మూడు రోజులపాటు ‘కళాయజ్ఞ’ చిత్ర ప్రదర్శన

‘కళాయజ్ఞ’ చాలెంజ్ లో పాల్గొన్న 143 మంది ఉత్తమ చిత్రాల ప్రదర్శన
JNTU నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు

మూడు రోజులూ ప్రముఖ కళాకారులచే కళాప్రదర్శనలు
……………………………………………………………………………………….

అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. సామాజికంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగాక ఎన్నో రకాల చాలెంజ్ లు గురించి విన్నాం. నేడు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం లలో ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్, సెల్ఫీ చాలెంజ్, డొనేషన్ చాలెంజ్…ఇలా ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువుగా సినిమా స్టార్లు, సెలెబ్రెటీల మధ్యనే జరిగేవి. కానీ చిత్రకళ కోసం, చిత్రకారుల కోసం ప్రముఖ చిత్రకారుడు శేషబ్రహ్మం ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసిన చాలెంజ్ కళాయజ్ఞ. ఇందులో భాగంగా 21 రోజుల పాటు ప్రతీరోజు ఒక చిత్రాన్ని వేయాలి. అందులోనే మోనో కలరింగ్ (ఏదైనా ఒక కలర్) మాత్రమే వాడాలి. ఈ చాలెంజ్ లో పాల్గొని అద్భుత కళా ప్రతిభను కనబర్చిన కళాకారుల 143 ఉత్తమ చిత్రాలను హైదరాబాద్ నగరం వేదికగా ప్రదర్శించనున్నారు. ఈ ‘కళాయజ్ఞ’ ప్రదర్శన జేఎన్టీయూ కాలేజి ఆవరణలో నున్న నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది.

కళోత్సవంగా మారిన చాలెంజ్ ఈ ‘కళాయజ్ఞ’ చాలెంజ్ను బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ చిత్రకారుడు శేషబ్రహ్మం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారుల్లో ఉత్సాహం నింపడానికి, వారిని మంచి చిత్రాలు వేసేలా ప్రోత్సహించేందుకు ఈ చాలెంజ్ ప్రారంభించినట్లు తెలిపారు. అనూహ్యంగా దేశవ్యాప్తంగా పదికి పైగా రాష్ట్రాల నుంచి 400 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఇందులో 200 మంది నిర్విఘ్నంగా 21 రోజులు చాలెంజ్లోని నియమాల ప్రకారం చిత్రాలను వేశయగల్గారు. దాదాపు నాలుగు వేల చిత్రాలను పోస్ట్ చేశారని చెప్పారు. ఈ ప్రయత్నంలో కేవలం దేశ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం వంటి అంశాలను థీమ్ గా ఎంచుకున్నామని శేషబ్రహ్మం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 12 నుంచి 31 తేదీల మధ్యలో నిర్వహించిన ఈ చాలెంజ్లో అన్నివయసుల కళాకారులు పాల్గొనడం విశేషం.

ఎవరి చిత్రాలు ప్రదర్శనలో వుంటాయి ?
400 మందికి పైగా కళాకారులు పాల్గొన్న వారి నుండి 21 రోజులపాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 21 మంది చిత్రకారులకు ‘కళాయజ్ఞ’ ఎక్సలెన్సీ అవార్డు’, ఇంచుమించు అదేస్థాయిలో ప్రతిభ కనబరిచిన మరొక 21 మంది చిత్రకారులకు ‘కళాయజ్ఞ’ హైలీ కమాండబుల్ అవార్డు’, అలాగే మంచి చిత్రాల సాధన చేస్తూ అలరించిన 42 మంది చిత్రకారులకు ‘కళాయజ్ఞ’ మోస్ట్ ప్రామిసింగ్ అవార్డు’ లతో 143 మందిని విజేతలుగా ప్రకటించారు. అలా 143 మంది చిత్రకారుల నుండి 143 చిత్రాలు ఈ కళాయజ్ఞ ప్రదర్శనలో వుంటాయి.

Kalayajna Workshop Guest participants

కళోత్సవం ప్రత్యేకత :
సాధారణంగా చిత్రకళా ప్రదర్శన ప్రారంభం రోజున జ్యోతి ప్రకాశనం చేసి, ముఖ్య అతిథులు ప్రసంగాలు చేస్తారు. కాని ఈ ప్రదర్శన అలా కాదు… ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి.. అవి ఏమిటంటే మొదటి రోజు నీటి రంగుల చిత్రాలలో మేటి కళాకారుడు మోసే డయాన్ గారిచే వాటర్ కలర్ డెమో, మధ్యాహ్నం ఆక్రలిక్ కలర్స్ డెమో వుంటాయి. రెండవ రోజు ప్రముఖ గ్రాఫిక్ ఇల్లస్ట్రేటర్ రాజేష్ నాగులకొండ గారిచే ఇల్లస్ట్రేటన్ అండ్ స్టోరీ టెల్లింగ్ డెమో వుంటుంది. తర్వాత ప్రముఖ శిల్పి, చిత్రకారుడు ఎం.వి. రమణా రెడ్డి గారి ఆర్ట్ జర్నీ స్లైడ్ షో వుంటుంది. రెండవ రోజు సాయత్రం శేషబ్రహ్మం గారిచే ఆయిల్ పెయింటింగ్ డెమో వుంటుంది. మూడవ రోజు ఉదయం స్థపతి డి.ఎన్.వి. ప్రసాద్ గారిచే ‘సాంప్రదాయ శిల్పకళ ‘ అంశం పై ప్రసంగం వుంటుంది. అనంతరం డా. ప్రీతి సంయుక్త గారిచే సెల్ఫ్ పోట్రైట్ అంశం పై స్లైడ్ షో ప్రదర్శన వుంటుంది. చివరిగా విజేతలకు, ప్రదర్శనలో పాల్గొన్నవారికి బహుమతులు అందజేయబడును.

కళాసాగర్
__________________________________________________________________________

Anji Akondi

‘కళాయజ్ఞ’ లో పాల్గొన్న చిత్రకారుల అభిప్రాయాలు:
కళాయజ్ఞం కార్యక్రమం.. 21 రోజులలో చిత్రకారులలో… మానసికంగా… వ్యక్తిగతంగా… సాధన పరంగా ఎన్నో మార్పులు… ఎంతో అనుభవాలు.. సొంతం చేసుకునేలా చేసింది. ముఖ్యంగా సీనియర్ చిత్రకారులు దగ్గర నుండి.. యువ చిత్రకారులు దగ్గరనుండి… ఇప్పడిప్పుడే చిత్రకళ అభ్యసిస్తున్న వారు కూడా చాలా పోటీతత్త్వంతో చిత్రాలు గీశారు… సీనియర్ చిత్రకారుల చిత్రాలు చూస్తూ… వారిలా మనం కూడా గీయాలి అనే పోటీ తత్వం కలిగింది అందరిలో…దీనివలన మన అందరికీ తెలియకుండానే సీనియర్ చిత్రకారులు.. మిగిలిన అందరికీ ఆదర్శప్రాయకులుగా.. గురువులుగా… మీ మీ వర్క్స్ అన్నీ వారికి ఒక విలువైన సంపదగా చూసుకుంటున్నారు… ఇటువంటి తరుణంలో అనుభవం ఉన్న సీనియర్ చిత్రకారులు…సహృదయంతో… మంచితనంతో… యువ చిత్రకారులని ప్రోత్సాహించాలి అని… అభినందనలు తెలపడానికి వారు ఈ కళాయజ్ఞంలో పోటీ నుండి తప్పుకోవడం… అనే నిర్ణయం చాలా చాలా అభినందనలు తెలపవలసిన విషయం…
ఇక నా విషయానికి వస్తే నేను సీనియర్ ఆర్టిస్ట్ అనే భావన కాకుండా… ఈ కళాయజ్ఞంలో పాల్గొనడమే ఒక అదృష్టంగా భావించి.. 21 రోజులు చివరివరకు ఉంటే చాలు నేను గెలుపు సాధించినట్టుగానే అని భావించి ఈ యజ్ఞంలో పాల్గొనడం జరిగింది… అలానే అనుకున్నట్టుగా 21 రోజులు పాటు చక్కని చిత్రాలు గీయండం జరిగింది. కానీ నేను కూడా ఎందరో చిత్రకారులను ప్రోత్సహించడంలో భాగంగా పెద్దల అడుగుజాడల్లో నేను కూడా ఈ చిత్రకళా యజ్ఞంలో పోటీ విభాగం నుండి తప్పుకుంటున్నాను…

ఇంతటి మహత్తర కార్యక్రమంలో ఎందరో ఎందెందరో మహత్తరమైన చిత్రకారుల ప్రతిభని బయటకి తీసుకుని వచ్చిన కళాయజ్ఞం రధసారధి శ్రీ శేష బ్రహ్మం గురువుగారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ…మీ నుండి ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ….
మీ…
అంజి ఆకొండి
చిత్రకారుడు,
………………………………………………………………………………..

Giridhar A

సంతోషంగా ఉంది…!

అత్యంత ప్రతిష్టాత్మకం గా 21రోజుల పాటు సాగిన ‘బ్రహ్మం కళా యజ్ఞం’ లో అనేక మంది చిత్రకారులు తో పాల్గొని బొమ్మలు గీసాను.. ‘కళాయజ్ఞ ఎక్సలెన్సీ అవార్డు’ లో నా పేరు నమోదు కావడం చాలా సంతోషంగా ఉంది.. ఈ అవకాశం ఇచ్చిన శేషబ్రహ్మం గారికి ఇంకా జ్యూరీకి నా ధన్యవాదాలు.. తోటి చిత్రకారులకు, విజేతలకు నా అభినందనలు…

గిరిధర్ అరసవల్లి
చిత్రకారుడు, గ్రాఫిక్ డిజైనర్

3 thoughts on “మూడు రోజులపాటు ‘కళాయజ్ఞ’ చిత్ర ప్రదర్శన

  1. గురువులు శేష బ్రహ్మం గారు తలపెట్టిన కళాయజ్ఞం గురించి చాలా చక్కని వ్యాసం అందించారు.. ధన్యవాదములు సాగర్ గారు…

  2. మంచి ప్రయత్నం.. చిత్రకళ ఇటువంటి కార్యక్రమాల ద్వారానే మళ్ళీ మళ్ళీ బ్రతుకుతుంది. ఎందరెందరో ఆర్టిస్టులని దగ్గర చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలని అందరూ ప్రోత్సహించాలి. చిత్రకారులంతా పాల్గొనాలి. వీలుంటే అందరూ తప్పకుండ ఈ ప్రదర్శనకి హాజరు కావలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap