గుంటూరులో రంగస్థల పురస్కారాలు

ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా గుంటూరులో వైభవంగా రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవం

ప్రపంచ రంగస్థల దినోత్సవం కళాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని స్ఫూర్తినిస్తుంది. ప్రపంచ వేదికలపై కళాకారులను సత్కరించుకోవడం, ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం తద్వారా యువతలో కొత్త ఆలోచనలను తీసుకొస్తుంది. బొప్పన నరసింహారావు కళా విపంచి హైదరాబాద్, ఆరాధన ఆర్ట్స్ డి. తిరుమలేశ్వరరావు, నటరత్న కళా పరిషత్ నడింపల్లి వెంకటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో 27-03-24, బుధవారం గుంటూరు బృందావన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికలో ప్రపంచ రంగస్థల దినోత్సవం వైభవంగా నిర్వహించారు. యువకళావాహిని వ్యవస్థాపకులు దివంగత వై.కె. నాగేశ్వరరావు స్మృతిలో ఈ వేడుక జరగడం విశేషం.

గురజాడ వారి పురస్కారంతో ప్రముఖ నట రచయిత ఆకురాతి భాస్కర చంద్ర, బళ్లారి రాఘవ పురస్కారంతో నట దర్శకుడు కత్తి శ్యాంప్రసాద్, సిఎస్ఆర్ పురస్కారం తో నట దర్శక ప్రయోక్త, ఆహార్య నిపుణులు డా. రాయల హరిశ్చంద్ర, సురభి వనారస గోవిందరావు పురస్కారంతో వారి ముని మనవరాలు రంగోద్దీపన నిపుణురాలు డా. నిరూపమ సునేత్రి, గరికపాటి రాజారావు పురస్కారంతో నట దర్శకుడు షేక్ హుస్సేన్ లను ఘనంగా సత్కరించారు.

సీనియర్ పాత్రికేయులు డా. మహ్మద్ రఫీ సభాధ్యక్షత వహించిన ఈ వేడుకలో సహృదయ నేత మన్నవ సుబ్బారావు, కళాపోషకులు నూతలపాటి తిరుపతయ్య, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు ఎర్రంశెట్టి అంజుబాబు, దేవాలయ పాలక మండలి అధ్యక్షులు మస్తానయ్య తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతలను అభినందించారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రత్యేకతను, నాటక రంగం ద్వారా కళాకారులు చేస్తున్న సమాజ సేవ గురించి వివరించారు.

ఈ సందర్భంగా హర్ష క్రియేషన్స్ విజయవాడ కళాకారులు కత్తి శ్యాంప్రసాద్ దర్శకత్వంలో ట్రీట్మెంట్ నాటికను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. జి. మల్లికార్జునరావు, జివిజి శంకర్, షేక్ జానీబాషా సమన్వయం చేశారు.

డా. మహ్మద్ రఫీ

SA: