బుధవారం రాత్రి హైదరాబాద్, రవీంద్రభారతి లో టికెట్ నాటక ప్రదర్శన విజయవంతం
కనక పుష్యరాగం నాటకం పేరు వినగానే మనకు ప్రముఖ నాటక దర్శక ప్రయోక్త స్వర్గీయ కె. వెంకటేశ్వరరావు గుర్తుకొస్తారు. 60 ఏళ్ల క్రితం ఆయన ఉధ్రుతంగా ప్రదర్శించిన నాటకం అది. నాటకమే ధ్యాసగా శ్వాసగా జీవించిన కె. వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా రసరంజని హైదరాబాద్ సంస్థ నెల నెలా టికెట్ నాటకంలో భాగంగా బుధవారం రవీంద్రభారతిలో కనక పుష్యరాగం నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. “టికెట్ కొనండి నాటకం చూడండి” అంటూ రసరంజని చేస్తున్న ఉద్యమానికి విశేష స్పందన లభించింది. ఆ సంస్థ మూలస్థంభం అయిన నాటక ప్రియులు డా. కె.వి. రమణాచారి స్వయంగా 50 రూపాయల టికెట్ కొనడమే కాకుండా, కాసేపు టికెట్ కౌంటర్లో కూర్చుని టిక్కెట్లు విక్రయించి కళాకారుల్లో కొత్త ఉత్సాహం నింపారు.
రసరంజని ఆధ్వర్యంలో విజయవాడ దృశ్య వేదిక కళాకారులు కనక పుష్యరాగం నాటకాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. స్వర్గీయ శ్రీ రాఘవ రచన ఇది. ప్రఖ్యాత నట, దర్శకులు యస్.కె.మిశ్రో దర్శకత్వం వహించారు. మిశ్రో నాటక రంగంలో చేసే ప్రయోగాలు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆ ఇంటి సెట్ కానివ్వండి, మిగిలిన ప్రాపర్టీస్ ను ఆయా నటులతో రచనకు తగినట్లుగా ఉపయోగించిన తీరు రక్తి కట్టించింది. ముఖ్యంగా థియేటర్ లో మూడు వాల్స్ ఉపయోగిస్తారు. కానీ, ప్రేక్షకుల వైపు కూడా మిశ్రో నాలుగో వాల్ గా భావించి ప్రయోగాలు చేస్తుండటం మనం చూస్తూనే వున్నాం. ఈ నాటకంలో కూడా ఫోర్త్ వాల్ ఉపయోగించి అక్కడ దేవుళ్ళ ఫోటోలు, చనిపోయిన స్నేహితుడి ఫోటో పెట్టినట్లు, ప్రతిరోజు పూజ చేస్తున్నట్లు చూపించారు. ఆయా నటులు పాత్రల్లో ఒదిగి పోయి నాటకాన్ని పండించారు. ఎవరి పాత్రల్లో వారు జీవించారు. 60 ఏళ్ల క్రితం నాటకం అయినా కొత్తగానే అనిపించింది. ఎగ్జిట్, ఎంట్రీ లు చూపించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది.
కథ విషయానికి వస్తే, ఒక పాత సినిమాలా అనిపిస్తుంది. రాజశేఖరం మిత్రుడు పురుషోత్తం చనిపోతే అతని కుమార్తె ను తన కుమారుడు ఆనంద్ కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని ఆ అమ్మాయి కనకం ను తన ఇంట్లో నే పెంచి పెద్ద చేస్తాడు. సొంత కుమార్తె లక్ష్మి మూగ పిల్ల. ఆ అమ్మాయి పెళ్లి చేయడానికి నానా తంటాలు పడుతుంటాడు. చివరకు ఇల్లరికం, కుండమార్పిడి విధానంలో అల్లుడు ప్రసాద్ ను తెచ్చుకుని కనకం ను తన కుమారుడికి చేసుకోలేకపోతాడు. ప్రేమలు, అనుమానాలు, సంఘర్షణల సన్నివేశాలు తరువాత చివరకు కనకంకు ఆనంద్ స్నేహితుడు సుందర్ తో వివాహం జరిపిస్తారు. ఇదీ కనక పుష్యరాగం నాటకం. పూర్తిగా మెలో డ్రామా.
“మీరు అసహించుకున్న వస్తువును దయచేసి ఇతరులకు దానం చేయకండి” అనే గొప్ప సందేశం అందించింది. పెళ్లి చూపులకు వస్తున్నప్పుడు పడే హడావిడి, మూగ కుమార్తె కు పెళ్లి కావడం లేదని డిప్రెషన్ లో ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం, బావా మరదళ్ళ చిలిపి ప్రేమలు, అలకలు, అనుమానపు అల్లుడిని నమ్మించేందుకు చిన్న నాటకం ఆడి దొరికిపోవడం ఇలా ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగింది. రాజశేఖరం పాత్రలో దొంతాల ప్రకాష్, ఆనంద్ గా ఈవన భాగ్యరాజ్, సుందరంగా కత్తి శ్యాంప్రసాద్, నీలకంఠం పాత్రలో ఈవన రమేష్ బాబు, ప్రసాద్ గా బొర్రా నరేన్, కనకంగా బి.రూపశ్రీ, లక్ష్మి పాత్రలో జి.ఎన్.డి. కుసుమ సాయి చక్కగా ఒదిగి నటించి మెప్పించారు. అద్భుతమైన టీమ్ వర్క్ తో అలరించారు.
దర్శకుడు యస్.కె.మిశ్రో మాట్లాడుతూ ప్రయోగం అనలేను కానీ, మంచి ప్రయత్నం చేశానని, ఇది విలువలు కలిగిన నాటకం అన్నారు. సంభాషణలను గట్టిగా అరిపిస్తే మెలో డ్రామా అంటున్నారు, స్లోగా మాట్లాడిస్తే ప్రేక్షకులు విన పడటం లేదంటున్నారు. మధ్యలో నటులు, నాలాంటి దర్శకులు నలిగి పోతున్నారని, నేటి నాటకాల పరిస్థితి ఇలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దర్శక ప్రయోక్త డి.యస్. ఎన్.మూర్తి మాట్లాడుతూ 60 ఏళ్ల కిందటి నాటకం అయినా మళ్ళీ 60 ఏళ్ల తరువాత ప్రదర్శించినా కొత్తగానే ఉంటుందని, అలాంటి గొప్ప నాటకం కనక పుష్యరాగం అని ప్రసంశించారు. కె. వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా రసరంజని సమర్పించిన గొప్ప నాటక నివాళి అని డా. కె. వి. రమణాచారి అన్నారు.
–డా. మహ్మద్ రఫీ
ఫోటోలు : బి.యల్. రెడ్డి (ఫోటోలు అన్నీ కనక పుష్యరాగంలో దృశ్యాలు)
టికెట్ కొనుక్కుని నాటకం చూడటం…. మన పూర్వీకులను, సంప్రదాయాలను, కళా వైభవాన్ని,
సందేశాన్ని గౌరవించుకోవడమే, మరియు మన పూర్వ, అపూర్వ కళాకారులకు మహోత్క్రుష్ట
నివాళులు అర్పించుకోవడమే! ఈ ప్రయత్నం, ప్రయోగం మన రెండు రాష్ట్రాలలోనూ జరగాలి!
Team అందరికీ అభినందనలు…
60 ఏళ్ళ నాటి నాటకం నేటి తరం నటులుఆకట్టుకునేలా ప్రదర్శించడం అద్భుత ప్రయత్నం
ప్రదర్శించిన కళాకారులకు, దర్శకుడు ఎస్ కె మిశ్రో, నిర్వాహకులు హెచ్ వి ఆర్ ఎస్ ప్రసాద్, రచయిత స్వర్గీయ రాఘవ అభినందనీయులు.