ప్రాచీన కళింగాంధ్రలో చారిత్రక విషయాలు

నల్లి ధర్మారావు ప్రముఖ కవి, కాలమిస్టు రచయిత, జర్నలిస్టు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు, చిన్న మధ్యతరహా వార్తాపత్రిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉత్తరాంధ్రాలో ప్రముఖంగా భాసిల్లుతున్నారు. సమాజ సేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది జర్నలిస్టుల సమస్యలను, సామాజిక సమస్యలను తన బాధగా భావించి వాటి పరిష్కారానికి విశేష కృషి చేస్తూ జర్నలిస్టులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన తల్లిని ఎంత గొప్పగా ప్రేమిస్తారో పల్లెను కూడా అంతే గొప్పగా ప్రేమిస్తారు. మట్టి పరిమళాల్ని నరనరానా జీర్ణించుకుని ఆ మట్టి పరిమళాల్ని తన రచనల ద్వారా అందరికీ పంచుతున్నారు రైతు కుటుంబంలో జన్మించిన నల్లి ధర్మారావుగారు. వీరు రచించిన ఈ “ప్రాచీన కళింగాంధ్ర” చారిత్రక గ్రంధంలో కళింగ ప్రాంత ప్రాచీన చరిత్రను సాక్ష్యాధారాలతో, సాహిత్య గ్రంథాల ప్రామాణికంతో, మనం చూడని, మనకు తెలియని ఎన్నో సరికొత్త విషయాల్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగించే విధంగా రూపొందించారు. ఇందులో ధర్మారావుగారు చరిత్ర మూలాల్లోకి వెళ్లి అంటే ఆదిమానవుని సమాధి స్థలాన్ని, సంగమయ్య కొండ, ఆదిమానవ చిత్రలేఖనం, ఆదిమానవ సంచార ఆనవాళ్ళని పరిశీలించి ఫొటోలతో ప్రాచీన కళింగాంధ్ర చరిత్రని అద్దంలో ప్రతిబింబంలా అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్కరు ఈ “ప్రాచీన కళింగాంధ్ర” చరిత్ర ని చదివి తెలుసుకోవలసిన ఆసక్తికర విషయాలు ఎన్నింటినో ఈ చారిత్రక గ్రంథంలో పొందుపరిచారు.

“హిమాలయాల కన్నా ప్రాచీనమైనది తూర్పు కనుమలు” అంటూ మొట్టమొదటిగా ఒక ఆదివాసి తెగ గురించి చాలా చక్కగా చెప్పారు. గోండ్వానా మహా కొండల్లో ప్రస్తుత భారత్, దక్షిణాఫ్రికా దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండాలు కలిసి ఉండేవి. దీనిని తెలంగాణలో ఒక ఆదివాసీ తెగ గుర్తించి గోండ్వానా మహా ఖండానికి గుర్తుగా “గోండులు” అని పేరు పెట్టారు. ఆ తర్వాత ‘హోమో సేపియన్స్’ మానవులు నివసించారు. వారు ఆధునిక మానవులకు మూలతరం. వీరికి భాష రాదు. వీరికి తట్టిన భావాలను బొమ్మలుగా చిత్రీకరించి చూపించారు. అక్కడి గ్రానైట్ పలకలపై వివిధ జంతువుల బొమ్మలు చిత్రించబడి ఉన్నాయి. మెల్లిగా ఆహార అన్వేషణ దశనుంచి మానవులు ఆహారం నిల్వచేసుకునే దశకు వచ్చారు. మెల్లిమెల్లిగా అడవులు నరికి స్త్రీ, పురుషులిద్దరూ వ్యవసాయం మొదలుపెట్టారు. వీరు రాతి పనిముట్లకు బదులు రాగిని వాడడం కొంత వరకు ముందడుగు వేశారని చెప్పవచ్చు. మెల్లిగా ఇళ్ల నిర్మాణం, బట్టల తయారీ కూడా మొదలుపెట్టారు. దీనిని కొత్తరాతి యుగంగా చెప్పవచ్చు. ఆ కాలంనాటి పనిముట్లు, అవశేషాలు, కాశీపట్నం, బోయపాలెం, మారికవలస, లంకపాలెం దగ్గర లభించాయి. శాస్త్రవేత్తలకి ఇక్కడ కొత్తవలస కొండల్లో విశాఖ నదీతీరంలో కలిసే 35కి “గంభీరం” అనే చిన్న నదిని కూడా కనుగొన్నారు. మెల్లిగా వీరు సంచార జీవనం మొదలుపెట్టారు. ఈ దశనే “నవీన శిలాయుగ విప్లవం” అని ‘గార్నెల్డ్ చైల్డ్’ అన్నారు.

“రామాయణంలో సవరలు” చరిత్ర చాలా ఆసక్తిదాయకంగా ఉంది. రామాయణంలో విశ్వామిత్రుణ్ణి చంపటానికి ఆవు తోక నుంచి సవరలను విష్ణువు పుట్టించినట్లు ఉంది. మహాభారతంలో కామధేనువు తోక నుంచి నుంచి పుట్టారని ఉంది. వేద సాహిత్య పురాణ కథలు ఎలా ఉన్నా ఈ ప్రాంతంలో సవరులు అప్పటికే ఉన్నారు. వీరి నివాస ప్రాంతాన్ని ఆ పవిత్ర భూమిగా ఆర్యులు చూసేవారు. అశోకుడి శాసనాల్లో కూడా వీరి ప్రస్తావన ఉంది. వీరి ప్రధాన దైవాల్లో “రామన్, భీమాను” ఉన్నారు. మహేంద్ర యాత్రకు కొండ ఎక్కేవారు నడుస్తూ మధ్య మధ్యలో ‘భీమా’ అని అరుస్తూ ఆనందపడుతుంటారు. భద్రాచలం అడవుల్లో కూడా సవరలు ఉన్నారు. రామునికి ఎంగిలి పండు తినిపించింది శబరి. అలాగే సవర తెగ ఉన్న ప్రాంతంలో శబరి నది ప్రవహిస్తుంది. అలాగే శబరిని సవర స్త్రీ అని భావిస్తే రామాయణంలో కూడా సవరుల పాత్ర కీలకంగానే భావించాలి. వీరు ప్రాచీనమైన వారు కాబట్టి వారి రూపాలను ఊహించి కవులు వారిని వానరులు అంటారు. వారికి ఉన్న 72 మంది దేవతల్లో ‘రామ’ కూడా ఉన్నాడు. వీరు “గు-ఆర్ (ఆగం)” అనే పండుగని మనం సంక్రాంతి పండుగ చేసుకుంటున్నట్లుగా ఘనంగా చేసుకుంటారు. వీరు చిత్రకళలో కూడా రావణుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, బోయ గోమాంగో తెగ, మతపెద్దల బొమ్మలతో పాటు గుర్రాన్ని కూడా అందంగా చిత్రీకరించారు.

“పురాణ కళింగ” చరిత్రలో పురాణం అంటే సంస్కృతంలో ప్రాచీనం – పురాతనం అని అర్థం. వివరంగా చెప్పాలంటే పురాణ – పాత ఒకే పేరు. అలాగే విశాఖలో ‘పాతపట్నం’ పేరు గతంలో ‘పురాణ పట్నం.’ దీర్ఘ తమనుడు అనే ఋషి సంతానంలో కళింగులు ఒకరు. వేదకాలంలో ఆర్య పెద్ద, రుషిగా గుర్తింపు పొందాడు. దీర్ఘతమనుడు మమత అనే స్త్రీకి జన్మించాడు మహాభారతం ప్రకారం అతని కాళ్లు చేతులు కట్టేసి శిష్యులు గంగానదిలో విసిరి వేశారు. ఇలా కొట్టుకుపోతూ చిత్రమైన ప్రజల మధ్య గౌరవం పొందాడని ఉంది. ఆ చిత్రమైన ప్రజల నాయకుడు ‘బలి’ కావచ్చు. ఎంతో దాన గుణం గల బలిని విష్ణుమూర్తి పాతాళానికి తొక్కేశారు. కేరళలో జరిపే ఓనం పండుగ ఈ బలిచక్రవర్తికి సంబంధించినది. అలాగే మహాభారతంలో కూడా కౌరవుల పక్షాన కళింగులు పోరాడారు. వీరికి కౌరవులతో వివాహ సంబంధాలు కూడా ఉండేవి. అందుకే కళింగ అల్లుడు దుర్యోధనుడు అంటారు. అంటే కళింగరాజు చిత్రాంగుడు కూడా తన కుమార్తె భానుమతిని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేశాడని చరిత్ర చెబుతోంది.

“మౌర్యులకు ముందు కళింగ” దీనిలోని చారిత్రక విషయాలు కూడా చాలా ఆసక్తి దాయకంగా ఉన్నాయి. “మహా గోవింద సుత్తాంతం” అనే గ్రంథంలో కళింగను సత్తబుడనే రాజు పాలించేవాడని, అతని కాలంలో దంతపురం ప్రముఖ ఓడరేవు పట్టణం అని ఉంది. అలాగే బుద్ధుడు జీవించిన కాలంలోనే బౌద్ధాన్ని కళింగ ఆదరించింది. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికే దంతపురం ప్రముఖ ఓడరేవు అని సిల్వియన్ లెవి అనే చిత్రకారుడు చెప్పాడు. కళింగ నుంచి చైనా పర్షియా వరకు వర్తక వాణిజ్యాలు జరిగేవి. వర్తక వాణిజ్యాలను కూడా బౌద్ధం ప్రముఖ పాత్ర వహించి రేవు పట్టణాల దగ్గర బౌద్ధ క్షేత్రాలు అభివృద్ధి చేసింది. ఇలా సముద్ర ప్రయాణంలో కళింగులు గొప్ప సాహసీకులనే చెప్పవచ్చు. అలాగే శ్రీలంకలో పేరు చివర ‘సింఘ్’ అని ఉన్నవారు తమ పూర్వీకులు కళింగులని సింహపురమని చెబుతారు. ఇది ఒక ప్రత్యేక రాజ్యాంగగా కనిపిస్తున్నా కూడా ఆదివాసి తెగల సముదాయం. ఎవరన్నా వీరిపై దాడి చేస్తే అందరూ కలిసికట్టుగా ఎదిరిస్తారు. వీరు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, ఐకమత్యతకు మారుపేరుగా నిలిచారు.

చివరిగా “క్లుప్తంగా క్రీస్తు పూర్వ చారిత్రక సారం” అనేక చారిత్రక విషయాలు క్రీస్తుపూర్వం ముందు చాలా కూలంకషంగా పొందుపరిచారు రచయిత. భారతదేశం క్రీస్తుపూర్వ కాలంలో గిరిజన సమాజంలో ఉంది. ఈ గిరిజన తెగల్లో ప్రధానంగా బోండా, సవర, పొర, గదజ జాతులు కళింగలో ఉండి వీరందరితో ఒక బలమైన సంస్కృతి ఏర్పడింది. ఆతర్వాత రాజ్యాలు రూపొంది ఇవే చరిత్ర పుటల్లోకి ఎక్కాయి. చరిత్రతో ముడిపడి భారత, భాగవత, రామాయణాలు వచ్చాయి. ‘విండిడో నిగర్’ అనే సంస్కృతం, హిందూ మత పరిశోధకుని అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం 200-క్రీస్తు శకం 300 మధ్యలో భారతం, రామాయణం క్రీస్తుపూర్వం 200 – క్రీస్తు శకం 200 మధ్య ప్రారంభం అయ్యాయని చెప్పారు.

ఇంకా ప్రాచీన కళింగాంధ్ర చారిత్రక గ్రంథంలో “వేదకాలం- సవరలు – ఆంధ్రులు, నాగులెవరు, అణచివేతలు – వలసలు, అశోకుని ముసుగు తొలగిస్తే, ఋషికుల తీరంలో” లాంటి ఎన్నో చారిత్రక విషయాల గురించి చాలా కూలంకషంగా వివరించారు. ఈ చారిత్రక గ్రంథం ఆద్యంతం మొదటి నుంచి చివరి దాకా అద్భుతమైన విషయ పరిజ్ఞానంతో, వాటికి సంబంధించిన చారిత్రక బొమ్మలతో అందంగా మలచి అందరి చేత చదివింప చేశారు రచయిత ధర్మారావు గారు. అలాగే ఈ గ్రంథం పోటీ పరీక్షలకు తయారయ్యే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సమాజానికి ఆదర్శమైన ఎన్నో గ్రంథాలు రచనలు చేసిన ధర్మారావుగారు కలెక్టర్ చేతుల మీదగా రెండు సార్లు “ఉత్తమ జర్నలిస్ట్” అవార్డు, నవయుగ కవి చక్రవర్తి “గుర్రం జాషువా” అవార్డుని, ఇంకా జాతీయ స్థాయి రైతు గీతాల పోటీలో ఖమ్మంలో ప్రధమ బహుమతి”ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు గారి చేతుల మీదగా అందుకొని అవార్డులకే వన్నె తెచ్చిన నల్లి ధర్మారావు గారికి అభినందనలు.

పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్ట్, రచయిత్రి
ప్రతులకు : నల్లి ధర్మారావు (రచయిత)-7660967313

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap