కర్నూలు జిల్లా, నద్యాలకు చెందిన కళారాధన సాంస్కృతిక సంస్థ వారు ఇటీవల మంత్రి కందుల దుర్గేష్ గారిని కలిసి సమర్పించిన విజ్ఞాపన పత్రం.
గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల గౌరవ మంత్రివర్యులు.
కళాభివందనములతో…,
విషయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంస్కృతిక అభివృద్ధికి విజ్ఞాపన పత్రం.
కళాభిమానులు, స్వతహాగా కళలపై ఆసక్తి కలిగినటువంటి మీరు ఈ శాఖ మంత్రివర్యులు కావడం రాష్ట్రంలోని సాంస్కృతిక సంస్థలకు, కళాకారులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి కళలకు పూర్వ వైభవం తీసుకు రావడం కోసం కింది విషయాలు మీ దృష్టికి తీసుకు వస్తున్నాం.
- గత ఐదు సంవత్సరాలలో కేవలం ఒకే ఒక్క సంవత్సరం నంది నాటకోత్సవాలు నిర్వహించారు. ఇకపై ప్రతి ఏటా నంది నాటకోత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని కళా, నాటక సంస్థలు కోరుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు ముగిశాక బహుమతి వచ్చిన నాటకాలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మినీ నంది నాటకోత్సవాలు నిర్వహించాలని కోరుతున్నాం. తద్వారా ప్రజలలో నాటక కళ పట్ల అభిమానాన్ని, ఆసక్తిని తిరిగి తీసుకురావడానికి దోహదం పడుతుందని భావిస్తున్నాం.
- రాజమహేంద్రవరానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగంగారి జయంతి ఏప్రిల్ 16 న “తెలుగు నాటక రంగ దినోత్సవం”గా గతంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేవారు. రాష్ట్రస్థాయిలో ముగ్గురికి రాష్ట్రస్థాయి కందుకూరి వీరేశలింగం పురస్కారాలు లక్ష రూపాయల నగదుతో సత్కరించేవారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఐదు మంది కళాకారులను గుర్తించి పదివేల రూపాయలతో సత్కరించేవారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం పూర్తిగా పక్కన పెట్టడం కళాకారులను తీవ్రంగా కలిచి వేసిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం. తిరిగి ప్రతి ఏటా తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో, జిల్లాల స్థాయిలో నిర్వహించి కళాకారులను గుర్తించి, సత్కరించి కందుకూరి వీరేశలింగం గారి స్ఫూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- గతంలో ప్రతి ఏటా ఉగాది రోజున వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పదివేల రూపాయల నగదు బహుమతితో, తెలుగు తల్లి ప్రతిమ తో ఉగాది పురస్కారాలు అందజేసేవారు. అదేవిధంగా 50 వేల నగదు బహుమతితో పాటు హంస ప్రతిమను అందజేసి ప్రతిష్టాత్మకమైన కళా రత్న (హంస) పురస్కారాలు వివిధ రంగాల ప్రముఖులకు అందజేసేవారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికిన విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం. వీటిని తిరిగి పునరుద్ధరించ వలసిందిగా కోరుతున్నాం.
- తెలుగు నాట గతంలో ఒక వెలుగు వెలిగి, కాలక్రమేనా అంతరించి పోతున్నటు వంటి కళారూపాలైన… బుర్రకథ, హరికథ, ఒగ్గు కథ, కోలాటం, జడ కోలాటం, తప్పెట గుళ్ళు, డప్పు, తోలుబొమ్మలాట, చెక్కభజనలు వంటి కళాకారులను గుర్తించి, వాటికి తిరిగి పునర్ వైభవం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ, వీటన్నిటిని ఒక చోటికి చేర్చి వివిధ ప్రాంతాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ద్వారా, వాటిని డిజిటల్ రూపంలో నిక్షిప్త పరచడం ద్వారా ఈ కళ లను, కళాకారులను భవిష్యత్తు తరాలు మర్చిపోకుండా చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలని కోరుతున్నాము.
- గతంలో సాంస్కృతిక శాఖ ద్వారా కళా సంస్థలకు, నాటక సంస్థలకు కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్థిక సహకారం అందించే పథకం గత ఐదు సంవత్సరాలుగా సరిగా అమలు చేయలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాము. ఈ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం. మంజూరు చేసిన కార్యక్రమాలకు, కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత సంబంధిత నివేదికలు, రసీదులు సమర్పించిన తర్వాత ఆలస్యం చేయకుండా కళా సంస్థలకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- ఖజురహో తరహా జాతీయ స్థాయి నృత్య ఉత్సవాలను ప్రతి ఏటా కూచిపూడి లో లేదా ఒక్కోసారి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిర్వహించాలని కోరుతున్నాం. తద్వారా పిల్లల్లో శాస్త్రీయ నృత్యం పట్ల అభిరుచిని పెంచడానికి దోహదం చేయవచ్చని భావిస్తున్నాం. 7. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంగీత, నృత్య కళాశాలకు తగినన్ని నిధులు కేటాయించి, మౌలిక వసతులు పెంపొందించి, ఎక్కువమంది శిక్షణ పొందే లాగా వాటిని అభివృద్ధి పరచాలని కోరుతున్నాం. సంగీత, నృత్య కళాశాలలు లేని జిల్లాలలో నూతనంగా నెలకొల్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా పిల్లలలో కళల పట్ల అభిరుచిని పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది.
- అన్ని జిల్లాలలో మంచి వసతులు ఉన్న కళాకేంద్రాలను (రవీంద్ర భారతి తరహా ఆడిటోరియంలను) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ఆడిటోరియంలలో గుర్తింపు పొందిన సాంస్కృతిక సంస్థలకు కార్యక్రమాల నిర్వహణ కోసం అద్దె లేకుండా, విద్యుత్ ఛార్జీలు మాత్రం తీసుకుని అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళా సాంస్కృతిక రంగ అభివృద్ధి కోసం నూతన పథకాలు రూపకల్పన చేయడానికి, ప్రస్తుతం ఉన్న కార్యక్రమాలను మరింత మెరుగైన విధానంలో నిర్వహించడానికి రాష్ట్రంలో ఉన్న వివిధ సాంస్కృతిక సంస్థల ప్రతినిధులను, ప్రముఖ కళాకారులను ఆహ్వానించి వారితో చర్చించాలని కోరుతున్నాం.
కళాభివందనములతో..
డాక్టర్ సి. మధుసూదనరావు(అధ్యక్షులు)
డాక్టర్ గుర్రాల రవికృష్ణ (ప్రధాన కార్యదర్శి)