నిత్యనూతన నృత్యోత్సాహి ‘పసుమర్తి’

జనవరి 24 2020 రవీంద్రభారతిలో ‘కళారత్న’ పసుమర్తి రామలింగశాస్త్రిగారి నేతృత్వంలో ‘సత్యహరిశ్చంద్రీయం’ నృత్య నాటకం తొలి ప్రదర్శన జరిగిన సందర్భంగా వారి గురించిన ప్రత్యేక వ్యాసం (రూపక రచయిత : ‘కళారత్న’ బ్నిం, స్వర రచన : డి.ఎస్.వి. శాస్త్రి).
సారవంతమైన సుక్షేత్రంలో నాణ్యమైన రసాలపు విత్తనం పడితే.. అది మధుర రసఫలాలు అందించే మహా వృక్షం కావటంలో ఆశ్చర్యం వుండదు కదా! అలాంటి కూచిపూడి సుక్షేత్రంలో, నాట్యకుటుంబాల్లో ప్రముఖులైన ‘పసుమర్తి’ వారింట ప్రభవం – ఓ సుకృతం! నాట్యవేదాంతాలనాసాంతం ఆస్వాదించి, తాండవ లాస్య ప్రతీకలైన పార్వతీశ్వరుల పేరు దాల్చిన నాట్యఋషులు బ్రహ్మశ్రీ వేదాంతం పార్వతీశం గారి శిష్యరిక భాగ్యం పొందటం ఓ మహద్భాగ్యంఈ రెండూ జన్మత: సంక్రమించిన, సమకూరిన అదృష్టవంతులు శ్రీ పసుమర్తి రామలింగ శాస్త్రి. ‘కూచిపూడి’లో నిష్ణాతులైయాక ఇంకా కళాస్వాదన చేయ్యాలన్న తపన ఆయనని కృష్ణాతీరం నుంచి అడయార్ గట్టుకు చేర్చింది.

‘కళాక్షేత్ర’లో భరతం…
మద్రాసులో భరత నాట్య శిక్షణాలయం ‘కళాక్షేత్ర’లో ప్రసిద్ధ నాట్య పరిశోధక గురువు శ్రీమతి రుక్మిణీ అరెండల్ నేతృత్వంలో భరత నాట్యంలో డిప్లమో చేశారు. ఆమె వివిధ నృత్యాల మేళవింపుని భరతనాట్య రీతితో చేస్తున్న అద్భుతమైన రూపకల్పనా విధానాన్ని ఆకళింపు చేసుకున్నారు. అక్కడ ఆనాడు రూపొందించిన రామాయణం, అభిజ్ఞాన శాకుంతలం లాంటి ఎన్నో ప్రదర్శనల్లో ముఖ్యమైన పాత్రలు సమర్థవంతంగా నటించి గురువుల మెప్పు పొందారు.
ఆ సందర్భంలో ‘కథాక’ బేసిక్స్ కూడా అవగతం కావటం పసుమర్తి వారి కళాతృష్ణకి దర్పణం అయింది. భరతనాట్యంలో డిప్లమో పూర్తయ్యాక మద్రాసులో కూచిపూడి నాట్యంలో అనేక ఒరవడుల్ని ప్రవేశపెడుతూ ప్రఖ్యాతులయిన పద్మభూషణ్ వెంపటి చిన సత్యంగారి ‘సిద్ధేంద్ర కళాక్షేత్రం’లో మెలుకువలు నేర్చుకున్నారు. వారి పర్యవేక్షణలో రూపొందే… సంగీత సాహిత్య నవీన సమ్మేళన రూపకాల్లో నర్తించారు. భామాకలాపంలో సత్యభామగా సంప్రదాయ బాణీలో రక్తి కట్టించారు. క్షీరసాగర మథనంలో శివుడు, శ్రీనివాస కళ్యాణంలో నారదుడు పాత్రలో వీరు అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

నర్తన నుండి నట్టువాగం…
పసుమర్తివారి జీవన రంగంలో ఉద్యోగపర్వం హైదరాబాదులో 3దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. నట్టువాంగం చేపట్టి గురువుల వద్ద నేర్చినదీ… తన సృజనా సామర్ధ్యంతో శిష్యులకి బోధిస్తూ.. క్లాసుల నుంచి కళాశాల దాటి యూనివర్సిటీల దాకా విస్పారితమైంది. తన గురువుల వద్ద తాను నేర్చుకున్నది మరొకరికి బోధించడం, విద్యని కాపాడటం, గురు ఋణం తీర్చుకొనే క్రమంలో ఆయనకి ఎందరో శిష్యప్రశిష్యులు తయారౌతున్నారు.

ఉద్యోగ విజయాలు…
పసుమర్తి వారి క్లాసులు సిలబస్సుకి మించి అనుభవ పాఠాలుగా నడుస్తాయి. ఆయన ప్రసంగాలు డిమాన్ స్టేషన్ క్లాసుల్లా వుంటాయి. దేశ విదేశాల్లో వివిధ సంస్థల్లో ఆయన సమర్పించిన పత్రాలు సిద్ధాంత గ్రంథాల్లా ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీలో లెక్చరర్ గా ప్రారంభమైన ఆయన బోధనోద్యోగం ప్రొఫెసర్, డీన్ వగైరా పదోన్నతులతో కొనసాగుతోంది.

కల్పనాకౌశలం…
పసుమర్తి రామలింగ శాస్త్రిగారు రూపొందించిన నృత్యరూపకాలు విశిష్టంగానూ, వినూత్నంగానూ ఉంటాయి. 42 ప్రదర్శనలు చేసిన గజాననీయం, 22 ప్రదర్శనలు జరుపుకున్న శ్రీరామకథాసారం, 15 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న శశిరేఖా పరిణయం, త్రిపాది గంగ ఎన్నిసార్లు ప్రదర్శించినా.. ఒకేలావుండవు. సాధారణంగా నర్తకులు మారుతూనే వుంటారు. మళ్ళీ కొత్తవారికి నేర్పిస్తున్నప్పుడల్లా ఆయన సృజనశైలి కొత్త అందాలను ఆవిష్కరిస్తుంది. అవశ్యం స్వచ్ఛపాలనం, లివింగ్ లెజెండ్స్ ఆఫ్ కూచిపూడి, నవదుర్గా విలాసం, గ్రేట్ నెస్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్, శివలీల,
రాసలీల, అష్టవిధ నాయికులు మొదలైన వాటిలో ఆయన రూపకల్పనలు వైవిధ్య భరితంగా, వైభవోపేతంగా వుంటాయి. పసుమర్తి రామలింగ శాస్త్రిగారికి ఎన్నో సన్మానాలు, సత్కారాలు లభించాయి. వీరు సింగపూర్, మలేషియా, మిచిగన్, వెస్లియన్, క్యాలిఫోర్నియా లాంటి వివిధ దేశాల్లో ప్రదర్శనలు, ఉదాహరణ పూర్వక ప్రసంగాలు ఇచ్చారు.
నాట్య కళాధర, నృత్య విద్వన్ మణి, వంటి బిరుదులు ఎన్నో వీరికి లభించాయి. 2012లో ఉగాది పురస్కారం. 2016 ప్రతిష్టాత్మకమైన కళారత్న(హంస) అవార్డు, 2018లో సంగీత నాటక అకాడమీ పురస్కారం పసుమర్తి రామలింగశాస్త్రిగారు అందుకున్నారు. అధ్యయనం, అధ్యాపనంలో, విశిష్టులైన వీరి శిష్యులు వీరి నిబద్ధత, క్రమశిక్షణ తట్టుకోలేని పరిస్థితిని కూడా భయభక్తులలో అనుసరిస్తుంటారు. అది వీరి అపార పాండిత్యానికి నిదర్శనం.
-బ్నిం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap