కమల్ స్పార్కున్న కార్టూనిస్ట్ -జయదేవ్

కార్టూన్ కళ అందరికీ అబ్బదు. ఆ కళ అబ్బాలంటే శరీర కణాల్లో ప్రత్యేక జన్యు పదార్ధం వుండాలి. ఊన్నా , అది పనిచేయటానికి బ్యాటరీ తప్పనిసరి. కొందరికి ఆ బ్యాటరీ ఇంబిల్ట్ గా వుంటుంది. ఆ కొందరే, ప్రొఫెషనల్ కార్టూనిస్టులు. వాళ్ళ బ్యాటరీలు హై వోల్టేజ్ కరెంట్ పుట్టిస్తాయి. మామూలు రీచార్జబుల్ బ్యాటరీ తెగలో “హాబీ ” కార్టూనిస్టులం వుంటాం. వీళ్ళది మాత్రం చాలా పెద్ద సంఖ్య. మన తెలుగు “హాబీ” కార్టునిస్టుల గుంపు కి మించిన గుంపు దేశంలో మరెక్కడా లేదు. కారణం మన తెలుగు పాఠ కులే. వీళ్ళకి హ్యూమర్ సెన్సు ఎక్కువ. హాస్యరసం గుటకలేసుకు మింగుతారు. అందు చేతనే, తలిసెట్టి వారూ, బాపూ, సత్యమూర్తీలు తెలుగు గడ్డమీద హై వోల్టేజ్ బ్యాటరీలతో కార్టూను దీవిటీలు వెలిగించారు. కార్టూన్ కళాకారులని వందల సంఖ్య లో పుట్టించారు. ఆ వందల మందలో నేనూ ఒకడిని. ఈ పుస్తక రచయిత కమల్ కూడా.

నేను, కమల్ కంటే వయసులో పెద్దవాడిని గనక అతడికి అప్పుడెప్పుడో ఒకట్రెండు సలహాలిచ్చాను, నాయనా, కార్టూన్ కి భావం ప్రధానం, వ్యాఖ్య ప్రాణం, బొమ్మ వూపిరి అని. నా సలహాలతో పాటు, తోడి కార్టునిస్ట్ మిత్రుల నుండి పొందిన స్ఫూర్తితో శ్రమించి, కమల్, కొన్ని వందల కార్టూన్లు అవలీలగా సృష్టించి పేరు తెచ్చుకుని స్ధిరపడ్డాడు. ఈ పుస్తకం చూస్తే మీకే అర్ధమౌతుంది, కమల్ స్పార్కున్న కార్టూనిస్టని.

నేను ప్రతిసారీ, కార్టున్లు గీస్తున్నప్పుడు అనుకుంటుంటాను, ఈ ఫలానా కార్టూన్, ఇదే ఫస్టు, దీన్ని మరొకరు మార్చి గీయలేరు అని. ఆలాంటి కార్టూను ఒకటి ఏనుగు లక్ష్మణ కవి మీద గీసినది. ఇదేదో నభూతో నభవిష్యతి అనుకోకు మాష్టారూ, మేము కూడా ఒకటి అలవోకగా గీసేయ గలం అంటూ చాలెంజ్ విసిరాడు కమల్! లోపలి పేజీలు తిరగేయండి. ఏనుగు లక్ష్మణ కవి మీకు చిరునవ్వులు చిందిస్తాడు. మా కార్టూనిస్టులకి ఒకే రకం అయిడియాలు తరచూ తడుతుంటాయ్. కానీ, అవి, ఆయా కార్టునిస్టుల స్టాంపులతో వెలికి వచ్చి పాఠకులకి గిలిగింతలు పెడతాయి. కమల్ తన కార్టూన్లతో అది భేషుగ్గా, సాధించాడు. ఈ కార్టూన్లు తిలకించండి.

స్లిప్ టెస్ట్, పత్రిక జీర్ణించుకునే పాఠకులు, అంతరిక్షంలో చెంబు, కీ మర్చిపోయిన కీలు గుర్రం వీరుడు, డబుల్ డెక్కర్ టీటీయీలు, పేపర్ స్టాండు వద్ద పేపర్ చదివే పెద్ద మనిషి, మురికి అల్లవుద్దీన్ తివాసీ, చంద్రబాబుతో మాహిష్మతి, బుక్ ఫేర్ లో భేతాళుడు, లిప్స్టిక్ మాస్క్, ఇవి మాత్రం, కమల్ స్పెషల్స్, అని తప్పక చెప్పి…తీరాలి.

పుస్తకంలో, తక్కిన కార్టూన్లు అనేక వెరయిటీ సబ్జెక్ట్లకి సంబంధించినవి. కమల్ ఆలోచనా వైవిధ్యాన్ని మనకి విడమర్చి చెబుతాయి. గజేంద్ర మోక్షం, సుమతి శతకం, మానవ పరిణామం, వస్త్రాపహరణం, వేశ్యవాటిక, లావుపాటి ఆంటీ, కంటి డాక్టరు, ఇంకుడు గుంతా, ఒక్కటేమిటీ, అన్నీనూ!!

ఈ సంకలనంలో కమల్ ఒక ప్రయోగం చేసాడు. మన తెలుగు వెలుగు గిరీశం మీద కార్టూన్లు అల్లాడు. ముళ్ళపూడి వారి అప్పరావు మీద తెలుగు కార్టూనిస్టులు ఆడుకున్నారు. కానీ, నాకు తెలిసి గురజాడ వారి గిరీశం మీద ఎవరూ సాహసం చేయలేదు. కమల్ తనవంతు ప్రయత్నం ధైర్యంగా చేసాడు. కన్యాశుల్కం బాగా చదివి వంట బట్టించు కుంటే గానీ ఇది సాధ్యం కాదు. కొన్ని కార్టూన్లు ఆలోచింప చేసేవి గా వున్నాయి. ఒపిక తో చదవాలి మరి.

కమల్ సాధించిన ఈ అమూల్య సంకలనం పాఠకుల మనసులను రంజింపజేస్తుందన్న గట్టి నమ్మకం నాకుంది. చిరంజీవి కమల్ తన వ్యాసంగం కొనసాగిస్తూ, మరిన్ని కార్టూన్ సంకలనాలని తీసుకురావాలని ఆకాంక్షిస్తాను.

శుభాకాంక్షలతో, జయదేవ్.

కమల్ కార్టూన్లు
పేజీలు: 176, వెల: రూ. 170/-

ప్రతులకు:
కమల్ కార్టూనిస్ట్ (9705162419)

SA:

View Comments (1)