4,270కిలోమీటర్ల లక్ష్యం…
వీపుమీద 20 కేజీల బరువు…
152 రోజుల నడక…
రాళ్లూరప్పలు.. ఎడారి దారులు.. దట్టమైన అడవులు.. చిన్నచిన్న పర్వతాలు.. ఆ పక్కనే లోయలు.. అడుగువేస్తే జారిపోయే మంచుకొండలు.. వెన్నులో వణుకుపుట్టించే ఇలాంటి ప్రాంతాల్లో అలుపెరగక నడిచిన బహుదూరపు బాటసారి కార్తికేయ నాదెండ్ల. తన జీవన గమనానికి.. జీవిత గమ్యానికి సంబంధించిన సత్యాల ప్రతిధ్వనిని వినేందుకు వందల మైళ్ల దూరం ఒక్కడిగా నడిచే లక్ష్యాన్ని, ధైర్యాన్ని తెచ్చుకుని తనకు తాను మార్గనిర్దేశనం చేసుకున్నారాయన. ‘ఫెసిఫిక్ క్రెస్ట్ ట్రయల్’ పేరుతో మెక్సికో నుంచి కెనడా వరకు హైకింగ్ (ట్రెక్కింగ్) చేస్తూ లక్ష్యాన్ని ఛేదించారు. కెనడాలోని మ్యాక్సీ మస్ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కార్తికేయ బెజవాడ బిడ్డే. అరుదైన సాహస యాత్రను పూర్తి చేసుకుని ఇటీవల విజయవాడ వచ్చిన కార్తికేయ తన అనుభవాలను 64కళలు.కాం తో పంచుకున్నారు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
యాత్ర ప్రారంభమైందిలా… ఫెసిఫిక్ క్రెస్ట్ ట్రయల్ వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు కెనడాలో నేను పనిచేస్తున్న ఉద్యోగం మానేయాలనుకున్నాను. ఇదే విషయాన్ని సంస్థ ఉన్నతాధికారులకు చెప్పాను. వారు నన్ను ప్రోత్సహించారు. ‘ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు. నీ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని రా..’ అని ఆరు నెలలు ప్రత్యేక సెలవు మంజూరు చేశారు. అక్కడి నుంచి ఏప్రిల్ 24న రైలులో కాలిఫోర్నియాకు వెళ్లాను. అక్కడి నుంచి శాండియోలో ప్రాంతానికి రోడ్డు మార్గాన వెళ్లాను. గంటన్నరపాటు కారులో ప్రయాణించి మెక్సికో బోర్డరుకు చేరుకున్నాను. అక్కడ నాలాంటి వాళ్లు 600 మందికిపైగా ఉన్నారు. అక్కడ పర్యాటకశాఖ అధికారుల అనుమతి తీసుకున్నాక ఇంతకుముందు యాత్రను విజయవంతంగా పూర్తిచేసిన అనుభవజులతో ప్రత్యేక సమావేశం జరిగింది. కాగితంపై రూట్ మ్యాప్ ఇచ్చారు. జాగ్రత్తతో కూడిన పుస్తకమిచ్చారు. మొబైల్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. అంతా సిద్ధమయ్యాక అందరితో కలిసి యాత్ర ప్రారంభించాను.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
4,270 కిలోమీటర్ల నడక మాది విజయవాడే. నాన్న నాదెండ్ల శ్రీనివాసరావు ఆడిటర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అమ్మ జానకి గృహిణి. నేను పదో తరగతి వరకు వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూలులో చదువుకున్నాను. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (ఈఈఈ) పూర్తి చేశాక ఎంఎస్ చేయడం కోసం కెనడా వెళ్లాను. చదువు పూర్తయ్యాక అక్కడే మంచి జీతంతో ఉద్యోగంలో స్థిరపడినా జీవితంలో ఏదో తెలియని వెలితి ఉండేది. ఈ క్రమంలోనే ఫెసిఫిక్ క్రెస్ట్ ట్రయల్ గురించి తెలుసుకున్నాను. ఏప్రిల్ 30న మొదలైన నా ప్రయాణం సెప్టెంబరు 28 నాటికి విజయవంతంగా ముగిసింది. దాదాపు 4270 కిలోమీటర్ల మేర సాగిన సుదీర్ఘ నడక ఎడారుల్లో, అత్యధిక ఉష్ణోగ్రతల్లో, మంచుకొండల్లో జీరో డిగ్రీల మధ్య సాగింది. విపరీతమైన చలి, ఒక్కోసారి మంచు గడ్డలపైనే నిద్ర… ఇలా అనేక కష్టాలు పడి లక్షా ్యన్ని సాధించాను. నడకకు అవసరమైన సరంజామాతో ఉన్న నా బ్యాగ్ బరువు 20 నుంచి 25 కేజీలు. ఆ బరువును వీపుపై మోసుకుంటూనే ఎత్తయిన పర్వతాలు, లోయలు, అడవులను దాటుకుంటూ ముందుకు సాగాను.
ఎడారిలో ప్రయాణం మొదటి వారంలో రోజుకు 24 కిలోమీటర్లు మాత్రమే నడిచాను. నా శరీరం అక్కడి వాతావరణానికి, ఆ ప్రాంతాల్లో నడకకు అలవాటయ్యే వరకు రెండు వారాలు నడక పరిమితంగానే సాగింది. మూడో వారంలో రోజుకు 32 కిలోమీటర్లు నడిచాను. మొత్తం ప్రయాణంలో 1,120 (700 మైళ్లు) పూర్తిగా ఎడారిలోనే సాగింది. 35 రోజులు ఎడారి ప్రయాణం సాగింది. చిన్నచిన్న కొండలు, ఎటుచూసినా ఇసుక.. మధ్యాహ్నం ఎండ మండిపోయేది. చెమట పట్టేది కాదు. అయితే, ఉక్కపోత ఉండేది కాదు. కానీ, శరీరం డీ హైడ్రేషన్‌కు గురై నీరసం వచ్చేది. కండరాలు పట్టేసేవి. శరీరం సహకరించేది కాదు. ఎండబారి నుంచి రక్షణ కోసం శరీరమంతా కప్పి ఉంచేలా దుస్తులు ధరించేవాడ్ని.
దాహం వేయకపోయినా ఐదు లీటర్ల నీరు తాగుతూ సమస్యలను అధిగమించాను. ఎడారుల్లో పాములు, తేళ్లు వంటి విషపూరిత కీటకాలు ఎక్కువ. వాటి నుంచి తప్పించుకున్నప్పటికీ ఎండ తీవ్రత వల్ల శరీరమంతా బొబ్బలొచ్చాయి. ఎడారి దాటే సమయానికి 600 మందికి పైగా ఉన్న యాత్రికుల్లో ఐదుగురమే మిగిలాం. ఆస్ట్రేలియాకు చెందిన మిషన్, నెదర్లాండకు చెందిన జాఫీ, ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్చత్ నాకు మంచి మిత్రులయ్యారు.
మంచుకొండల్లో… జూన్ 17వ తేదీ నాటికి విపరీతమైన మంచుకొండల్లో నడవాల్సి వచ్చింది. ఇక్కడ వాటర్ బరువు మోత తగ్గినా.. దాని స్థానంలో ఉన్ని దుస్తులు, జాకెట్లు, స్పైక్స్ జత, ఐన్యాక్స్ స్టిక్ వంటివి పెరిగాయి. ఉదయం.. సాయంత్రం అక్కడ నడక నరకప్రాయం. మంచు గడ్డకట్టి ఉండటం వల్ల నడక ముందుకు సాగేది కాదు. దారిలో ఎలుగుబంట్లు, పర్వతశ్రేణుల్లో ఉండే సింహాలు ఎదురయ్యేవి. వాటిని చూసి భయపడి పారిపోతే సహచర సాహసికులతో కార్తికేయ వాటికి ఆహారమైపోతాం. అలాకాకుండా అక్కడే నిలబడి వాటిని చూస్తూ పెద్ద పెద్దగా అరిస్తే అవి భయపడి పారిపోతాయి. మంచుకొండల్లో చలికి ఒళ్లంతా గడ్డ కట్టేది. మట్టి ప్రదేశాలను ఎంచుకుని టెంట్లు వేసుకుని నిద్రపోవాలి. పగలు 10 డిగ్రీల కన్నా తక్కువ..
రాత్రికి జీరో డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. అలాంటి వాతావరణంలో నదులు దాటుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. నదుల్లో దిగినప్పుడు శరీరం చలితో గడ్డకట్టినంత పనయ్యేది.
రూటు మారి ఒంటరిగా.. ఎడారులు. మంచుపర్వతాలు కలగలిసిన ప్రాంతాల్లో దట్టంగా పెరిగిన ఎత్తయిన చెట్ల మధ్య నడక ప్రారంభమైంది. అప్పటికి మూడు నెలలు పూర్తయింది. 1,900 కిలోమీటర్లు నడిచాం. 50 నుంచి 60 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న నిక్స్ ప్రాంతాల్లో నడక పెద్ద సవాల్. తాగడానికి నీళ్లు దొరకవు. నాతోపాటు వచ్చిన మిత్రులు కనిపించలేదు. రూట్ మారి ఒక్కడినే మిగిలాను. లక్ష్యాన్ని చేరుకోగలనా? అనే అనుమానం మొదలైంది. శరీరమంతా నొప్పులు.. మందులు వాడితే కాస్త ఉపశమనం లభించేది. ఈ ప్రాంతంలో భోజనం చేసిన చోట టెంట్ వేసుకుని నిద్రపోకూడదని మాకిచ్చిన పుస్తకంలో ఉంది. అది నేను చదవలేదు. భోజనం తిన్న చోటే టెంట్ వేసుకుని నిద్రపోయాను. నేను తిన్న భోజనం వాసన పసిగట్టిన ఎలుగుబంట్లు నా చుట్టూ చేరాయి. నా పని అయిపోయిందనుకున్నాను. కదలకుండా అలాగే పడుకున్నాను. తెల్లారాక అవి వెళ్లిపోయాయి. ధైర్యం తెచ్చుకుని మళ్లీ నడక ప్రారంభించాను. సెప్టెంబరు 10వ తేదీకి 3,436 కిలోమీటర్లు నడిచాను. వాషింగ్టన్ అడవుల్లో ప్రయాణం సాగుతున్నప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన మిషన్ మళ్లీ జత కలిశాడు. చాలా ఆనందం వేసింది. ఇద్దరం కలిసి మరో 18 రోజులు నడిచాం. ఆ అడవుల్లో రోజూ వర్షం పడేది. దారి కనిపించేది కాదు. బురదలో నడక కష్టంగా ఉండేది. నిద్రపోవడానికి చోటు దొరికేది కాదు. హెడ్ లైట్ వెలుతురులో రాత్రంతా నడిచిన రోజులున్నాయి. ఆరు రోజులపాటు మంచు తుపాను రావడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటికి లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం 46 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఉత్సాహంతో మళ్లీ అడుగులు ముందుకేశాం. కానీ, అనుకున్నంత వేగంగా ప్రయాణం సాగలేదు. మరుసటి రోజు రాత్రి 11 గంటలకు గమ్యానికి 6 కిలోమీటర్ల దగ్గరకు చేరుకున్నాం. అలసటతో అక్కడే నిద్రపోయాం . తెల్లారేసరికి మంచులో కూరుకుపోయాం . తెల్లారిన తర్వాత మిగిలిన 6 కిలోమీటర్ల నడక పూర్తి చేసి లక్ష్యాన్ని ఛేదించాం. అప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. నా మిత్రుడు మీషన్ అక్కడి నుంచే మరో సాహస యాత్రను లక్ష్యంగా పెట్టుకుని నడక ప్రారంభించాడు. నేను మిగిలిన సెలవులను గడపడానికి భారత్ కు వచ్చాను. ఈ ప్రయాణంలో 12 రోజులు స్నానం చేయని పరిస్థితులున్నాయి. ఇలా 4,270 కిలోమీటర్ల నడకను పూర్తి చేసి కెనడా నుంచి ఈ నెల 4న విజయవాడ వచ్చాను. ఈసారి ఇలాంటి సాహస యాత్ర భారత్ లోనే చేయాలనుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడక యాత్ర సాగిస్తానని తన భవిష్య ప్రణాళికను తెలియజేసారు.
-యస్. శ్రీనివాస రెడ్డి, జర్నలిస్ట్ (6300676687)
Great effort. Can u provide his contact no. / mail ID.
karnadendla@gmail.com
Great man, we are proud of you.