రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వం కళారంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. స్వాతంత్య్రానంతరం మన చారిత్రక ఘట్టాలను దృశ్యమానం చేసి, వాటిని భావితరాల కోసం భద్రపరుస్తున్న ఫిలిం డివిజన్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్‌లతో పాటు ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్, చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియాల ఉనికిని దెబ్బతీస్తూ నేషనల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వాటిని విలీనం చేసింది.
చిత్రకళా సంస్థల గొంతు కోయవద్దంటూ 900 మంది ప్రముఖులు చేసిన విజ్ఞప్తినీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. జయా బచ్చన్, డానీ, అదూర్ గోపాల కృష్ణన్, డేవిడ్ ధావన్, ఓంపురి, నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, మిథున్ చక్రవర్తి, శత్రుఘ్న సిన్హా, గిరీష్ కాసరవెల్లి, రాజ్ కుమార్ హీరాణి, రాజ్‌కుమార్ రావ్, విధువినోద్ చోప్రా, సంజయ్ లీలా భన్సాలీ, అనుపమ్ ఖేర్ మొదలయిన ఉద్ధండులను అందించిన పుణె, కోల్‌కతా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు పీయూష్ మిశ్రా, ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితర ఉత్తమ కళాకారులను రూపుదిద్దిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంటి సంస్థల మెడపై కత్తి వేళ్ళాడుతూ ఉన్నది. కళారంగాన్ని గంపగుత్తగా ప్రైవేటీకరించడానికి ఇది తొలిమెట్టనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఇంటర్నెట్, యూట్యూబ్, ఓటీటీల కాలంలో దృశ్య మాధ్యమం సరికొత్త రూపాల్ని సంతరించుకుంటున్నది. ఇలాంటి వేళ కేంద్ర ప్రభుత్వం మాత్రం చరిత్రాత్మకమైన, ప్రతిష్ఠాత్మకమైన పలు ప్రభుత్వ సినిమా సంస్థల్ని విలీనం చేసి భవిష్యత్తులో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే పనికి పాదులు వేస్తున్నది. ఈ చర్య సరైనది కాదంటూ 900 మంది నటులు, దర్శకులు, సినీ మేధావులు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడ చెవిన పెట్టింది. దీనిపైన సమగ్ర ఆధ్యయనం జరుపలేదు. ఆయా సంస్థలతో సంబంధమున్న వారి భావాల్ని పట్టించుకోలేదు. ఎలాంటి బహిరంగ చర్చలు లేకుండానే ప్రభుత్వం చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా, ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్, ఫిలిమ్స్ డివిజన్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్‌లను నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో విలీనం చేసింది. ఫిలిం సెన్సార్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఇప్పటికే రద్దు చేసిన ప్రభుత్వం ఈ సంస్థల విలీనాన్నీ ఏకపక్షంగా జరిపింది.
స్వాతంత్య్రం లభించిన తొలినాళ్లలో ఎంతో దూరదృష్టితో ఆనాటి ప్రభుత్వం ఈ జాతీయ సినిమా సంస్థల్ని ఏర్పాటు చేసింది. మన చరిత్రను, సంస్కృతిని, వారసత్వాన్ని దృశ్య మాధ్యమంలో నిర్మించి, పెంచి, పోషించి, రక్షించి, ప్రదర్శించే లక్ష్యంతో ఆ సంస్థలు ఊపిరి పోసుకున్నాయి. నెహ్రూ హయాంలో ఎస్‌కే పాటిల్ కమిటీ సిఫార్సుల మేరకు సినిమాను కళ గానూ, దృశ్య సాంస్కృతిక చరిత్రగానూ భావించి ప్రభుత్వం ఈ స్వతంత్ర సంస్థల్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమాకు పేరు ప్రతిష్ఠల్ని తెచ్చే ఎన్నో సినిమాల్ని రూపొందించే కృషిని చేపట్టింది. కానీ నేటి ప్రభుత్వం వాటిని విలీనం ముసుగులో నామరూపాలు లేకుండా చేసింది. సినిమా వినోద సాధనమే కాదు, జాతి సాంస్కృతిక వారసత్వాన్ని దృశ్యబద్ధం చేసే కళా మాధ్యమం. ఇప్పటికే సినిమా నిర్మాతల సోయిలేనితనం వల్ల వందలాది మూకీ సినిమాలు నశించి పోయాయి. అందుకు భిన్నంగా ఉదాత్తమైన ఆశయాలతో పని చేస్తున్న ఫిలిం సంస్థల్ని విలీనం చేసి కేంద్రం సినీ కళా రంగానికి తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా మన సాంస్కృతిక మూలాల్ని తుడిచి వేసే పనికి పూనుకొన్నది.
2018లో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మాజీ కార్యదర్శి బిమల్ జుల్కా అధ్యక్షతన మోదీ ప్రభుత్వం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ సంస్థలు చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా, ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్, ఫిలిమ్స్ డివిజన్, నేషనల్ ఫిలిం ఆైర్కైవ్, పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్, కలకత్తా సత్యజిత్ రే ఫిలిం అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్‌ల పని తీరును సమీక్షించడం ఈ కమిటీ బాధ్యత. మొదట ఈ చర్య అందరికీ సబబుగానే తోచింది. అనేక ఏండ్లుగా ఉన్న ఈ సంస్థల పని తీరు మెరుగు అవుతుందని చాలా మంది భావించారు.
కానీ జుల్కా కమిటీ సినిమా వాళ్ళను, నిర్మాతలను, నటీ నటులను, రచయితలను సంప్రదించకుండానే నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2020 డిసెంబర్‌లో చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా, ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్, ఫిలిమ్స్ డివిజన్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్‌లను నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో విలీనం చేసి చేతులు దులుపుకొన్నది. కమిటీ నివేదికను కనీసం ప్రజల ముందు పెట్టలేదు. పార్లమెంటుకు సమర్పించలేదు. సమాచార చట్టం కింద అడిగిన ప్రశ్నలను బుట్ట దాఖలు చేసారు. 2022 జనవరి 31న ఆయా సంస్థలను మూసేసి విలీనం తంతును పూర్తి చేసేశారు. తర్వాత జుల్కా కమిటీ నివేదికను వెబ్‌సైట్‌లో పెట్టినప్పుడు ఇందులో అనేక పొంతనలేని వాదనలున్నాయని వెల్లడైంది.
ఇప్పటి నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, దాని పూర్వ రూపమైన ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్ మన దేశంలో అర్థవంతమైన, ఉత్తమ విలువలున్న సినిమాల్ని నిర్మించడం, నిర్మాతలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు సినిమా సంస్కృతిపై ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యాలుగా ఏర్పాటయ్యాయి. 1970-90 దాకా మన దేశంలో ఆర్ట్ సినిమాలు, సమాంతర సినిమాలకు ఈ సంస్థ సహకారం అందించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు అందుకున్న సినిమాల్ని నిర్మించింది. శ్యామ్ బెనెగల్ లాంటి దర్శకులతో సినిమాల్ని తీసింది. అయితే కాలగమనంలో ఈ సంస్థకు ప్రభుత్వాల నుంచి ఆర్థ్ధిక సహకారం, మద్దతు లభించక క్రమంగా కుంటుపడింది. నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లాభనష్టాల్ని పరిగణించే కంపెనీగా రిజిస్టర్ అయిన సంస్థ. ప్రస్తుతం దాని మనుగడే ప్రశ్నార్థకమయిన స్థితిలో ఇంకా పలు సంస్థల్ని దానిలో కలిపేయడం ఎట్లా సమంజసం?
ఈ విలీనంలో కనుమరుగైన సంస్థల కృషి, సేవలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికే 1948లోనే ఫిలిమ్స్ డివిజన్ ఏర్పాటయింది. చిన్న సినిమాలు తీస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేయడం దాని లక్ష్యం. విద్య, వైద్యం లాంటి పలు అంశాలపైన డాక్యుమెంటరీలు నిర్మించడం ఇందులో ఒకటి. జాతీయ ప్రాముఖ్యం కలిగిన సందర్భాలను, సమావేశాలను, సెల్యూలాయిడ్‌పై చిత్రించి భద్రపరచడం కూడా దీని విధి. అట్లా ఫిలిం డివిజన్ 75 ఏండ్లలో కళలు, చరిత్ర, సంస్కృతుల్ని ఫిలిం మీడియాలో చిత్రించి పెట్టింది. ఇది స్వతంత్ర భారత చరిత్రను, విజయాలను నిక్షిప్తం చేయడమే. గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి అనేక మంది జాతీయ నాయకుల దృశ్యాత్మక చరిత్రల్ని చిత్రీకరించి భద్రపరిచింది. ఆ డాక్యుమెంటరీలు నిర్మించడం అంటే దేశ చరిత్ర, వారసత్వాలను కదిలే బొమ్మల్లో పొదివి పెట్టడమే. అనేక ఫిలిమ్స్‌ని, వార్తా విశేషాల్ని 16 ఎమ్‌ఎమ్ (న్యూస్) రీళ్ళలో భద్రపరిచింది. నెహ్రూ పట్ల గానీ, మరే నాయకుడి పట్ల గానీ ఎవరికైనా ఇష్టమున్నా లేకున్నా అది మన సజీవ చరి త్ర. ఫిలిం డివిజన్ దాదాపు 8,500 ఫిలిమ్స్ అండ్ న్యూస్ రీళ్ళను నిర్మించింది. ఫాలి బిల్ మోరా, సుఖ్ దేవ్, ఎస్‌ఎంఎస్ శాస్త్రి, ప్రమోద్ పాటి వంటి గొప్ప చలన చిత్రకారులు ఈ కృషిలో భాగస్వాములయ్యారు.
నేషనల్ ఫిలిం ఆర్కైవ్ 1964లో ఏర్పాటైంది. ఈ సంస్థ ప్రధాన బాధ్యత సినిమాల పరిరక్షణ, డిజిటైజేషన్ చేయడం. పీకే నాయర్ వంటి వారి నేతృత్వంలో ఆర్కైవ్ గొప్ప కృషి చేసింది. అంతర్జాతీయంగా దీనికి గొప్ప పేరుంది. అనేక అపురూప సినిమాలు పూనా ఆర్కెవ్‌లో ఉన్నాయి. వెల కట్టలేని ఈ సినిమాలు చరిత్రకు దర్పణాలు. చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా 1955లో ఏర్పాటయింది. బాలల కోసం ప్రత్యేకంగా సినిమాల్ని నిర్మించడం, ప్రదర్శించడం, పంపిణీ చేయడంతో పాటు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించడం దీని ప్రధాన బాధ్యత. ఈ సంస్థ పిల్లల సినిమాలు రూపొందిస్తూనే హైదరాబాద్ నగరం శాశ్వత కేంద్రంగా చిత్రోత్సవాల్ని నిర్వహించింది. ఇప్పటికి దాదాపు 114 బాలల సినిమాలు, 45 షార్ట్ ఫిలి మ్స్, 52 డాక్యుమెంటరీలు నిర్మించింది. పుణె, కోల్‌కతా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు ఎంతో మంది దర్శకులను, నటీ నటులను, సినీ సాంకేతిక నిపుణులను అందించాయి. ఏదో క్షణాన వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం మాయం చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్ని బలోపేతం చేయాల్సిన సందర్భంలో వాటిని వ్యాపార సంస్థ లాంటి ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం అర్థరహితం. ఈ సంస్థలను స్వతంత్రంగానే ఉంచి, సినిమా వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళకు అప్పగించి, సృజనాత్మక స్వేచ్చ ఇచ్చి, ఆర్థికంగా బలోపేతం చేస్తే మరెన్నో గొప్ప ఫలితాలు వచ్చేవి. ఆధునిక సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో ఇటువంటి సాంస్కృతిక సంస్థల ద్వారా పరిశోధన, సేకరణ, పరిరక్షణ విస్తృతంగా, నిరంతరం సాగుతుండాలి. తత్ఫలితంగానే భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వం పది కాలాలపాటు భద్రంగా నిక్షిప్తమై వుంటుంది. ప్రపంచ దేశాలకు మాడల్‌గా వుంటుంది.
ఈ సంస్థల్లో నిర్లక్ష్యం నెలకొన్నదని, ఒకే పనిని పలు సంస్థలు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు ఒక వాదనను తెస్తున్నాయి. ఇదే నిజమైతే వాటిని చక్కదిద్దవచ్చు కదా! ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టుకుంటామా! అన్ని సంస్థల్ని పెట్టుబడులు, లాభనష్టాల దృష్టితో చూడకూడదు. కొన్ని సంస్థలు ప్రజా సంక్షేమం కోసం, భవిష్యత్తు అవసరాల కోసం పనిచేయాల్సి వుంటుంది. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవనే కారణంతోనూ వాటిని రద్దు చేయడం సరికాదు.
సినిమా వ్యాపార రంగం కనుక ఈ సంస్థలు కూడా లాభాలు తేవాలనుకుంటే అది సాధ్యమే. దశాబ్దాలుగా నిర్మించి భద్రపరిచిన సినిమాలను, డాక్యుమెంటరీలను, ఇతర స్టిల్ ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్‌ను డిజిటైజ్ చేయడం ద్వారా లాభాల్ని ఆర్జించవచ్చు. ప్రభుత్వమే సొంతంగా ఓటీటీలను ప్రారంభించి కొత్త ఆదాయ వనరుల్ని సృష్టించవచ్చు. ఇప్పటి వరకు వివిధ భారతీయ సినిమా సంస్థలు నిర్మించిన కంటెంట్ తక్కువేమీ కాదు. సృజనకారుల చేతుల్లో ఆయా సంస్థల్ని పెట్టి, మౌలిక పెట్టుబడిని సమకూర్చగలిగితే గొప్ప ఫలితాలను సాధించవచ్చు. కానీ ప్రభుత్వం.. కేంద్రీకరించడం అన్న మిషతో ప్రైవేటీకరించడం వైపే సాగితే భారతీయ సినిమా వారసత్వ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
ఇవ్వాళ సినిమా సంస్థలకు పట్టిన గతే రేపు లాభరహిత, వ్యాపారరహిత అన్ని కళా, సాంస్కృతిక సంస్థలకూ పడుతుంది. కవులు, కళాకారులు, సినిమా సృజనకారులు మౌనం వహిస్తే ఫిలిం సంస్థలతో పాటు అన్నీ రద్దు కావడమో ప్రైవేటు కార్పొరేషన్ల పాలబడడమో తప్పదు. చెరువుల నీళ్లు చెరువెనుక పడ్డంక ఎవరెంత ఏడ్చినా ఫలితం ఉండదు.
(వ్యాస రచయిత: ప్రముఖ ఫిలిం సొసైటీ ఉద్యమకారుడు, డాక్యుమెంటేరియన్, ఫిలిం క్రిటిక్)
కళలను, కళా రంగాలను లాభ నష్టాల దృష్టితో చూస్తే వాటి మనుగడే అర్థం లేకుండా పోతుంది అన్నాడు సుప్రసిద్ధ దర్శకుడు గిరీష్ కాసరవెల్లి. కళలను లాభాపేక్షలేని సృజనాత్మక దృష్టితో చూసినప్పుడే వాటి మనుగడ, అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ఇవ్వాళ కేంద్ర ప్రభుత్వం కళా రంగాల్ని నిర్వీర్యం చేస్తున్నది.
ఇటీవల నవంబర్ 14న నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం నుంచి హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరగాల్సింది. రెండేళ్ల కొకసారి జరిగే ఈ ఉత్సవాలు ఊసే లేకుండా పోయాయి, ఎందుకంటే వాటిని నిర్వహిం చాల్సిన చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా ఉనికిలో లేకుండా పోయింది. కేంద్రం మరో మూడు జాతీయ సంస్థల్ని ఏకపక్షం గా నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కలిపేసింది. దాంతో పిల్లల కోసం ఫిలిం ఫెస్టివల్స్ లేకుండా పోయాయి. ఆ సంస్థల విలీనం వల్ల దేశంలో అర్థవంతమైన సినిమాల ప్రోత్సాహానికి తీవ్ర విఘాతం కలిగింది.
ఫిలిం డివిజన్, ఫిలిం ఆర్కైవ్‌లు మన చరిత్రను దృశ్య రూపాల్లో నిక్షిప్తం చేసే సంస్థలు. చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ, ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్‌లు మన చరిత్ర వారసత్వాలను కాపాడేవి. వీటిని క్లరికల్ ఆఫీస్ లాంటి సంస్థలో విలీనం చేయడం సరికాదు. ఫిలిమ్స్ డివిజన్, ఫిలిం ఆర్కైవ్, చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ, ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్ లను కలిపి వేయడమంటే మన రాజ్యాంగం మీద దాడి చేయడమే.
–వారాల ఆనంద్
Courtesy: Namasthe Telangana