64 కళలు.కామ్ వారు ‘కళ నాడు- నేడు’ అన్న శీర్షికన కళాకారులు, కళాభ్యాసకులు, కళా ప్రేమికుల కోసం ఈ గ్రంథాన్ని వెలువరించారు, పుస్తక రచయిత కళాసాగర్ యల్లపు. కళాసాగర్ పరిచయం ఇస్తూ ఆచార్య ‘సశ్రీ’ వీరిని ‘ఆంధ్రా వసారి’గా అభివర్ణిస్తారు. ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ చిత్రకారుడు వాస్తు శిల్పి కవి అయిన జార్జియో వసారి, ఓ పుస్తకం ద్వారా లియోనార్డో డావెన్సీ, మైకేల్ యాంజిలో, రాఫెల్, ఆండ్రియా తదితర ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులు జీవితాలు, కళ కోసం వారు చేసిన విశేష కృషిని తన గ్రంథం ద్వారా ప్రపంచానికి మొదటిసారిగా తెలిపారు. ఇది చిత్రకారులు శిల్పులు వాస్తు విశేషజ్ఞులు గురించిన గ్రంథం.
అలాంటిదే తెలుగులో ఆంధ్ర కళాకారుల సమగ్ర వివరాలను 2024లో ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పుస్తకం ద్వారా అందించారు కళాసాగర్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 300 మంది చిత్రకారులు శిల్పులు కలంకారీ తదితర దృశ్య కళాకారుల సృజనను, వారి ప్రతిభాపాటవాలను ఇందులో నిక్షిప్తం చేశారు. ఈ పుస్తకం కళాకారులకి ఒక హ్యాండ్ బుక్ అనడం కంటే కూడా ఒక ఎన్సైక్లోపీడియా అనవచ్చు. ఇందులో కళ పుట్టుపూర్వోత్తరాలు, 64 కళలు, లలిత కళలు, కళా విద్య, ఫైనార్ట్స్ యూనివర్సిటీలు, కళా సంస్థలు, ప్రభుత్వ అవార్డులు మొదలైన పలు అంశాలకు ఇందులో స్థానం కల్పించారు.
‘కళలు నాడు -నేడు’ పుస్తకానికి ముందుమాట రాసిన పద్మశ్రీ ఆవార్డు గ్రహీత డాక్టర్ ఎస్.వి. రామారావు, ప్రముఖ చిత్రకారులు “ఇటువంటి పుస్తకం 1956 నాటి రోజుల్లో ఉండి ఉంటే ఎంత బాగుండు” అని అంటారు. అందుకే దీన్ని ఆయన కేవలం ఒక పుస్తకం అనలేదు, కళా పిపాసులకు, కళాకారులకు కళలు ఆరాధించే ప్రతి హృదయానికి ఇది ఒక ‘అమరకోశం’ అన్నారు. అసలు కళ అంటే ఏమిటి? అన్న మౌలిక ప్రశ్నతో మొదలుపెట్టి, కళ పుట్టుక ప్రకృతితో కళకున్న అవినాభావ సంబంధం, నిత్యజీవితం, శుద్ధ నైతికత, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, చరిత్రతో కళకున్న అద్భుతమైన సామరస్యాన్ని, ప్రతి చదువరి హృదయానికి హత్తుకునేలా సరళమైన శైలిలో ఆవిష్కరించారు” కళాసాగర్ అంటారు. కళా రంగంలో భవిష్యత్తును వెతుక్కునే ప్రతి విద్యార్థికి ఈ గ్రంథం ‘ఒక వరహాల మూట’ అని కూడా అంటారు.
కవి చిత్రకారుడు కళా విమర్శకుడు మాకినీడి సూర్య భాస్కర్– కళ అంటే ఏమిటి? అన్న దానికి జవాబుగా కళాసాగర్ గారు ఒక పుస్తకమే రాశారు. ప్రశ్న పరిధిని దృష్టిలో పెట్టుకొని చాలా విస్తృత ప్రాతిపదికన విషయ పరిచయం కావించారు అంటారు. కళను ఒక విభాగంగా కాకుండా జీవితానికి అంతర్భాగంగా చూపించే ప్రయత్నం, ఇందులో కళాసాగర్ చేశారంటూ, భారతీయ సౌందర్య శాస్త్రపు రసానుభూతిని ప్రతిధ్వనిస్తూనే మరోవైపు పాశ్చాత్య సౌందర్య శాస్త్రపు ‘భావ ప్రకటన’తోనూ వివరించే ప్రయత్నం చేశారు.
ఈ గ్రంథం ప్రత్యేకత ఏమిటంటే ఇది సిద్ధాంతాలను తెలిపే ప్రయత్నం చేస్తూనే వాటిని జీవితం ద్వారా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో కళ, వినోద సాధనం నుండి ఒక జ్ఞాన సాధనంగా, మరింతగా ఒక అనుభూతి మార్గంగా చూపుతుంది. కళ అంటే చేయగల స్థితి నుండి అనుభవించగల స్థితికి మనిషిని తీసుకువెళ్లాలని భావిస్తారు రచయిత కళాసాగర్. ఆహారం శరీరాన్ని పోషిస్తుంది, కళ మనసును పోషిస్తుంది. కళ లేకపోతే జీవితం యాంత్రికంగా మారుతుంది. భావోద్వేగాలు నశిస్తాయి అంటారు. టెక్నాలజీ వల్ల కళ యాంత్రికం అవుతుంది. డిజిటల్ సాధనాలు కళను మారుస్తున్నాయంటూ, యంత్రం భౌతిక సృష్టి చేయగలదే కానీ భావాలను కాదు’- అంటారు రచయిత. కళ ఒక వృత్తి, ఒక జీవన మార్గం కూడా! ఎందుకంటే కళాకారుడుకి యంత్రం కంటే అదనంగా పరిశీలన, సాధన, ప్రకృతి పట్ల అనుబంధం, అంతర్గత అనుభూతి ఉంటాయి. కనుక కళ, ఒక దేశపు గుర్తింపు, సంస్కృతిక మూలాధారం, చరిత్రను నిలబెట్టే శక్తి గల కళలే లేకపోతే, సంస్కృతి కోల్పోతుంది. మానవ విలువలు తగ్గిపోతాయి. కళ లక్ష్యం తీసుకుంటే.. రసానుభూతి అనేది భారతీయ తత్వమైతే, సౌందర్య భావన పాశ్చాతులది. కళాతాత్వికత పరంగా ఆధ్యాత్మికత భారతీయమైతే, తాత్వికత పాశ్చాత్యం. రెంటి మిశ్రమాన్ని ప్రతిపాదిస్తారు కళాసాగర్.
కళ అంటే?’ అన్న ఈ పుస్తకంలోని మొదటి వ్యాసంలో ‘నైపుణ్యంతో చేసే పని మాత్రమే కళ. మరొక రూపంలోకి మార్చడం లేదా మనిషి తన మనసులోని ఆలోచనలకు ఒక రూపం ఇవ్వడం కళ అవుతుంది. కళాకారుడు ఈ ఆలోచనలను బయట ప్రపంచం నుంచి లేదా లోపల మనసు నుంచి గ్రహించొచ్చు. బయట ప్రకృతి, లోపల మనసు, ఈ రెంటికి కలయికే కళ. కళలో వాస్తవం ఉంటుంది. అలాగే కల్పన కూడా ఉంటుంది.కొందరు వాస్తవానికి పెద్ద పీట వేస్తే మరికొందరు ఊహలకు ప్రాణం పోస్తారు. కళ మొదట వాస్తవంలో పుడుతుంది. ఆదర్శంగా ఎదుగుతుంది. ఊహల్లో పరిపూర్ణమవుతుంది. ప్రకృతిలో లేని పరిపూర్ణత కళ ద్వారా సాధ్యమవుతుంది. అసంపూర్ణమైన ప్రకృతిని గుడ్డిగా కాపీ కొడితే కళ కూడా అప్పుడు అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. మనిషి బుద్ధి జీవి. బుద్ధి ఆలోచనలను పుట్టిస్తే, హృదయం అనుభూతులను ఇస్తుంది. సైన్స్ బుద్ధినుంచి పుడితే, కళ హృదయం నుంచి పుడుతుంది. సత్యాన్ని సైన్స్ ఆవిష్కరిస్తే- కళ సౌందర్యాన్ని ఆరాధిస్తుంది. సైన్స్ జ్ఞానాన్ని ఇస్తే, కళ ఆనందాన్నిస్తుంది. సైన్స్ కు శాస్త్రీయత, ఉపయోగం ముఖ్యం. కళకు ఆనందం ముఖ్యం. ‘కళ పుట్టుక- పరిణామం’ అన్న వ్యాసంలో భాష ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోక ముందే మనిషి తన మనసులోని భావాలను వ్యక్తపరచడానికి కనుగొన్న అద్భుతమైన సాధనం కళ. భావవ్యక్తీకరణ సాధనంగా, నమ్మకాలకు ప్రతిరూపంగా, కళ ఉద్భవించింది. చెక్కడం.. అంటే శిల్పకళ మానవుని మొట్టమొదటి కళారూపం అని చెప్పవచ్చు.
ఆ తరువాత 64 కళలు అంటే ఏమిటి? అన్న వ్యాసంలో ‘ప్రస్తుతం 64 కళలుగా, లలిత కళలు అంటే చిత్రలేఖనం శిల్పం సంగీతం నాట్యం సాహిత్యం మొదలైనవి ఈ జాబితాలోకి వస్తాయి. కళ ప్రయోజనం’ ఏమిటో వివరిస్తూ ‘వస్తువులో అందం ఉండాలి. చూసే కంటికి ఆస్వాదించే గుణం ఉండాలి. ఈ రెండింటి కలయికే నిజమైన సౌందర్య తత్వం’ అని ప్రసిద్ధ రచయిత ఎమర్సన్ అంటారు. మనలో సౌందర్యం లేకపోతే ప్రపంచంలో ఎక్కడ వెతికినా కనిపించదు అని.
కళకు సంబంధించినదే ఇస్తటిక్స్. దీనిని 1750 లో జర్మనీ దేశపు అలెగ్జాండర్ గాట్లిబ్ బామ్ గార్డెన్ ‘ఈస్తటికా’ అనే గ్రంథాన్ని రచించాడు. గ్రీకు పదం ‘ఈస్తేటా’ (బుద్ధికి అందని అనుభూతి) నుంచి ఈ పదం వచ్చింది. అప్పటినుంచి సౌందర్య తత్వానికి పాశ్చాత్య భాషల్లో ఈస్తెటిక్స్ అనే పేరు ఏర్పడింది. ఇందులో మూడు భావనలు ప్రధానమైనవి. అవి- అనుకరణ కల్పన అభివ్యక్తి. టాల్స్టాయ్ ‘ఆనందం తాత్కాలిక మత్తు లాంటిది. శాశ్వతమైన నైతికతను పెంచేదే ఉత్తమ కళ’ అని వాదిస్తారు.
ఆ తరువాత మానవ నాగరికతలో కళల పాత్ర, సంప్రదాయ పండుగల్లో కళల పాత్ర, కళలు, కళా విద్య, కళా విద్య ప్రయోజనాలు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లలిత అకాడమీ కేంద్ర సంగీత నాటక అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ గురించిన వివరాలు, ఇప్పటివరకు అవి అవార్డులు అందజేసిన కళాకారుల వివరాలు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా పురస్కారాలు (పద్మపురస్కారాలు వంటివి) ఇంకా కళాకారుడికీ, ప్రత్యేకత కళాకారులకు ఉండవలసిన లక్షణాలు, కళ- కళ కోసమా? ప్రజల కోసమా?, కళా విద్యలో డిప్లమో డిగ్రీ కోర్సులు, బాల కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం, కళా వికాసంలో సాంస్కృతిక సంస్థల పాత్ర, డిజిటల్ యుగంలో తెలుగు కళల వారధి’ వంటి శీర్షికలతో రాయబడిన వ్యాసాలు, అపారమైన కళాపరిజ్ఞానాన్ని పాఠకులకు అందిస్తాయి. అంతేకాకుండా ‘కళా రంగంపై కృత్రిమ మేథ ప్రభావం ‘అన్న వ్యాసం కూడా ఇందులో చోటు చేసుకోవడం ఈ గ్రంథ ప్రత్యేకతల్లో ఒకటి. అవకాశం ఉన్నచోట, స్థలం దొరికిన చోట చక్కని కొటేషన్లు కూడా ఇవ్వడం మరింత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
కళాసాగర్ చిత్రకళా రంగంలోకి ప్రవేశించి మూడున్నర దశాబ్దాలుగా, గడిచిన 2010 నుండి 64 కళలు డాట్ కామ్ అనే అంతర్జాల పత్రిక సంపాదకుడిగా తన ఆలోచనలను పంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ‘కళ నాడు- నేడు’ పుస్తకం వెలువరించడం కూడా. కళ అనేది కేవలం ఒక వృత్తి కాదు అదొక జీవన విధానం. కళ అనేది కంటికి కనిపించే సౌందర్యం మాత్రమే కాదు, మనసును సాంత్వన పరిచే అదృశ్య శక్తి అన్నది కళాసాగర్ కళా దార్శనికత. ఇది కళాభ్యాసకులకు కళా బోధకులకు పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కళాభిమానులకు, తల్లిదండ్రులకు, తమలోని సృజనాత్మకతను వెలికి తీయాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం ఒక కరదీపికలా ఉపయోగపడాలని ఆశిస్తారు కళాసాగర్.
ప్రతులకు: (వెల. 220/- కలిగిన, 176 పేజీలున్న ఈ పుస్తక ప్రతుల కోసం 98852 89995 లేదా నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ పుస్తక కేంద్రంలో / అమెజాన్ లో కూడా లభిస్తుంది).
–మల్లేశ్వరరావు ఆకుల
7981872655
