీవి అంటాడు. విప్లవ కార్యాచరణలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ దానిని అక్కున చేర్చుకున్నట్టు గానీ కొన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ సంప్రదాయాన్ని అక్కున చేర్చుకుంటే ఉక్క పోత అనుభవించాలా.

ఒక సామాజిక మార్పు ఏ ఒక్కరితోనో ఏ ఒక్కవిధానం తోనో సాధ్యపడదు. ఆలోచనా శీలురు అయిన సృజనకారులు తమ తమ మార్గాలలో కృషి చేస్తారు అలా తనదయిన మార్గం లో కృషి చేసినవారు కె. విశ్వనాధ్. ఆయన తన భావాలకి దృశ్య రూపం ఇచ్చి తన ఆలోచనలని సమాజం తో పంచుకున్నారు. హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ. అది సృష్టించే విలయం దానిని సమూలంగా మార్చవలసిన. అలా మార్పుకు దోహదం చేయడానికి తన దగ్గర ఉన్న ఆయుధాలు గురించి బాగా అవగాహన వున్నవారే విశ్వనాధ్.

ఒక రకం గా ఆయన ఉదార సంప్రదాయ వాది. సంప్రదాయం పట్ల ఆయనకీ ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం ఉన్నది. అదే సమయం లో దాని లోని దుర్లక్షణాల గురించిన గ్రహింపు కూడా ఉంది. ఏ సంప్రదాయానికైనా అంతర్లీనం గా మానవత్వమే తాత్విక భూమిక గా ఉంటుంది. కనుక ఆ దుర్లక్షణాలని సంప్రదాయం లో నుండి తొలగిస్తే అది సర్వజనామోదం పొందుతుంది. మనిషి ఆలోచనా పరిధిని విస్తరించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది అన్నది విశ్వనాధ్ విశ్వాసం. ఆలోచనా పరిధిని విస్తరించడానికి దృశ్యాన్ని మించిన సాధనం మరొకటి లేదు . శంకరాభరణం లో ఆయన చేసింది అదే. ఒకశుద్ధ బ్రాహ్మణుడు ఒక వేశ్యను ఆదరించడం కేవలం ఆలోచనని విస్తరించడం ద్వారా మాత్రమే జరుగుతుంది.

శంకరాభరణం, సప్తపది లాంటి ఒకటి రెండు సినిమాలలో తప్పిస్తే బ్రాహ్మణ ఆచార వ్యవహారాలూ మరెక్కడా కనిపించవు విశ్వనాధ్ సినిమాలలో. అవి రెండూ బ్రాహ్మణులు కేంద్రంగా నడిచిన సినిమాలు. విశ్వనాధ్ ఏ సినిమాలోనూ ఒక వ్యక్తి పుట్టుక చేత బ్రాహ్మణుడు కావటం వలన మాత్రమే గొప్పవాడు అని చిత్రీకరించలేదు. గీత లో చెప్పినట్టు “చాతుర్వర్ణం మయా సృష్టం” కృషి చేత ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చు అన్నది ఆయన విశ్వాసం . ఇక్కడ బ్రాహ్మణత్వం అనేది గుణానికి సంబంధించిన విషయం. స్వయం కృషి సినిమా లో చెప్పులు కుట్టుకునే వాడు కథానాయకుడు. అతడు స్వయం కృషి చేత గొప్పవాడు అవుతాడు. శుభ సంకల్పం లో జాలరి. సూత్రధారులు లో గంగిరెద్దులు ఆడించే వారు కథానాయకులు. వీళ్ళందరూ బ్రాహ్మణ భావజాలం తో ఏమీ మనకు కనిపించరు. వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వాళ్ళ సామాజిక స్థాయికి అనుగుణం గానే కనిపిస్తుంది. పైగా కృషి చేత ఉన్నతి సాధించడం కనిపిస్తుంది.

బాలచందర్ లాగా అర్బన్ మొరాలిటీ మీద విశ్వనాధ్ తిరుగుబాటు జెండా ఎగుర వేయలేదు. అందుకే బాలచందర్ నచ్చినంత గా విశ్వనాధ్ నచ్చడు. బాలచందర్ స్కూల్ వేరు. విశ్వనాధ్ స్కూల్ వేరు. విశ్వనాధ్ ది సామరస్యపథం. శ్రీ శ్రీ, సినారె ల మధ్య ఉన్న వ్యత్యాసమే ఈ ఇద్దరి మధ్యా వున్నది. విశ్వనాద్ సృజనకి కొన్ని పరిమితులు వున్నాయి. ఆ మాటకొస్తే ఏ సృజనకారుడి సృజనకు అయినా కొన్ని పరిమితులు ఉంటాయి. చరిత్రలో ఆ సృజనకారుడిని స్థానాన్ని అంచనా వేసేటప్పుడు ఆ పరిమితులను కూడా పరిగణన లోకి తీసుకోవాలి. శ్రీ శ్రీ భాషను పరిగణన లోకి తీసుకుని ఆయనను పక్కా ఫ్యూడల్ అనడం హాస్యాస్పదంగా ఉంటుంది.

మానవ సహజమైన అనుభూతులకు కుల పరమైన, మతపరమైన, లింగపరమైన విభజనలు ఉండవు. విశ్వనాధ్ సినిమాలు అన్నీ భావోద్వేగాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. భావోద్వేగానికి బ్రాహ్మణుడు అయినా పంచముడు అయినా ఒకటే. భావోద్వేగాన్ని అండర్లైన్ చేయడమే విశ్వనాధ్ సినిమాలు ముఖ్య లక్షణం.

బాపు లాగా శుద్ధ కళాత్మక వాది కూడా కాదు విశ్వనాధ్ . అందుకే విశ్వనాధ్ మీద ఉన్నన్ని ఫిర్యాదులు మనకు బాపు మీద వుండవు. బాపు కళాత్మక సౌందర్యానికి మంత్రముగ్ధులం అయినట్టుగా విశ్వనాధ్ సినిమాలకి మనం మంత్రముగ్ధులం కాలేము. బాపు సినిమాలు హృదయానికి పని పెడితే, విశ్వనాధ్ సినిమాలు ఏక కాలంలో హృదయానికి, మెదడుకు పని పెడతాయి. హృదయం బావుంది అంటుంది. మెదడు బావుందా అంటూ ప్రశ్నిస్తుంది . ఈ రెండింటినీ సమన్వయం చేయడం కష్టం.

సాధించాల్సిన లక్ష్యం ఒకటి ఉన్నప్పుడు, దానిని సాధించడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ఎవరికీ నచ్చిన మార్గాన్ని వారు ఎన్నుకోవచ్చు. ఆ మార్గం లో ముందుకు పోవచ్చు. ఫలానా దారి సరి అయినది అని ఎలా చెప్పగలం ? గమనమూ గమ్యమూ రెండూ ముఖ్యమే అయినప్పుడు ఒకదానిని మరొకటి ఓవర్ లాప్ చేయకూడదు.

మొత్తంగా చూసినప్పుడు సామాజిక చలన సూత్రాల పట్ల విశ్వనాధ్ కి కావలసిన అవగాహన వున్నది. అది అతడు పుట్టి , పెరిగిన వాతావరణానికి అనుగుణంగా ఉండటం లో వింతేమీ లేదు. అయితే ఒక సృజనకారుడిగా ఆయన తన చుట్టూ ఉన్న సమాజం నుండి తన మనసులోకి కొంత తీసుకుని, తననుండి కొంత ఇచ్చే క్రమంలో ఉదార సంప్రదాయ వాదీగా మిగిలిపోయారు.
ప్రస్తుతం ఉన్న విభిన్న అస్తిత్వాల సామాజిక సంవేదనల నేపధ్యంలో ఒక సద్బ్రాహ్మణుడు ఒక దళిత జీవితాన్ని దృశ్యమానం చేస్తే దళిత జీవితం గురించి నీకేం తెలుసు? అంటారు. పోనీ తన మానాన తనకు తెలిసిన జీవితాలను చిత్రిస్తే ఈ సామాజిక కోణం లోపించింది అంటారు. ఏ రీతిన రాసినా సమకాలీనులు మెచ్చరే అని చేమకూర వెంకట కవి వా పోయింది ఇందుకేనేమో?

శివ తాండవ కేళిలో
ఘల్లుమని మోగడానికి
ఒక సిరిసిరిమువ్వ
నింగి కెగసింది

కాశీనాధుని విశ్వనాద్ గారికి కంటి నిండా నీళ్లతో……

-వంశీ కృష్ణ

SA: